Jun 18,2023 08:06

'పెద్ద తండ్రీ.. దా నాన్నా.. ఈ రెండు ఇడ్లీలు తినెరు. స్కూల్‌కి టైమవుతుంది. నా బంగారుకొండ కదా! దా.. దా.. దా..' నా స్టైల్‌లో బుజ్జగిస్తూ పిలిచాను.
పిల్లలకు కేరేజీ సిద్ధం చేస్తున్న శ్రీమతి నా వంక ఓ కన్నేసి చూస్తోంది. ఆమె ఎంత బతిమాలినా, బుజ్జగించినా, వాతలు పెడతానని బెదిరించినా పెద్దోడు మొండిఘటంలా ఇడ్లీ ముట్టలేదు. చిన్నోడు మాత్రం తిన్నాననిపించి స్కూల్‌కి రెడీ అయిపోయాడు.
'దా నాన్నా.. ఇవాళ మామ్మ, తాతయ్య వస్తున్నారుగా.. వచ్చాక మనం పార్క్‌ కెళ్దాం. బాబా గుడికెళ్దాం. దా.. దా.. దా..' ఇంకా ప్రేమ కురిపించాను.
గుండ్రని చేతివేళ్ళు, బొద్దుగా ఉండే పాదాలు, కోల మొహం, బండముక్కు, ఒక వైపుగా ఉండే జుట్టు, కొనలా పొడుచుకొచ్చిన పిలకతో నాన్నగారి రూపానికి ప్రతిబింబంలా ఉంటాడు. అందుకే వాడిని 'జూనియర్‌ గోవర్ధనరావు' అంటాం.
'తాతయ్య వత్తన్నాడా?' దగ్గరకొచ్చి ఆశగా అడిగాడు.
'ఆ.. వత్తన్నాడు. నీకిష్టమైన ముంజికాయలు తెత్తన్నాడు. ''ఆమ్‌.. ఆమ్‌..'' అని తినేద్దాం. ఎవరికీ పెట్టొద్దు. సరేనా?' ఇడ్లీ ముక్కకు చెట్నీ అంటించి, వాడి నోట్లో పెట్టాను.
'ఊ.. అమ్మకొద్దు. తమ్ముడికొద్దు. మనమే తిందాం..!' సంబరపడ్డాడు.
శ్రీమతి చురచురా చూస్తోంది. నేను గారాబం చేస్తున్నానన్నది ఆమె ఫిర్యాదు. తల్లిదండ్రుల్లో ఒకరు కఠినంగా, ఒకరు మృదువుగా ఉండాలి. అప్పుడే పిల్లలు ఎవరితోనో ఒకరితో వాళ్ళ సందేహాలను షేర్‌ చేసుకుంటారు. ఇద్దరూ కఠినంగా ఉంటే అనుబంధం దెబ్బతింటుంది. ఇద్దరూ మృదువుగా ఉంటే అలసత్వం ప్రోది చేసుకుంటుందని నమ్ముతాను.
తినడం అయ్యాక పెద్దోడికి స్నానం చేయించాను. ఒళ్ళు తుడిచాను. పౌడర్‌ రాశాను. బట్టలేశాను. తల దువ్వి రెడీ చేశాను. ఎవరేమనుకున్నా ఇదెప్పుడూ బరువు కాదు.. నా బాధ్యత. ఏదైతే మన బాధ్యత అవుతుందో అక్కడ అలసటకు, అసహనానికి చోటుండదు.
బరువైన బ్యాగులు వీపుకు తగిలించుకుని, బయలుదేరారిద్దరూ.
'చిన్ని తండ్రులూ.. గిఫ్ట్‌ ఇవ్వకుండా వెళ్తారేం..' నవ్వుతూ వారి వంక చూశాను.
చటుక్కున వచ్చేసి మంచానికి ఆనుకుని, తలపైకి లేపాడు పెద్దోడు. నుదిటిమీద, కళ్ళమీద, బుగ్గలమీద, పెదవులమీద ముద్దు పెట్టుకున్నాక చిన్ని గడ్డం కొరికాను. కోపంతో నన్ను కొట్టి, ఆ గడ్డాన్ని నిమురుకున్నాడు.
