
అమ్మకు పోరాటం ప్రకృతి నేర్పిన పాఠం. బిడ్డని భూమ్మీదకు తెచ్చేటప్పుడే ఆమె చేసే పోరాటం అనితరం. ఆ ప్రకృతిలోనే నిత్యం ప్రాణం పోసుకున్న ఆదివాసీ మహిళలది నిత్య జీవన పోరాటం. అంతిమంగా పోరు సల్పడంలో ఆమె ఎప్పుడూ అలుపెరగని సాహసే. పట్టుమని పన్నెండేళ్లు నిండని పసిపిల్లలు.. యువతులు.. మహిళలు.. 70 ఏళ్ళ వృద్ధులు.. మేము సైతం అంటూ పోలవరం పోరుకేకలో పాదం కలిపారు. మేమేం తక్కువ కాదంటూ వారితో మాట్లాడలేని, వినలేని విభిన్న ప్రతిభావంతులు సైతం ఎర్రజెండా చేబూని కదం తొక్కారు. అలా ఒక్కరు కాదు.. ఏకంగా 110 మంది ధీర వనితలు భవిత కోసం గళాలెత్తారు. ఒకటి కాదు, రెండు కాదు.. వందల కిలోమీటర్లు మండే ఎండని, కురిసే వానను లెక్క చేయక పిడికిళ్లు బిగించి, పోరుబాటలో కొనసాగారు. ఎలాంటి అనుకూలతలు ఎదురైనా మడమ తిప్పక ముందుకే సాగారు. అలుపెరగని పోరాటంలో పాల్గొన్న ఈ మహిళలంతా పోలవరం నిర్వాసితులే.. ఎర్రజెండా చూపిన వెలుగుదారుల్లో స్వేదం చిందిస్తూ పోరు సల్పుతున్న వీరిందరివీ మనసును ద్రవింపజేసే నిర్వాసిత గాథలే. పదిహేను రోజుల పోరుకేక మహాపాదయాత్రలో మేము సైతం అంటూ గర్జించిన ఈ ధీరల గురించే ఈ ప్రత్యేక కథనం.

'ఓడిపోయిన మట్టికి..
గాయపడిన మనసులకు
గెంటేసిన స్థలాలకు.. కాలాలకు..
ఎప్పుడో గడ్డకట్టుకుపోయి
ఎంతకీ బయటకు రాని దుఃఖాలకి..
పొగచూరిన బతుకులకు..
వెలుగు వచ్చేది ఎప్పుడు?
ఆకాశం గోదారిని చుంబించే చోటు
నారింజరంగు నీలివర్ణం కలయికలో..
ఓ విషాదపు చారిక
మోకాలు లోతు నీటితో
జీవితపు చరమాంకంలో గ్రామం
చూరికే తాడుతో పెనవేసుకున్న పడవ
నదిలోకి వెళ్లేదెప్పుడు?' అని కవి అన్నట్లు.. ఆ కష్టాల కన్నీళ్లలో ఇంకెన్నాళ్లీ మునక అనేది ప్రశ్నించుకున్నారు వారంతా.. అందుకే రాష్ట్రం మారుమోగేలా పెద్దఎత్తున పోరుకేక పెట్టారు.

