నయాగరా జలపాతం అంటే మూడు జలపాతాల మొత్తానికి ఉన్న సామూహిక నామం. అమెరికా,కెనడాల మధ్య నయాగరా నదిపై ఉన్న అతిపెద్ద జలపాతం ఇది. ఈ జలపాతం గుర్రపునాడా ఆకారంలో ఉంది. అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వెయిల్ ఫాల్స్ అమెరికన్ ప్రాంతంలో ఉన్నాయి. బ్రూస్ ట్రిగ్గర్ అనే ఇరాకీ శాస్త్రజ్ఞుని అభిప్రాయం ప్రకారం, ఫ్రెంచి మ్యాప్‌లో చూపించినట్లుగా 17వ శతాబ్దానికి చెందిన నయాగరేగా అనే జాతికి చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేవారనీ, దాన్నుంచి ఈ జలపాతానికి ఈ పేరు వచ్చిఉండవచ్చునని ఆయన భావన. ఈ జలపాతం వల్ల ఉత్పన్నమయ్యే అపారమైన శక్తిని విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చునని ఏనాడో గుర్తించడం జరిగింది. 1759లో మొట్టమొదటి సారిగా అలాంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. డేనియల్ జాన్‌కైర్ తన సామిల్ అవసరాలకోసం దీనిపై ఒక కాలువను నిర్మించాడు. నయాగరా జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది. అమెరికన్ సరిహద్దు తీరం, కెనడా సరిహద్దు తీరం మధ్య దూరం 3,409 అడుగులు. జలప్రవాహం శిఖరాగ్రంలో ఉండే సమయంలో నయాగరా జలపాతం నుండి సెకనుకు 2,02,000 ఘనపు అడుగుల జలం పడుతుంది. ఈ జలం నయాగరా నదిగా ప్రవహించి, ఒంటారియా సరస్సును చేరుకుంటుంది. ఇది వసంతకాలం చివరి భాగంలో అంటే ఎండాకాలం ఆరంభంలో అత్యధికంగా ప్రవహిస్తుంది.