Aug 06,2023 10:23

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ఆదివాసీల పట్ల ప్రభుత్వాలు అణచివేతనే ప్రదర్శిస్తున్నాయి. ఆధునిక సమాజంలో వారి అభివృద్ధిని పట్టించుకోవాల్సిన స్థితిలో వారి హక్కుల్ని కాలరాస్తున్నాయి. మణిపూర్‌ మారణహోమం రగులుతూనే ఉంది. మతతత్వం పెచ్చరిల్లిన తర్వాత ఆదివాసీల మీదే బాణం ఎక్కుపెట్టిన విషయం తేటతెల్లం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అడవిబిడ్డల ఆలనాపాలనా పాలకులకు పట్టడం లేదు. పోలవరం ముంపు ప్రాంతాల బాధితులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. తెలంగాణాలో పోడు భూముల్లో హరితహారం మరో దారుణం. ఆదివాసీ బిడ్డలు అందరిలానే అభివృద్ధి కావాలి. వారూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నదేంటి? నాటి నుంచి నేటి వరకూ జరుగుతున్న అన్యాయాలేమిటి? గిరిజనులకున్న హక్కులు, చట్టాలు ఏంటి? వాటి అమలు ఎలా ఉంది? వీటన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 9వ తేదీన 'ప్రపంచ ఆదివాసీల దినోత్సవం' సందర్భంగా అడవిబిడ్డల గురించి ఈ ప్రత్యేక కథనం.

222

      స్వాతంత్య్రానికి ముందే గిరిజనులు బ్రిటీష్‌వారితో పోరాడి నివాస ప్రాంతాలపై, అడవిపై ప్రత్యేక హక్కులు సాధించుకున్నారు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం కూడా వారి ఆచార, సాంప్రదాయాలను పాటించే స్వేచ్ఛనిచ్చింది. తమ ప్రాంతాలను తామే పాలించుకునే స్వయం ప్రతిపత్తినీ కల్పించింది. దాని ఫలితమే రాజ్యాంగంలోని 10వ అధ్యాయం 5వ షెడ్యూల్‌, 6వ షెడ్యూల్‌. వీటిద్వారా గిరిజనులకు రాజ్యాంగ రక్షణలు కల్పించబడ్డాయి. దేశవ్యాప్తంగా 1200 ఆదివాసీ తెగలుండగా వాటిలో 705 తెగలను మాత్రమే భారత ప్రభుత్వం ఇప్పటివరకూ ఎస్టీలుగా గుర్తించింది.

55

                                                                        నెహ్రూ ట్రైబల్‌ పంచశీల..

ఆదివాసుల అభివృద్ధి, సంక్షేమం కోసం మనదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 'ట్రైబల్‌ పంచశీల' అనే పాలసీని తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఐదు అంశాలను పొందుపర్చారు.

1. ఆదివాసుల అభివృద్ధి అనేది వారి శక్తి సామర్ధ్యాలు, నైపుణ్యంతో జరగాలి. వారిలో చదువుకున్న వారికి తగిన శిక్షణనిచ్చి, వారినే పాలకులుగా నియమించాలి.
2. భూమి, అడవి విషయంలో వారి హక్కులను గౌరవిద్దాం.
3. ఆదివాసుల భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరిరక్షించాలి. అందుకు అవసరమైన ప్రోత్సాహకాలివ్వాలి.
4. కఠినమైన నియంత్రణ వ్యవస్థ లేకుండా మార్కెట్‌ శక్తుల ప్రవేశాన్ని అనుమతించకూడదు. ఇతరుల పెత్తనాన్ని, ఆధిపత్యవాదాన్ని ఆదివాసులపై రుద్దకూడదు.
5. ఆదివాసుల అభివృద్ధిని వారికి కేటాయించిన నిధులతో కాక, వారి జీవప్రమాణాల్లో వచ్చిన మార్పుల ఆధారంగా లెక్కించాలి.
 

                                                                విధానాల అమలు ముఖ్యం..

