Jul 23,2023 12:35

'రాజు, రోజాల జంట విడాకుల కేసులో ఎలాగైనా సరే వాళ్లకు నచ్చజెప్పి, విడాకులు తీసుకోకుండా కలిసి ఉండేలా చేస్తేనే నేను గెలిచినట్లు. ఇన్నాళ్ళ నా సర్వీసులో నేను ఒక్క కేసులో కూడా ఓడిపోయింది లేదు. కానీ వీళ్లిద్దరూ ఇద్దరే.. వేలికేస్తే కాలికేస్తున్నారు.. కాలికేస్తే వేలికేస్తున్నారు. ఈ కేసు నాకు సవాలైపోయింది. హమ్మా' భార్యతో అంటూ, జారిపోతున్న కళ్లద్దాలు సరిచేసుకున్నాడు గోవిందం.
           'ఇప్పటి పిల్లలకు ఆవేశాలు ఎక్కువ, ఆలోచన తక్కువ. బంధమంటే విలువ కూడా తెలియదు. ఒకప్పుడు మనల్ని కన్నవాళ్ళ గురించి, మనం కన్నవాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం. ఇప్పటి యువతరం వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను ఎందులో తక్కువ? నేనెందుకు తగ్గాలి? అనుకుంటున్నారు. విడాకులంటే కాగితాలు మాత్రమే అనుకుంటున్నారు. మావిడాకుల మధ్య ఒకటిగా ముడిపడిన రెండు జీవితాలు అని గ్రహించటం లేదు. అందుకే విడాకుల కేసులు పెరిగాయి.. మీకు సంపాదన పెరిగింది. ఇంతకీ నేను వాళ్ళలా ఆలోచించటం లేదు కాబట్టే మీ బట్టతలను భరిస్తున్నాను. మీకది తెలుసు కదా?' అంటూ పక పకా నవ్వుతూ అంది అనసూయ.
       ఎదురుగా అద్దంలో కనిపిస్తున్న నున్నటి బట్టతలను చూసి ఉస్సూరుమంటూ భారీ నిట్టూర్పు విడుస్తూ తల నిమురుకున్నాడు.
'నిమురుకుంది చాల్లెండి. ఇప్పుడు మీరెలా ఉన్నా మీ వెనుక అమ్మాయిలెవరూ లైను కట్టరు. అర ఎకరం మైదానంలాంటి బట్టతల చూసి, ఆమడదూరం పారిపోతారు' ఆనందంగా నవ్వుతూ ఆంది అనసూయ.
'బెలూన్‌లో గాలి తీసేసినట్లు అలా అంటావేంటే? అసలు నా ఒత్తయిన గిరిజాల జుట్టంతా పీకేసిందే నువ్వు' ఉక్రోషంగా అన్నాడు గోవిందం.
'కోపంలో జుట్టు పట్టుకుంటే పీకినట్లేనా? మీరు మరీనూ.. అబ్బా మీరు ఎలా ఉన్నా నా కళ్ళకు మాత్రం అందంగానే కనిపిస్తారు లెండి' అంది అనసూయ.
ఆ మాటకు మురిసిపోయి ఆనందంగా నవ్వుకుంటూ 'నువ్విచ్చిన ఈ స్ఫూర్తితో వెళ్త్తున్నాను. వీర తిలకం దిద్ది, విజయంతో తిరిగి రమ్మని పంపించు వీరపత్నీ' అన్నాడు గోవిందం.
'అవన్నీ చేసేసరికి మీ క్లయింట్లు వేరే కౌన్సిలర్‌ దగ్గరకు వెళ్ళిపోతారేమోగానీ వెళ్ళండిక..' అంది అనసూయ.
'అవును.. అదీ నిజమే' అంటూ ఫైల్‌ తీసుకొని, గబ గబా బైక్‌ స్టార్ట్‌ చేశాడు గోవిందం.

                                                                   ***

ఫ్యామిలీ కోర్టు అవరణలో జడ్జిగారి అనుమతితో రోజా, రాజులకు కౌన్సెలింగ్‌ ఇవ్వమని గోవిందంని నియమించారు.
ఒక చేత్తో ఫైల్స్‌ పట్టుకొని మరో చేత్తో బట్టతల నిమురుకుంటూ వచ్చి కూర్చున్నాడు గోవిందం.
'నమస్కారం సర్‌' అంది రోజా.
'నమస్తే అమ్మా అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది' సంజాయిషీ ఇస్తూ అన్నాడు గోవిందం.
'సర్‌ మీరు రావడం ఆలస్యమైందంటే మీ ఇంట్లో కోడి మాంసం కూర వండి, మినపగారెలు చేసి ఉంటారు కదండీ' నోట్లో లాలాజలం ఊరుతుంటే చప్పరిస్తూ అన్నాడు రాజు.
