Jun 11,2023 12:55

ఆమె పాదాలు బిగుతుగా లేవు. ముళ్ళ మీద పడినప్పుడు అప్రయత్నంగా లాగేసుకున్నట్టు వదులుగా ఉన్నాయి. మనీప్లాంట్‌ తీగలు పాకుతున్న మూడో అంతస్తు నుండి కిందికి దూకేశాయి. ఇంటర్‌ క్యాంపస్‌ మొత్తం రక్తమోడుతున్న ఆ పసి మనసుతో జ్ఞాపకాలు గుర్తొచ్చి, వెక్కివెక్కి చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. ఇంకొందరు భయంతో వణికిపోతున్నారు. అప్పటికే చనిపోయిందని తెలిసినా యాజమాన్యం హాస్పటల్‌కు తరలించింది. శవం క్యాంపస్‌లో ఉంటే ఉద్వేగాలను నియంత్రించలేం. ఉద్వేగాలు ఉద్రేకాలుగా మారి, విధ్వంసానికి దారి తీయొచ్చని వారికి తెలుసు. వెంటనే టి.వీల్లో స్క్రోలింగులు, వీడియోలు దాని తాలూకు వేడి చల్లారకుండానే తరువాత ఉదయం ప్రింటు మీడియా కాలేజ్‌ యాజమాన్యంపై దుమ్మెత్తి పోసింది. కలెక్టరు ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్టు ఆ రోజైతే ప్రకటించారు.. కానీ కాలేజీ రెండురోజుల తరువాత ఎప్పటిలానే తెరుచుకుంది.
           ఆ రోజు సాయంత్రమే విద్యార్థిని తండ్రి థామస్‌ కాలేజీలోకొచ్చి నిరసన చేస్తుంటే పోలీసులు బయటకు తీసుకెళ్ళబోయారు. ఆగ్రహించిన థామస్‌ తరపు బంధువులు క్యాంపస్‌లో ఆఫీసు అద్దాలు, బస్సుల అద్దాలు పగలకొట్టారు. కాసేపట్లో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాలకు విద్యార్థులు కూడా తోడై, బస్సు తగలబెట్టారు. వార్త మళ్ళీ దావానలంలా రేగి, తెల్లారేసరికి స్కూలుకు కలెక్టర్‌ సీల్‌ వేశారు.
థామస్‌ కేరళ నుండి కుటుంబంతో సహా వచ్చి, ఇక్కడ స్ధిరపడ్డాడు. పట్టణానికి దూరంగా సెంట్‌ థామస్‌ కైరళి స్కూలును ప్రారంభించాడు. చిన్నగా ప్రారంభించిన స్కూలును పదవతరగతి వరకు విస్తరించాడు. ఇద్దరు కూతుళ్ళు.. పెద్దమ్మాయి దివ్యను పదవతరగతి తమ స్కూల్లో పూర్తిచేశాక ఇంటర్‌కు పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాలేజీలో చేర్చాడు.
ఐఐటిలో ఎక్కువ సీట్లు సాధించిన రికార్డు సదరు కాలేజీ వారికి ఉంది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌.
కాలేజీకి సీలు వేసిన సాయంత్రం క్యాంపస్‌ను అంటిపెట్టుకుని కట్టుకున్న ఇంట్లో ప్రసాద్‌తో భార్య భవాని ఆవేదనతో మాట్లాడుతుంది. భవాని నర్సరీ నుండీ పదవతరగతి వరకూ స్కూలు బాధ్యతలు మోస్తుంది. చనిపోయిన దివ్య ముఖాన్ని ఆమె మరచిపోలేకపోతుంది. ఓనరుగా తన సంస్థను కాపాడుకోవాలన్న ఆశతో ఆమె పరిస్థితుల గురించి మాట్లాడడం లేదని ప్రసాద్‌కు తెలుసు. ఆవిడ ఒక్కొక్కటిగా మనసులో విషయాన్ని బయటపెడుతుంది.