ట్రైబల్‌ పంచశీలతో పాటు రాజ్యాంగం వారికి కల్పించిన రక్షణ చట్టాలు అరకొరగానైనా అమలులో ఉండేవి. మంచి గిరిజన విధానం ప్రకటిస్తేనే సరిపోదు. దాని అమలుకు దృఢమైన రాజకీయ సంకల్పం కావాలి. తగిన అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రెండు విషయాల్లో గత కాలపు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు (పాలక వర్గాలు) అన్యమనస్కంగానే వ్యవహరించాయి. 1952లో గిరిజన విధానం రూపొందితే.. కేంద్రంలో మంత్రిత్వ శాఖ కమిషనర్‌ వ్యవస్థ 1999 వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1985 సెప్టెంబర్‌ వరకు హోంమంత్రిత్వ శాఖలో చిన్న ''గిరిజన డివిజన్‌'' గా ఎందుకు కొనసాగింది? రాజ్యాంగ ఆదేశం ఉన్నా గిరిజన అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపు ఎందుకు లేదు? వలసకాలం నాటి వారసత్వం నేటికీ కొనసాగుతోంది. గిరిజన సమస్యను దేశాభివృద్ధిలో భాగంగా కాక, కేవలం ఒక శాంతిభద్రతల సమస్యగా భావించడమే ఆ వారసత్వం. వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో భాగంగా నాటి కాంగ్రెస్‌ 75 జిల్లాల్లో, నేటి బిజెపి 177 గిరిజన జిల్లాల్లో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారు. అదే 'ఎల్‌డబ్ల్యుఇ' (ూఔజు) పథకం. దీనికి హోం మంత్రిత్వ శాఖలో నిధులు కేటాయిస్తున్నారు.

77

                                                                          హక్కుల హరణం..

గిరిజనాభివృద్ధి 2014 తర్వాత గతి తప్పిన మతి లేని పాలనగా ఉన్నది. మోడీ అధికారం చేపట్టిన తర్వాత గిరిజన హక్కులను ఒక్కొక్కటిగా ఉపసంహరిస్తున్నారు. అడవుల నుంచి ఆదివాసులను బలవంతంగా బయటికి వెళ్లగొట్టే ప్రణాళికలు రచించి, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అమలులో ఉన్న అటవీ చట్టాలను నిర్వీర్యం చేసేలా చట్ట సవరణలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. 2020 సంవత్సరంలో తీసుకొచ్చిన 'నేషనల్‌ ట్రైబల్‌ పాలసీ' ఆ కోవకు చెందినదే. దాన్ని గిరిజన హక్కులను హరించేలా రూపొందించారు. ఆదివాసీల అభివృద్ధి ఆదివాసీలతోనే జరగాలన్న విధానానికి భిన్నంగా స్వచ్ఛంద సంస్థలకు ఆ పని అప్పగించారు. ప్రణాళికా సంఘం రద్దుతో ఎస్టీ సబ్‌ప్లాన్‌ పోయింది. గిరిజనుల జనాభా శాతానికి ప్రాతిపదికగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గిరిజన సంక్షేమ బడ్జెట్‌ను కూడా కుదించుకుంటూ వస్తున్నారు. ఆర్టికల్‌ 275 (1) ప్రకారం గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించిన వాటికి అదనంగా నిధులు (గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌) సమకూర్చాలి. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
 

                                                               ఆవాసాలు లేకుండా చేసే సవరణలు..

అటవీ పర్యావరణ, పరిరక్షణ చట్టం 1980 ప్రకారం.. అటవీయేతర పనులకు అటవీ భూములు కేటాయించరాదు. గ్రామసభల తీర్మానాల ద్వారా హక్కు పత్రాలివ్వాలని అటవీ హక్కుల చట్టం చెప్పింది. అటవీయేతర పనులకు భూ సేకరణ చేసేటప్పుడు పబ్లిక్‌ హియరింగ్‌ విధిగా నిర్వహించాలని పై చట్టాలు ఒక పద్ధతిని సూచించాయి. కానీ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా ఆ నిబంధనలను పూర్తిగా తొలగించారు. అటవీ భూములు కావాలని ఏదైనా సంస్థ కానీ వ్యక్తి కానీ ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే అనుమతులివ్వాలి. ఈ మేరకు గతేడాది జూన్‌ 22న మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. వంద ఎకరాలలోపు అటవీ భూములకైతే పిఎంవోకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్స్‌కు అటవీ పరిరక్షణ చట్టం 2023ను ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుతో ఆమోదించుకున్నారు. ఈ చట్టం పర్యావరణం, జీవ సమతుల్యతకు నష్టం చేస్తుంది. గిరిజనుల జీవనానికి ఇది గొడ్డలిపెట్టు. ఆదివాసీలు తమ ఆవాసాల నుంచి బలవంతంగా గెంటివేయబడతారు.