'చిన్న తండ్రీ.. నువ్వు దా..' చిన్నోడిని లాక్కుని అలానే ముద్దులు పెట్టాను.
గడ్డం కొరికితే చిన్నోడికి చక్కిలిగింతలు పుడతాయి. ఫక్కున నవ్వుతాడు. ఆ నవ్వు మహత్యమో, వారికి పెట్టిన ముద్దుల మహత్యమోగానీ ఆరోజుకి కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. నేనలా ముద్దులు పెట్టడం శ్రీమతికి సుతరామూ ఇష్టం లేదు.
'ప్రపంచంలో నువ్వొక్కడివే కన్నావా కొడుకుల్ని? ముడ్డి కిందకి ఆరేళ్ళు వచ్చారు. ఇంకా ముద్దొస్తున్నారా?' అంది.
'నా కొడుకులెప్పుడూ నాకు ముద్దే.. గొప్పే..' అన్నాను.
'వాళ్ళంతట వాళ్ళుగా నీకు ముద్దు పెట్టినప్పుడే గొప్ప..' అందామె.
ఈ మాట ఎప్పుడూ వినేదే. కానీ, ఈ రోజు ఎందుకో ఈ డైలాగులో నిగూఢమైన అంతరార్థం దాగుందనిపించింది. అదేంటో వెంటనే తట్టలేదు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్‌ చేసి, వచ్చేశాను.

ఆఫీసులో పని చేసుకుంటుంటే ఆ మాటే గుర్తుకొచ్చింది. పనికి ఆటంకం కలిగింది. మాటిమాటికి గుర్తుకొస్తుంది. అది ఎందుకు ఇంతగా నాలో మథనాన్ని రేకెత్తిస్తుందో.. జ్ఞాపకాల మథనం జరిగింది. ఆఖరికి అమృతంలాంటి 'కల' జ్ఞప్తికొచ్చింది.
పీట మీద కూర్చుని నాన్నగారు అన్నం తింటున్నారు. వెనక నుంచి వచ్చి ఆయన వీపుపైకి ఎక్కాను. ఆయన తినడం ఆపేసి, కింద పడిపోకుండా నన్ను పట్టుకున్నారు. మెల్లగా అడుగులేస్తూ ఆయన మెడ దగ్గరకు చేరాను. భుజం మీద అటో కాలు, ఇటో కాలు వేశాను.
'ఏంటి నాన్నా?' నవ్వుతూ అడిగారాయన. నేను కూడా నవ్వుతూ కుడివైపుకు వంగి, ఆయన బుగ్గమీద ముద్దు పెట్టాను. సంతోషంతో పరవశించిపోయారు.
'ఇంకా గట్టిగా..' అన్నారు. 'ఊ..' అంటూ ఇంకా గట్టిగా ముద్దు పెట్టాను. ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆనందం అందలమెక్కింది.
'నా బంగారు కొండే..!' అంటూ నన్ను ఆయన ఒళ్లోకి లాక్కుని, ముద్దులు కురిపించారు.
కల నుంచి ఇలలోకి వచ్చాను. ఊహ వచ్చాక నాన్నగారిని ముద్దు పెట్టుకున్న సందర్భం ఒక్కటన్నా ఉందేమోనని గతంలోకి జ్ఞాపకాలు అనే టార్చిలైటును వేశాను. అది నాన్నగారితో నేను గడిపిన క్షణాలపైనే ఫోకస్‌ పెట్టింది.
ఐదో తరగతిలో మంచి మార్కులతో పాస్‌ అయ్యానని నాన్నగారిని పిలిచి, మాష్టారు పొగిడారు. బాగా చదివిస్తే ప్రయోజకుడవుతాడని సూచించారు. నాన్నగారు పుత్రోత్సాహంతో అక్కడే ముద్దు పెట్టుకున్నారు.
పదో తరగతిలో స్కూల్‌ సెకండ్‌ వచ్చాను. 'ఆరొందలకు ఐదొందల మార్కులు దాటడమంటే చాలా గొప్ప' అని గర్వపడుతూ నాన్నగారు ముద్దు పెట్టుకున్నారు. అదే చివరిసారి. తర్వాత దాని ఊసే లేదు.
