
అతనొక రైతు
అతనికున్నది
స్థలము కొద్దిగ!!
స్థలములోనే
కలదు గృహమూ!
పొలములో తనె
సలుపు సేద్యము!!
ఉన్నదతనికి
ఒకే కూతురు
ఉన్నదామెకు
ఒక ఉద్యోగము!!
కలిగినంతలో
కట్నమొసగీ
పెద్ద ఎత్తున
పెళ్ళి చేసెను!!
అప్పుచేసీ
పప్పుకూడు
అన్న సామెత
ఉన్నదే గద !!
అప్పులధికం
అయ్యెనతనికి
ఆ దిగులె తెచ్చె
అనారోగ్యం !!
ఆపరేషన్
అత్యవసరం
తక్షణం అగు
లక్షలెన్నో !!
తెచ్చినప్పులు
తీర్చవలెగా
ఉండుటకు గృహ
ముండవలెగా!!
కలదు గృహమా
స్థలములోనే
అందుకె పొలం
అమ్మదలచెను
ఉన్న విషయం
కన్న బిడ్డకు
విన్నవించెను
వెళ్ళి వెంటనే !!
'వైద్యమొద్దూ
సేద్యమొద్దూ
పొలము అమ్మే
తలపువద్దూ!!
పుచ్చుకొనుమీ
పురుగుమందూ!
చచ్చిపోయీ
సౌఖ్యమొందూ!!
అనెను కూతురు
ఆగ్రహిస్తూ
తండ్రి మనసూ
తల్లడిల్లెను!!
గుండె ఒక సుడి
గుండ మాయెను
మనసునందున
మధనమాయెను!!
చిన్నతనమున
నిన్ను నా ఈ
గుండె పైనే
పండబెడితిని !!
సరిగ నీవా
గుండెనిప్పుడు
ఘాటు మాటల
ఈటె పోటుల
చీల్చి వేస్తివి
చిదిమి వేస్తివి
ఏమి న్యాయము
ఎంత హేయము!!
చివరికీగతి
చింతలొందితి
బతికి ఉండగ
చితికి చేరితి !!
అలపర్తి వెంకట సుబ్బారావు,
94408 05001