5511

                                                                       నిర్వాసితులకు నష్టం..

నిర్వాసితులైన గిరిజనులకు, దళితులకు పునరావాసం కల్పించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు సవరణ చేసి, బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఇందుకు అనుగుణంగా భూసేకరణ చట్టం 2013 (ల్యాండ్‌ అక్విజేషన్‌, రిహాబిలిటేషన్‌, రి సెటిల్‌మెంట్‌) ప్రకారం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం, పునఃస్థాపితం.. ప్రభుత్వాలు ఏవిధంగా ఇవ్వాలి అనేది స్పష్టంగా ఉంది. కానీ బిజెపి ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. దీనివల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం లేదా ఆయా సంస్థల నిర్ణయం ప్రకారమే పునరావాసం, ప్యాకేజీ ఉంటుంది.. అంతేకానీ నిర్దిష్టమైన చట్టబద్ధత ఉండదు. ఇది ఆదివాసీలకు తీరని నష్టం కలిగిస్తుంది.
 

                                                                         యుసిసితో ఆధిపత్యం..

రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్‌ ప్రకారం.. యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యుసిసి) కోసం ప్రయత్నించాలని ఉంది. సమాజంలో హెచ్చుతగ్గులను నివారించేందుకు యూనిఫాం సివిల్‌ కోడ్‌ పనిచేయాలని ఆర్టికల్‌ 38 చెబుతోంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, యూనిఫాం సివిల్‌ కోడ్‌తో మెజార్టీ ప్రజల విధానాలను కేంద్రం అందరిపై రుద్దే ప్రయత్నం చేస్తుంది. అసోంలో సిఎఎ అమలు చేసి, 19 లక్షల మందిని అనుమానితులుగా తేల్చారు. అందులో 2.5 లక్షల మంది గిరిజనులున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే జీవనం సాగిస్తున్న ఆదివాసీలు ఇప్పుడు స్థానికులమేనని రుజువు చేసుకోవాల్సి వచ్చింది. వారిని ఇప్పటివరకు పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు ధృవీకరణ అంటే ఎలా సాధ్యమవుతుంది? వారు ఎక్కడ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి? వారికి ఎవరిస్తారు? ఇప్పటివరకు వారిని మనుషులుగా చూడని ప్రభుత్వాలు.. ఇప్పుడు వారిని అవమానకరంగా ఇబ్బందులు పెట్టడం వెనక అసలు ఉద్దేశ్యం ఏమిటి ?

