
బ్రాంచి బిల్డింగ్ పైకి వెళ్లి నిలబడింది కొత్తగా అపాయింట్ అయిన గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నిశ్చల. ఊరు ఎలా ఉందో చూద్దామని అన్ని దిక్కులూ చూడసాగింది.
అది పాతికవేల లోపు జనాభా ఉన్న మండల కేంద్రం. ఆకాశంలో నక్షత్రాల్లాగా ఎత్తయిన భవనాలు దండిగా కనిపించాయి ఆమెకు. ఊరికి దూరంగా ఆనుకుని పెద్దపెద్ద కొండలు.. పచ్చగా పొడుగాటి చెట్లు.. కన్నుల పండుగగా అనిపించింది.
వెనుకనే వచ్చిన అటెండర్‌తో 'ఇంత సస్యశ్యామలంగా ఉంది కదా ఈ ఊరు. డిపాజిట్‌లు సేకరించడం అంత కష్టమా?' అని అడిగింది.
'అంతా డబ్బున్న మారాజులే మేడమ్. అయితే ఇక్కడివారికి బ్యాంకుల్లో డిపాజిట్ చేసే అలవాటు తక్కువ. ఎంత ఉన్నా చీటీలే వేస్తారు. నెలవారీ చీటీలు, వారం చీటీలు, రోజువారీ చీటీలు.. అంటే ఎక్కువ ఇష్టపడతారు. వారి లెక్కల్లో మన బ్యాంకు వడ్డీ కన్నా చీటీలు వేయడంలోనే లాభమంట' అని బదులిచ్చాడు.
'సేద్యం బాగుంది. మంచిమంచి భవనాలు ఉన్నాయి. మనం అడిగితే డిపాజిట్ చేయరా?' అని మళ్ళీ అడిగింది.
'ఎన్ని పెరిగినా ఈ ప్రపంచంలో భూమి మాత్రం పెరగదని వారి ఉద్దేశ్యం. అందుకే అప్పు చేసైనా సరే.. వాళ్ళు నేల మీద ఎంత డబ్బయినా పెట్టుబడి పెడతారు మేడమ్!'
'అలాగా'.. అని చిన్నగా మెట్లు దిగుతోంది.
వంద కిలోమీటర్ల దూరంలోని అమ్మ నుంచి ఫోన్-
'మంచి పేరున్న కాలేజీలో బి.టెక్, ఎమ్.బి.ఏ చేశావు. ఏదో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చూసుకుని దేశవిదేశాలు తిరగకుండా, ఈ పల్లెలమ్మట తిరిగే ఉద్యోగం ఎందుకే వారం, పక్షం, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం.. ఇలా పూట పూటకీ టార్గెట్లు పెట్టి, నిన్ను ఎక్కడ నిద్ర పోనిస్తారే మీ పెద్ద ఆఫీసర్లు? నా మాట విని రాజీనామా చేసి, ఇంటికి వచ్చేరు. ఎయిర్ కండిషన్ గదుల్లో కాలు మీద కాలు వేసుకుని, కంప్యూటర్‌తో కాలం గడిపే ఉద్యోగం చూసుకోవచ్చు!' అని బతిమలాడింది నిశ్చల తల్లి.
'అమ్మా.. నేను చాలా బిజీగా ఉన్నాను. లీజర్‌గా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను.. పెట్టేరు..' అని ఫోన్ కట్ చేసింది.
మొబైల్ చూసుకుంటూ మెట్లు దిగుతూ ఉంది నిశ్చల. అప్పుడే ఓ మార్వాడీ వ్యాపారి తన వెండి వస్తువుల కొత్త అంగడి ప్రారంభోత్సవ ఆహ్వానపత్రిక తీసుకుని వచ్చాడు. కార్యక్రమానికి తప్పక రావాలని పిలిచాడు. సందట్లో సడేమియాగా నిశ్చల 'సేట్ జీ..మా బ్యాంకులో ఏమైనా డిపాజిట్ చేయకూడదా!' అని అడిగింది.