           'ఆ విజయ్ కు అడ్డూ అదుపూ లేదు. బాగా చదువుకోవాలని అప్పోసప్పో చేసి పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రుల బాధలు వాడికి అవసరం లేదు. ఫీజులు కట్టని మధ్యతరగతి ఆడపిల్లలు వాడి టార్గెట్‌. చదువులో వెనకబడిన పిల్లల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పి, చదువు మాన్పించి పెళ్ళిళ్ళు చేయిస్తానని, వంటింట్లో పడి ఏడవడమే మీ పని అని భయపెడతాడు.వాళ్ళని లొంగదీసుకుంటాడు. తన అనుకున్న విద్యార్ధుల చేత తనకు లొంగని అమ్మాయిల పేరు ముడిపెట్టి తన పేరును బ్లాక్‌ బోర్డు మీద, ఎవరు రాసారో తెలియకుండా రాయిస్తాడు. మళ్లీ తానే కోప్పడి తనను అన్నయ్యగానూ, ఆ అమ్మాయిని వదినగానూ కొందరు విద్యార్థులతో ప్రచారం చేయిస్తాడు. ఇంకొందరికి మరోదారి కనిపెడతాడు. వేరే వాళ్ళ బ్యాగుల్లో లవ్‌ లెటర్లు పెట్టించి, అవి ఆ అమ్మాయి రాసిందని తన దగ్గర పంచాయితీ చేయించి, ఇంటిదగ్గర చెబుతానని బెదిరించి, తానే ఆ సమస్యను పరిష్కరించినట్టు వ్యవహరిస్తాడు. మీ ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారు. మీ జీవితం పాడవుతుంది అని వాడే మాటలు అస్త్రంగా ఏ విద్యార్థినైనా కుంగ తీస్తుంది. అమ్మాయిల టాయిలెట్లలో ఉన్నప్పుడు క్లీనింగ్‌ గురించి ఇన్స్పెక్షన్‌ అంటూ వెళతాడు. అమ్మాయిలందరినీ పిలిచి, నెలసరి సమయంలో టాయిలెట్లను సరిగా క్లీన్‌ చేయాలని క్లాసిస్తాడు. వాళ్లు సిగ్గుతో తలదించుకుంటుంటే సైకోలా ఆనందపడతాడు. ఇప్పుడు ఇదంతా ఆ వెధవ వల్లే' అని చెబుతున్న భవాని కళ్ళలో నీళ్లు తిరుగుతూ పాకిన ఎర్రటి జీరలు చూసి, తల నిలువుగా ఊపుతున్నాడు ప్రసాద్‌.
భవాని కాసేపు మాట్లాడకుండా తలదించుకుని ఉండిపోయింది. ఆ రాత్రిలోని నలుపు స్త్రీ జీవితంలో ఉంది. చెట్ల ఆకులు నలుపు, పచ్చ రంగుల్ని పులుముకున్నాయి. నియాన్‌ లైట్ల వెలుతురులు క్యాంపస్‌లో బస్సులపై పడుతుంటే ఆ బస్సుల నీడలు ఒకదానివి ఇంకోదానిపై పడుతున్నాయి. ప్రసాద్‌ ఏసీ లెవెల్‌ని రిమోట్‌ సాయంతో మరికాస్త పెంచి. అద్దాల్లోంచి క్యాంపస్‌ వైపు చూస్తున్నాడు.
         'చూడు భవాని ఓ 15 ఏళ్ల క్రితం గుర్తుందా? నువ్వు నేను చిన్న ట్రంకు పెట్టెతో ఈ ఊరు వచ్చాం! నాలుగు పాకలు వేయించి, స్కూలు ప్రారంభించాం. దిన దినాభివద్ధి చెందుతూ షెడ్డులు వేయించాం. ఎదుగుతున్న క్రమంలో సాటి స్కూళ్ళ నుండి ఎంతో పోటీని తట్టుకున్నాం. అంతకుమించి ఒత్తిడిని ఎదుర్కొని, మన కన్నబిడ్డలకు కూడా సమయం ఇవ్వలేకపోయాం. స్కూలే ప్రపంచమైంది. భవనాల్లోకి మారాం. రాజకీయాల్లో చేరి వాటిని అడ్డం పెట్టుకుని, మనస్సాక్షిని చంపుకుని, స్కూల్‌ను నిలబెట్టుకోవాలన్న ఆశతో ఎన్నో చిన్న స్కూళ్లపై కుట్రలు చేశాను. వాటిని మూతపడేలా చేశాను. అధికారులను మేపాను. రాజకీయ పార్టీలకు ఫండ్లు ఇచ్చాను. ఏ పార్టీ మీటింగ్‌కైనా మన బస్సులనే నడిపాను. బలంగా నిలబడ్డాను అనుకుంటున్న తరుణంలో మన ఫ్యాకల్టీలు బయటికి వెళ్లి, మనకే పోటీగా విద్యాసంస్థ తెరిచారు. ఇప్పుడు అదే మనకు పోటీగా మారింది. నేను పోటీ ఇవ్వలేకపోతున్న సమయంలో విజరు నాకు తోడు నిలబడ్డాడు. మన విద్యాసంస్థను పడిపోకుండా కాపాడాడు. వాడు నాకు మనీ ప్లాంట్‌. డబ్బులు కాస్తున్న చెట్టుని నేను నరుక్కోను. నీకు ఈ మధ్య అసలు ఆరోగ్యం బాగుండడం లేదు. జరిగేదేమీ పట్టించుకోకుండా నిద్రపో! టాబ్లెట్లు వేసుకున్నావా..?' అంటూ ఆమె పక్కన కూర్చుని తన భుజం పైకి భవాని తలను తీసుకొని ఓదార్చాడు. శక్తివంతమైన విద్యుత్‌ దీపాల వెలుగును కూడా ఆపి తన కింద నీడను ఏర్పరచుకున్న చెట్లను చూస్తున్నాడు ప్రసాద్‌.