8899

                                                                         తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న జిఓ నెంబర్‌ 3ని 2020 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఏజెన్సీలో ఉద్యోగాలను అక్కడ పుట్టి పెరిగిన స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలనేది ఆ జిఓ సారాంశం. దీనివల్ల గిరిజనులకు ఎంతో కొంత మేలు జరిగింది. కానీ సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది. ఇది గిరిజనుల ఉపాధి అవకాశాలకు పెద్ద దెబ్బ. ఇప్పుడు కేవలం 50 శాతం ఉద్యోగాలే గిరిజనులకు దక్కుతున్నాయి. ఆ తీర్పు సమయంలో కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు హాజరుకాలేదు. తర్వాత కూడా కేంద్రం స్పందించలేదు. గతంలో పలు కేసుల్లో గిరిజన హక్కులను, చట్టాలను సమర్ధించిన న్యాయస్థానాలే, ఇప్పుడు ఇటువంటి తీర్పులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకాకపోవడమో, హాజరైనా అరకొర వాదనలు చేయడం కూడా ముఖ్య కారణం.
         'తెలుగు రాష్ట్రాల్లో గిరిజన హక్కులు హరించబడుతున్నాయి. పోలవరం నిర్మాణంతో ఏజెన్సీ ప్రజలకు నష్టం జరుగుతుందని సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాం'. 'గిరిజనుల హక్కులకు నష్టం జరగదని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే అప్పుడు మీ అప్పీల్‌ పరిశీలిస్తామ'ని కోర్టు చెప్పింది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం కోర్టు ముందు ఇచ్చిన హామీని పూర్తిగా పక్కనబెట్టింది. పోలవరం నిర్మాణంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఏ ఒక్క అటవీ, పర్యావరణ చట్టాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గిరిజన ఆవాసాలన్నీ ఉనికి కోల్పోయాయి. పునరావాసం లేక ఆదివాసీలు రోడ్డున పడ్డారు. అటవీ సంపదకు, జంతుజాలానికి తీరని నష్టం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన హరితహారం కార్యక్రమం కూడా ఆదివాసీలకు నష్టం కలిగించింది. అడవి లేనిచోట మొక్కలు పెంచాల్సిందిపోయి, గిరిజనులు పోడు సాగు చేస్తున్న భూముల్లో హరితహారం ప్రారంభించారు. ఇది చట్టాలకు వ్యతిరేకం. అంతేకాకుండా అటవీ అధికారులకు స్థానికంగా ఉండే గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది.

5599


                                                                              చట్టసభల్లో అన్యాయం..

దేశంలోని మొత్తం పార్లమెంట్‌ స్థానాల్లో 47 ఎస్టీ స్థానాలుండగా.. అందులో 37 స్థానాల్లో బిజెపి గెలిచింది. మిగిలిన వాటిలో కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారే ఉన్నారు. అయినా గిరిజనులపై బిజెపి దాడులు ఆపలేదు. అడవుల నుంచి ఆదివాసీలను బలవంతంగా బైటికి వెళ్లగొట్టి, వాటిని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయడమే బిజెపి పన్నాగం. అందుకు నిస్సిగ్గుగా రాజ్యాంగం, చట్టాలను కూడా మారుస్తున్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా హడావిడిగా తెచ్చిన అటవీ పరిరక్షణ చట్టం 2023ను రాష్ట్రపతి తిరస్కరించాలి. ఏకరూప పౌరస్మృతి గిరిజన తెగల సాంప్రదాయపు సామాజిక అలవాట్లకు వ్యతిరేకంగా రూపొందించబడుతోంది. పీసా చట్టంలో.. గిరిజన తెగల సాంప్రదాయపు చట్టాలను పాటించేందుకు అనుమతించింది. అందువలన యుసిసి పేరుతో ఆధిపత్యవాద హిందూ సంస్కృతిని గిరిజన తెగలపై రుద్దరాదంటూ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దేశమంతటా నినదించాలి.

889

                                                                      భూముల నుంచి తొలగింపు..

అటవీ హక్కుల చట్టం (2006) ప్రకారం.. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు, ఇతర సాంప్రదాయపు అటవీ నివాసులు గరిష్టంగా 10 ఎకరాల వరకూ పోడు భూమిపై హక్కు పత్రాలు పొందవచ్చు. గిరిజన తెగలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేస్తానంటూ వచ్చిన ఈ చట్టం అమలు అధ్వాన్నంగా ఉంది. ఐదు ఎకారాలు పోడు చేసే రైతులకు ఒకటి, రెండు ఎకరాలకే హక్కు పత్రాలిచ్చారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 42 లక్షల సాగుదార్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కనుక వారిని భూమి నుంచి తొలగించాలని స్వయంగా సుప్రీం కోర్టు 2019 ఫిబ్రవరిలో ఆదేశించింది. పిటిషన్‌ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. అయినా, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ రైతులను భూముల నుంచి తొలగించాయి.