'అదుగో చూడండి సర్‌ ఇతనికి ఎప్పుడూ మాంసం గోలే, అవకాశం దొరికితే పచ్చికోడిని కూడా తినేస్తాడు' ఆవేశంగా అంది రోజా.
'నేనేం తింటే నీకెందుకు? నిన్నేమయినా తినమన్నానా? ఎప్పుడూ ఇదే గోల.. రేపో మాపో విడాకులు వచ్చేస్తాయి. నీ నీతి పురాణాలు వినే బాధ తప్పుతుంది' కోపంగా అన్నాడు రాజు.
'శాఖాహారం విలువలు నీకేం తెలుసు? అసలు నీలాంటివాడికి మంచి నేర్పాలనుకున్నాను చూడూ.. అదీ నేను చేసిన తప్పు.. గంగిగోవులాంటి దాన్ని ఆంబోతుకి ఇచ్చి, పెళ్లిచేసినందుకు మా అమ్మనాన్నలను అనాలి' ముక్కు చీదింది రోజా.
'అమ్మారు అమ్మారు అది నా మీద పడుతుంది' అక్కడున్న కర్రతో టేబుల్‌ మీద కొట్టాడు గోవిందం కర్చీఫ్‌ అడ్డం పెట్టుకుంటూ.
'నువ్వు గంగిగోవు లాంటిదానివా? అలా అయితే బాగుండేది. తల ఊపుకుంటూ ఉండేదానివి. నువ్వు తినకపోతే తినబాకు.. వండకపోతే వండబాకు.. అంతే కానీ నేను నాన్‌వెజ్‌ తింటే నీకెందుకు? నా మానాన నేను తెచ్చుకొని తింటే రోజూ గోలే. నిన్ను, నీ గోలను భరించడం నా వల్ల కావట్లేదు' అన్నాడు రాజు.
'స్టాప్‌..స్టాప్‌.. ఇక్కడ నేను కూడా ఉన్నాను, నన్ను మరచిపోతున్నారు. మీరిద్దరూ మీ సమస్యలు నాకు చెప్పాలి. కానీ ఇలా పోట్లాడుకోకూడదు' కంగారుగా టేబుల్‌ మీద కర్రతో మళ్ళీ బాదాడు గోవిందం.
'సర్‌ నేను శాఖాహారిని.. పెళ్లికి ముందు ఇతడు మాంసాహారి అని తెలుసు. కానీ ఇలా రోజూ మాంసం లేకుండా అన్నం తినడని నాకు తెలియదు. పండుగల రోజులలో అతి కష్టం మీద తినకుండా ఆగుతాడు. అదీ నేను గొడవ చేస్తానని. మిగిలిన రోజుల్లో కంచాలు కంచాలు నీసు కూరలతో తినేస్తాడు. అలా తినకూడదని ఎంత చెప్పినా వినడు. నాకు ఇతడిని చూస్తుంటే హంతకుడిని చూసినట్లు అనిపిస్తుంది. నాకు ఈ వ్యక్తి వద్దు సర్‌.. విడాకులు ఇప్పించండి!' అంది రోజా.
'హంతకుడేంటి? ఎవరిని హత్య చేశాడు?' తుళ్ళిపడ్డాడు గోవిందం.
'అదుగో చూసారా? మీరు కూడా భయపడ్డారు.. నన్ను రోజూ ఇలాగే అంటుందండీ! చికెన్‌ కర్రీ తెచ్చుకున్నాననుకోండి, కోడిని చంపేశావు అంటుంది. చేపల కూర తెచ్చుకుంటే చేపను హత్య చేశారు అంటుంది. రొయ్యలు, పీతలు.. ఇలా ఏది తెచ్చుకున్నా ఆఖరుకు గుడ్డు తింటే భ్రూణహత్య అంటుంది. నాలో నాకే నేను హంతకుడినేమో అనే భావం కలుగుతుంది. నాకు ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్‌ మానేయడం కంటే ఈ అమ్మాయిని వదిలేయడం మంచిదనిపిస్తుంది' వగరుస్తూ అన్నాడు రాజు.
గోవిందానికి మతిపోయినట్లయింది. బట్టతల అని మరచిపోయి జుట్టు పీక్కోబోయాడు. చేతికి వెంట్రుకలు తగలక చెయ్యి తీసేశాడు.
'సర్‌ ఎవరయినా వారానికి రెండురోజులు, మహా అయితే మూడురోజులు నాన్‌ వెజ్‌ తింటారు. కానీ రోజూ తింటే ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా వినడు. చెప్పీ చెప్పీ నేను కూడా చాలా విసిగిపోయాను. నాకు నాన్‌ వెజ్‌ వాసన కూడా పడదు. అలాంటిది రెండు నెలల నుండి రోజూ భరిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇతని నుండి విడాకులు ఇప్పించండి సర్‌' ఆవేదనగా అంది రోజా.