'ఏమీ అనుకోకుంటే ఓ మాట చెబుతాను మేడమ్. మీ దగ్గర మా డబ్బు పెడితే మీరు నూటికి, నెలకి అర్ధ రూపాయి ఇస్తారు. అదే డబ్బుతో మేము వ్యాపారంలో పది నుంచీ ఇరవై రూపాయలు సంపాదిస్తాం..' అని నవ్వుతూ చెప్పి వెళ్ళాడు.
'ఆ..' అని నోరు తెరిచింది నిశ్చల.
అయినా కొద్దిసేపటికే తమాయించుకుంది.
తనకు తానే..'నో నెగటివ్ థాట్స్.. ఓన్లీ పాజిటివ్ థాట్స్. అడిగిన వాళ్ళంతా డిపాజిట్లు ఎందుకు వేస్తారు? అలా వేసేట్లయితే బ్యాంకు వాళ్ళు లక్షలకు లక్షలు జీతాలు మనకెందుకు ఇస్తారు? బ్రాంచికొక స్పెషల్ క్యాష్ కౌంటర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా..' అనుకుంది.
నేరుగా వెళ్ళి తన ఛాంబర్‌లో కూర్చుని, కొద్దిసేపు పాత డిపాజిటర్ల లిస్టు తిరగేయసాగింది.
అప్పుడే.. లాకర్‌లో నగలు పెట్టడానికి వచ్చిన రిటైర్డ్ మేనేజర్, తన భార్యతో ఇలా గుసగుసలాడాడు.
'పెద్దపెద్ద సీనియర్ ఆఫీసర్లు, మేనేజర్లుగా పని చేసిన బ్రాంచి ఇది. ఏ ఒక్కరూ.. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ టార్గెట్ రీచ్ కాలేదు. యాభై, అరవై కోట్ల సేకరణకే తల బొప్పి కట్టేది. పాత మేనేజర్ కామర్స్ లో పీ.హెచ్.డి చేసినాయన. అంతకుముందు ఉన్నాయన మినిస్టర్ మేనమామ కొడుకు. అంతటి హేమాహేమీల వల్లనే కాని టార్గెట్ అచీవ్‌మెంట్ పాతికేళ్ళ వయసు కూడా లేని ఈ అమ్మాయి ఏమి చేయబోతుంది.. అందులోనూ ఈ ఏడాది అక్షరాలా వంద కోట్ల టార్గెట్..' ఎగతాళిగా అన్నాడు.
'వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ అమ్మాయి చెయ్యలేదని ఎలా అంటారు..? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసండీ?' అంటూ చిన్నగా అక్కడి నుంచి అతడిని లాక్కెళ్ళింది.
చిన్న తెల్ల కాగితం తీసుకుని ఏదేదో లెక్కలు వేసింది నిశ్చల. తర్వాత సిస్టం ఆన్ చేసింది. మిగిలిన బ్రాంచీలు ఎంతెంత టార్గెట్‌లు చేశాయో చూసింది. గోడ మీది క్యాలెండర్ చూసింది. ఆర్థిక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకెన్ని రోజులున్నాయో మనసులోనే లెక్క కట్టింది.
ఫోన్‌లో చాలాసేపు ఎవరితోనో మాట్లాడింది. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు ఫీల్డ్ ఆఫీసర్‌కి చెప్పి, గబగబా స్కూటర్ బీగాలు తీసుకుని మెట్లు దిగింది.
నిశ్చల బయటికి వెళ్ళడం చూసిన కుళ్ళుబోతు లేడీ క్యాషియర్, కొత్త నోట్లు లెక్కేస్తూ..
'ఛాంబర్‌లో కూర్చుని సిస్టం చూసినంత, ఫోన్లలో మాట్లాడినంత సులభం కాదు.. డిపాజిటర్లను డీల్ చేయడమంటే..! ఈడ్చి కొలిస్తే ఐదు అడుగుల ఎత్తు లేదు.. ఈమె పర్సనాలిటీ చూసి డబ్బున్న మారాజులు క్యూ కడతారా..? ఈమెకు అమెరికా బంధువులు దండిగా ఉన్నారేమో.. వారి నుంచి డిపాజిట్లు తెచ్చుకుంటుందేమో చూద్దాం..!!' అని మనసులో గొణుక్కుంది.
