Jun 18,2023 06:58

పిల్లలు పదో తరగతికి వస్తున్నారంటే చాలు.. తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆందోళన.. కొందరైతే పుట్టీపుట్టగానే వారి భవిష్యత్తు గురించి భయాందోళనలు.. తల్లిదండ్రులు తమకు తీరని కలల్ని సహజంగా పిల్లల ద్వారా సాకారం కావాలని కోరుకుంటారు. ఆ క్రమంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచనలు చేయాలి? అసలు ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఏం చదవాలో ఎంపిక చేసుకోగలరా? ఏవిధంగా నిర్ణయాలు తీసుకోవాలి? అసలు పిల్లలు ఏది చదవగలరో, ఏది చదవలేరో తెలుసుకోవచ్చా? అంటే సాధ్యమేనంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఇటీవల బలవంతపు చదువులతో బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవుతున్న విషాదాలు చూస్తున్నాం. అదే క్రమంలో పిల్లలకు పరీక్షల్లో వాళ్లు ఊహించిన మార్కులు, ర్యాంకులు రాకపోతే అవమానంగా ఫీలయ్యే తల్లిదండ్రులనూ చూస్తున్నాం. జీవితంలో అసలైన మలుపు తిరిగే ఈ టీనేజ్‌లో ఉన్నత విద్య విషయంలో తల్లిదండ్రులు, పిల్లలు ఎలా ఆలోచించాలి అనే దానిపైనే ఈ ప్రత్యేక కథనం..
సంహిత పదో తరగతి పరీక్షలు రాస్తోంది. తొలిరోజు పరీక్ష రాసి రాగానే తల్లి ప్రశ్నాపత్రం తీసుకుని, కూర్చోబెట్టి, 'ఈ ప్రశ్నకు ఏం రాశావు సంహితా?' అని అడిగింది. చెప్పిన సమాధానంతో సంతృప్తిపడని తల్లి సంహితను అనుమానంగా చూస్తూ.. 'అన్ని ప్రశ్నలకూ జవాబు సరిగానే రాసినట్లేనా?! ఏమైనా వదిలేశావా?' అని ఒత్తిపట్టి అడిగింది. అప్పటికే తల్లి ఏమంటుందోనన్న భయంతో ఉన్న సంహిత కళ్లు ఏకధాటిగా వర్షించడం ప్రారంభించాయి. 'ఏంటే ఏడుస్తున్నావు? నీకేం లోటు చేశాను? అన్నీ టైమ్‌ టూ టైమ్‌ పెడుతూనే ఉన్నానుగా.. నీతోపాటు నేనూ రాత్రిళ్లు మేల్కొనే ఉంటున్నాగా? ఏడుపు ఆపి ఎన్ని రాశావో, ఎన్ని వదిలేశావో చెప్పేడువు?' అని గద్దించింది తల్లి. 'ముందు వచ్చినవన్నీ రాసేశానమ్మా. చివరిలో నాలుగు మిగిలాయి. రెండు బాగానే రాశాను. రెండు మాత్రం సరిగా రాయలేదు.' అంది సంహిత. వెంటనే తల్లి పేపర్‌ తీసుకుని ఒక్కోదానికి మార్కులు వేసుకుంటూ వచ్చి.. 'అయితే నీకు కనీసంలో కనీసం 85 మార్కులు వస్తాయి. 90 మార్కులు తెచ్చుకోవాలని చెప్పాను. ఏం చేస్తాం.. మొద్దావతారం.. మిగిలిన పరీక్షలన్నా సరిగ్గా రాసేడువు..!' అని విసురుగా లోపలికి వెళ్లిపోయింది తల్లి.