                                                                  మణిపూర్‌లో ఆరని మారణహోమం

మణిపూర్‌లో గిరిజనులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో మైనింగ్‌ జరిపేందుకు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదివాసీలకు అక్కడ ప్రభుత్వం ఆరు నెలల కిందటే నోటీసులిచ్చింది. అక్కడ నుంచి ప్రారంభమైన అసంతృప్తి ఇప్పుడు ఆ రాష్ట్రమంతటా పాకింది. ఇప్పుడది మతాల మధ్య, జాతుల మధ్య చిచ్చుగా మారింది. దీనికి కారణం బిజెపి ప్రభుత్వ అవకాశవాద విధానమే. గిరిజనుల తెగ జీవనాన్ని సంఘపరివార్‌ ధ్వంసం చేస్తోంది. వారి సాంప్రదాయాల్లోకి చొరబడింది. ఆదిమ తెగలు ఆవు మాంసం తినరాదనీ.. చర్చి, మసీదులకు వెళ్లరాదనీ.. సాంప్రదాయపు వస్త్రధారణ మానుకావాలనీ.. వారి సంస్థల ద్వారా ప్రభోదిస్తోంది. ఆదిమ తెగ సంస్కృతిని హిందూ సంస్కృతిగా మార్చాలని పన్నాగం పన్నింది. ప్రకృతి ఆరాధికులను హిందువులుగా మార్చాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. హైందవీకరణ, కార్పొరేటీకరణ, సరళీకరణ, డబ్బు ఆశ చూపి అడవిబిడ్డల మధ్య ఘర్షణలు సృష్టిస్తోంది. పాస్టర్లుగా ఉన్న గిరిజనులపై దాడులు చేయిస్తున్నారు. గిరిజన పాస్టర్‌ను కాల్చేస్తానని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన బిజెపి ఎంపి అనడం ఎంతవరకు సమంజసం? ఆయన మాటల వెనక ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి.

5544

                                                                      ఆదివాసీల అభివృద్ధి వారితోనే..

స్వయం నిర్ణయాధికారం కోసం దేశీయ యువతే మార్పు చేసేవారిగా ఉండాలి. ప్రపంచంలోని మూలవాసుల హక్కుల ఉల్లంఘనలు నిరంతర సమస్యగా మారాయి. ఈ సమస్యలకు ప్రతిస్పందనగా, ఆదివాసీలు తమ స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉండాలి. వాటిని అర్థవంతంగా, సాంస్కతికంగా వారికి తగినట్లుగా నిర్వహించే హక్కును ప్రతి ఆగస్టు 9న గుర్తుంచుకోవాలి.
          స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్‌ ఉన్న ఈ సందర్భంలో, స్వదేశీ యువత నేడు మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాలలో ముందుభాగంలో ఉండి, మార్పుకు కృషి చేయాలి. ఉదా: దేశీయ యువత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నది. పరిష్కారాలను అందించడానికి, మన ప్రజలకు మరింత స్థిరమైన, శాంతియుత భవిష్యత్తుకు దోహదం చేయడానికి కొత్త నైపుణ్యాలను అభివద్ధి చేస్తోంది. అయితే ఈ రోజు తీసుకునే నిర్ణయాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వారి ప్రాతినిధ్యం ప్రధానం. వాతావరణ మార్పులను తగ్గించడం, శాంతి నిర్మాణం, డిజిటల్‌ సహకారం కోసం ప్రపంచ ప్రయత్నాలలో పాల్గొనడం, స్థానికంగా వారి హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం కీలకం. ఈ అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం 2023 ''స్వయం నిర్ణయాధికారం కోసం దేశీయ యువతతోనే మార్పు' అనే శీర్షికతో, పర్యావరణం, న్యాయం కోసం అన్వేషణలో వారి అంకితభావ ప్రయత్నాలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడంలో స్థానిక యువత తప్పనిసరి అనేది పునరుద్ఘాటించాలి. వారు ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలు, రచనలను సజీవంగా ఉంచేలా ఇంటర్‌జెనరేషన్‌ కనెక్షన్‌ని సృష్టించాలి.

- డాక్టర్‌ మిడియం బాబూరావు, చైర్మన్‌, ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌, మాజీ ఎంపి.

baburao