మైదాన ప్రాంతంలో లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండించేందుకు అవసరమైన నీరు అందించే, లక్షలాది ప్రజల భవితకు బంగరు బాట వేసే బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం. అది వందలాది ఆదివాసీ గ్రామాలనూ.. సాగు భూములనూ.. నీట ముంచితే.. వారంతా నిర్వాసితం అయితే, అందేది ఏమిటి? ఇళ్లను, ఊళ్లను, భూములను, త్యాగం చేసిన ఆదివాసీల పట్ల ప్రభుత్వాల బాధ్యతేది? అసలైతే వీరికి ఎంత అండగా నిలవాలి? కానీ, అలాటిదేమీ లేకుండా వారి పట్ల ఎంత నిర్లక్ష్యం.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గిరిజన బిడ్డల జీవితాల్లో పెను విషాదాన్ని తెచ్చింది. ఉన్న ఊరిని, కట్టుకున్న ఇంటిని, నమ్ముకున్న భూమిని ప్రాజెక్టుకు అప్పజెప్పిన ఆ అడవిబిడ్డలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందడం లేదు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి, పునరావాసం కల్పిస్తామన్న మాటలు గోదాట్లో కలిసిపోయాయి. ఇంట్లో వున్నా, రోడ్డు మీదున్నా ఒకేలా ఉండే పునరావాసాలు.. వారిని దుర్భర జీవితాల్లోకి నెట్టేశాయి. తమ బతుకులు బాగు చేసి, న్యాయం చేయండని.. ఏళ్ల తరబడి వేడుకున్నా.. గోడు వినే ఏలికలే లేకపోవడం అత్యంత విషాదం. అందుకే ఎన్నాళ్లీ నిర్లక్ష్యం.. ఎంతకాలం ఈ అగచాట్లూ.. సగం మునకలో ఉన్న బతుకులకు పోరు తప్ప మరో మార్గం లేదనుకున్నారు. అందుకే పోరుబాట పట్టారు ఆదివాసీలు.

పట్టని పాలకపక్షాలు..
'ఒక్కసారి చూసి వెళ్లలేని ఏలికలు..
జీవితమే మునక గ్రామమై
కడుపులో సుడులు తిరుగుతున్న దుఃఖం
నీటి అలలపై ఎగసిపడుతూ
యువత ఆవేశంలా ఉద్రేకపడుతోంటే..
ఈ ఉద్రేకం చల్లారేదెప్పుడు?' అన్న కవి మాటలు అక్షర సత్యం. అందుకే యువత రగిలిపోయింది. తమకు, తమ కుటుంబాలకు ఇప్పటివరకూ జరిగిన అన్యాయంపై 'పోలవరం పోరుకేక మహాపాదయాత్ర' తో ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. దళాలుగా ఏర్పడి, 15 రోజుల పాటు దండుకట్టి పోరుబాటలో ముందుకు ఉరికింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినా ఆర్ అండ్ ఆర్‌కు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అండగా నిలుస్తానంటూ నాడు ప్రతిపక్ష నేతగా తన పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదు. గతేడాది వచ్చిన వరదల్లోనూ బాధితులకు కేవలం రెండువేల రూపాయలు, నాలుగు రకాల కూరగాయలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
ఈ నేపథ్యంలో నిర్వాసిత మహిళలు 'పోరుకేక'లో తమ పాదం కలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర 380 గ్రామాలను సందర్శిస్తూ 400 కిలోమీటర్లు అలుపెరగక కొనసాగారు ఈ ధీర వనితలు. వారి బాధామయ గాథలు వారి మాటల్లో వినాల్సిందే.

- పదిమంది మహిళా ప్రజా ప్ర్ర్రతినిధులు..
ఈ యాత్రలో పది మంది మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొనడం. వీరిలో కారం లక్ష్మి ఎంపిపి, అడవి వెంకన్నగూడెం నుంచి పాల్గొన్నారు. దరుముల అమ్మాజీ (ఆరుకూరు), కారం జయసుధ (కొండాయిగూడెం), ప్రస్త్తుతం ఎంపిటిసిలుగా ఉన్నారు. మాజీ ఎంపిటిసి సున్నం నాగమ్మ (సున్నంవారి గూడెం) కూడా పాల్గొన్నారు. నలుగురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. వీరిలో మడకం నాగమణి (రేపాక), బొగ్గ వెంకమ్మ (ముల్లూరు), బుచ్చమ్మ (చొప్పెలి), కూనెం సరోజిని (రేకపల్లి) ఉన్నారు.
- మూడింట ఒక వంతు మహిళలే!
మొత్తం యాత్రలో అన్ని రోజుల పాటు 351 మంది పాల్గొన్నారు. వారిలో 110 మంది మహిళలు పాల్గొన్నారు. అంటే మూడింట ఒక వంతు మహిళలు పాల్గొన్నారన్న మాట. వారిలో 60-70 ఏళ్లవారు ముగ్గురు మినహా, మిగిలిన అందరూ 18-25 ఏళ్లలోపు యువతులే.
ఎంత నష్టమైందన్న సర్వేనే లేదు..