2


అలా వెళ్తున్న తల్లివైపు చూస్తూ ఏడుపును ఉగ్గబెట్టుకుని గదిలోకి వెళ్లి, వెక్కి వెక్కి ఏడ్చింది సంహిత. ఈ ప్రభావం మిగిలిన పరీక్షల మీద కూడా పడింది. క్లాసులో మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండే సంహిత ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో అంతగా రాయలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?
ఏం చేయాలి : పిల్లలు పరీక్ష రాసి రాగానే వాళ్లు ఏమన్నా తినడానికి పెట్టాలి. కనీసం ముందు మంచినీళ్లయినా ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్లు రాయగలిగినవి, రాయలేనివి నిర్భయంగా తల్లిదండ్రులతో పంచుకునే వాతావరణం మొదటి నుంచి ఉండాలి. అలాకాకుండా చెబితే ఏమన్నా అంటారేమోనని భయపడిపోయేలా చేయడం వల్ల కొన్ని సార్లు మార్గం తప్పిపోతారు. పర్యవసానంగా అబద్ధాలు చెప్పడం, సరిగ్గా చదవకపోవడం చేస్తారు. గట్టిగా మందలించి, ఎందుకూ పనికిరారని హేళన చేస్తే.. తర్వాత రాసే పరీక్షల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆత్మనూనతా భావం ఏర్పడి, మరింత ప్రతికూలమైన ప్రభావాలు కలిగించే అవకాశం ఉంటుంది. అంతేగాక, తల్లిదండ్రుల దగ్గర చనువు స్థానంలో భయం ఏర్పడి, పిల్లలకీ తల్లిదండ్రులకీ మధ్య దూరం పెరిగి, వారు అనేక విధాలుగా తప్పించుకునే ధోరణులు ప్రదర్శించే అవకాశం కూడా ఉంటుంది.

  • ఎలా తెలుసుకోవాలి..

నేడు ఉన్నత చదువు అంటే బైపీసీ, ఎంపీసీ, ఐఐటీ ఇవే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ట్స్‌ గ్రూపులైన సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీల్లోనూ విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. మారుతున్న విద్యావిధానంలో అనేక అవకాశాలొచ్చాయి. వాటిల్లో ఏదైనా ఎంచుకుని, జీవితంలో స్థిరపడొచ్చు. పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. తాము చదివించాలనే సబ్జెక్టు మీద పిల్లలకు ఇష్టం ఉందో లేదో అనేది ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. పిల్లలు పలానాది బాగా చదవగలరు అనేది తెలుసుకోవడానికి కనీసం నాలుగు అంశాలు అయినా పరిశీలించాలి.. అవి..
1. సహజ నైపుణ్యం
2. ఆసక్తి
3, వ్యక్తిత్వ ధోరణి
4. సానుకూల వాతావరణం

