May 07,2023 08:27

ఇండోర్‌ ప్లాంట్స్‌ ఎక్కువ పువ్వులు కాకుండా ఆకులతోనూ ఆకట్టుకుంటాయి. వివిధ రంగుల్లోనూ, ఆకతుల్లోనూ అలరించే బోలెడన్ని విదేశీ రకాల మొక్కలు ఇప్పుడు మన ప్రాంతాల్లోనూ కొలువుదీరి కనువిందు చేస్తున్నాయి. నవ్యతరం ఈ అపురూప వనమాలికల్లో కొన్నింటిని తిలకిద్దాం!

  • పెపెరోమియా ఆర్గిరియా ..

పెపెరోమియా ఆర్గిరియా, పుచ్చకాయ పెపెరోమియా అని పిలిచే ఈ మొక్క బ్రెజిల్‌, ఈక్వెడార్‌ ప్రాంతాలలో లభిస్తుంది. ఆకులు పుచ్చకాయ ఆకారంలో ఉండడంతో దీన్ని ఆ పేరుతో పిలుస్తారు. పైరేసి కుటుంబానికి చెందిన పుష్పించే జాతి మొక్క. ఆకులు లేత ఆకుపచ్చ రంగు మీద వెండి లాంటి చారలు, కాడలు ఎరుపు రంగులోనూ ఉంటాయి. వేసవిలో చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. ఇది పూర్తిగా ఇండోర్‌ మొక్క. ఇంటి లోపల ఎక్కడ అలంకరించుకున్నా అందమే!

  • కలాథియా జీబ్రినా..
2

కలాథియా జీబ్రినా అనేది ఆగేయ బ్రెజిల్‌కు చెందినది. చారలు, గీతల ఆకు మొక్క. ఇది మరాంటాసియే కుటుంబానికి చెందిన మొక్క. లేత ఆకుపచ్చ పత్రాలపై ముదురు ఆకుపచ్చ చారలు డిజైన్‌తో అందంగా ఉంటుంది. అందుకే దీన్ని జేబ్రానా మొక్క అంటారు. ఇది పూర్తిగా ఇండోర్‌ మొక్క. ఇంటిలో ఎక్కడ అలంకరించుకున్నా అందంగానే ఉంటుంది.

  • కెంప్ఫెరియా..
3

చైనా దేశపు మరో అద్భుతమైన మొక్క కెంప్ఫెరియా. ఆకుపచ్చని ఆకుల మీద తెల్లని మచ్చలు ఎంతో అందంగా ఉంటాయి. మొక్కకు ఆకులు దట్టంగా అలిమి ఉంటాయి. ఏడాదికోసారి చిన్న లేత నీలం పువ్వులు పూస్తాయి. ఆకులన్నీ మిఠాయి పొట్లం చుట్టినట్లుగా విచ్చుకుంటాయి. రోజూ నీళ్లు పోస్తే మొక్క చక్కగా ఉంటుంది. సెమీశేడ్‌, ఇండోర్లో కూడా మొక్క పెరుగుతుంది.

  • అట్లాంటిస్‌ సెడమ్‌ లైవ్‌ బ్రూరూట్‌ ప్లాంట్‌ ఎల్లో..
7

ఆకులే పువ్వులై మరిపించే మొక్క అట్లాంటిస్‌ సెడమ్‌ లైవ్‌ బ్రూరూట్‌ ప్లాంట్‌ ఎల్లో. సంవత్సరం పొడుగునా విరబూస్తుంది. ఆకులు గులాబీ పువ్వు రేకల గుత్తి మాదిరిగా చెట్టంతా విచ్చుకుంటాయి. ఆకుల అంచుల చివర రంపపు పళ్ళు మాదిరిగా ఉంటుంది. పసుపు రంగు పత్రాలు, వాటి మీద ఆకుపచ్చని మచ్చలు చూడ్డానికి బాగుంటాయి. ఆకులు దళసరిగా ప్లాస్టిక్‌ మాదిరిగా మెరుస్తూ ఉంటాయి. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగాను, కాస్త ముదిరితే పసుపు రంగులోకి మారతాయి. బయట వాతావరణంలో పెరిగే దీన్ని ఇంటి ముంగిట, పార్కుల్లో, కార్యాలయాలలో, పాఠశాలల్లో పెంచితే శోభనద్దుతాయి. పది రోజులకి ఒకసారి నీటి వనరు అందిస్తే సరిపోతుంది.

  • పిలియా కేడియరీ..
5

చిన్న చిన్న ఆకులతో అలరించే మొక్క పిలియా కేడియరీ. ఇది వియత్నాం దేశపు మొక్క. ఆకులపై తెల్లని మచ్చలు. చెట్టు ముదిరిన తర్వాత చిన్న చిన్న పూలు పూస్తాయి. ఈ ఇండోర్‌ మొక్కను ఇంటి లోపల ఎక్కడైనా అలంకరించుకోవచ్చు.

  • గోపెర్టియా రోసోపిక్టా..
4

గోపెర్టియా రోసోపిక్టా అనేది వాయువ్య బ్రెజిల్‌కు చెందిన మరాంటాసియే కుటుంబానికి చెందిన ఒక మొక్క. కలాథియా రోసోపిక్టా అని కూడా దీన్ని అంటారు. ఇది కూడా ఇండోర్‌ ప్లాంటే. ఆకుల పైన ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు ప్రత్యేకమైన ఆకారాల్లో పత్రాలపై ఇమిడి ఉంటాయి. కొబ్బరి పొట్టులో పెరుగుతాయి. ఆకులు ప్లాస్టిక్‌లా గట్టిగా ఉండి, మెరుస్తూ ఉంటాయి. రెండు రోజులకోసారి నీటి వనరు అందించాల్సి ఉంటుంది.

  • పెలర్గోనియం జోనలే..
6

చిన్న అరచేతి పరిమాణంలో గుండ్రంగా ఉండే పత్రాలు ఎంతో అందంగా ఉంటాయి. వివిధ రకాల రంగులు చిలికినట్లు ఆకులు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఒక మొక్క రెండు ఆకుల రంగుల డిజైన్‌ ఒకే మాదిరిగా ఉండదు. ఇది అమెరికా దేశ ఇండోర్‌ మొక్క. దీన్ని 'కలర్స్‌ ట్రే' అని కూడా పిలుస్తారు. కొబ్బరి పొట్టు మిశ్రమంలో మొక్క పెరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పువ్వులు పూస్తుంది. నిజానికి పువ్వుల కంటే ఆకులే ఎక్కువ అందంగా ఉంటాయి. అందువల్ల మొగ్గలు రాగానే తుంచేస్తారు. మూడు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది.

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506