ఆయన విషయాల్ని టార్చిలైటు బాగానే ఫోకస్‌ చేసిందిగానీ, నేనెప్పుడూ ఆయన్ని ముద్దు పెట్టుకున్నట్లు చూపించలేదు. సమాచారాన్ని క్రోడీకరిస్తే ఒకటి అర్థమవుతుంది. నాన్నగారిని ముద్దు పెట్టుకోవాలని అంతరాత్మ ఆరాట పడటం.. ఈ విషయాన్ని కల రూపంలో చేరవేయడం..
నన్ను కొడుగ్గా పొందినందుకు ఆయనెప్పుడూ చింతించలేదు. గర్వ పడ్డాడు.. పడుతూనే ఉన్నాడు. నామీదున్న ప్రేమను బహు రూపాల్లో వ్యక్తం చేశాడు. మరి నేను?
'ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో సంకేతాలుండగా ముద్దుకే ఎందుకంతటి ప్రాశస్త్యం?' అనే సందేహం కలిగింది. సమాచార నిధి గూగులమ్మ దగ్గరికెళ్ళాను. 'ముద్దు' అని టైప్‌ చేశాను. బోలెడంత సమాచారమొచ్చింది.
'ఏంటి సార్‌? ముద్దు గురించి పాకులాడుతున్నారు?' జోసెఫ్‌ అడిగాడు. అదేంటో ఇటువంటివి చూస్తున్నప్పుడే కొలీగ్స్‌ మనవైపు ఓ కన్నేస్తారు. నిజం చెప్పినా నమ్మరు.
'నాకో డౌట్‌..' అన్నాను.
'అడగండి సార్‌' అన్నాడు.
'నువ్వెప్పుడైనా మీ నాన్నగారికి ముద్దిచ్చావా?' అడిగాను.
'మాలో ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం చాలా కామన్‌..' చెప్పాడు.
వాళ్ళల్లో కామన్‌ అయినప్పుడు మిగిలిన వాళ్ళల్లో ఎందుకు కాదనేది పెద్ద డౌట్‌.. దేవుడందరికీ ఒకటే అయినప్పుడు ఈ వ్యత్యాసాలెందుకో.. 'దేవుణ్ణి' వేరు చేసి 'మతం' అని పేరు పెట్టారా? వైవిధ్యాన్ని చాటుకోవడానికి నియమాలు ఏర్పర్చుకున్నారా? ఏంటో ఈ ప్రపంచం.. ఎప్పుడూ జడ పదార్థమే!
'మీలో ఆ కల్చర్‌ లేదా సార్‌?' అడిగాడతను. సమాధానం చెప్పకుండా బయలుదేరాను.

సాయంత్రం ఐదున్నరకు అమ్మా, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరినీ చూడగానే పిల్లలిద్దరూ కేరింతలు కొట్టారు. నాన్నగారు పెద్దోడితో ఆడుకుంటున్నారు. వాడికి ముద్దులు కురిపిస్తున్నారు. వాడు ఎగిరెగిరి గంతులేస్తున్నాడు. నేను ముద్దు పెట్టినప్పుడు కూడా వాడు అలానే చేస్తాడు. ప్రపంచాన్ని మర్చిపోతాడు.
వెంటనే నాన్నగారికి ముద్దిచ్చిన కల గుర్తుకొచ్చింది. ముద్దు పెట్టుకుందామనిపించింది. అదంత అవసరమా అని కూడా అనిపించింది. 'ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే పోలా' మనసు ఆరాటపడింది. కానీ, ఏదో బిడియం అడ్డుపడింది.
అమ్మ చిన్నోడితో ఆడుకుంటుంది. వాడు అమ్మ చుట్టూ తిరుగుతూ 'రింగా రింగా రోజెస్‌' అనే పాట పాడుతున్నాడు. 'ఉరు ఆర్‌ ఫాల్‌ డౌన్‌' అని కింద పడుకుని చూపిస్తున్నాడు. వాడి చేష్టలకు అమ్మ మురిసిపోతోంది. నేను వెళ్లి, ఆమె ఒడిలో పడుకున్నాను. వెంటనే గొడవకి దిగాడు చిన్నోడు.