టూ వీలర్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళిన నిశ్చల బండి స్టార్ట్ చేస్తూ ఉంటే.. ఓ పదేళ్ళ పిల్ల వచ్చి చేయి చాపింది.
ఏమి కావాలన్నట్లుగా చూసింది నిశ్చల.
'ఆకలవుతోంది. పైసలుంటే ఇవ్వండి మేడమ్.. ఏదైనా కొనుక్కుని తింటాను' అని దబాయింపుగా అడిగింది.
'నా దగ్గర లేవు. ఇంకెవర్నైనా అడుగు పో..' అని అరిచింది నిశ్చల.
'బ్యాంకు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకెవ్వరి దగ్గర ఉంటాయి మేడమ్?' అని మొండికేస్తున్నట్లుగా అడ్డంగా నిలబడింది ఆ పిల్ల.
'బ్యాంకులో పని చేస్తూ ఉంటే.. బ్యాంక్ డబ్బంతా మాదే అనుకుంటే ఎలా?' అంటూ బ్యాగులోని పది రూపాయల నోటు తీసి ఆ పిల్లకిచ్చింది.
'థ్యాంక్స్.. థ్యాంక్స్..' అంటూ అక్కడి నుంచి కదిలిన ఆ పిల్ల దూరంగా వెళ్ళి ఓ 'ఫ్లయ్యింగ్ కిస్' విసిరింది.
ఆ పిల్ల చేష్టలకు పైకైతే ఉరిమి చూసింది కానీ, లోపల్లోపల ముసిముసినవ్వులు నవ్వుకుని బండి తీసుకుని బయలుదేరింది నిశ్చల.
నేరుగా నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న భూస్వామి కొండప్పనాయుడు ఇంటికి వెళ్ళింది. ట్రాక్టరు, అతడు వాడే బూడిదరంగు బుల్లెట్ బండి ఇంటి ముందరే ఉండటంతో ధైర్యం వచ్చింది నిశ్చలకు.
రోడ్డుకు ఆనుకుని ఉన్న నాలుగెకరాల పొలం అమ్ముడై వచ్చిన రెండుకోట్ల మొత్తాన్ని ఆ రోజు డిపాజిట్ చేస్తానన్నాడు. అందుకే అంతదూరం.. ఎండైనా వచ్చింది.
నిశ్చల రావడం చూసి నాయుడమ్మ గబగబా వచ్చింది. అభిమానంగా పిలిచి హాల్లో కూర్చోబెట్టింది. చల్లటి నిమ్మరసం ఇచ్చింది.
'సార్ లేరా మేడమ్?' అని అడిగింది నిశ్చల.
'అయ్యో.. ఇప్పుడే బయటకు వెళ్ళారు మేడమ్.. వస్తే ఏమైనా చెప్పమంటారా?' అని అడిగింది.
'చెబుదామా, వద్దా..' అనుకుంటూ నిశ్చల 'ఏమీలేదు.. మా బ్యాంకులో డిపాజిట్ వేసే విషయం మాట్లాడదామని వచ్చాను.'
'అయ్యో.. ఆ విషయమా.. రాత్రి అదే విషయం మాట్లాడుకున్నాం. నేల అమ్మిన డబ్బు మన బ్యాంకులోనే వేద్దామనుకున్నాం. కానీ మా అబ్బాయి బెంగళూరులో విల్లా కొంటున్నాడట. అందుకు ఆ డబ్బు కావాలన్నాడు. కాబట్టి ఆ ఆలోచన మానుకున్నాం. ఆయన లేనప్పుడు మీరు వస్తే ఈ విషయాన్ని మీతో చెప్పమన్నాడు. ఏమీ అనుకోకండి మేడమ్..' అని చెప్పింది.
