
వారి పేర్లు రెండూ రెండు ధైర్య శిఖరాలు ..
వారి తీరూ అంతే ! ఉవ్వెత్తున ఎగసే విప్లవ అగ్నిశిఖలు ..
ఇద్దరూ ప్రజాపక్షపాతులూ ..
ఇద్దరూ దోపిడీశక్తులకు బద్ధ శత్రువులు ..
ఆశయం కలిపింది ఆ ఇద్దరినీ !
వారిది మానవాళి గర్వించేంత గొప్ప స్నేహం.
ప్రపంచ మానవాళికి మేలు చేసిన మహత్తర మైత్రీబంధం !
ఆ ఇద్దరూ ఫిడెల్ కాస్ట్రో, ఎర్నెస్టో చే గువేరా.
- శాంతిమిత్ర
మొదటిసారి కలుసుకున్నప్పుడే- గంటల తరబడి మాట్లాడుకున్నారు. రాత్రి 8 కి మొదలు పెట్టి బళ్లున తెల్లారిన దాకా ! నవ నవలాడుతున్న ఆ యవ్వనులు ఏం మాట్లాడుకున్నారు? తమ చుట్టూ ఉన్న సమాజ పరిస్థితుల గురించి. లాటిన్ అమెరికా ప్రజల అగచాట్ల గురించి. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దోపిడీ గురించి, పెత్తనం గురించి. ఆ పరిస్థితులను మార్చి, ప్రజలకు మంచి రోజులు రావడం గురించి. అలా రావాలంటే తామేం చేయాలో - కార్యాచరణ గురించి.
కాస్ట్రో మాట్లాడ్డం మొదలు పెడితే- అదొక ప్రవాహం. ప్రజల పట్ల అపార ప్రేమాస్పద ఉద్వేగం. దోపిడీదారుల పట్ల పెల్లుబికే లావా లాంటి ఆగ్రహం. సమస్యను అర్థం చేసుకోవడంలో, వివరించటంలో అపార పరిజ్ఞానం. అ తీరు నచ్చింది చే గువేరాకి. ఆరోజు తన డైరీలో రాసుకున్నాడు : ''క్యూబన్ విప్లవకారుడూ, మేధావీ, అచంచలమైన ఆత్మవిశ్వాసం గల యువకుడూ ఫిడెల్ కాస్ట్రో. తనను కలవడం నాకొక అపురూపమైన రాజకీయ సందర్భం. మేమిద్దరం కలిసి లక్ష్యాన్ని సాధించగలమని నా నమ్మకం.'' ఇదే నమ్మకం, ఇదే ఆచరణ .. వాళ్లిద్దరి స్నేహానికీ ప్రాతిపదిక.
అప్పుడు క్యూబాలో ఉన్నది అమెరికా తొత్తు బాటిస్టా ప్రభుత్వం. ప్రజలను నానా అగచాట్లకూ గురిచేస్తోంది. దానిని పడగొట్టి, ప్రజా ప్రభుత్వం తీసుకురావాలని కాస్ట్రో ప్రభృతుల వ్యూహం. అర్జెంటీనాలో పుట్టి పెరిగిన చే గువేరా - క్యూబా విప్లవంలో భాగస్వామి అయ్యాడు. ఎన్నో వ్యూహాలూ ఎత్తుగడలూ.. ఎన్నో విజయాలూ ఎన్నో ఎదురుదెబ్బలు. మిత్రులిద్దరూ కలిసి పంచుకున్నారు. అన్ని లక్ష్యాలనూ కలిసే ఎంచుకున్నారు. క్యూబా విముక్తి కోసం.. ప్రజలను సమీకరించటం, సాయుధ శిక్షణ ఇవ్వడం, వ్యూహాలు రూపొందించటం, అమలు చేయడం.. వాళ్లిద్దరి నిత్య విధులుగా మారిపోయాయి. చే గువేరాకు చిన్నప్పటి నుంచి తీవ్రమైన ఉబ్బసం. చలిగాలులు పడవు. తేమ వాతావరణం అనుకూలంగా ఉండదు. కానీ, అవేం పట్టించుకునేవాడు కాదు చే. తాను వాడాల్సిన మందుల గురించి తనకు ధ్యాసే ఉండదు. దళాల్లోని మిగతా వారి ఆరోగ్య అవసరాలకోసం మాత్రం ఒక డాక్టరుగా నిత్యం అప్రమత్తంగా ఉంటాడు. అలాంటి ప్రేమమయుడైన చే ని కాస్ట్రో కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎవరిని వాళ్లే చూసుకోవడం ఎవరైనా చేసే పని. ఒకరి కోసం ఒకరు అనుకోవడం సోషలిస్టు సమాజపు ఔన్నత్యం. విప్లవం రాకముందూ, విప్లవం వచ్చాక .. కాస్ట్రో, చే గువేరాల ఆచరణ సోషలిస్టు చైతన్యంతోనే ఉండేది.