'మా అమ్మ.. నా ఇష్టం.. నువ్వు మీ అమ్మదగ్గరికెళ్ళు..' వాణ్ణి ఆట పట్టించాను.
'నాన్నోరు.. ఓ నాన్నోరు.. లే.. ప్లీజ్‌..' బలవంతంగా నన్ను లేపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు.
'చిన్నమ్మా, 'నాన్నోరు' అనకూడదు. 'నాన్నగారూ' అని పిలవాలి. ఇప్పటికీ మీ నాన్న అలాగే పిలుస్తాడు.' గొప్పగా చెప్పింది అమ్మ.
నిజమే, నాన్నను అలాగే పిలుస్తాను. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయనే మా వెన్నెముక. ఆయన మొహంలోని ముడతలు మమ్మల్ని నిలబెట్టాయని చెప్పడానికి మిగిలిన సాక్ష్యాలు. నెరిసిన జుట్టులోని ఒక్కో వెంట్రుక, మా జీవితంలో రంగులు నింపాయనడానికి ప్రతీకలు.
మాటల్లో మాటగా నాన్నగారికి ఆరోగ్యం బాగుండటంలేదని తెలిసింది. ఏమైందని అమ్మను అడిగాను.
'గుండెల్లో నొప్పిగా ఉందంటున్నారు. తల తిరిగినట్లుంటుందట. తూలిపోబోతున్నారు. కళ్ళు తిరుగుతున్నాయట..' అమ్మ మాటలో బాధ స్పష్టంగా తెలుస్తోంది.
'అయ్యో! ఎప్పట్నుంచి అత్తయ్యా? చెప్పనేలేదు..' గాబరా పడింది శ్రీమతి.
'ఈ మధ్యనే..' అంది అమ్మ.
వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. కార్డియాలజిస్ట్‌కు చూపించాను. ఇ.సి.జి. తీశారు. హార్ట్‌ బీట్‌ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఒత్తిడికి గురౌతున్నారని, ఎక్కువగా ఆలోచించడం మానమని సూచనలిస్తూ టాబ్లెట్స్‌ ఇచ్చారు.
ఇంటికొచ్చాక నాన్నగారిని అడిగాను. ఆయన చెప్పలేదు. చెప్పరని అర్థమైంది. నేనే తెలుసుకోవాలి. దేని గురించి ఆలోచిస్తున్నారో కనిపెట్టి సాల్వ్‌ చేయాలి. ఆయన్ని సంతోషంగా ఉంచాలి. ప్రణాళికలు రచించాను.
ఉదయం నాతోపాటుగా నాన్నగారిని పార్క్‌కి తీసుకెళ్ళాను. ఆయన పక్కనే నడుస్తుంటే ఏదో అనుభూతి. కుటుంబ చరిత్రనంతా విప్పి చెప్తున్నారు. ఆసక్తిగా వినసాగాను.
'యోగీ, మన కుటుంబ చరిత్రనంతా ఒకచోట రాయగలవా?' అడిగారాయన.
బాబారు చనిపోయాక నాన్నగారు కొద్దిగా చితికారు. బహుశా వారిద్దరి ఆత్మీయతను నెమరు వేసుకుంటున్నారేమో.. గతంతో కలిసి నడుస్తున్నారేమో.. ఈ చరిత్రనంతా ఒక మ్యాప్‌లాగా చేసిస్తే సంతోషపడతారేమో.. ఆయన ఎక్కువగా ఆలోచించేది ఇదేనేమో.. కనిపెట్టేశాను.
'అదెంత పని నాన్నగారు..' మాటిచ్చాను.
కొన్ని ఇన్‌పుట్స్‌ తీసుకున్నాను. కుటుంబ వృక్షాన్ని ఛార్ట్‌ రూపంలో గీయించాను. ఫ్రేమ్‌ కట్టి అందించాను. ఆ ఛార్ట్‌లో నాన్నగారి పేరు స్పష్టంగా కనిపించేలా పెద్దగా రాయించాను. దాన్ని చూసి ఆయన థ్రిల్‌ ఫీలయ్యారు.
