Nov 13,2023 15:15

అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు పాలమూరు. ఆ ఊరిలో అర్జున్‌ అనే పదహారు ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు. అతనికి చిన్నప్పటినుంచి సామాజిక స్పృహ ఎక్కువ. అర్జున్‌ ఒక కాలేజీలో చదివేవాడు. అతను రోజూ తన ఊరినుండి పక్కన ఉన్న టౌన్‌కి వెళ్ళవలసి వచ్చేది. అర్జున్‌ ఆ ఊరి చివర ఉన్న డంపింగ్‌ యార్డు దాటి వెళ్ళాలి. దానిని చూసినప్పుడల్లా చాలా బాధ పడుతుండేవాడు. ఆ చెత్తంతా ప్లాస్టిక్‌తో నిండిపోయి ఉండేది. 'ఈ ప్లాస్టిక్‌ భూతాన్ని మనం తరిమి కొట్టలేమా' అని తనలో తాను మదన పడుతూ ఉండేవాడు.
ఒకరోజు ఊర్లో ఉన్న తన స్నేహితులను పిలిచి, 'ఊర్లో ఉన్న ప్లాస్టిక్‌ను మనం తరిమి కొట్టాలి. ఈ ప్లాస్టిక్‌ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్‌ కుళ్ళదు. భూమిలో కలవదు. ఈ ప్లాస్టిక్‌ అంతా చివరికి సముద్రంలో చేరుతుంది. అది తినడం వల్ల జంతువులు, సముద్ర పక్షులు, చేపలు ఇంకా ఎన్నో జీవులు, జంతువులు చనిపోతున్నాయి. వెయ్యి సంవత్సరాలు జీవించే తాబేలు కూడా ప్లాస్టిక్‌ కవర్లను తినడం వలన మరణిస్తున్నాయి. ఇంకా ఎన్నో జంతువులు ప్లాస్టిక్‌ను తినడం వల్ల ఆకలి లేక చాలా రోజులు ఏమీ తినలేక పోవడంతో మరణిస్తునాయి. కొన్ని మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ కవర్స్‌ ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్నాయి. కానీ అందులో ఒక్క శాతం మాత్రమే రీసైకిల్‌ అవుతున్నాయి. మనం రోజూ చూస్తున్నాం. టీలు, కాఫీలు కూడా ప్లాస్టిక్‌ కప్పులో తాగేస్తున్నాం. దాని వల్ల కాన్సర్‌లాంటి అతి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు మనుషులు. మనమందరం కలిసి ఎలాగైనా ఈ ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేద్దాం రండి. నాతో కలసి రండి.' అని అర్జున్‌ అనగానే, తన స్నేహితుడు ఒకరు ఇలా అన్నాడు. 'మనం ఇప్పటివరకూ మనకు తెలియకుండా మనకు మనమే హాని చేసుకున్నాంరా. మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ రోజు నుండి మనం ఏదైనా కొనాలంటే ఇంటినుండి సంచులు తీసుకెళ్ళాలి.
ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చినప్పుడు విష రసాయనాలు వస్తాయి. వీటివలన సమస్త జీవరాశులు దెబ్బతింటాయి. వ్యర్ధాలు తేని వీధులను మనం చూడాలి. వాళ్ళందరూ చాలా ఆలోచించి జనానికి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలనుకొని, మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి, మన బాహుబలి సినిమాలోని కాలకేయుడు గుర్తుగా, వాడి విగ్రహాన్ని తయారు చేసి ఎలా ఉందంటే తల వరకు కాలకేయుడు తల మిగతా భాగం అంతా ప్లాస్టిక్‌ సంచులు, బాటిల్స్‌, టీ కప్పులు, జ్యూసు బాటిల్స్‌తో నింపేశారు. ప్లాస్టిక్‌ అనేదాన్ని ఒక రాక్షసుడితో పోల్చి దాన్ని మనం హతమార్చాలని విగ్రహాన్ని చూసి ప్లాస్టిక్‌ వాడకం ఆపేసి పర్యావరణహితకారులు కావాలని కోరుకున్నారు. ఆ ఊరి జనం అది చూసి వారిలో వారే 'నిజమే కదా! మనం ప్లాస్టిక్‌ వాడటం వల్ల పర్యావరణానికి, ఇంకా మనిషి జాతికి, సమస్త జీవరాశులకు అపారమైన నష్టం జరుగుతుంది. మనం మేలుకోవాల. అని అక్కడున్నవారు ఇక మీదట ప్లాస్టిక్‌ని మన ఊరి పొలిమేర దాటరాదని ప్రతిజ్ఞ చేశారు. ఆ మరుసటి రోజునుండి ఆ ఊరి జనం ఏ దుకాణానికి వెళ్లినా తమ వెంట క్లాత్‌ సంచులను తీసుకొని వెళ్లేవారు. అలాగే దుకాణాల్లో కూడా స్టీల్‌ బాక్సులు మీ వెంట తెచ్చుకోండి అని బోర్డులు పెట్టారు. హోటల్‌కి వెళ్తూ పార్శిల్‌కి కూడా స్టీల్‌బాక్స్‌లు తమవెంట తీసుకెళ్ళేవారు. అలా వారి ఊరు కొద్దినెలల్లోనే ప్లాస్టిక్‌ రహిత ఊరుగా పేరుగాంచింది. ఆ జిల్లాకలెక్టర్‌ పాలమూరు గురించి తెలుసుకుని ఆ గ్రామానికి వచ్చి ఆ ఊరి ప్రజలను, అర్జున్‌ను అభినందించారు. ఆ ఊరిని ఇండియాలోని ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా గుర్తించి, నిర్మల్‌ గ్రామ పురస్కార అవార్డుతో అర్జున్‌ని సత్కరించారు. పక్కన ఉన్న ఊరివారు కూడా ఈ ఊరిని ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్‌ని బాన్‌ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూసి అర్జున్‌ సంతోషించాడు. ఇలాంటి అర్జున్‌ ప్రతి ఊరిలో ఉండాలి. ప్లాస్టిక్‌ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. డబ్బాలు, బక్కెట్లు, సంచులు ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ కనిపిస్తూనే ఉంటుంది. జనపనార సంచులు వాడదాం. బ్రిటన్‌, జపాన్‌లో వాడే బంగాళా దుంపలతో తయారు చేసే వాటిని వాడదాం.'ప్లాస్టిక్‌ వాడకు.. ప్రాణాలు తీయకు.'. అనే నినాదంతో మనం ముందుకెళ్దాం.
నీతి : మనం మన ప్రకృతికి హాని చేయకూడదు. మన దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ను రీసైకిల్‌, రీయూస్‌ చేసుకోవాలి. ప్రకృతికి హానికరమైన వస్తువులను వాడకూడదు.
ఒ. వేదప్రియ, 6వ తరగతి,
విజరు హైస్కూలు, నిజామాబాద్‌, తెలంగాణ.