2


1. సహజ నైపుణ్యం: అంటే ఒకరకంగా ప్రత్యేకంగా ఒక అంశం మీద సహజంగా సమర్ధత కలిగి ఉండటం. తద్వారా వాటిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. ఉదాహరణకు కొందరికి లెక్కలు, మరికొందరికి సంగీతం, ఇంకొందరికి భాష పట్ల ఎక్కువ సమర్ధత కలిగి ఉంటారు. ఆయా అంశాల మీద వారిని ప్రోత్సహిస్తే.. ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మరింత వివరంగా చెప్పాలంటే.. కొంతమంది పిల్లల్లో కొన్ని సహజంగా వచ్చే సామర్థ్యాలు ఉంటే, కొందరు చిన్నతనంలో సంగీతంలో, ఇంకొందరు చిత్రలేఖనంలో సామర్థ్యం చూపిస్తారు. వారి ప్రతిభను తోసిరాజనకుండా, వాళ్లల్లో సహజమైన సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో.. వాటిని ప్రోత్సహిస్తే.. వాళ్లకంటూ ఒక కొత్త దారి ఏర్పర్చుకోగలుగుతారు. లేదా తాము ఎంచుకునే దారిలో దానిని కూడా ఆలంబనగా నిలబెట్టుకోగలుగుతారని తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
2. ఆసక్తి : లెక్కలు, సంగీతం అంటే వాటిలో సామర్థ్యం ఉండడం వేరు.. వాటి పట్ల మానసికంగా మరింత ఆసక్తి కలిగి ఉండటం వేరు. అలా ఆసక్తి ఉన్నప్పుడు వాటిని మనసుపెట్టి తెలియని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మరింత తెలుసుకోవాలనే జిజ్ఞాస వీటి పట్ల ఉండే ఆసక్తి ద్వారానే కలుగుతుంది. కొంతమంది పిల్లలకు మొక్కల పట్ల ఆసక్తి చూపించారనుకోండి. చెట్లూ చేమల్లో ఏం తిరుగుతావు? టైము ఎందుకు అంతా వృథా చేస్తావు? ఇంట్లో కూర్చుని లెక్కలు చేసుకోవచ్చు కదా? ఇంట్లోనే ఉండి బొమ్మలు గీసుకోవచ్చు కదా? ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు కదా? అలా చెట్లు చేమల్లో ఉపయోగించే సమయాన్ని చదువు మీద దృష్టి పెట్టొచ్చు కదా.. అలా చాలామంది తల్లిదండ్రులు విసుక్కుంటూ, మందలిస్తూ ఉంటారు. అయితే వాళ్లల్లో ఉన్న ఆసక్తి వాళ్లకు భవిష్యత్తుకు సోపానం ఏర్పరుస్తుందేమో.. మనం కూడా ఆలోచించాలి కదా? ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల సహజ ప్రతిభని, ఆసక్తిని అణచివేసి ఉంటే.. ఇంతమంది క్రికెటర్లు, క్రీడాకారులు, రచయితలుగానీ, కళాకారులు వంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా మనకు ఆదర్శంగా నిలబడేవారు. అది సేవాభావం కావొచ్చు, రచనా ప్రతిభ కావొచ్చు, చిత్రలేఖనం లేదా మరేదైన కళాత్మకమైన ప్రతిభా కావొచ్చు, అటు సహజ సామర్థ్యాలు, ఇటు ఆసక్తి, ఈ అభిరుచులు వీటన్నింటినీ కలబోసినప్పుడే కదా ఆ పిల్లల్లో ప్రతిభ సరిగ్గా సానబెట్టే దిశగా వెళ్లగలిగేది.
3. వ్యక్తిత్వ ధోరణి : సహజ నైపుణ్యం, ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. తగిన వ్యక్తిత్వధోరణి కూడా కీలకం. అంటే ఆయా అంశాలకు కావలసిన వ్యక్తిత్వ లక్షణాలూ అవసరమే. ఉదాహరణకి కొన్ని సబ్జెక్టులను ఎంచుకున్నప్పుడు వాటితో పాటు మరికొన్ని సబ్జెక్టులు కూడా తోడవుతాయి. అవన్నీ చదివితేనే ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అలాంటప్పుడు ఓర్పుగా వాటన్నింటినీ చదవాలి. కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కొన్ని సబ్జెక్టులను లోతుగా చదవడం, ఓర్పుగా సాధన చేయడం, నిశితంగా పరిశీలించడం అవసరం. ఇలా తను చదవదలుచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన వ్యక్తిత్వ ధోరణి ఉంటేనే ఎలాంటి కష్టమైన అంశాలనైనా సులువుగా నేర్చుకోగలుగుతారు. వాళ్ల వ్యక్తిత్వం కూడా వాళ్లకు తగ్గట్టుగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి నిర్మాణాల గురించి అభిరుచి, ఆసక్తి, సహజ సామర్థ్యం.. ఇలాంటివన్నీ కాదనీ మన కుటుంబంలోనే డాక్టర్లు అంటూ ఎవరూ లేరు, ఇంజనీర్లు కాకుండా, ఆర్కిటెక్చర్‌ కాకుండా, మెడిసిన్‌ వైపే నువ్వు వెళ్లు అని నెడితే, వాళ్ల వ్యక్తిత్వ ధోరణి వాళ్లకి సహకరించాలి కదా.. ఉదాహరణకు రక్తాన్ని చూస్తే భయపడే, ఒళ్లు జలదరించే పిల్లల్ని బలవంతంగా బయాలజీవైపు మాత్రమే వెళ్లు, నువ్వు మెడిసిన్‌ చదువు అంటే.. అది తట్టుకోగల ధైర్యం, ఓర్పు, నేర్పు సహజంగా వాళ్లకు ఉండాలి కదా. కొన్ని సబ్జెక్టుల్లో చాలా ఓర్పు అవసరం అవుతుంది. ఉదాహరణకు : కంప్యూటర్‌ ఫీల్డు తీసుకోండి.. ఇబ్బడిముబ్బడిగా చాలామంది వెళ్తున్నారని మనం అనుకుంటున్నాం గానీ, ఒక ప్రోగ్రామింగ్‌ చేయాలంటే ఓర్పు, నేర్పు కావాలి. అందరూ శాస్త్రవేత్తలుగా, గణిత మేధావులుగా, రచన చేయాలంటే, పురాతన విషయాన్ని పరిశోధన చేయాలంటే దానికి తగ్గ వ్యక్తిత్వ ధోరణి అవసరం. కూలంకషంగా విషయ పరిశీలన చేయగలిగే శక్తి సామర్థ్యాలు, వ్యక్తిత్వం అవసరం. పరిశీలనా ధోరణే కాకుండా సునిశితంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగేది అభివృద్ధి చేసుకుంటే ఏర్పడేవే కానీ, అందుకు తగ్గ వ్యక్తిత్వ ధోరణి అవసరం.. ఇది తల్లిదండ్రులు ఆలోచించాలి.
4. సానుకూల వాతావరణం : పై మూడు విషయాల్లో ఎలాంటి సమస్యా ఉండకుండా ఉన్నా.. అంటే సహజ నైపుణ్యం, ఆసక్తి, వ్యక్తిత్వ ధోరణి అన్నీ ఉన్నా.. కుటుంబంలోగానీ, విద్యాసంస్థలో గానీ ప్రతికూల వాతావరణమో, నచ్చని విషయాలో, సర్దుకుపోలేని అంశాలో ఉన్నప్పుడు విద్యార్థి ప్రతిభ తగిన ధోరణిలో వెల్లడికాకపోవచ్చు. సానుకూలమైన వాతావరణం సామాజికంగా, కుటుంబపరంగా లేకపోతే లక్ష్యం నెరవేరదు. ఉదాహరణకు.. మెడిసిన్‌ చదవాలని ఉంటుంది పై మూడు అంశాలున్నా, కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటేనే విద్యార్థి లక్ష్యాన్ని మరింత తేలికగా నెరవేర్చుకోగలుగుతాడు. కళలంటేనో.. రచనలంటేనో.. లేదా రచనా వ్యాసంగం.. కథలు కావచ్చు, కార్టూన్లు గీయడం కావచ్చు, పద్యాలల్లడం కావచ్చు ఇలాంటి ఏ సామర్థ్యాలైనా ఉండనివ్వండి. పిల్లల్లో అలాంటి సామర్థ్యాల్ని పక్కకి నెట్టేసి, వాళ్ళు ఎంచుకున్న ధోరణి వైపు కాకుండా.. మేమనుకున్నదే జరగాలి.. నీకు తొందరగా ఉద్యోగం వచ్చేయాలి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనే కోరికలు కావచ్చు.. అవి సానుకూల ఆలోచనలుగానే భావిస్తారు తల్లిదండ్రులు. కానీ పిల్లల ఆలోచనలకు, ఆసక్తులకు, వారి అభిరుచులకు, వారి సహజ సామర్థ్యాలకు, వారి వ్యక్తిత్వ ధోరణులకు.. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ వారికి సానుకూల ప్రోత్సాహక వాతావరణం లేకపోతే పిల్లల్లో చాలా సమస్యలు క్రియేట్‌ అవుతాయి. వాళ్ళు కోరుకున్న ఆశయాలేవైతే ఉన్నాయో అటువైపు వెళ్ళడానికి అడ్డంకిగా మారుతుంది. అలాగే పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోకపోవడమే కాదు. తమ ఆలోచనలను వారిపై రుద్దే వాళ్ళు కొందరైతే.. మరికొంతమంది నువ్వు చదువుకో.. మా విషయాలు నీకెందుకు.. అని ఇంట్లో ప్రతికూల వాతావరణం ఇస్తారు. అంటే ఒక యుద్ధ వాతావరణం కాన్విండి లేదా విచారకరమైన వాతావరణం కానీ లేదా పిల్లలు చదువుకోడానికి వీలుకానటువంటి వాతావరణం అంటే అతిగా ఉల్లాసం, ఆనందాల్లో మునిగి తేలే కుటుంబాల్లో ఇంత లోతుగా ఆలోచించరు. ఉదాహరణకి పెద్దగా టీవీనో కంప్యూటరో పెట్టి నీ చదువు నువు చదువుకో.. టీవీ వైపు చూడకు అంటే పిల్లలు చదువు మీద దృష్టి ఎలా పెట్టగలుగుతారు? ఇక్కడ సానుకూల వాతావరణం అంటే సామాజికంగా, మానసికంగా అన్ని విధాలుగా పిల్లలకు సానుకూల వాతావరణం క్రియేట్‌ చేసినప్పుడే పిల్లలు వారి గోల్‌ను సాధించగలుగుతారు. పిల్లల ప్రతిభకి మార్కులు మాత్రమే కొలమానం కాదు. మార్కుల్లో హెచ్చు తగ్గులకు వారికి అనేక కారణాలుంటాయి. వ్యక్తిగతంగా పిల్లవాడి ప్రతిభకే పరిమితం కాదు. వారికి అర్థం కావాలి. నేర్చుకుంటున్న విషయంపై సరైన అవగాహన ఉండాలి. చదువుకునేందుకు అనుకూల పరిస్థితులుండాలి. ఎన్నో రకాల కారకాలుంటేగానీ వారికి కావలసిన దానిని చేరుకోగలుగుతారు. అన్నీ ఉన్నా పరీక్ష రాసే సమయానికి శారీరకంగా కానీ, మానసికంగా కానీ అనేక అలజడులుంటాయి. మార్కుల కొలమానమే జీవితంలో రాణించడానికి సూచిక కాదు. అవి మాత్రమే కొలమానం కాదు. మార్కులు రానంత మాత్రాన వారికి సామర్ధ్యం లేనట్లు కాదు. పిల్లలు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం గురించి ఆలోచించాలి. మార్కులు అసలు వద్దూ అనడంలేదు. మార్కులతో పాటు పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని కూడా పెంపొందించాలి. అలాంటి సానుకూల వాతావరణం చాలా అవసరం.
ఇవి నాలుగూ పిల్లల కెరియర్‌కు నాలుగు స్తంభాల్లాంటివి.