                                                                                     ***

'విద్యాసంస్థ గ్రాఫ్‌ నెమ్మదిగా పడిపోతున్నప్పుడు టెన్త్‌ క్లాస్‌ ఫ్యాకల్టీగా విజరు జాయినయ్యాడు. ఆ ఏడాది టెన్త్‌ పరీక్షలు చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. కాపీకి కాసంత కూడా ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణ జరుగుతుంది. అంత కఠిన పరిస్థితుల్లోనూ విజరు విజయవంతంగా తమ పిల్లలతో అన్ని పరీక్షలకు స్లిప్పులు అందేలా చేశాడు. వేసవి సెలవుల్లో వచ్చిన టెన్త్‌ రిజల్ట్‌ ప్రసాద్‌ విద్యాసంస్థల కీర్తిని ఆకాశానికి ఎత్తేసింది. పట్టణంలో ఏ విద్యాసంస్థ ప్రసాద్‌ విద్యాసంస్థల దరిదాపులకు కూడా రాలేదు. ఫలితాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకునే తల్లిదండ్రులు ప్రసాద్‌ స్కూల్‌ వైపే తల తిప్పారు. అదే అదనుగా విజయ్ పాఠశాల ఆవరణలోనే యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, బ్యాగులు, షూస్‌ స్కూల్‌ యాజమాన్యం ద్వారా లభించేలా చేశాడు.
            తల్లిదండ్రుల ఇష్టాలకు వదలకుండా వస్తువ్యాపారం చేశాడు. తప్పనిసరిగా స్కూల్లోనే కొనాలని 'బ్రాండ్‌' అనే పేరుని తగిలించాడు. అధిక ధరలకు అమ్మించేవాడు. పంక్తిలో కూర్చున్నాక వద్దన్నా వడ్డన ఆగుతుందా? మొండికేసిన తల్లిదండ్రులకు తానే ఫోన్‌ చేసి ఒప్పించేవాడు. ప్రసాద్‌ ఆనందానికి అవధులు లేవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకున్నాడు. విజరు వైఖరి నచ్చి, ఇంటర్‌ క్యాంపస్‌కు ఇన్ఛార్జిని చేశాడు. ఎవరికీ సాధ్యం కాకపోయినా తనదైన మార్కుతో మాస్‌ కాపీ జరిపించేవాడు. ఐఐటీ సీట్లలో ప్రసాద్‌ విద్యాసంస్థలను ముందంజలో నిలిపాడు.
'విజరు సార్‌ అంటేనే విజయం' అనేలా జనాల్ని నమ్మించాడు. కుప్పలు తెప్పలుగా అడ్మిషన్లు వచ్చి, పడేవి. బస్సుల్లో సీట్లు సరిపోకపోయినా రెండు బస్సుల పిల్లల్ని ఒకే బస్సులో కుక్కేసేవాడు. ఎదురుతిరిగే విద్యార్థుల్ని ఏదో ఒక వంకతో తిట్టి, నోరు మూయించేవాడు. కాలం చెల్లిపోయిన బస్సులను తిప్పేవాడు. పర్మిట్లు లేకపోయినా పై అధికారులను మేనేజ్‌ చేసేవాడు. విద్యార్థుల తల్లిదండ్రుల దష్టి మరల్చడానికి, పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాల కార్యక్రమాలు చేసేవాడు. సంఘంలోనే ప్రముఖ వ్యక్తులతో సాహిత్య సదస్సులు నిర్వహించేవాడు. ప్రవచనకారులతో భారీగా కార్యక్రమాల్ని ఏర్పరిచేవాడు. వేలాది జనాల్ని ఆ కార్యక్రమానికి రప్పించేవాడు. సంక్రాంతి సంబరాల పేరుతో స్థానిక రాజకీయ నాయకులను పిలిచి, సన్మానించేవాడు. వాళ్లను అతిగా మైకుల్లో పొగిడేవాడు. 'చెవిటివాడికి కూడా పొగడ్త వినపడుతుందనే మానసిక బలహీనతే విజయ బలం'.