'వరద ముంచెత్తింది.. కళ్ల ముందే గూడు కూలిపోయింది. వండుకున్న కూడు నీటిలో కలిసిపోయింది. బిడ్డలకు కడుపు నింపలేదనే బాధతో వచ్చే కన్నీరు వరద నీటిలో కలిసిపోయింది. ఉన్న ఫలాన చేతికందిన సామాను పట్టుకుని అడవిలోకి పరుగులు పెట్టాం. ఆ జోరువానలో ఒకటి, రెండురోజులు కాదు.. నెలల తరబడే ఉండిపోవాల్సి వచ్చింది. చేతికొచ్చిన పంట నీట మునిగిపోయింది. మూడు నెలలు పాటు పొలాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం అరకొరే. తాటిచెట్టు ఎత్తు నీరు పారిన మా గ్రామంలాంటివి ఎటపాక మండలంలో చాలా ఉన్నాయి. ఇంతలా మునిగిపోయినా మాకింత వరకు కనీసం ఎంత నష్టం జరిగిందన్న సర్వే కూడా చేయలేదు. మా గోడు పట్టించుకున్న నాథుడే లేడు. అందుకే మా బాధలు తెలపాలనే ఈ యాత్ర చేస్తున్నాం. మా బాధ ప్రభుత్వానికి చేరి, మా కష్టాలు తీరి, మాకు న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు' అంటూ ఎటపాక మండలానికి చెందిన మహిళ వీరమ్మ తన ఆవేదనను పంచుకుంది.
ఈ మండలం నుంచే పోరుకేక యాత్రలో 40 మంది వరకు పాల్గొన్నట్లు వీరమ్మ చెప్పింది. 'ఇన్ని రోజులు నడవడంతో కాళ్లు నొప్పులు పెడుతున్నాయి.. చిన్నపిల్లల కాళ్లు బొబ్బలెక్కాయి. అయినా మేం నడక ఆపలేదు. నాయకులు విశ్రాంతి తీసుకోమని ఎన్నోసార్లు చెప్పారు. అయినా న్యాయం దక్కేవరకూ ఆగేది లేదని వారితోనే మేమూ నడుస్తున్నాం' అని వీరమ్మ చెప్తుంటే.. వారంతా ఎంత పట్టుదలతో ఈ పోరాటంలో కొనసాగారో అర్థమవుతుంది. భవిష్యత్తు బాగుండాలంటే పోరు సల్పాల్సిందేనని ఆమె మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది.
చిట్టితల్లికి ఎన్నికష్టాలో..

ఈ యాత్రలో 11 ఏళ్ల చిట్టితల్లి రజిని పాల్గొంది. విఆర్ పురం మండలానికి చెందిన ఈ చిన్నారి మొదటిరోజు నుండి యాత్రలో కొనసాగింది. తల్లిదండ్రులు పనులకెళితే.. ఆ ఇంటి నుంచి పోరుబాటలో పాల్గొంది. పెద్దవాళ్లతో ఏమాత్రం తగ్గకుండా పొద్దున్నుంచి రాత్రి వరకూ నడుస్తూనే ఉంది. కాళ్లు బొబ్బలెక్కి, వాసిపోయి, నిద్ర పట్టక రాత్రుళ్లు లేచి కూర్చొనేది. నడవలేవులే ఇంటికెళ్లిపొమ్మని నాయకులు ఎన్నిసార్లు చెప్పినా వెనక్కి తగ్గేది కాదు. పైగా 'మేము పడే బాధకన్నా ఈ నొప్పులేమీ ఎక్కువగాదు. మా ఇంటి నుండి నేనొక్కదాన్నే వచ్చాను.. ఇప్పుడు నేను వెళ్లిపోతే ఎలా? వరదల్లో మా ఇల్లు కొట్టుకుపోయినప్పుడు నాకు చాలా భయమేసింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలి. అలా జరగాలంటే నాయకులు చేసే ఈ యాత్రలో నేనూ పాల్గొనాలి. అందుకే అమ్మ ఈ విషయం చెప్పగానే నేను యాత్రలో నడిచేందుకు వచ్చాను, ఏ బండీ ఎక్కను. నొప్పులొచ్చినా వెనక్కి వెళ్లను' అంటున్న ఆ చిన్నారి మాటలు అక్కడి నిర్వాసితుల దయనీయ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎంతటా ఆరాటపడుతున్నారో మనకు కళ్లకడుతోంది. ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తోంది. ఈ చిట్టితల్లికి ఎన్నికష్టాల్లో కదా! ఇప్పటికైనా పాలకుల పాషాణ హృదయాలు కరిగేనా?
మా భవిష్యత్తు కోసం..

