
ప్రపంచవ్యాపితంగా ఎన్నో భాషలు.. ఎన్నో సంస్కృతులు.. ఎన్నో సాంప్రదాయాలు.. నమ్మకాలు వున్నాయి. వీటన్నింటికీ అతీతంగా కొనసాగేదే స్నేహం. ఇది కాలాలకు అతీతమైనది.. పురాణాల నుంచి.. చరిత్ర నుంచి.. నేటి ఆధునిక యుగం వరకు స్నేహానికి ఒక బలమైన శక్తి వుంది. ఒక భాష వుంది. ఆ భాష మాటల్లోనేకాక.. భావవ్యక్తీకరణలో, పరస్పర అవగాహనతో ఏర్పడే ఒక అనిర్వచనీయమైన అనుబంధం. ప్రపంచ వ్యాప్తంగా కనిపించని అడ్డుగోడలు, విభజన రేఖలు, ఉన్మాద దాడులతో భయానక పరిస్థితి వున్నప్పటికీ.. పూలచెండులో దారంలా అందరినీ కలిపి వుంచే శక్తి మైత్రీబంధానిదే. అందుకే 'స్నేహమేరా జీవితం / స్నేహమేరా శాశ్వతం..' అన్న కవి మాటలు సత్యం. నా అనేవారు లేకపోవచ్చునుగానీ.. స్నేహితులు లేనివారు వుండరు. అదే స్నేహంలోని గొప్పతనం.. మాధుర్యం.. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

మన జీవితాలను సుసంపన్నం చేసే ఒక అమూల్యమైన బంధం స్నేహం. ఇది ఓదార్పునిస్తుంది. ఆనంద క్షణాలను పంచుతుంది. మానవత్వం యొక్క సున్నితమైన హృదయతంత్రుల్ని మీటుతుంది. కాలాన్ని, దూరాన్ని మించిన గొప్ప సంబంధం. సామాజిక సంబంధాలు తరచుగా నశ్వరమైనవిగా (తాత్కాలికమైనవిగా) భావించబడే యుగంలో.. స్నేహం స్థిరమైన దీపస్తంభంగా వెలుగొందుతోంది. మనసు యొక్క గందరగోళ సమయాల్లో, స్నేహమొక స్వర్గధామం. జీవితంలో ఎదురయ్యే అనేక తుపానులకు అడ్డునిలిచే అభయ హస్తం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల సమయంలోనే స్నేహం యొక్క బలం బయటపడుతుంది. స్నేహితులు తాము నేనున్నానని భరోసానిస్తారు. భుజం తడతారు. మార్గనిర్దేశం చేస్తారు. కష్ట సమయంలో మన పక్షాన నిలబడతారు. నిజమైన స్నేహంలో, ప్రేమలో షరతులు వుండవు. మన లోపాలను అంగీకరిస్తూ.. మన విజయాలలో భుజం తడతారు. మన ఆనందాలలో పాలుపంచుకుంటారు. మన బాధలలో ఓదార్పు అవుతారు. మన శక్తిని మనం అనుమానించుకున్నప్పుడు, మన సామర్థ్యం మీద మనకు నమ్మకం లేనప్పుడు - మనల్ని సంపూర్ణంగా విశ్వసించేది, ప్రోత్సహించేది స్నేహితుడొక్కడే. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని అడుగు ముందుకు వెయ్యడానికి అవసరమైన ప్రేరణను అందించేది స్నేహితుడే. మన సామర్థ్యాలపై స్నేహితుని అచంచలమైన నమ్మకం.. వ్యక్తిగత ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసానికి శక్తివంతమైన ఉత్ప్రేరకం. ఒక వ్యక్తి ఎలాంటివాడో చెప్పడానికి అతని స్నేహితుల గురించి తెలుసుకుంటే చాలు అంటారు. అంటే, స్నేహితులు మన నిజస్వరూపాన్ని ప్రతిబింబిస్తారు. మన ఆలోచనలకు సౌండింగ్ బోర్డుగా వ్యవహరిస్తారు. 'స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాక నీడలాగ నిను వీడిపోదురా' అంటూ స్నేహానికున్న గొప్పదనం గురించి చెబుతాడో కవి. ఎందరు ఎన్నిరకాలుగా చెప్పినా.. ఎన్ని వర్ణనలు చేసినా.. మాటలకు అందని, వర్ణనలకు చిక్కని.. ఒక దృఢమైన బంధం.. స్నేహం.