3
  • అవగాహనతోనే ఎంపిక..

పిల్లలకు చిన్నప్పుడు పేరెంట్స్‌ సహకారం చాలా అవసరం. అలాగే మన విద్యావిధానంలో దశలవారీగా పిల్లల ఎదుగుదల అనేది ఉంటుంది. 5,6 తరగతుల్లో ఉన్న పిల్లలకు వారి అవగాహనను ఒక్కో మెట్టు పెంచుతూ ఉంటాం. అలా పిల్లలకు అవగాహన పెంచేలా సిలబస్‌ను రూపొందిస్తాం. 8,9, 10 తరగతులు వచ్చేసరికి వారికి ప్రపంచం పట్ల, స్వతహాగా కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల, సీనియర్స్‌ ద్వారా కొంత అవగాహన ఏర్పడుతుంది. పిల్లలకు స్వంతంగా నిర్ణయం తీసుకోవడానికి తల్లిదండ్రులుగా మనం అవకాశం ఇస్తున్నామా? లేదా? ప్రశ్నించుకోవాలి. ఇప్పటి విద్యావిధానంలో 12వ తరగతి తర్వాత అవగాహన కలిగే అవకాశాలు పెరిగాయి. సాంకేతిక పరమైన అభివృద్ధి, సాంకేతికంగా జరిగిన అభివృద్ధి వల్ల అంతర్జాల సౌకర్యం వల్ల గతంలో కన్నా మెరుగైన అవగాహన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఈ తరం పిల్లలకు ఏది చదవాలో ఎంచుకోగలగడానికి తోడ్పడేవే. ఇది ఇష్టం అని చెప్పగలిగే పరిస్థితులు, అవకాశం కల్పించాల్సింది తల్లిదండ్రులే. విషయ పరిజ్ఞానంతోనే అవగాహన పెరుగుతుంది. ఇది విస్తారంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకూ అమలవుతున్న విద్యావిధానంలో ఈ పరిస్థితులు కొంతమేరకే ఉంటున్నాయి. మారుతున్న విద్యావిధానాల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది, ఆచరణలోకి రావాల్సిన అవసరం ఉంది.

  • అవకాశాలు ఎన్నో..