ఎవరో నిశ్చలను చీకట్లో మెట్లు లేని బావిలో తోసినట్లు అనిపించింది.
చిన్నగా లేచి ఇంటి బయటికి వస్తూ ఉంటే కొండప్పనాయుడు చెప్పులు వరండాలో కనిపించాయి.
'అంటే.. ఇంట్లో ఉండి, లేనని చెప్పమన్నాడు..'
నిశ్చల మనసు మండుతున్న కట్టెను నేలకేసి కొడితే నిప్పురవ్వలు చెలరేగినట్లు చెలరేగింది.
బాధగా బండిని చిన్నగా తోసుకుంటూ వెళ్ళి రాములవారి గుడి ముందర కూర్చుంది.
'నేను ఈ ఉద్యోగం చేయగలనా..? డిపాజిట్ల సేకరణ సాధ్యమయ్యే పనేనా..? ఎలా..ఎలా.. ఎలా..?' ఆలోచనల సుడిగాలి వీచింది.
ఇంతలో ఓ కుర్రాడు సైకిల్‌పై సర్రున వచ్చి 'మేడమ్, పేపర్ తీసుకోండి!' అని న్యూస్‌పేపర్ చేతికివ్వబోయాడు.
'వద్దు బాబూ.. మా బ్యాంకుకు వస్తుంది. అక్కడ చదువుతాను'
'మీరు డబ్బేమీ ఇవ్వక్కరలేదండీ..'
'ఎందుకలా?'
'మా ఊరి సర్పంచ్ రోజూ వంద దినపత్రికలు కొని ఊర్లో వాళ్ళకి, ఊర్లోకి వచ్చిన వాళ్లందరికీ కూడా.. ఉచితంగా ఇస్తాడు!'
'దాని వల్ల ఆయనకు లాభమేమిటి?'
'వాళ్ళ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గూర్చి అందరూ తెలుసుకోవాలని' చెప్పి తుర్రుమన్నాడు.
ఓపికగా కూర్చుని న్యూస్ పేపర్ చదవడం ప్రారంభించింది నిశ్చల.
అన్ని పేజీలూ తిప్పాక ఫ్లాష్‌లా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మళ్ళీ మళ్ళీ పేపర్ తిప్పింది. ఏదో తెలియని ధైర్యం ఆమెలో ప్రవేశించింది.
గబగబా లేచి బండి స్టార్ట్ చేసి, డిపాజిట్ల వేట ప్రారంభించింది.
నెలలు గిర్రున తిరిగిపోయాయి.
ఆర్థిక సంవత్సరం హడావుడి సద్దుమణిగింది.
ఏప్రిల్ మొదటివారం..
బ్యాంక్ ముందర కారు వచ్చి ఆగిన శబ్దం.
టీ కోసం బయటికి వెళ్ళిన అటెండర్ పరుగెత్తుకుంటూ వచ్చాడు.
'మేడమ్.. రీజినల్ మేనేజర్ సార్ వచ్చాడు' అని అరుస్తూ చెప్పాడు.
హౌసింగ్ లోన్‌కి వచ్చిన ఓ క్లయింట్‌తో కావాల్సిన రిక్వైర్‌మెంట్స్ లిస్టు రాసి ఇస్తోంది నిశ్చల. అటెండర్ అరుపులు విని, వెంటనే సీటు నుంచి లేచి సిబ్బందితో కలిసి రీజినల్ మేనేజర్‌కి ఆహ్వానం పలకడానికి ఎదురు వెళ్ళింది.
మెరుపు ముఖంతో వచ్చిన రీజినల్ మేనేజర్ 'కంగ్రాట్స్ నిశ్చలా.. యు డన్ ఎ గ్రేట్ జాబ్.. వంద కోట్ల డిపాజిట్లు సేకరించడం అంటే మాటలు కాదు. మన జిల్లాలోని ఏ బ్రాంచీ ఈ సంవత్సరం వారికిచ్చిన టార్గెట్ చేరుకోలేదు. కరువు తాండవిస్తోందని, జనాల్లో సేవింగ్స్ మెంటాలిటీ తగ్గిపోయిందని, బ్యాంకులు ఎక్కువై పోయాయని ఇలా ఏవేవో కారణాలు చెప్పారు.. నువ్వేమో చేసి చూపించావు' అంటూ మెరిట్ సర్టిఫికెట్ చేతికిచ్చాడు.