పంచుకున్న అనుభవాలు, సంతోషాలు..
స్నేహం అనేది ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు, పంచుకున్న అనుభవాల భాండాగారం. ఆకస్మికమైన సాహసాల నుంచి హృదయపూర్వకమైన సంభాషణల వరకు స్నేహితులతో గడిపే సమయాలు జీవితకాలం కొనసాగే దృఢమైన బంధాలను పెంపొందిస్తుంది. విభిన్న దృక్పథాలు గల ప్రపంచంలో విభిన్న సంస్కృతులు, నమ్మకాలు, భిన్న దృక్కోణాలను బహిర్గతం చేస్తుంది. ఇతరులను అర్థం చేసుకునే, గౌరవించే కళను నేర్పుతుంది. స్నేహం ద్వారా మేము వ్యక్తులుగా ఎదుగుతున్నాం.. ప్రపంచ దృష్టికోణాన్ని విస్తృతం చేస్తాం.. అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తాం.. అనే బలమైన సంకల్పాన్ని ఇస్తుంది. జీవితంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా.. మేము విభేదాలను అధిగమించి, సామరస్యాన్ని పెంపొందించే వంతెనలను నిర్మిస్తాం.. అన్న ధృడమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది స్నేహం.

పురాణ కాలంలోనూ..
స్నేహంలోని గొప్పతనం పురాణాల కాలంలోనూ కనిపిస్తుంది. అవి కథలే అయినా.. ఆ కథల్లోని పాత్రల స్నేహం నేటికీ చెప్పుకునేంత గొప్పది. దశరథుడు- జటాయువు, రాముడు- సుగ్రీవుడు, రాముడు- గుహుడు, కృష్ణుడు- అర్జునుడు, కృష్ణుడు-కుచేలుడు, దుర్యోధనుడు-కర్ణుడు.. వంటివారు అద్భుతమైన, అజరామరమైన స్నేహానికి నిదర్శనం. ఇప్పటికీ వారి గురించి మాట్లాడుకుంటున్నారంటే.. వారి స్నేహంలోని గొప్పతనమే. కృష్ణుడు, కుచేలుడు మధ్యగాని, రాముడు, సుగ్రీవుడి మధ్యగాని, దుర్యోధనుడు, కర్ణుడి మధ్యగాని చిగురించిన స్నేహానికి జాతులు, కులాలు అడ్డు రాలేదు. ఇంత ఆధునిక యుగంలోనూ జాతులు, కులాల మధ్య తగవులు పెట్టి, కుంపట్లు రగిలిస్తున్న ప్రబుద్ధులకు.. వారు అభిమానించే పురాణగాథల్లోని స్నేహభావం కనువిప్పు కలిగించాలి. 'ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం/ ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం' అన్నట్లుగా వుండాలి ఎవరి స్నేహమైనా.

డిజిటల్ యుగంలో స్నేహం..
సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్నేహం ఎల్లలు దాటింది. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) వంటి మాధ్యమాల్లో ఖండాంతరాల స్నేహం గుబాళిస్తోంది. సోషల్ మీడియా రెండంచుల ఖడ్గం వంటిది. దీన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతే.. అనర్థాలకూ దారితీస్తుంది. ఇది సోషల్‌మీడియాలో ఏర్పడే స్నేహితుల మధ్య కూడా అనర్థాలకు దారితీస్తుంది. తప్పుడు ఐడీలతో, మారుపేర్లతో పరిచయాలు చేసుకొని, స్నేహం, ప్రేమ పేరుతో వేధిస్తున్న కిలాడీలు ఇక్కడ తారసపడుతుంటారు. పక్కనున్న స్నేహితులతోనో, కుటుంబసభ్యులతోనే పొడిపొడిగా మాట్లాడేవారు.. ఎక్కడో కనిపించని వారితో గంటల తరబడి మాట్లాడుతూ.. తమ సమయాన్ని, భవితను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ రకమైన బాధితులు ఎక్కువగా వుంటున్నారు. స్నేహం అమూల్యమైనది.. అద్భుతమైనదే. కానీ, ఎదుటివారు ఎలాంటివారో తెలుసుకోకుండా స్నేహం చేయడం అంటే కోరి కష్టాలను తెచ్చుకోవడమే. డిజిటల్ యుగంలో స్నేహాల పట్ల అప్రమత్తంగా వ్యవహారించాల్సిందే.