ఇక సంస్థకు అన్నీ తానే అనుకున్నాక అతనిలోని పశుత్వం బయటికి వచ్చింది. తాహతుకు మించి, ఏది ఎక్కువైనా విషం మనిషిలో పెరుగుతుంది. ఆ విషానికి అధికారం ఒక పెద్ద కారణం. పిల్లల వాట్సాప్‌లో తన బర్తడే స్టేటస్లు పెట్టించేవాడు. సిఇసి చదివే పిల్లల్ని 'మీది చదువే కాదు' అంటూ అవమానించేవాడు. క్లాస్‌ చెబుతూ ఆడపిల్లల బెంచీల మీద కూర్చుని, వాళ్ల జడలోని పూల రెక్కల్ని పీకి వాసన చూసేవాడు. వాళ్ళ పక్కన కూర్చుని నీతి పదాలకు బూతుల బట్టలు తొడిగేవాడు. ఏ మగ విద్యార్థి ఇటువైపు చూసినా, మాట్లాడినా అతడిని టార్గెట్‌ చేసి, హింసించేవాడు. భయం ఏ మనిషిని అయినా లొంగదీస్తుంది. అమ్మాయిల పట్ల వంకర చూపులు, వండి వార్చిన వ్యంగ్యాలు సదాసిద్ధంగా ఉండేవి. తనను తాను ప్లేబారుగా ఊహించుకునేవాడు.
             తల్లిదండ్రులు గొడవకు వస్తే.. చాలా లౌక్యంగా మాట్లాడి, వెనక్కి పంపేవాడు. ఎటు గాలి వీస్తే అటు దీపం తలాడించినట్టు మాట్లాడేవాడు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. అవసరమైతే తల్లిదండ్రుల కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనకాడేవాడు కాదు. ఎలా దిగజారైనా, ఏం చేసైనా, ఏ విషయం యాజమాన్యం చెవిన పడనీయడు. కొన్ని విషయాలు ప్రసాద్‌కు తెలిసినా, తనదాకా విషయం రానందుకు సంతోషించేవాడు.
           ఏ విషయమైనా ప్రసాద్‌ వరకూ వెళ్లి అడిగినా 'పిల్లలు తొందరగా అబద్ధాలు ఆడతారు. ఊహల్లో జీవించే వయస్సు' అనే రెండు సూత్రాల విత్తనాలను యాజమాన్యం మెదడులో బలంగా నాటాడు. విజరు చెప్పేవి అబద్ధాలు అని తెలిసినా ప్రసాద్‌ కిమ్మనకుండా ఉండిపోయేవాడు.
దివ్య చురుకైన పిల్ల. ఎలా నవ్వితే సహజంగా ఉంటుందో ఆ అమ్మాయిని చూపిస్తే చాలు. పెద్ద పెద్ద ఉపమానాలు అక్కర్లేదు. అందుకే థామస్‌ 'స్మైలీ' అని పిలిచేవాడు. నవ్వులు నటిస్తూ విజరు బతుకుతాడు. మితభాషిగా ఉండే దివ్యను అతడు లక్ష్యం చేసుకున్నాడు. ఏదో రకంగా వేధించేవాడు. తనెంత ఇబ్బందిపడుతున్నా చూపు తిప్పుకోకుండా దివ్య శరీరాన్ని చూస్తుండేవాడు. అతడి స్వభావం ఎరిగిన దివ్య లొంగలేదు. విజరు అహం దెబ్బతింది. దివ్య క్యారెక్టర్‌ ఎస్సాసినేషన్‌ చేయాలనుకున్నాడు. ఆమె పేరు రకరకాల విద్యార్థుల పేర్లతో ముడిపెట్టి, క్యాంపస్లో కథలు పుట్టించాడు. 'సీతాకోక రెక్కలు పీకి దానిని ఈ లోకానికి చూపించాక తిరస్కారం పెద్ద కష్టమేమీ కాదు' అనే విజరు దృక్కోణం దివ్యకు తెలుసు.