సంతోషంగా చేతిలోకి తీసుకుంది నిశ్చల.
ఆమె కళ్ళలోకి చూస్తూ ఆయన 'ఫ్రెష్ గా రిక్రూట్ అయిన నువ్వు ఈ విజయాన్ని ఎలా సాధించావమ్మా?' అని నవ్వుతూ అడిగాడు.
కొంచెంసేపు తటపటాయించింది నిశ్చల.
'మీ విజయ రహస్యం మాకు చెబితే మిగిలిన మేనేజర్లకు మేము చెబుతాము. మరిన్ని విజయాలు మన బ్యాంకు స్వంతమవుతాయి' అన్నాడు.
గదిలో మూలగా కుండీలోని మనీ ప్లాంట్ మొక్కని చూస్తూ చిన్నగా చెప్పడం ప్రారంభించింది నిశ్చల.
***
'ఈ చిన్న మండల కేంద్రంలో మేనేజర్‌గా ఛార్జి తీసుకున్నాక ప్రతిరోజూ ఉదయం సాయంత్రం పల్లెలన్నీ తిరిగాను సార్. ఇక్కడి వారి జీవన విధానం, ఆర్థిక వనరులు, పొదుపు అలవాట్లు తెలుసుకున్నాను.
అలాగే ఇక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓ పెద్ద సోప్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడికి వెళ్ళి పర్సనల్ డిపార్ట్‌మెంట్ వారిని కలిసేదాన్ని. ఎవరెవరు ఎప్పుడు రిటైర్ అవుతున్నారో వివరాలు సేకరించాను. వారిని ఇళ్లకెళ్ళి కలిశాను. వారికి వచ్చే ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్, గ్రూప్ ఇన్సూరెన్స్ తాలూకు మొత్తాలను మన బ్యాంకులో డిపాజిట్ చేయమని అభ్యర్థించాను.
నా విజయంలో దినపత్రికల పాత్ర ఎంతో ఉంది. రోజూ న్యూస్ పేపర్‌లో రిటైర్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగుల అడ్వర్టయిజ్‌మెంట్‌లు చూసేదాన్ని. వారినీ కలిశాను. అలాగే తక్కువ వయసులో మరణించినవారి పత్రికా ప్రకటనలూ పరిశీలించేదాన్ని. వారికేమైనా పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయేమో ఆరా తీసేదాన్ని. ఇలా రేయింబవళ్ళూ కష్టపడ్డాను.
నా పడక గది నిండా పెద్ద అట్టలతో వంద కోట్ల టార్గెట్‌ని స్కెచ్ పెన్నులతో రాసుకున్నాను. రోజువారీ నిధుల సేకరణ ఎంతెంత చేశామో వివరాలు కూడా చూసుకునే దాన్ని. మార్చి చివరికి ఇంకెంత చేయాలో రాసుకునేదాన్ని. రోజూ బ్యాంకుకు ఆలస్యంగా రావడం, సాయంత్రాల్లో శీఘ్రంగా వెళ్ళడం, ఫోన్లలో మాట్లాడటం, బ్యాంకులో పేపర్లు తిరగేయటం చూసి కొందరు నన్ను 'పని దొంగ' అని కూడా అనుకుని ఉంటారు. అయితే నేను అవేవీ పట్టించుకోలేదు. నాపని నేను చేసుకుంటూ పోయాను. అందుకే విజయం సాధించాను' అని చెప్పింది.
కుళ్ళుబోతు క్యాషియర్ చిన్నగా తల దించుకుంది. చూసీచూడనట్లు ఉండిపోయింది నిశ్చల.