ఉన్నత చదువులంటే కేవలం మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఐఐటి అనే ధోరణి సరికాదు. ఇప్పుడు విస్తృతమైన అవకాశాలు పెరిగాయి. పిల్లల చదువుల గురించిన ఆలోచనలని కొన్నింటికే పరిమితం చేసేస్తున్నాం. ఉదాహరణకి భాష మీద స్పెషలైజేషన్‌ చేయొచ్చు. జర్నలిజం, సాంకేతిక పరమైన, సైన్సు రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్‌లోనూ చాలా అవకాశాలున్నాయి. హిస్టరీ, ఎకనామిక్స్‌, కామర్స్‌, జాగ్రఫీ వంటి సబ్జెక్టుల్లో స్పెషలైజేషన్‌ చేయొచ్చు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి వాటిల్లో అభిరుచి బాగుంటే వాటివైపు కూడా పిల్లల్ని ప్రోత్సహించవచ్చు. వారిని అందులో నిష్ణాతులను చేసే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఉండే పిల్లల్ని వాటిల్లోకి వెళ్లి తర్ఫీదు తీసుకునేలా, అందులో రాణించేలా ప్రోత్సహించవచ్చు. ఆలోచనల్లో మార్పు రావాల్సింది ముందు పెద్దవాళ్లల్లోనే.

3
  • మార్కులే ప్రతిభ కాదు!

అందరికీ చదువు అబ్బదు. కొందరికి తక్కువ మార్కులు వచ్చినా అన్ని సబ్జెక్టుల్లో పాస్‌ అవుతారు. కొందరు కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు ఎక్కువ వచ్చినా ఒక్కో సబ్జెక్ట్‌ ఫెయిల్‌ అవుతారు. అంటే నూటికి 35 మార్కులు వచ్చినా పాస్‌ కాబట్టి ఆ మార్కులు పొందినవారిని కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. సరిగ్గా అలాంటిదే మహారాష్ట్రలో ఓ విద్యార్థి పేరెంట్స్‌ చేశారు. మహారాష్ట్ర ఠాణెకు చెందిన ఆ విద్యార్థి తండ్రి ఆటోడ్రైవర్‌. కొడుకు పదోతరగతి 35 శాతం మార్కులతో పాస్‌ అయినందుకు వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవనీశ్‌ శరణ్‌ దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు. 'నాకు 10వ తరగతిలో 44.7 శాతం మార్కులు వచ్చాయి.. డిగ్రీ తర్వాత సివిల్స్‌ రెండో ప్రయత్నంలో 77వ ర్యాంకు పొందాను' అని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 'ఇలాంటి పేరెంట్స్‌ ఉంటే విద్యార్థుల బలవన్మరణాలు తగ్గిపోతాయి. విద్యార్థులు కూడా ఒత్తిడి లేని చదువుకు అలవాటుపడతారు' అని నెటిజన్లు అంటున్నారు.

  • పోలిక ఆలోచనే సరికాదు..

ప్రస్తుతం అవకాశాలు విస్తృతమై పోయాయి. 'పలానా పిల్లవాడు పది ర్యాంకుల్లోపే సీటు కొట్టేశాడు.. వాడికి ఉన్న ఎక్కువేంటి? నీకు మేం చేసిన తక్కువేంటి?.. నీకన్నీ సమకూరుస్తుంటే ఏమీ తెలియడం లేదు.. ఆడపిల్లలు తెచ్చుకుంటున్నారు మంచి మంచి ర్యాంకులు.. నీకు ఏది కావాలంటే అది కొన్నాం. నీవు కనీసం క్వాలిఫై కాలేదు.' అంటూ పేరెంట్స్‌ పిల్లవాడిని సూటీపోటీ మాటలనే సందర్భాలు కన్పిస్తుంటాయి. ఇలాంటి ప్రతికూల ప్రభావం చూపే మాటల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. పైగా వాళ్లు మళ్లీ ప్రయత్నించడానికి కూడా వీలులేని మానసిక దుస్థితిలోకి వెళ్లిపోవడానికే దోహదపడతాయి. వారిలో ఆత్మన్యూనతా భావాన్ని కలిగించినవాళ్లమవుతాం. 'నీకు ఇన్ని డబ్బులు పోసి చదివిస్తే ముష్టి 70% మార్కులా? ఆ పక్కింటి పిల్లోడు చూడు ఏ కోచింగ్‌ ఇప్పించకపోయినా 90% మార్కులు తెచ్చుకున్నాడు. నీకు సిగ్గేయడం లేదా?' అంటూ పోలుస్తూ, హీనంగానే కాదు. వాళ్లను కుంగిపోయేలా కఠినంగా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదు. ఇది వాళ్లను ఆత్మన్యూనత భావానికి గురిచేయడమే. ఇదే విషయం మనకు వర్తింపచేసుకుంటే.. ఉదాహరణకు: పిల్లలు తల్లిదండ్రుల్ని వేరే పిల్లల తల్లిదండ్రులతో పోలిస్తే పెద్దలుగా మనం తట్టుకోగలమా? అది సరైనది కాదని మనకర్థమవుతుంది కదా.. అలాంటప్పుడు పిల్లల్ని వేరే పిల్లలతో ఎందుకు పోల్చడం?

