
పదవ తరగతి విద్యార్థులు ఐదుగురు తరగతి గదిలో లేకపోవడం చూసి 'ఒక్కసారిగా ఐదుగురు ఎందుకు రాలేదు?' అంటూ అడిగాడు హెడ్మాష్టర్ కృష్ణమూర్తి.
'మా పక్కింటి భీషణ్ నాకన్నా ముందుగా పుస్తకాల సంచితో వెళ్లడం చూశాను. కానీ బడికి రాకుండా ఎక్కడకు వెళ్ళాడో తెలీదు సార్!' అంటూ సమాధానం ఇచ్చాడు ఒక విద్యార్థ్థ్థి.
'ఊరి బయట ఏటి ఒడ్డున వుండొచ్చనుకొంటాను!' అన్నాడు ఇంకొక విద్యార్థి.
'బడి వదిలాక ఏటిఒడ్డున అప్పుడప్పుడు ఆడుకొంటూ వుంటాము' అన్నాడు మరొక విద్యార్థి.
హెడ్మాష్టర్ కృష్ణమూర్తి మనసులో ఏదో అనుమానం. ఒకసారి వెళ్లి ఎక్కడున్నారో లేదో చూడాలనిపించింది. పీరియడ్ పూర్తికాగానే బండి తీసుకొని, ఏటి దగ్గరకు వెళ్ళాడు కృష్ణమూర్తి.
అక్కడున్న ఐదుగురు ఏదో విషయం చర్చించుకోవడం గమనించాడు. వారి దగ్గరకు వచ్చి 'పాండవుల్లాగా ఐదుగురు కలసి ఏదో సమస్యతో.. వున్నట్లుండి బడికి రాకుండా ఏమిట్రా?' అనుమానంతో అడిగాడు కృష్ణమూర్తి.
'ఈ వారంలో రెండు రోజులు మా నాన్న తాగి, రోడ్డు మీద పడిపోతే మేము తీసుకొని వచ్చాము' అన్నాడు ధర్మేంద్ర.
'మా నాన్న తాగిన మత్తులో నన్ను బూతులు తిట్టాడు' అన్నాడు భీషణ్.
'మా నాన్న అయితే నన్ను కొట్టాడు' చెప్పాడు అరుణ్.
'మానాన్న మత్తులో నన్ను, మా అమ్మను కొట్టాడు సార్!' కన్నీళ్లతో కోపంగా అన్నాడు నకుల్.
'మా ఇంట్లోనూ అదే సమస్య' సదాశివం అన్నాడు.
'ఉన్నట్లుండి మా తండ్రులలో ఇలాంటి మార్పు కలగడానికి ఏమిటో కారణం తెలుసుకున్నాం. కానీ ఏమీ చేయలేకపోతున్నాం' అన్నాడు ధర్మేంద్ర.
'మా ఐదుగురి తండ్రులకు మద్యం అలవాటు లేదు. వాళ్ళు మంచివారే, కానీ నాలుగురోజులలో జరగబోయే ఎన్నికల కోసం ఆయా పార్టీల వారు తమ సభ్యులకు గత పదిహేనురోజులుగా మందుని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వద్దన్నా మొదట్లో బలవంతం మీద తాగించారు.. ఇప్పుడు అలవాటయినట్లుంది' వివరంగా చెప్పాడు అరుణ్.
'ఈ ఎన్నికలు ముగిసేలోపున ఏదో ఒకటి చెయ్యాలి' గట్టిగా అన్నాడు భీషణ్.
'ఇదేమి సినిమా కాదు.. హీరో అనుకొంటే మార్చేయడానికి, ఇది జీవితం!' అన్నాడు నకుల్.
'అలాంటి పెద్ద డైలాగులు మనకెందుకు? ఏం చెయ్యాలో ముందు ఆలోచిద్దాం!' అన్నాడు సదాశివం.
ఆ ఐదుగురు చెబుతుంటే మౌనంగా వినసాగాడు హెడ్మాష్టర్ కృష్ణమూర్తి.
'మిమ్మల్ని చూస్తుంటే పాండవులను చూస్తున్నట్లుంది. మీ సమస్య అర్థమయింది. మీ బాధలోనూ, కోపంలోనూ న్యాయం ఉంది. ఇదంతా మీ చదువులు పూర్తయ్యాక ఆలోచించవచ్చు కదా. ఈ ఎన్నికలు అయిపోతే, మీ వాళ్లకు మందు కొనిచ్చే వారుండరు' అన్నాడు హెడ్మాష్టర్ కృష్ణమూర్తి.
'ఆ లోపునే ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తున్నాము!' అన్నారు ఐదుగురు.
'ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుంది?' నకుల్ ప్రశ్నించాడు.
'ఓటుకు నోటు ఇవ్వకూడదు అంటారు. ఇస్తే ఎన్నికలు నిలిపేస్తామని చెబుతారు. నూరు శాతం అని చెప్పలేకపోయినా, ఎన్నికలలో ఎక్కువ శాతం ఓటుకు నోటు ఇవ్వడం అలవాటయింది. ఆ సంగతి ఎన్నికల అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు!' అన్నాడు హెడ్మాష్టర్ కృష్ణమూర్తి.
'ఓటుకు నోటు సంగతి మాకూ తెలుసు సార్. మా తండ్రులలో ఈ మార్పును భరించలేకపోతున్నాము' బాధగా అన్నాడు ధర్మేంద్ర.
'మీ ఆలోచనా తీరు కాస్త విచిత్రమైనదిగా తోస్తున్నా.. నేటి సమాజానికి ముఖ్యమైనది. మీరు తండ్రులను ఈ ఎన్నికలలోపున మార్చారంటే సమాజాన్ని మార్చడానికి మొదటి అడుగు వేస్తున్నట్లే!' మెచ్చుకున్నాడు హెడ్మాష్టర్ కృష్ణమూర్తి.