'అధికారుల లెక్కల ప్రకారం మా గ్రామం 45వ కాంటూరు పరిధిలో ఉంది. గతేడాది వచ్చిన వరదలకు పూర్తిగా మునిపోయింది. నాకు ఊహ తెలిసిన తర్వాత ఈ స్థాయిలో వరద రావడం అదే మొదటిసారి. రెండు వారాలు బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఇలా ఎన్నాళ్లు చస్తూ బతుకుతాం? అందుకే ఈ పోరు యాత్రలో నేనూ పాల్గొన్నాను. నేను ఈ మధ్యే డిగ్రీలో చేరాను. అసలైతే నేను కాలేజీకి వెళ్లాలి. కానీ మా భవిష్యత్తు కోసం జరిగే పోరాటం ఇది. అందుకే ఈ యాత్రలో మా కుటుంబం మొత్తం పాల్గొన్నాం' అని వేలేరుపాడు మండలం, వసంతవాడ గ్రామానికి చెందిన కుంజా కావ్య చెప్పారు.

రాళ్లు.. ముళ్లు.. గుచ్చుకున్నా..

'నడిచేటప్పుడు కాళ్లకు రాళ్లు గుచ్చుకునేవి. కొన్నిచోట్ల ముళ్లు కూడా పాదాల్లో దిగబడేవి. అయినా మా బతుకులకన్నా అవేమీ పెద్ద బాధ అనిపించలేదు. అన్నీ దాటుకుంటూ విజయవాడకు చేరాం. నాలుగు వందల కిలోమీటర్లు కాలినడకన వచ్చాం. మహిళలకు నెలనెలా వచ్చే సమస్యలున్నా.. అన్నీ తట్టుకుని ముందుకే వెళ్లాం. ఒక్కరం కూడా వెనక్కి వెళ్లలేదు. నేనే కాదు.. నాలానే వందలాది మంది మహిళలు ఈ యాత్రలో అన్నీ ఓర్చుకునే ముందుకు సాగారు' అంటూ ఎటపాక మండలం, జగ్గారం గ్రామానికి చెందిన పదం నిర్మల చెప్పారు.
ఏం తిని బతకాలి?

'పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు మండలాల్లో నివసిస్తున్న మాలాంటి యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు ఉంది. అందులో మిర్చి సాగు వేసుకుని, మా కుటుంబం బతుకుతోంది. మాకు ఇంతవరకూ పునరావాసం కల్పించలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించనేలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్న మాటలేగానీ, మా గురించి మాట్లాడే వాళ్లే లేకుండా పోయారు. మమ్మల్ని, మా బతుకుల్ని గోదాట్లో ముంచేస్తున్నారు. అడవి నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి? ఏం తిని బతకాలి? ఈ బాధ నాదొక్కదాన్నే కాదు నాలాంటి యువత అందరిదీ ఇదే బాధ. ఈ పోరుయాత్ర మాకు బతుకు మీద ఆశ కలిగించింది. అందుకే ఈ యాత్రలో పాల్గొన్నాను!' అంటూ కూనవరం మండలం, రేపాక గ్రామ సర్పంచ్ మడకం నాగమణి ఆందోళనతో చెప్పారు.
మాట తప్పారు..