'గ్రేట్..గ్రేట్..గ్రేట్..' అంటూ రీజినల్ మేనేజర్ తను తెచ్చిన స్వీటును నిశ్చల నోటికి అందించాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిన నిశ్చల తను తింటూ సిబ్బందికంతా స్వీట్లు పంచింది.
అభినందనలు తెలుపుతున్న రీజినల్ మేనేజర్‌కి బ్రాంచి మూలన, ఎయిర్ కూలర్ పక్కన ఇద్దరు ముస్లిం మహిళలు కనిపించారు. బురఖా ధరించిన ఆ మహిళల చేతిలో సంచులు ఉన్నాయి.
క్లరికల్ సిబ్బందితో 'ఎవరు వాళ్ళు? వారి చేతిలో సంచులు ఎందుకున్నాయి?' అని అడిగాడు. సీనియర్ క్లర్క్ పడీపడీ నవ్వుతూ 'ఇక్కడ చాలామంది లోన్ డబ్బు తీసుకెళ్ళడానికి సంచులు తీసుకొస్తారు సార్!' అన్నాడు.
రీజినల్ మేనేజర్ అతడి వెటకారపు మాటలని పట్టించుకోకుండా దూరం నుంచే వారిని రమ్మని సైగ చేశాడు. వారిద్దరూ భయంభయంగా ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు.
'ఏవమ్మా! ఏ పని మీద వచ్చారు?' అని అడిగాడు.
వారు ముఖం మీది వస్త్రాన్ని పక్కకి తీసి 'సార్.. మేమిద్దరం అక్కాచెల్లెళ్లం. మా భర్తలు కువైట్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మాకు పదో తరగతి చదివే ఆడపిల్లలున్నారు. వారి పెళ్లిళ్ళకు కొంచెం డబ్బు దాచి పెట్టమని మా భర్తలకు చెప్పేవాళ్ళం. వాళ్ళు మా మాటలు ఏమాత్రం పట్టించుకునే వాళ్ళు కాదు.
ఈ మధ్యలో మేడమ్ మా ఇంటికి వచ్చారు. మా భర్తలతో ఫోన్‌లో మాట్లాడారు. బ్యాంకులో డబ్బు దాచుకుంటే, అవసరానికి పనికి వస్తుందని వారికి నచ్చచెప్పారు. మొదటిసారి వాళ్ళు ఒప్పుకోలేదు. మేడమ్ మా ఇంటికి రెండుమూడుసార్లు వచ్చి వారితో ఫోన్‌లో మాట్లాడి, ఒప్పించారు. డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేయించారు. ఆ సర్టిఫికెట్లను చేతిలోకి తీసుకున్నాక మాకు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. మా పిల్లల పెళ్లి ఇక పెద్ద సమస్య కాదనే నమ్మకం వచ్చింది. చొరవ తీసుకుని మా పిల్లలకు రక్షణ కల్పించిన మేడమ్‌కి సన్మానం చేద్దామని పూలమాలలు తెచ్చాము' అని సంచుల్లోని మాలలు తీసి, నిశ్చల మెడలో వేశారు.
'మన ఆలోచనల్లో పాజిటివ్ డిపాజిట్లు ఉంటే.. బ్యాంకు డిపాజిట్ల సేకరణ ఓ లెక్కా!' అంటూ
రీజినల్ మేనేజర్ సీటులో నుంచి లేచాడు. ఆయనతో పాటు అందరూ లేచి నిలబడ్డారు. వారికి తెలియకనే చేతులు చప్పట్లు చరిచాయి.
ఛాంబర్‌లోని ఏ.సి. నుంచి నీళ్ళు బొట్లుబొట్లుగా రాలుతున్నాయి. నిశ్చల కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఒక్కొక్కటిగా రాలుతున్నాయి.
కూతురికి అభినందనలు తెలియజేయడానికి నిశ్చల అమ్మానాన్నలు అప్పుడే బొకేలతో బ్యాంకులోకి అడుగుపెట్టారు.
ఆర్.సి. కృష్ణస్వామిరాజు
93936 62821