నా భార్యకింకా పెళ్లి కాలేదు
రచయిత : వల్లీశ్వర్
పేజీలు :176
వెల : 150/-
ఫోన్ : 98487 89094
ప్రస్తుతం మన చుట్టూ సమాజం చాలా మారిపోయింది. సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, విషాదాలు ఎవరికి వారివే. ఇట్లాంటి ధోరణుల మధ్య కాసేపు సరదాగా నవ్వుకునేందుకు ఎన్నో మాధ్యమాలు మనముందు ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా సెల్‌ఫోన్ పుణ్యమా అని అరచేతిలోనే ప్రపంచం కళ్లముందు ఉంటోంది. టిక్‌టాక్‌ల కాలం పోయి, ఇన్‌స్టా రీల్స్‌తో ప్రపంచం ఊగిపోతోంది. నవ్వించేందుకు చిన్నాపెద్దా తేడా లేదు. ఎవరి శక్తి వంచన మేర వారు తయారైపోతున్నారు. జబర్దస్త్‌లు, స్టాండప్ కామెడీలు నడుస్తున్న రోజులివి. ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే రచయిత విరించి గారు రచించిన 'నా భార్యకింకా పెళ్లి కాలేదు' అనే రచనల సంకలనం గురించి.. 'గిలిగింతలు పెట్టే కథలు' అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ సంకలనంలో మచ్చుకు ఒక కథైనా కిసుక్కుమని నవ్వు తెప్పించదు. అంతా ఏదో సీరియస్ ఉపోద్ఘాతం చదువుతున్నట్లు చదవాల్సి వచ్చింది.
రచనలన్నీ పదేళ్ల క్రితం నాటివే అయినా.. అవన్నీ 70, 80 కాలం నాటి అవధానులు, చాదస్తాలు, వెర్రితనం చుట్టూ తిరుగుతాయి. సంభాషణల్లో హాస్యం పలికించే ప్రయత్నంలో భాగంగా వెగటుపుట్టే పలుకులే కనిపిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న పెద్దాయన రెండో వివాహం కోసం పడే తాపత్రయాన్ని మరోపాత్రతో చెప్పించే కథలో మహిళలను, సంసార జీవితాన్ని చాలా తక్కువ చేసి చూపించారు. అలాగే కొన్ని కథల్లో సున్నితమైన, ప్రైవేటు విషయాలను కూడా సినిమాల్లో చూపించినట్లు సంభాషణల రూపంలో పలికించడం వెగటు తెప్పిస్తుంది. 'పార్వతీ కల్యాణం' కథలోనైతే ఓ పెళ్లికాని యువతి పట్ల పురుషుని వెకిలిచేష్టల్లో హాస్యం పండించాలన్న తాపత్రయం కనిపిస్తుంది. ఇది హాస్యం అనడం సరికాదేమో! ఇక 'బామ్మ గారి గోల' కథలోనైతే ఏమీలేని విషయం పట్ల మీడియా చేసే హడావిడిని సాగదీసి సాగదీసి మరీ జీడిపాకంలా చెబుతారు. ఈ అంశంపై ఇప్పటికే ఎన్నోసార్లు తెరపై చూశాం. దీంతో ఈ కథ చదువుతున్నప్పుడు హాస్యం మాట అలా వుంచితే తలనొప్పి వచ్చేలా ఉంటుంది. కొన్ని కథలైతే పాతచింతకాయ ఆలోచనలతో చాదస్తపు భావాలతో సాగుతాయి. మరికొన్ని సామాజిక అంశాలను స్పృశించినట్లు అనుకున్నా సంభాషణల్లో ఎక్కడా హాస్యం పండదు.
'మబ్బుల్లో నీళ్లు' అనే కథలో ఆన్లైన్ మోసాన్ని స్పృశించినా కథాగమనంలో ఎక్కడా హాస్య చతురత లేదు. 'సెల్ఫ్ గోల్' కథలో ఓ పెద్దావిడ దశదిన కార్యక్రమం నడిపే తంతులో కొడుకులు, ఈవెంట్ మేనేజర్ పడే తాపత్రయం, ఆ పెద్దావిడ చావలేదు అని ఇంకా బతుకుతుందని ఇతర పాత్రలతో చెప్పించే విధానం జంధ్యాల గారి సినమాల్లో ఎప్పుడో చూసేసిన పాఠకుడికి ఆ సన్నివేశాలు తలచుకుని నవ్వుకోవాల్సిందే గానీ, ఇక్కడి సంభాషణల్లో నవ్వు రాదు. కొన్ని కథల్లో వెగటు పుట్టే సంభాషణల నుండి హాస్యం వెతుక్కోవాలి. ఎటొచ్చి 'బ్రతుకుదెరువు' కథలో డ్రైవింగ్ పేరుతో నడిపిన కథనం కిసుక్కున ఒక్కసారి నవ్వు తెప్పిస్తుంది. 'కనువిప్పు', 'ఉచితం అనుచితం', 'స్వయంపాకం' కథల్లో అక్కడక్కడా హాస్య గుళికలు రాలతాయి. అయితే ఏరుకునే వాళ్లను బట్టి అవి ఎక్కువ, తక్కువ ఉంటాయి మరి. 'వాసు, వాసంతి, వాట్సాప్' కథలోనైతే ఫోనుతో తనను, ఇంటిని పట్టించుకోని భార్యకు బుద్ధి చెప్పే భర్త పాత్రతో సమాజానికి సందేశం, నవ్వించే ప్రయత్నం చేసినా ఏ ఒక్కటీ ఫలించలేదు. చాలా కథలు మూతి బిగదీసుకుని చదవాలి. సందర్భాల్లో సంభాషణల్లో హాస్యం వెతుక్కోవాలి.
ఇక సుబ్బారావు అన్న కథనాయకుడి పాత్ర పేరు దగ్గరదగ్గర ఓ అరడజనుకు పైగా కథల్లో ఉంటుంది. కథ తరువాత కథ చదివేటప్పుడు కిందటి కథలో సుబ్బారావే రెండో కథలో కూడా గుర్తుకువస్తాడు. అలాగే రచయిత ఈ సంకలనానికి పెట్టిన పేరు ఏ కథలోనూ తారసపడదు. అసలు ఆ పేరుతో కథ కూడా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలా శ్రమ లేకుండానే రచయిత 'బ్రతుకుదెరువు' కథలో ఒక పాత్రతో ఇలా చెప్పిస్తాడు..
'ఏమిటి చూస్తున్నావ్?'.. అన్నాను.
'హాస్యవల్లరి' అన్నాడు తలతిప్పకుండా
'మరీ అంత సీరియస్‌గా చూడాలా' అన్నాను.
ఒకవేళ పొరబాటున జోక్ చేస్తే మిస్సవుతానేమోననీ నసిగాడు..' అంటూ బావ, బామ్మర్ది మధ్య సంభాషణలా ఈ సంకలనం ఆసాంతం వుంది.
- జ్యోతిర్మయి