అమెజాన్, బందీపూర్ అడవులు ఒకదానికొకటి ఆనుకొని ఉండేవి. దట్టమైన చెట్లతో గుబురుగా ఉండేవి. జలపాతాల సోయగాలు వాటి అందాలను రెట్టింపు చేసేవి.
అమెజాన్ అడవిలో బ్రూసీ అనే కుందేలు ఉండేది. అమెజాన్ అందాలను తన మొబైల్లో బంధించి సోషల్ మీడియా వేదికగా మిత్రులతో పంచుకునేది.
బ్రూసీ ప్రతిరోజు తను చేసే ప్రతి పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. వాటిని చూసిన మిత్రులు లైక్‌లు, కామెంట్లు చేసేవారు. బ్రూసీ వాటిని చూసి పొంగిపోయేది.
ఒకరోజు బాంబి అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ బ్రూసీకి వచ్చింది. వెంటనే రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది బ్రూసీ. 'హలో.. బ్రూసీ...నా పేరు బాంబి. నా రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు' అని చెప్పింది బాంబి.
'హారు బాంబి.. నిన్ను స్నేహితుడిగా పొందడం నాకూ ఆనందంగా ఉంది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి?' అని అడిగింది బ్రూసీ. నా పేరు బాంబి. మీ అడవిని ఆనుకొని ఉన్న బందీపూర్ అడవిలో ఉంటాను. నీలాగే నాకు అడవిలో ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడము.. వాటిని మొబైల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. నా అభిరుచులతో నీ అభిరుచులు కలిసాయి. అందుకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను' బదులిచ్చింది బాంబి.
ఆరోజు నుంచి ప్రతిరోజూ జరిగే సంగతులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునేవి. పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకునేవి. వాటి మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది.
ఒకరోజు 'బ్రూసీ మామా..! నిన్ను చూడాలని ఉంది. నిన్ను కలవాలని ఉంది. నాకోసం బందీపూర్‌కు వస్తావా? ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. దుంపలు, పండ్లకు కొదవలేదు. ఎంచక్కా కలిసి మనిద్దరం బందీపూర్ అడవిని చుట్టి వద్దాము. కొన్ని రోజులు ఇక్కడే హాయిగా గడుపుదాము. ఆ తర్వాత నీతో పాటు మీ అడవికి నేను కూడా వస్తాను' అన్నది బాంబి.
మిత్రుడి కోరికను కాదనలేక అలాగే కొత్త ప్రదేశాలను చూడాలనుకుని 'సరే వస్తాను మిత్రమా.. నాక్కూడా నిన్ను కలవాలని ఆశగా ఉంది' అని బదులిచ్చింది బ్రూసీ.
మరుసటిరోజే బందీపూర్‌కు ప్రయాణాన్ని మొదలుపెట్టింది బ్రూసీ. చెట్లపై గెంతుతూ.. వాగులు దాటుతూ.. మధ్య మధ్యలో దుంపలను తింటూ... అమెజాన్ అడవిని దాటి బందీపూర్‌కు చేరుకుంది.
'బ్రూసీ మామా! ఎక్కడున్నావు?' అడిగింది బాంబి.
'ఇప్పుడే బందీపూర్ జలపాతాల వద్దకు చేరుకున్నాను' బదులిచ్చింది బ్రూసీ.
'సరే! నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను. అక్కడికి రా'.. చెప్పింది బాంబి.
'సరే' బదులిచ్చింది బ్రూసీ.
పెద్ద బండరాయి పక్కన చెట్లపొదలు ఉన్నాయి. వెళ్లి అక్కడ బాంబి కోసం ఎదురుచూడసాగింది. ఎంతకీ బాంబి రాకపోవడంతో.. బ్రూసీకి ఆకలిగా అనిపించడంతో బండరాయి పక్కకు దుంపలకోసం వెళ్ళింది.
అంతలోనే ఆ ప్రదేశానికి రెండు నక్కలు చేరుకున్నాయి. 'మిత్రమా! ఈరోజు మనకు కమ్మని విందు దొరుకుతుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బ్రూసీ అనే కుందేలు ఇక్కడికి వస్తుంది. దాన్ని కలవడానికే నిన్ను నాతో వెంటబెట్టుకొచ్చాను. మనం దాన్ని వదలకూడదు. నేను బాంబి పేరుతో కుందేలు బొమ్మ ముఖచిత్రంగా పెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాను. తెలివి తక్కువ బ్రూసీ నేను కుందేలు అని నమ్మి ఇక్కడిదాకా వచ్చింది' అని పకపకా నవ్వుతూ మిత్రుడైన నక్కతో చెప్పింది బాంబి.
బండరాయి పక్కనే ఉన్న బ్రూసీ వాటి మాటలు విన్నది. 'కుందేలు కాదు నక్కనా! ఇన్ని రోజులు నేను స్నేహం చేసింది నక్కతోనా? అని భయంతో గజగజ వణికిపోయింది. మోసాన్ని గ్రహించింది బ్రూసీ. అక్కడి నుండి ప్రాణ భయంతో పరుగందుకుంది. ఎండుటాకుల శబ్దం కావడంతో రెండు నక్కలు చూసి బ్రూసీ వెంట పడ్డాయి. అప్పటికే చీకటి పడటంతో పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి వెళ్లి దాక్కుంది బ్రూసీ. రెండు నక్కలు వెతికి వెతికి అలసిపోయాయి. బ్రూసీ ఎంతకూ కనపడకపోయేసరికి అక్కడ నుంచి నిరాశగా వెళ్ళిపోయాయి నక్కలు.
బ్రూసీ ఊపిరి పీల్చుకుంది. సొంత అడవికి చేరుకుంది. ఆరోజు నుండి సోషల్ మీడియాలో వచ్చే అపరిచిత ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు స్పందించలేదు. 'అపరిచితుల మాటలు నమ్మి స్నేహం చేయకండి. వారి కొరకు ఎక్కడికీ వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. ప్రాణాలకే ప్రమాదం' అని తన సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేసింది బ్రూసీ.
- ముక్కామల జానకీరామ్
63053 93261