3
  • సమన్వయం అవసరం..

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమన్వయం చాలా అవసరం. పిల్లలకు తమ అభిప్రాయాలను చెప్పగలిగే అవకాశం కల్పించాలి. ఆ రకమైన స్వేచ్ఛ ఇవ్వగలిగేది తల్లిదండ్రులే. తమకు చిన్నప్పుడు తీరని కలల్ని పిల్లల ద్వారా సాకారం కావాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. అలాగే తమ కన్నా పిల్లలు ఒక మెట్టు పైనే ఉండాలి. తమలాగా కాకుండా ఆర్థికంగా మరింత ఉన్నతంగా ఉండాలని అభిలషిస్తారు. ఇవన్నీ కోరుకోవడం అసలు తప్పుపట్టాల్సిన విషయాలేమీ కాదు. కానీ అవి నెరవేర్చడానికి పైన పేర్కొన్న నాలుగు పిల్లర్స్‌లో పిల్లలకున్న లక్షణాలు ఎలాంటివో గమనంలోకి తీసుకోవాలి. అంతేగానీ.. తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం మంచి నిర్ణయం కాదు. పలానా చదువులే చదవాలని పట్టుబట్టే ముందు అందరం ఒకటి ఆలోచించాలి. అందరూ సాఫ్ట్‌వేర్‌లు చదివి, విదేశాలకే వెళ్లాలా? అలా వెళ్లిన వారు నిద్రాహారాలు మాని, ఎంతలా వాళ్లు కష్టపడుతున్నారో, వారి సాధకబాధకాలేమిటో ఆలోచించాలి! ఎవరికైనా జీవనం నాణ్యతతో.. వ్యక్తిగత సంతృప్తితో ఉండాలి. వీళ్లు నిరంతరం విషయ పరిధి పెంచుకుంటూ ఉండాలి. అది నిరంతర ప్రక్రియ.. ఆకాశానికి మనం నిచ్చెన వేసినప్పుడు ఆ క్రమంలో నాణ్యత ఎంత ఇచ్చినా.. ఇంకా ఎంతో కావాల్సి ఉందని ఆశిస్తూనే ఉండొచ్చు. ఇదంతా ఎండమావిలాంటిది కాదా? దీనికి అంతూ దరి ఉండదు. అడుగులేని పాత్ర అంటారు చూడండి.. అలా అన్నమాట. ఇలాంటి విషయాలన్నీ పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. ఆలోచిస్తే పిల్లల్ని ఎలాంటి చదువుల ఒత్తిళ్లలోకి నెట్టం.

  • అవమానంగా ఎందుకు?