'నాడు ప్రతిపక్ష నేతగా మా ప్రాంతంలో ఇప్పటి సిఎం పర్యటించారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన మాకు న్యాయం చేస్తానని అప్పుడు భరోసా ఇచ్చారు. అవన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. సిఎం మాట తప్పారు. గత వరదలు నాటి దుర్భర పరిస్థితులు మా కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కనీసం వరద సాయం కూడా లేదు. పోరుకేక మహా పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నేను వచ్చాను.' అని చింతూరు మండలం, గూడూరు గ్రామానికి చెందిన సోడి సింగమ్మ ఆగ్రహంగా చెప్పారు.
అమ్మకు బిడ్డనప్పగించి ..

'పోయినేడాది వచ్చిన వరదల్లో పండిన పంట, ఇళ్లు కొట్టుకుపోయి గింజ మిగల్లేదు. అన్నీ కొనుక్కొని తిన్నాం. కరువు పనులకెళ్లినా అరకొరగానే వేతనం వచ్చేది. అలాగే బతుకు సాగిస్తున్నాం. గోదారి, శబరి మధ్య డెల్టాలో మా ఊరు ఉంది. అందువల్ల పాడైన ఇళ్లు బాగు చేసుకోవడానికి రూ.60 -70 వేలు ఖర్చయ్యాయి. కనీసంగా పదివేలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు. ఏవో సాకులు చెప్పి, కాసింత సాయం కూడా అందకుండా చేశారు. మాకు వరదలేమీ కొత్త కాదు.. అప్పట్లో వరదలొచ్చినా రెండు, మూడు రోజుల్లోనే తెప్పరిల్లేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదే.. గతేడాది వచ్చిన వరదలయితే మూడు వారాల పాటు డేరాలు కట్టుకుని అడవిలోనే ఉన్నాం. జోరువానల్లో పిల్లజెల్లాతో ఎంత ఇబ్బందిపడ్డామో అనుభవించిన మాకు తెలుసు' అంటూ ఎంతో ఆవేదనగా చెప్పుకొచ్చింది కూనవరానికి చెందిన జ్యోతి. 'నాకు ఆరేళ్ల బాబు ఉన్నాడు. మా అమ్మ దగ్గర ఉంచి, పోరుయాత్రలో పాల్గొన్నా.. మా మండలంలో ఒక గ్రామానికి ప్యాకేజీ కింద పునరావాసం ఇచ్చారు. అక్కడ నీళ్లు లేవు. కరెంటు లేదు. రోడ్లు లేవు. మాది బాగా పండే భూమి. కానీ, ఇక్కడంతా రాళ్ల గుట్టలు. అది చూసి ఊరోళ్లంతా గుండెలు బాదుకున్నారు. మా గోడు ఎవరు పట్టించుకుంటారు? యాత్రలో భాగంగా పునరావాస కాలనీలకు కూడా వెళ్లాం. అవి చూసినప్పుడు మాకు భయం వేసింది. రేపు మా పరిస్థితి కూడా ఇదేనన్న బెంగ పట్టుకుంది. ఇన్ని బాధలు అనుభవించిన మేమంతా న్యాయం కోసమే ఈ పోరుబాటలో పాల్గొన్నాం. ఒంట్లో బాగుండటం లేదు. అయినా వెనక్కి వెళ్లకుండా ముందుకే సాగాం!' అంటూ వివరించింది జ్యోతి.
వినపడకున్నా.. మాటలు రాకున్నా..