ఎలా వచ్చింది..?
జాతి, రంగు, లింగం, ప్రాంతం, మతం వంటి వాటితో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడాలనే ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' ఏర్పాటు చేసింది. హింసను తిరస్కరించి, మంచి విలువలు, శాంతితో కూడిన మెరుగైన సమాజ నిర్మాణం కోసం ఈ 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' ను యూనెస్కో ప్రతిపాదించింది. వ్యక్తుల మధ్యనే కాదు, రెండు దేశాల మధ్య కూడా పొరపచ్చాలు, వైషమ్యాలు తొలిగిపోయి, స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రతియేటా రెండుసార్లు 'అంతర్జాతీయ స్నేహ దినోత్సవం' జరుపుకుంటాయి. భారత్‌తో సహా బంగ్లాదేశ్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే, అనేక ఇతర దేశాల్లో ఈ వేడుకను జులై 30న జరుపుకుంటారు. బ్రెజిల్‌లో స్నేహితుల దినోత్సవాన్ని ఏప్రిల్ 18న జరుపుకుంటారు.
అయితే, మొట్టమొదటిగా స్నేహితుల దినోత్సవాన్ని 'వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్' అనే సంస్థ 1958లో పరాగ్వేలో జులై 30న జరుపుకోవాలని ప్రతిపాదించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రతిపాదనను పాటిస్తున్నాయి.

మార్క్స్-ఎంగెల్స్ స్నేహం..
ప్రాచీన చరిత్రలో స్నేహం గురించి చెప్పుకోడానికి అనేక ఉదాహరణలున్నాయి. 'మానవాళి చరిత్రలో స్నేహానికి దర్పణం పట్టే అన్ని ఉదాహరణలను అధిగమించే స్నేహితుల ద్వయం, విప్లవకారుల ద్వయం, మేధావుల జోడీ.. కార్మిక వర్గపు శాస్త్ర విజ్ఞానాన్ని సృష్టించారని యూరోపియన్ కార్మికవర్గం చెప్పుకుంటుంది' అని మార్క్స్-ఎంగెల్స్ స్నేహం గురించి లెనిన్ వ్యాఖ్యానించాడు. వారి స్నేహం ఎంత బలమైనదో, వారు దర్శించిన విప్లవక్రమం అంత నిర్మాణాత్మకమైనదని వీరి స్నేహం రుజువు చేస్తుంది. ఈ స్నేహం భవిష్యత్తరాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుంది. సమాజాభ్యున్నతికే వారిద్దరూ కలిసి అరుదైన స్నేహ ప్రయాణం చేశారు. సైద్ధాంతిక రచనలో వీరిద్దరిదీ విడదీయలేని, ఆదర్శవంతమైన మైత్రీ బంధం.

కాస్ట్రో- చే గువేరా అపూర్వ కలయిక..
ఫైడల్ కాస్ట్రో - చే గువేరా స్నేహం ఒక అపూర్వమైన విప్లవ ఘట్టం. ఇద్దరు విప్లవకారుల మధ్య సమాజ విముక్తి కోసం భావసారూప్యతతో ఏర్పడిన మైత్రీబంధం వారిది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ వీరులు ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. 1967లో మరణించిన చేగువేరా, 2016లో మరణించిన ఫైడల్ కాస్ట్రో మళ్లీ కలుసుకోవడం ఏమిటా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కాస్ట్రో-చేగువేరా స్నేహానికి క్యూబా ప్రజలిచ్చిన కానుక అది. ఫైడల్ కాస్ట్రో మరణానంతరం ఆయన అస్థికలను ఉంచిన ప్రత్యేక మిలటరీ వాహనం శాంటాక్లారాకి చేరుకున్న సమయంలో ఈ అపూర్వ కలయిక చోటుచేసుకుంది. చేగువేరా, కాస్ట్రోల స్నేహానికి గుర్తుగా కాస్ట్రో అస్థికలు ఉంచిన వాహనాన్ని రోజంతా అక్కడి చేగువేరా స్మారక స్థలంలో నిలిపి వుంచారు. తద్వారా ఈ అపూర్వ స్నేహితులు ఒకరినొకరు కలుసుకున్నట్లు క్యూబా ప్రజలు భావించారు.

అమ్మాయి- అబ్బాయిల స్నేహం..