తన బాధ బయటకు చెప్పినా ఎవరూ పట్టించుకోరు, పంచుకోరు సరి కదా.. ఇవి తెలిస్తే ఇంట్లో వాళ్ళు కాలేజీ మాన్పించేస్తారు. పైగా అక్కడి విద్యార్థులందరూ వారంలో చివరిరోజు కోసం ఎదురుచూసే వారే! ఇక తనగోడు ఎవరు వింటారు ?
          థామస్‌ హాస్టల్‌కు వచ్చినప్పుడల్లా దివ్య తండ్రికి చెప్పుకోలేని విషయాల్ని మాట్లాడేది కాదు. తల్లిదండ్రులను చూడగానే ఆనందానికి రెక్కలు వచ్చేవి. వాళ్ళు వెళ్లిపోగానే రెక్కలు మాయం అయ్యేవి. కళ్ళ ముందు మనిషి కనపడతాడు.. అతని కళ్ళలోని బాధ మాత్రం ఎదుటి వ్యక్తికి కనబడదు.
          థామస్‌ అప్పుడప్పుడు సిక్‌ లీవ్‌ మీద దివ్యను ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఆ నాలుగు రోజులు దివ్య ప్రపంచంలోకి సంతోషపు నది ప్రవహించేది. చిన్నపిల్లయి ఆడేది. కాళ్లకు లేడిగంతులు పరిచయమయ్యేవి. మళ్లీ హాస్టల్‌ గేటు దగ్గరికి రాగానే భయంతో వణికేది. మాటిమాటికీ చున్నీ సరిచేసుకునేది. క్యాంపస్‌లో తనకు ఎదురయ్యే వ్యక్తులు, ఎదుర్కొనే సంఘటనలు అచేతనత్వాన్ని పెంచేవి. రాత్రిళ్ళు అర్ధాకలితో పడుకున్న రోజులు ఎక్కువ అవుతున్నాయి. శాసించడం మొదలైన చోట సంతోషం ఆవిరైపోతుంది. కన్నీళ్లు తుడిచేవారు లేరు. కఠినమైన పరిస్థితుల్లో ఒంటరిగా మారింది. గురువు కావాల్సిన జీవితం బరువుగా మారింది. కష్టాలు కన్నీళ్ళతో పాటు నిజాలను బయటకు తీసుకు వస్తుంది.. కానీ నిజం ఎవరికి చెప్పాలి? కన్నీళ్లను దాచినట్టే వాటిని కనపడకుండా చేయాలి.
           ఆలోచనలు బరువైతే అడుగు కూడా ముందుకు వేయాలి అనిపించదు. కానీ దివ్య మాత్రం మరో అడుగు ముందుకు వేసింది.. అవి చివరి అడుగులు.
 

                                                                                  ***

కాలం గడిచే కొద్దీ భవాని మామూలు స్థితికి వచ్చింది. ఎంత కాలేజీ ఓనర్‌ అయినా తానూ ఒక మహిళనే. విద్యార్థులే కాదు తాను బందీనే అనే వాస్తవిక కోణాన్ని జీర్ణించుకుంది.
సక్సెస్‌ రేట్‌ తగ్గినా, స్ట్రెంగ్త్‌ తగ్గినా ఈ ఫీల్డ్‌లో మొదటికే మోసం. అందుకే విజరు తనకు అవసరమని ప్రసాద్‌కు తెలుసు.
విజయాలు తెచ్చే వరకు, విద్యార్థులతో గదులు నింపే వరకు ప్రిన్సిపాల్‌కు తన అవసరం అని విజరుకు తెలుసు. మార్కుల్ని ప్రామాణికంగా భావించే ప్రపంచం సంగతి తను చూసుకుంటాడు.
 

                                                                               ***

ఇంటర్‌ విద్యార్థులు నష్టపోకుండా టెన్త్‌ క్యాంపస్లో వాళ్లకు యథావిధిగా పాఠాలు కొనసాగుతున్నాయి. అధికారుల విచారణ సాగదీయబడుతుంది. డబ్బులు చేతులు మారుతున్నాయి. సమాజం తన నిత్య కర్మల్లో మునిగిపోయింది. నెల రోజులు గడిచాయి.