'ఎవరికి ఫిర్యాదు చేస్తే చర్య తీసుకొంటారో అర్థం కావడం లేదు సార్!' అన్నారు ఐదుగురు.
'ముందు బడికి వెళ్ళండి. ఆ తరువాత తీరికగా ఆలోచిద్దురుగానీ. మీ తరగతి పిల్ల్లలతో కూడా కలసి చర్చిస్తే ఒక పరిష్కారం దొరకడానికి అవకాశం వుంది. ఒక హెడ్మాష్టర్‌గా నేను ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయం చేసి, ఏమీ చెప్పలేను' అన్నాడు కృష్ణమూర్తి.
ొొొ
మరుసటి రోజు పదవ తరగతి గదిలోనికి కృష్ణమూర్తి ప్రవేశించగానే 'సార్! ఈ రోజు కూడా ఆ ఐదుగురూ రాలేదు. మాలో కొంతమంది దగ్గర సంతకాలు తీసుకొన్నారు. కలెక్టరు గారికి ఫిర్యాదు చేస్తారట' అన్నాడు ఒక విద్యార్థి.
'అలాగా? వచ్చాక విచారిస్తాను!' మనసులో నవ్వుకొంటూ అన్నాడు కృష్ణమూర్తి.
ొొొ
హైస్కూలు విద్యార్థులు కలెక్టర్‌ను చూడటానికి వచ్చిన సంగతి తెలుసుకొని, వారిని లోనికి రమ్మన్నారు కలెక్టరు.
కలెక్టరుతో తమ బాధను చెప్పుకున్నారు ఆ ఐదుగురు.
'దేశ భవిష్యత్తు నేటి తరం విద్యార్థుల పైనే వుంది. మీరంతా కష్టపడి చదివి, ఉన్నతస్థాయికి చేరాక మార్చడానికి ప్రయత్నించండి!' అన్నారు కలెక్టర్.
'పరీక్షలు పాస్ కావడం పెద్ద సమస్య కాదు. నీతి, నిజాయితీ, ధర్మం లోపించిన ఈ సమాజంలో మేము చదువు పూర్తిచేసుకొనే లోపల అవినీతి, అన్యాయం, అధర్మం పెద్ద వృక్షాలై విస్తరిస్తున్నాయి. మాకు ఇప్పుడు మా తండ్రుల పతనానికి కారణమైన ఆ రాజకీయ పార్టీలపై చాలా కోపంగా వుంది. ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు' అన్నాడు ధర్మేంద్ర.
'మీ చేతిలో పవర్ వుంది. మీరనుకొంటే సరిదిద్దవచ్చుగా సార్' అన్నాడు అరుణ్.
'చూడండీ ఈ సమస్య దేశంలో ఎక్కువశాతం నియోజకవర్గాల్లో జరుగుతున్నదేగా?' అన్నారు కలెక్టర్.
'సార్ మీరూ యువ కలెక్టర్ అని తెలిసి, ఎంతో నమ్మకంతో వచ్చాం. మా సమస్య పరిష్కరించారంటే మీలాంటి యువ కలెక్టర్ల పైన నమ్మకం మరింత పెరుగుతుంది. ఈ ఎన్నికల వలన మా కుటుంబాలలో ఇంతవరకూ లేని సమస్యలు ఏర్పడ్డాయి!' అన్నారు ఆ ఐదుగురు విద్యార్థులు.
'చెదలు పట్టిన ఎన్నికలు అని అందరూ అంటున్నారు. రేపటి తరం మార్చాలి అంటున్నారు. మీరైనా ఈ చెదలు కొంతవరకైనా నిర్మూలించడానికి ప్రయత్నించండి. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్రను మా పుస్తకాలలో చదువుకొన్నాం. ఎన్నికలు అయ్యేంతవరకూ గాంధీజీ అడుగుజాడల్లో శాంతియుతంగా పోరాటం చెయ్యాలని నిర్ణయించుకొన్నాము సార్!' అన్నాడు ధర్మేంద్ర.
'మా ఐదుగురు తండ్రులు మాత్రమే కాదు, మా బడిలోనే మొత్తం ఎనభై నాలుగు విద్యార్థులు, విద్యార్థినుల దగ్గర ఫిర్యాదు ఉత్తరం కింద సంతకం పెట్ట్టారు. మీరనుకొంటే చర్య తీసుకోవచ్చు!' అంటూ చేతులు జోడించాడు అరుణ్.
'తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. ఒక్కరోజు అవకాశం ఇవ్వండి' అన్నారు కలెక్టరు.
మరుసటి రోజు బ్రేకింగ్ వార్తగా న్యూస్ ఛానెల్స్‌లో 'ఆ గ్రామంలో ఎన్నికలకు పదిహేను రోజుల ముందు నుండే మద్యం ఏరులై పారుతోంది! పార్టీల వారు ఓటర్లకు మద్యం పంచుతూ సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు!, 84 మంది హైస్కూల్ విద్యార్థులు ఆ దుస్థితికి బాధపడుతూ తమ తండ్రులను కాపాడి, న్యాయం చేకూర్చండి.. అంటూ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు!, ఎన్నికల చరిత్రలో మొదటిసారి విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై ఆ గ్రామంలో ఎన్నికలను నిలిపివేయమని ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఎన్నికలకు పట్టిన చెదలు నిర్మూలించడానికి ముందడుగు వేసిన కలెక్టర్!' అంటూ హెడ్‌లైన్స్ వచ్చాయి.
ఓట్ర ప్రకాష్ రావు
09787446026