మనుషుల మధ్య ఎలాంటి సంబంధాలు వుండాలో, ఎవరు ఎవరితో స్నేహం చేయాలో.. ఎలా ఆలోచించాలో నిర్ణయించే దేశంలో మనం వున్నాం. ఓ అబ్బాయి, అమ్మాయి ఎన్నడూ స్నేహితులు కాదు. నిజంగా స్నేహితులైతే.. మీ ఇళ్లలోనే మాట్లాడుకోండి.. అంటూ బెదిరించే ఉన్మత్తులు మన చుట్టూ వున్నారు. ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచి పిల్లల్లో లింగబేధం లేకుండా స్నేహం పరిమళిస్తుంది. అది వారితోపాటే పెరిగి, పెద్దదవుతుంది. స్కూల్లోనే కాకుండా.. ఎక్కడ పరిచయమైనా స్నేహంగా మారొచ్చు. అది ఒక స్వచ్ఛమైన స్నేహంగా.. ఒకరికోసం ఒకరు అన్నట్లుగా బలపడుతుంది. ఆ స్నేహాన్ని అలాగే వదిలేస్తే.. అది ఎప్పటికీ స్వచ్ఛంగానే వుంటుంది. వారి స్నేహానికి ఏవేవో పేర్లు పెట్టి.. వారిలో ఒక న్యూనతా భావాన్ని తీసుకురావడం.. వేరే ఆలోచనలు కలిగేలా చేయడం మంచిది కాదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రోత్సహించాలి. స్నేహభావానికి వారధులు కావాలి.
సినిమాల్లో.. పాటల్లో.. స్నేహం
ప్రపంచ వ్యాప్తంగా స్నేహంలోని గొప్పదనాన్ని చాటిచెప్పే సినిమాలు ఎన్నో వచ్చాయి.. వస్తూనే వున్నాయి. 'ఇద్దరు మిత్రులు, స్నేహం కోసం, స్నేహితుడా, స్నేహితులు, నీ స్నేహం, ఓ మై ఫ్రెండ్, ఫ్రెండ్‌షిప్, స్నేహమంటే ఇదేరా!' వంటి అనేక సినిమాలు స్నేహం పేరుతో వస్తే.. 'ఆర్య-2, వసంతం, ఊపిరి, ఆర్‌ఆర్‌ఆర్, డార్లింగ్, మహర్షి, హ్యాపీ డేస్, నవ వసంతం' వంటి సినిమాలు స్నేహితుల కథనాలతో వెండితెరపై ఆవిష్కృతమయ్యాయి. వీటన్నింటి సారాంశమూ ఒక్కటే. స్నేహం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పడమే. కాలాలకు అతీతమైన మైత్రిని ప్రేక్షకుల హృదయాలలో అనుభూతింపజేయడమే. అంతకంటే మరింత అనుభూతిని అందించే సాహిత్యం, పదికాలాలు నిలిచే పాటలు మనల్ని ఉర్రూతలూగిస్తూనే వున్నాయి. వాటిలో.. 'నీవుంటే వేరే కనులెందుకు/ నీకంటే వేరే బతుకెందుకు/ నీ బాటలోని అడుగులు నావి/ నాపాటలోని మాటలు నీవి' అంటూ స్నేహ సౌందర్యంలోని గుబాళింపును ఈ పాటలో పొదిగారు సినారె. 'స్నేహమే నాకున్నది/ స్నేహమేరా పెన్నిధి' అంటూ తన స్నేహితుడి కోసం ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధపడతాడు. 'ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?' అంటూ చాలాకాలం తర్వాత కలుసుకోబోతున్న ఇద్దరు స్నేహితుల ఆతృత ఈ పాటలో కనిపిస్తుంది. 'ఆనాటి ఆ స్నేహమానందగీతం/ ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం/ ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం/ ఆ రోజులు మునుముందిక రావేమిరా' అంటూ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ప్రశ్నించేే ఈ పాట ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారింది. అలాగే హిందీలో నాలుగు దశాబ్దాల క్రితం 'ఛోడేంగే దమ్ అగర్/ తేరా సాథ్ నా ఛోడేంగే' అంటూ ఊర్రూతలూగించే పాటల్లోని భావనకు స్నేహమాధుర్యమే కారణం.
పంచతంత్ర కథల్లో..