చే అంకితభావం, అకుంఠిత దీక్ష అనితర సాధ్యం. అందుకే అతడు క్యూబా విప్లవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. క్యూబాకు చెందని చేని క్యూబా విప్లవ సైన్యానికి అధ్యక్షుడిని చేయటమా? అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలను సోదాహరణంగా తిప్పికొట్టాడు కాస్ట్రో. 'మన దేశానికి చెందని ఒక వ్యక్తి మన దేశం కోసం తన రక్తాన్ని ధారబోయటానికి సిద్ధపడుతున్నాడు. అతడి విప్లవదీక్ష గొప్పది.' అని చెప్పాడు. తరువాత ఒక వ్యాసంలో ఇలా రాశాడు : 'చే తన సొంతానికంటూ ఏ కోరికలూ లేని వ్యక్తి. కానీ, తననెవరైనా సందేహిస్తే చిన్నబోతాడు.' తన మిత్రుడి అంతరంగపు అణువణువూ కాస్ట్రోకి తెలుసు.
క్యూబన్లు 1959, జనవరిలో విజయం సాధించారు. ప్రజలు వీధివీధినా సంబరాలు చేసుకున్నారు. కాస్ట్రో, చే గువేరా తదితర విప్లవ యోధులను జేజే ధ్వానాల మధ్య ఊరేగించారు. తరువాత ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. క్యూబా అధ్యక్షుడిగా కాస్ట్రో ఎన్నికైతే.. ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చే గువేరా నియమితుడయ్యాడు. క్యూబా విప్లవంలో పనిచేసిన విదేశీయులందరూ క్యూబా పౌరులుగానే గుర్తింపబడ్డారు. ఆ గౌరవాన్ని స్వీకరించి, సంతోషించాడు చే. కానీ, తను ఒక దేశానికో, ప్రాంతానికో కట్టుబడాలని అనుకోలేదు. అతడి హృదయం విశాలం. అసలు సిసలు అంతర్జాతీయవాది. ఎక్కడ ప్రజలకు తాను అవసరమో అక్కడికి వెళ్లాలి అనుకున్నాడు. అప్పుడు అనేక లాటిన్ అమెరికా దేశాల్లో విముక్తి పోరాటాలు జరుగుతున్నాయి. అందుకనే చే తన మంత్రి పదవికి, క్యూబా పౌరసత్వానికి రాజీనామా చేశాడు. తన మిత్రుడు కాస్ట్రోకి ఒక లేఖ రాశాడు.. 'మిత్రమా, మనం విడిపోయే సమయం ఆసన్నమైంది. నేను క్యూబా కోసం చేయాల్సిందంతా చేశాను. మన లక్ష్యాలను సాధించాల్సిన దేశాలూ, నా సహాయం అవసరమైన ఉద్యమాలూ ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికి వెళతాను. నేను నా జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే! నిన్ను ఇంకా ముందే కలిసి, నీ పోరాటం మీదే ఇంకా ముందుగానే నమ్మకం ఏర్పర్చుకోకపోవడం. నా భార్యాబిడ్డలు క్యూబాలోనే ఉంటారు. వారి కోసం ఎలాంటి ఆస్తినీ వదిలి వెళ్లనందుకు నేను సిగ్గుపడడం లేదు. సంతోషపడుతున్నాను. ప్రభుత్వమే వారి జీవనానికి తగినంత లభించేలా చూస్తుంది.' ఈ లేఖను పార్టీ సమావేశంలో చదివి, భావోద్వేగభరితుడయ్యాడు కాస్ట్రో. అప్పటితో వారి బంధం ముగిసిపోలేదు. కాంగోలో, బొలీవియాలో చే విప్లవానికి అవసరమైన దళాలను కాస్ట్రో పంపిస్తూనే ఉన్నాడు. చే ఆరోగ్యం గురించి, అవసరాల గురించీ తెలుసుకుంటూనే ఉన్నాడు. ఉత్తర ప్రత్యుత్తరాలూ నడుస్తూనే ఉన్నాయి. 'చే .. నీ మనసు నాకు తెలుసు. నీ పట్టుదలా తెలుసు. అందుకనే బలవంతంగా రమ్మని కోరలేను. కానీ, అక్కడ నీకు ఎలాంటి ప్రతికూలత ఏర్పడ్డా వెంటనే ఇక్కడికి రా. నీ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా మన ప్రజాప్రభుత్వం నీకు అన్నివిధాలా సహకారం అందిస్తుంది.' అని ఒక లేఖలో రాశాడు కాస్ట్రో. కానీ, చే గువేరా వెనక్కు రాలేదు. ఎక్కడ తన అవసరం ఉందనుకుంటే అక్కడికి తరలిపోయాడు. దీక్షతో.. తపనతో.. అచంచలమైన సంకల్పంతో ప్రజాయుద్ధంలోకి తరలిపోయాడు. దుర్మార్గ అమెరికా 1967లో కిరాయి సైనికులు అతికిరాతంగా హత్య చేసేదాకా.. ఆఖరి శ్వాస వరకూ చే ప్రజల కోసమే బతికాడు. కాస్ట్రో అన్ని సందర్భాల్లోనూ తన మిత్రుడి విప్లవ దీక్షను అరుణ పతాకంగా సమున్నతంగా ఎత్తిచూపాడు.
చే, కాస్ట్రో విశ్వనరులు.. విప్లవ యోధులు..
వాళ్లిద్దరి స్నేహం విశ్వ శ్రేయస్సు కోసం. విశాల ప్రజానీకపు సౌభాగ్యం కోసం. ఎలాంటి దోపిడీ, బంధనాలూ లేని స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం. ఈ భూమి యావత్తూ సమానత్వం సాధించేంతవరకూ వారి స్నేహస్ఫూర్తి తరగనిది. వారి విప్లవ కీర్తి చెరగనిది.