అమ్మానాన్న లేని దేవికి చెవులు వినపడవు. మాటలు రావు. బంధువుల ఇంట్లో తలదాచుకుంటోంది. డిగ్రీ చదివింది. కాళ్లు నొప్పులతో ఎంతో ఇబ్బంది పడింది. అయినా వెనక్కి వెళ్లటానికి ఇష్టపడలేదు. తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే పట్టుదలతో ముందుకే సాగింది. ఇలా పోలవరం పోరుకేక నడక యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మహిళా ఎంతో పట్టుదలతో ముందుకే నడిచారు.
నెలసరి వచ్చినా వెనక్కి తగ్గలేదు..

'వరదలొచ్చి ఇళ్లు, పొలాలు నీట మునిగిపోతే ఉత్త చేతులతో అడవిలోకి వెళ్లిపోయాం. వరదల వల్ల అంటురోగాలు వచ్చాయి. మాకు ఎలాంటి వైద్యం అందలేదు. జ్వరాలతో నానాఇబ్బందులు పడ్డాం. ఆ జోరువానలో.. అడవిలో.. చిమ్మచీకటిలో.. విష పురుగుల నుండి పిల్లల్ని రక్షించుకునేందుకు రాత్రుళ్లు నిద్ర కూడా పోయేవాళ్లం కాదు. ఈ యాత్ర ద్వారానైనా మా పరిస్థితిల్లో మార్పు వస్తుందన్న ఆశ. ఇన్ని వందల కిలోమీటర్లు నడవడానికి కారణం అదే. ఆడోళ్లం కదా.. నెలసరి సమస్యలు మామూలే. ఆ సమయంలో నడవడం అంటే ఊహించుకోండి. ఎండైనా.. వానైనా.. నెలసరితో మాలో చాలా మంది ఇబ్బందిపడ్డారు. జ్వరాలు వచ్చాయి. అయినా ఒక్కరం కూడా వెనకడుగు వేయలేదు' అంటూ తమ బాధను కళ్లకుకట్టారు వి.ఆర్.పురం ఎంపిపి, లక్ష్మి. తనకున్న చిన్న పిల్లల్ని ముసలివాళ్లయిన అత్తకి అప్పజెప్పి భర్తతో కలిసి పోరుకేకలో ఆసాంతం పట్టుదలతో పాల్గొన్నారు.
చరిత్రలో ఓ మైలురాయి..

'పోలవరం నిర్వాసిత కాలనీలు దేనికీ పనికి రావు. వర్షం వస్తే ఆ ఇళ్లల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. గోదాట్లో ఆ కాలనీలూ మునిగి పోతున్నాయి. ఈ పునరావాస కాలనీల్లో ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు జానెడు స్థలం కూడా లేదు. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉందా? సర్వం కోల్పోయిన వారంతా ఈ పోరుకేక మహా పాదయాత్రలో పాల్గొన్నారు. యువత ఉరికే ఉత్సాహంతో కదం తొక్కుతూ నినదిస్తూ ముందుకు సాగారు. పదిహేను రోజులుగా 400 కిలోమీటర్లు జరిగిన ఈ పోరుకేక పాదయాత్రలో వందలాది మంది యువత, ప్రధానంగా మహిళలు పాల్గొనడం సామాన్యమైన విషయం కాదు. ఈ పోరాటం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నో బాధలు ఓర్చుకుంటూ, ఆడవాళ్లకు వచ్చే నెలసరి సమస్యల్ని సైతం అధిగమించి ముందుకే సాగారు. మండే ఎండలైనా, జోరు వానలైనా.. మునిగిన బతుకులు బయటకు రావాలంటే పోరు తప్పదని పంటిబిగువున అన్నీ ఓర్చుకుని, వెనక్కి తగ్గకుండా కొనసాగారు. అంతేకాదు ఈ మొత్తం యాత్రలో సంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటతోనే అలుపు తగ్గించుకుంటూ తమ కష్టాలు కడతేరాలని పట్టుదలతో కదం తొక్కారు. పదకొండేళ్ల అమ్మాయి నుంచి 18 ఏళ్ల లోపు యువతులు ఎందరో ఈ యాత్రలో పాల్గొన్నారు. కొంతమంది మహిళలు తమ పసిబిడ్డల్ని ఇళ్లల్లో పెద్దల దగ్గర వదిలేసి, ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. యాత్ర వెళ్లిన చోటల్లా మహిళలు ఎంతో ఆదరించారు. హారతులు పట్టి, కుంకుమ బొట్లు పెట్టారు. దండలేశారు. తాము ఎదుర్కొంటున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు' అంటూ సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు మొడియం నాగమణి చెప్పారు.
నిర్వాసితుల గొంతుక..