కొందరు పిల్లల్ని పైన పేర్కొన్న విషయాంశాలను దృష్టిలో పెట్టుకోకుండా అతిగా ఒత్తిడి చేస్తే, అలా తీసుకున్న నిర్ణయాలతో ఫలితాలు అనుకున్నట్లు రావు. ఉదాహరణకి పక్క సీటులో ఉద్యోగి కొడుక్కి మంచి ర్యాంకు వచ్చిందని స్వీటు పంచుతారు. తన బిడ్డకు సరైన ర్యాంకు రాకపోవడాన్ని అవమానంగా ఫీలవుతారు. అది సరైన ఆలోచన కాదు. ప్రతి విద్యార్థికి వారి వారి బలాలు, బలహీనతలూ ఉంటాయి. మరొక విద్యార్థితో మన బిడ్డను పోల్చే ముందు.. మన పిల్లల్లో బలాలు ఏమిటి? దేనికి వారు సరిగ్గా సరిపోతారు అని ఆలోచన మనం విశ్లేషణాత్మకంగా చేసుకోవాలి. ఒక వేళ మన పిల్లవాడికి అదే కోర్సుల్లో అన్నీ సానుకూలంగానే ఉన్నా, సరైన ర్యాంకు రాలేదంటే.. మన పిల్లల విషయంలో ఎక్కడ లోపం జరిగిందో పునరాలోచించుకోవాలి. తర్వాత వాళ్ల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏమి చేయొచ్చు అనేది ఉండాలి. వాళ్లు నిరుత్సాహపడకుండా చూడాలి.. ప్రత్యామ్నాయాల గురించిన ఆలోచనలు చేయాలిగానీ, అదేదో తప్పు చేసినట్లు అవమానంగా ఫీలవ్వకూడదు. ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికా బద్ధంగా మనం చేసే నిర్ణయాలు ఆచరణ్మాతకంగా ఉండాలి. ఊహాత్మకంగా సరైన ప్రణాళిక ఉన్నప్పుడే మంచి ఫలితాలను పొందుతాం అనే వాస్తవాన్ని గ్రహించాలి. అనుకున్న లక్ష్యం చేరకపోవడంలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో సమీక్షించుకోవాలి. ఉదాహరణగా పిల్లల సామర్థ్యం 60 శాతం ఉన్నప్పుడు కాస్త ప్రోత్సహించి, మరింత మెరుగుపరచుకోవచ్చు. కానీ అందుకు ఉన్న మార్గాలు ఆచరణాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ఉండాలి. అవన్నీ పిల్లలు అందిపుచ్చుకోగలుగుతున్నారో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులు వేసే ప్రతి మెట్టూ వారి అభివృద్ధికి సోపానం అవుతుంది. కొందరు పిల్లలు అందుకోలేకపోతుంటే.. అప్పుడు వాళ్లని బలవంతంగా చదివించాలని పట్టుపట్టకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించి, వారి సామర్థ్యం మేరకు, ఆసక్తి ఉన్నదాంట్లో అవకాశం కల్పించాలి. అందులో వాళ్లు రాణించేలా.. ఉన్నతంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి. అంతేగానీ పెద్దలు నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా వాస్తవ పరిస్థితిని బట్టి ముందుకు పోవాలి. ఇలాంటి విషయాల్లో ఓర్పు, నేర్పు పెద్దలకే చాలా అవసరం. ఈ ఓర్పు, నేర్చు తమతో పాటు పిల్లలకు ఏమేరకు ఉందనేది పెద్దలు గమనించుకోవాలి. దానిని బట్టే వారిని ఏం చదివించాలో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే వాళ్లు విజయపథాన కొనసాగుతారు. ఉన్నతంగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది.

6
  • అభిరుచులు.. అవకాశాలు..

కొందరు పిల్లలకు డాక్టరో, శాస్త్రవేత్తో, ఇంజనీరో కాకుండా.. సాహిత్యాభిలాష ఉందనుకోండి.. అప్పుడు ఆ పిల్లలకు ఆ విషయంలో మరింత పరిజ్ఞానం సంపాదించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అదేమీ అందరికీ అబ్బే విజ్ఞానం కాదు. అలాంటి సృజనాత్మక రంగాల్లో పిల్లల ఆసక్తులను, అభిరుచులను తెలుసుకుని తల్లిదండ్రులు అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి వాటిల్లో నిష్ణాతులైన వారి వద్దకు తీసికెళ్లి మాట్లాడించేలా చేయాలి. అలాంటి సభలూ, సమావేశాలు తీసికెళ్లడం, వెళ్లేలా ప్రోత్సహించాలి. అలా వాళ్లు తమకు ఆసక్తి ఉన్న సృజనాత్మక అంశాల్లో రాణించడానికి వీలవుతుంది. ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి వాటిల్లో కూడా అందులో గొప్ప గొప్ప పేరొందిన వారుంటారు. వాళ్లను కలిసేలా, శిక్షణ పొందేలా తల్లిదండ్రులు శ్రద్ధతో ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాలి. అప్పుడు ఆ పిల్లలు ఆ అవకాశాలు అందిపుచ్చుకుని, తమ అభిరుచులను ఫలవంతం చేసుకుంటారు.
అన్నీ సమన్వయం చేసుకుని, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఏర్పరుచుకోవడానికి తల్లిదండ్రులు మూలస్థంభాలుగా నిలబడతారన్న విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదు.

డాక్టర్‌ జి పద్మజ
సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సైకాలజీ హెడ్‌,
యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
.


- సంభాషణ : శాంతిశ్రీ