జోసెఫ్‌ నుంచి ఫోన్‌ వస్తూనే ఉంది. రెండు, మూడు మిస్డ్‌ కాల్స్‌ కూడా ఉన్నాయి.
'చెప్పు జోసెఫ్‌?' ఫోన్‌ ఎత్తాను.
'టూ డేస్‌ నుంచి ఆఫీస్‌కి రావట్లేదే?' అడిగాడు.
'నాన్నగారికి హెల్త్‌ బాగోలేదు. లీవ్‌ పెట్టాను. ఎనీ ప్రాబ్లం?' ప్రాజెక్ట్‌లో డౌట్‌ ఏమోనని అడిగాను.
'మా ఫాదర్‌ బర్త్‌ డే. ఈ నైటే.. పార్టీకి తప్పకుండా రావాలి.. ప్లీజ్‌..' ఆహ్వానించాడు.
వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందామని వెళ్లాను.
'థాంక్యూ ఫర్‌ కమింగ్‌..' అని నన్ను వాళ్ళ నాన్నగారికి పరిచయం చేశాడు జోసెఫ్‌.
కేక్‌ కట్‌ చేశారు. ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులందరూ జోసెఫ్‌ ఫాదర్‌ను గట్టిగా కౌగిలించుకుని, బుగ్గపై ముద్దు పెడుతున్నారు. జోసెఫ్‌ చెప్పింది ఇదేననుకుంటా.. కొత్తగా అనిపించింది. వాళ్ళ ఫాదర్‌ను మాట్లాడమన్నారు.
'ఎవరికైనా మొదటి హీరో తండ్రే! నాకు మా నాన్న. ఆయనెప్పుడూ ఒక ఫ్రెండ్‌లాగానే ఉండేవాడు. నా సక్సెస్‌ను ఆయన సక్సెస్‌లాగా ఫీలయ్యేవాడు. నన్ను గొప్పగా ప్రొజెక్ట్‌ చేయడానికే చూసేవాడు తప్పితే, అతని గొప్పదనాన్ని ఎక్కడా చెప్పుకునేవాడు కాదు. ఆయనే నాకు రోల్‌ మోడల్‌. నేను కూడా వీళ్ళ విషయంలో ఆయనకులాగానే ఉండాలనుకున్నాను. ఉన్నాననుకుంటున్నాను కూడా.. వీళ్ళు ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను' పరవశంతో పులకించిపోయారాయన.
ఆయన చెప్పింది అక్షరాల నిజం. ఏ తండ్రీ తన గొప్పదనాన్ని చెప్పుకోడు. ఓ లెక్కాపత్రం రాయడు. ఆయన చేసిన త్యాగాలు, పడిన కష్టాలు లెక్కించడానికి అంకెలు సరిపోవు. రాయడానికి అక్షరాలు దొరకవు. తాను గెలవడం కన్నా గెలిపించడంలోనే సంతృప్తిని వెతుక్కుంటాడు. అలాంటి తండ్రికి కృతజ్ఞతగా ఓ ముద్దివ్వలేమా? చెప్తే అర్థం కానిది, చేతలలో, స్పర్శలో అర్థమయ్యేది ప్రేమే.. ఆ ప్రేమకు సంకేత రూపమే ముద్దు. మనమెంత ప్రేమతో, గాఢంగా ముద్దు పెట్టుకుంటామో ఎదుటివారు అంతగా అనుభూతి చెందుతారు. వారి ఇష్టాన్ని తెలియజేస్తారు. ముద్దివ్వడం అనవసరమనుకున్న నాకు, నా మొదటి హీరోకి ముద్దివ్వాలని బలంగా ముద్ర పడిన క్షణమది.
ఇంకో నెల రోజుల్లో అమ్మానాన్నల పెళ్లిరోజు. ఏనాడూ చిన్న ఫంక్షన్‌ కూడా చేయలేదు. కానీ, ఈసారి ఎలాగైనా చేయాలి. ఆయనపై నాకున్న ప్రేమ ఆయనకు తెలిసేలా ముద్దు పెట్టుకోవాలి. నిర్ణయం జరిగిపోయింది.
ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది. గదిలో నాన్నగారు ఒక్కరే పడుకుని ఉన్నారు. ఏదో కలవరించడం వినిపించింది. దగ్గరగా వెళ్లాను.
'యోగీ, చిన్నోడికి గుండెలో బెజ్జం ఉందని నాకెందుకు చెప్పలేదురా? నేనంత పరాయివాడినా..' ఆ మాట వినగానే నా గుండె బద్ధలైంది.
చిన్నోడు పుట్టగానే హార్ట్‌బీట్‌ చెక్‌ చేశారు. అది అబ్‌ నార్మల్‌గా ఉందన్నారు. కార్డియాలజిస్ట్‌ను కలవమన్నారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ దగ్గరికెళ్ళాం. 2డి ఎకో స్కానింగ్‌ చేశారు. హార్ట్‌లో చాలా చిన్న హోల్‌ ఉందని, అదంత ప్రాబ్లం కాదన్నారు. మూడేళ్ళల్లో పూడుకుపోతుందని, మెడిసిన్‌ అవసరమే లేదన్నారు.
డాక్టర్‌ నమ్మకంగా చెప్పడంతో ఊపిరాడినట్లయ్యింది. అమ్మానాన్నలకు తెలిస్తే తట్టుకోలేరు. బాధపడుతూ కూర్చుంటారు. పిల్లలతో ఫ్రీగా ఆడుకోలేరని ఈ రహస్యాన్ని మా దంపతుల మధ్యనే ఉంచుకున్నాం.
సంవత్సరానికి ఒకసారి 2డి ఎకో స్కానింగ్‌ చేయిస్తున్నాను. చాలావరకూ పూడుకుపోయిందని చెప్పారు. ఇబ్బంది అనుకున్నప్పుడు నాన్నగారికి చెప్పొచ్చులేనని ఆగిపోయాను. చిన్నోడి ఎదుగుదలలో ఎటువంటి లోపమూ కనిపించలేదు. అందుకే చెప్పలేదు. కానీ, ఇప్పుడు నాన్నగారికెలా తెలిసింది? దాన్నే కలవరిస్తున్నారెందుకు? ఒకవేళ ఆయన ఒత్తిడికి అదే కారణమా? చెప్పకుండా తప్పు చేశానా? దోషినయ్యానా? నేనెందుకు ఈ విషయం దాచానో ఆయనకు వివరంగా చెప్పాలి. సమయం కోసం చూశాను.
ఎదురు చూస్తుండగానే వాళ్ళ పెళ్లిరోజు వచ్చేసింది. బలవంతం మీద అమ్మానాన్నలను ఒప్పించాను. అపార్ట్‌మెంట్‌ వాళ్ళను ఆహ్వానించాను. అందరూ చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. అమ్మానాన్న కేక్‌ కట్‌ చేశారు. ఎదురుగా ఉన్న టేబుల్‌ మీద రెండు పూలదండలు పెట్టాం. వాటిని ఒకరి మెడలో ఒకరు వేయాలని చెప్పాం. అది పూర్తికాగానే నాన్నగారికి ముద్దు పెట్టి, చిన్నోడి విషయం చెప్పాలన్నది ప్లాన్‌.
అమ్మ మెడలో దండ వేశారు నాన్నగారు. అమ్మ సిగ్గుల మొగ్గైంది. చప్పట్లు మారుమ్రోగాయి. నాన్నగారి మెడలో అమ్మ దండ వేసింది. ఒక క్షణం చప్పట్లు మారుమ్రోగాయి. నాన్నగారి మొహంలో ఏ భావమూ కనిపించకపోయేసరికి చప్పట్లు కొట్టాలా వద్దా అన్నట్లు జనం మా వంక చూశారు. ఎందుకో నాన్నగారి మొహంలో ఏదో అపశృతి పలికినట్లనిపించింది.
'నాన్నగారూ..' పిలిచాను. పలకలేదు. గట్టిగా పిలిచాను. అయినా పలకలేదు.