ప్రపంచ ప్రసిద్ధ కథలైన పంచతంత్రంలోని 'మిత్రలాభం, మిత్రభేదం' అనే రెండు భాగాల్లోనూ సన్మిత్రులంటే ఎవరు.. స్నేహపు గొప్పదనమేమిటి.. మైత్రి ఎలాంటి వారితో చెయ్యాలి.. ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవాళ్లని ఎలా గుర్తించాలి.. మొదలైన ఎన్నో తెలుసుకోవలసిన విషయాలన్నీ సరళంగా అర్థమయ్యే రీతిలో పిల్లల కథలుగా మలచి వివరించాడు విష్ణుశర్మ. ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలను స్నేహితుల సహాయంతో పరిష్కరించుకో గలుగుతాం. మనకు ఎదురయ్యే సమస్యల నుంచి బయట పడేయటానికి అండగా నిలిచే మంచి స్నేహితులను కలిగి వుండటం ఎంత ముఖ్యమో ఈ కథలు బోధిస్తాయి. స్నేహితుల దినోత్సవం అయినా.. మరేదైనా మొబైల్‌లోనే ఒక ఫోన్‌కాల్‌తోనో, ఒక మెసేజ్‌తో శుభాకాంక్షలు చెప్పి, ఇదే స్నేహితుల దినోత్సవం అనుకునే రోజుల్లో.. పంచతంత్ర కథలు పిల్లలతో చదివించడం ద్వారా.. వారిలో స్నేహం యొక్క గొప్పతనం, స్నేహంలో ఇమిడివున్న బలమైన బంధం విలువ నేర్పినట్లవుతుంది.

వెనకున్న ఆలోచన..
'అంతర్జాతీయ స్నేహ దినోత్సవం' నిర్వహించడం వెనుక ఉన్న ప్రాథమిక భావన.. ప్రజలను ఏకం చేయడం. కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతత్వం ఆధారంగా ప్రజలను వేరు చేయకూడదు. అంతర్జాతీయ భావన అవసరమని బోధించడం.. ఒప్పించడం.. ఈ దినోత్సవం వెనకున్న పరమార్థం.
సరిదిద్దేవాడే స్నేహితుడు..
నిరంతరం మారుతున్న ప్రపంచంలో ఓదార్పు, ప్రేరణ, ఆప్యాయతలకు ప్రతిబింబంగా నిలిచేది, శాశ్వతమైన నిధిగా మిగిలిపోయేది స్నేహం. స్నేహితుల దినోత్సవం అనేది.. మన స్నేహితులతో మనం పంచుకునే అమూల్యమైన బంధాల వేడుక. ఇది ఒకరిపట్ల ఒకరికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తీకరించడానికి, ఐక్యతను పెంచుకోవడానికి, సంబంధాలను మరింత బలోపేతం చేసుకోడానికి ఒక రిమైండర్‌గా స్నేహితుల దినోత్సవం ఉపయోగపడుతుంది. భర్తహరి మంచి మిత్రుని లక్షణాల గురించి చెబుతూ- 'ఎవరైనా చెడు పనులు చేస్తూంటే మంచి మిత్రుడు నివారించాలి. అలాగే మంచిపనులు చేయటంలో ప్రోత్సహించాలి. మిత్రునికి సంబంధించిన రహస్యాలను తనలోనే దాచుకోవాలి. మిత్రునిలోని మంచి లక్షణాలను నలుగురిలో తెలియజేయాలి. మిత్రునికి ఆపద కలిగినప్పుడు మొహం చాటేయకుండా, చేతనైన సహాయం చేయాలి. అవసర సమయాలలో తగిన రీతిలో ఆదుకోవాలి' అంటాడు. కాలపరీక్షకు తట్టుకుని, మన ఉనికిని సుసంపన్నం చేసే బంధం ఇది. స్నేహం అందించే అవగాహన, మద్దతు, వారి బంధంలోని గాఢత జీవితాలపై మనం చూపగల ప్రభావానికి గుర్తు. ఆధునిక ప్రపంచంలో సంక్లిష్టతలను దాటుకుంటూ స్నేహాలు, స్నేహితుల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలి. హృదయపూర్వక సందేశాల ద్వారా, ఒకరినొకరు ఆనందంగా కలుసుకోవడం ద్వారా.. ప్రతిరోజూ మన జీవితాలను స్నేహపరిమళంతో నింపే స్నేహితులను గౌరవించే ఒకానొక సువర్ణావకాశంగా ఈ రోజును స్వీకరిద్దాం.
రాజాబాబు కంచర్ల
9490099231