'మా గ్రామంలో 250 ఇళ్లు ఉన్నాయి. గతేడాది వరదల్లో మా గ్రామం మొత్తం మునిగిపోయింది. ఊళ్లో అంతెత్తు తాటిచెట్లు కూడా కనబడలేదంటే ఎంత వరకూ నీళ్లొచ్చాయో అర్థం చేసుకోండి. అయినా మా ఊరు ముంపు ప్రాంతంలో లేదని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థికంగా పూర్తిగా నష్టపోయాం. ఇప్పటివరకూ ఏ సాయం మాకు అందలేదు. మా అమ్మ ముసలిది. ఆమెను ఒంటరిగానే వదిలి ఈ పాదయాత్రలో పాల్గొన్నాను. ఈ పోరుకేక మహా పాదయాత్ర గోదావరి నిర్వాసితుల గొంతుక. నాకు ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. అయినా పుట్టెడు కష్టాల్లో ఉన్న నాకు ఇదేమీ బాధగా అనిపించలేదు. మా సమస్యల నుంచి బయటపడేందుకే ఈ పోరుకేకలో నడిచాను. నేను డిఇడి పూర్తి చేశాను. అయినా ఉద్యోగం లేక, వ్యవసాయ కార్మికురాలిగా కూలికే వెళుతున్నా. నేను పని చేస్తూ అమ్మను పోషించుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్‌సి తీయకపోవడంతో విలీన మండలాల్లో నాలానే అనేకమంది యువత ఉపాధి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది. ఇన్ని కష్టాలుపడుతున్న మాకు నాయకుల పిలుపు ఆశ కలిగించింది. అందుకే మా గ్రామం నుంచి 20 మందిమి ఈ పోరుకేకలో పాల్గొన్నాం.' అంటూ వివరించింది విఆర్ పురం వెంకన్నగూడెం గ్రామానికి చెందిన దారమ్మ.
అపూర్వ ఆదరణ..

పోలవరం పోరుకేక మహాపాదయాత్రకు ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి గొప్ప సంఘీభావం లభించిందని యాత్రలో పాల్గొన్న ప్రతిఒక్క మహిళా చెప్తున్నారు. చాలా గ్రామాల్లో మహిళలు వచ్చి తిలకం దిద్ది, హారతులు పట్టారు. నాయకులు తమ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. కొందరైతే మమ్మల్ని తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నారన్నారు. ఎప్పటికప్పుడు తమ అవసరాలు కనిపెడుతూ.. చెప్పులు తెగిపోతే చెప్పులు ఇచ్చారనీ, వానలో తడిచిపోకుండా గొడుగులు ఇవ్వడం, మంచినీటి సౌకర్యం, మజ్జిగ, ఆహారం, అవసరమైన మందులు సకాలంలో అందించారని తెలిపారు. చిన్న పిల్లలు కూడా ఈ యాత్రలో తమ చిట్టిచిట్టి చేతులతో నాయకులకు విరాళాలు అందజేశారు. యాత్రలో పాల్గొన్న ఎర్రదండుకు అడుగడుగునా పూలదండలతో ఆయా గ్రామాల్లో ఘన స్వాగతాలు లభించాయి. వ్యక్తులుగా, సంఘాలుగా తరలివచ్చి యాత్రకు సంఘీభావంగా పూలజల్లు కురిపించారని చెప్పారు.జెండాలు పట్టుకుని కదిలివస్తున్న ఎర్రదండు పాదయాత్రతో వీధులన్నీ అరుణవర్ణంలో గోదారి ప్రవహించినట్లుంది.
- శాంతిశ్రీ
8333818985