'ఏవండీ! పలకరేం..!' కాస్త భయంతో నాన్నగారి భుజాన్ని పట్టుకుని ఊపింది అమ్మ. అయినా ఆయనలో చలనం లేదు. నా ఒళ్ళు జలదరించింది. మనసు కీడు శంకించింది. ఆయనలో ఉలుకూ లేదు.. పలుకూ లేదు. వచ్చిన వాళ్ళు ఏవేవో అంటున్నారు.
ఆయన నాడి పట్టుకున్నాను. స్పందనలు లేవు. నాలో మాత్రం రెట్టింపయ్యాయి.
ఆయన మొహంపై చేయి వేశాను. చల్లగా తగిలింది. నా మొహంలో చెమటలు కమ్ముకున్నాయి.
ఆయన కళ్ళవంక చూశాను. రెప్ప వాల్చకుండా ప్రేమగా చూస్తున్నాయవి. నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
గుండె చప్పుడు విన్నాను. అది ఆగిపోయి కొంత సేపయ్యింది. నాలో దడ మొదలైంది.
దు:ఖం కట్టలు తెంచుకుంది. చాలా పెద్ద తప్పు చేసేశాను. భరించరాని మనోవేదనకు గురై ఉంటారు. ఆయన చావుకు నేనే కారణమయ్యానే..
స్వగ్రామం తీసుకెళ్ళాను. బంధుమిత్రులు ఒక్కొక్కరిగా వచ్చి, చూసి వెళ్తున్నారు. తలభాగం తప్ప మిగతా అంతా కప్పి ఉంది. దేహం నిశ్చలంగా ఉన్నా, మొహం మాత్రం ప్రశ్నించినట్లుగా ఉంది.
'యోగీ, నాకెందుకు చెప్పలేదురా? నేను పరాయివాడినా..' గుచ్చిగుచ్చి అడిగినట్లుగా ఉంది. బాధ పొగిలి పొగిలి వస్తోంది. మనస్సు గతి తప్పింది.
అంతిమయాత్ర మొదలైంది.
కొద్దిదూరం వెళ్ళగానే పాడెను దించారు. దింపుడు కళ్ళెం దగ్గర నాన్నగారి మీదున్న గుడ్డను తొలగించారు. గట్టిగా ఆయన్ని పేరుపెట్టి పిలవమన్నారు. ముద్దు పెట్టుకుని, నిజం చెప్దామని ఆయన తలభాగం దగ్గరికెళ్ళాను. నా ఆత్మ ఘోషించింది. కృతజ్ఞతా హీనుడివని నిందించింది. ముద్దు పెట్టలేకపోయాను.
'ఇలాంటిదేదో జరుగుద్దనే చెప్పలేదు నాన్నా.. నువ్వు పరాయివాడివి కాదు నాన్నా.. నన్ను క్షమించు.. లే నాన్నా! లేచి రా నాన్నా! చిన్నూకి స్కాన్‌ చేపిద్దాం. నువ్వే డాక్టర్‌తో మాట్లాడు. నీకు ముద్దు పెట్టే అర్హతను కోల్పోయాను నాన్నా.. నాన్నా.. ప్లీజ్‌, లే నాన్నా.. ఒక్కసారి ముద్దు పెట్టు నాన్నా.. నాన్నా.. నాన్నా..' అప్పటిదాకా ఆపుకున్న ఏడుపు ఆగలేదు.
'ఊరుకో.. ఊరుకో..' అంటూ బంధువులు సముదాయిస్తున్నారు.
రుద్రభూమికి చేరాక చితి పేర్చారు. నిప్పంటించమన్నారు. ఆ పని చేయడానికి చేతులు సహకరించలేదు. బలవంతంగా పెట్టించారు. ఎవరెన్ని చెప్పినా వినకుండా చితి పూర్తిగా కాలిపోయేవరకు అక్కడే ఉన్నాను. ఆకాశం వైపు చూశాను. ఆయనకు పెట్టాల్సిన ముద్దును కూడా తీసుకెళ్ళిపోతూ నాన్న.

దొండపాటి కృష్ణ
9052326864