         ప్రసాద్‌ థామస్‌ ఇంటికి వెళ్ళాడు అతని చేతులు పట్టుకున్నాడు. 'తమ్ముడూ! జరిగిన దాన్ని మార్చే శక్తి మనకు ఆ భగవంతుడు ఇవ్వలేదు. దివ్యను నా బిడ్డగా చూసుకునేవాడిని. దేవుడు దయ లేనివాడు' అంటూ థామస్‌ చేతులపై పడి బోరున ఏడ్చాడు. కాసేపటికి తేరుకుని, డబ్బుల సంచి థామస్‌ చేతుల్లో పెట్టాడు.
          థామస్‌ ఏదో అనబోయేంతలో 'తమ్ముడూ! ఇది నష్టపరిహారం కాదు. నీ రెండో బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే! ఆమె భవిష్యత్తు కోసం దీనిని నువ్వు కాదనకూడదు.. ఉంచు' అని ఒప్పించి, ఓదార్చి ప్రసాద్‌ బయటకు వచ్చాడు.
డబ్బుకు తోబుట్టువు అధికారం. గవర్నమెంటు ఆఫీసర్‌ ఒకరు సాయంత్రం వచ్చి.. కొన్ని కాగితాలు థామస్‌ చేతుల్లో పెట్టాడు.
          'దివ్య మానసిక సమస్యతో ఆత్మహత్య చేసుకుంది' అనేది దాని సారాంశం. థామస్‌ చదివి ఆఫీసర్‌ వైపు చూశాడు. 'గురువుగారూ! సంతకం చేసేయండి. ఈ గొడవను ఇక్కడితో వదిలేయండి. బస్సులు ధ్వంసం చేసినందుకు మీ మీద కేసు పెట్టారు. అది ప్రసాద్‌గారు ఉపసంహరించుకున్నారు. కేసులు, కోర్టులంటూ మీలాంటి వాళ్ళు తిరగలేరు. నా మాట వినండి. మీ మంచికే నేను చెబుతున్నాను!' అని హితోక్తులు చెప్పాడు. థామస్‌ సంతకం చేసేశాడు.
         వ్యక్తిత్వాన్ని నిలుపుకుని జీవిస్తే మరణం తరువాత అయినా ప్రపంచం గుర్తుంచుకుంటుంది అనుకుంది దివ్య. కానీ ఈ ప్రపంచం పది రోజులకు మించి ఏదీ గుర్తుంచుకోదు. పనిగట్టుకుని కూర్చుని విమర్శలు అయితే ఎల్లకాలం చేస్తుంటారని ఆ చిట్టి మనసు గ్రహించలేదు. చెడు గుర్రంలా పరిగెత్తే చోట.. మంచి మాత్రం ఎక్కడో నత్తనడక నడుస్తూ ఉంటుంది.
            కాలేజీ రెండు రోజుల్లో తెరుచుకుంది. చనిపోయిన అమ్మాయికి ఎఫైర్‌ ఉందని కాలేజీలో రూమర్‌ స్ప్రెడ్‌ చేశారు. కాగితాలు మాట్లాడే చోట మనుషుల మనోభావాలకు విలువ ఉండదు. థామస్‌ స్కూల్‌ మూసేసి కేరళ వెళ్ళిపోయాడు.
         పద్ధతిలేని పైసల వెనుక పరిగెట్టడం మొదలెట్టాక ఈ సమాజం గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపును నిలబెట్టుకోవాలంటే ఆశకు అంతం లేకుండా జీవితం చివరిరోజు వరకూ పరిగెట్టాలి. ప్రసాద్‌ తనకు స్కూల్‌ తెరిపించడానికి కోటి రూపాయలు ఖర్చయిందని ఘనంగా చాటాడు. విజరును ఇంటర్‌ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగించాడు. లోపలి వ్యక్తిత్వం ఎంతగా మాసిపోయినా పైన తెల్లబట్టలు వేసుకుని ఈ సమాజానికి కనబడితే చాలన్నట్టు ప్రసాద్‌ క్యాంపస్‌ మొత్తం తిరుగుతూ వైట్‌డ్రెస్‌తో, చేతికి బంగారపు ఉంగరాలు ధరించి వచ్చిపోయే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు చేస్తున్నాడు.
స్కూలు కొత్త అడ్మిషన్లతో కళకళలాడుతుంది.
'దివ్య దూకిన గోడపై మనీప్లాంట్స్‌ తీగలు దట్టంగా పాకి ఆమె పాదాల ముద్రలను కమ్మేశాయి'.

-'బహుశా' వేణుగోపాల్‌
9912395420