'ఆరోగ్యసూత్రాలు మొదలు పెట్టింది చూడండి సర్‌ ఆకుకూరల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుందని పచ్చగడ్డి వండుతుంది. కూరగాయలలో విటమిన్లు ఉంటాయి అని పత్యం కూరలు చేస్తుంది. పప్పులో ప్రొటీన్లు ఉన్నాయి అని పప్పు తినమంటుంది. నేను ఆ తిండి తినలేను. నేను తినేవి తను వండదు. నీతి సూక్తులు, ఉపన్యాసాలతో నాకు రోజు మొదలవుతుంది. వినీ వినీ నా చెవులు తూట్లు పడ్డాయి.' మళ్ళీ ఆవేశంగా అన్నాడు రాజు.
'ఆగండాగండి.. నా సర్వీసులో వెజ్‌, నాన్‌ వెజ్‌ల కోసం విడాకులు కావాలంటూ వచ్చిన మొదటి కేసు మీదే నన్ను మాట్లాడనివ్వండి' అన్నాడు గోవిందం.
'మీరు ఏం చెప్పినా మా నిర్ణయం మాత్రం ఇదే సర్‌!' ముక్తకంఠంతో అన్నారు ఇద్దరూ ఒకేసారి.
ఏం మాట్లాడాలో అర్థంకాక కర్రతో టేబుల్‌ మీద రెండుసార్లు కొట్టాడు గోవిందం.
'రాజూ.. రోజా.. ఒక ప్రశ్న అడుగుతాను. బాగా ఆలోచించి చెప్పండి. మీకు తెలిసిన భార్యాభర్తలలో ఇద్దరికీ అన్నింట్లో ఒకేరకమయిన అభిరుచి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి' అన్నాడు గోవిందం.
పది నిమిషాలు ఇద్దరూ గడ్డం కింద చెయ్యి పెట్టుకొని తదేకంగా ఆలోచనలో పడ్డారు.
'మా అమ్మానాన్న, పిన్నీబాబాయి, అమ్మమ్మాతాతయ్య, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరిని తీసుకున్నా సరే ఏదో విధమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి' ఆలోచిస్తున్నట్లుగా కొంచెం నిదానంగా అన్నాడు రాజు.
'ఈ విషయంలో నా జవాబు కూడా అదే సర్‌ మా ఇంట్లో మా అమ్మానాన్న, మా బంధువులు, నా స్నేహితులు ఇలా అందరూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు' రోజా గొంతులో కూడా ఆలోచిస్తున్నట్లుగా నిదానం కనిపించింది.
'ఇప్పుడు చెప్పండి మరి వాళ్ళందరూ మీలా విడాకులు తీసుకోకుండా ఎందుకు సర్దుకుంటున్నారు?' ప్రశ్నించాడు గోవిందం.
'వాళ్ళవి అభిప్రాయ భేదాలు.. మావి మనిషికి నిత్యావసరమైన ఆహార అలవాట్ల భేదాలు' మళ్ళీ ఒకేసారి అన్నారు రాజు, రోజా.
'ఏదయినా ఒక్కటే పెళ్లయిన రెండు నెలలకే విడాకులు ఇప్పించండి అంటూ వచ్చారు. పెళ్లంటే మీకు అంత తేలికగా అనిపిస్తుందా? ఒక తల్లికి పుట్టిన సంతానంలో కూడా ఇద్దరి రక్తం ఒకటైనా అభిప్రాయాలు, అభిరుచులు కలవవు. అలాంటిది పెళ్లి పేరుతో ఒకటైన ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు ఎలా కలుస్తాయి? ఒకరి ఇష్టాన్ని మరొకరు కించపరచకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పెళ్లి అనే బంధం చాలా పవిత్రమైనది, బలమైనది. ఒకటిగా బతకడమంటే అర్థం సర్దుకోవడమే. విడిపోవడానికి దారులు వెతక్కుండా, కలిసి ఉండటానికి మార్గమేముందో వెతకాలి..' మధ్యలో ఆగాడు గోవిందం.
'అలా చాలాసార్లు ఆలోచించాను కానీ జిహ్వ చాపల్యం చంపుకోవడం నా వల్ల కావట్లేదు సర్‌' అన్నాడు రాజు.
'సరే అది వదిలేసి రోజాలో ఇంకా నీకు నచ్చనివి ఏమున్నాయి?' అన్నాడు గోవిందం.
ఆలోచనలో పడ్డాడు రాజు.
'రోజా నువ్వు రాజుతో కలిసి ఉన్నన్ని రోజులలో అతనిలో ఇంకా నీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా?' అని రోజాను అడిగాడు గోవిందం.
రోజా కూడా ఆలోచనలో పడింది.
పది నిముషాలు అక్కడ మౌనం రాజ్యమేలింది.
'నచ్చనివి చెప్పడానికి మీరిద్దరూ ఇంత సమయం తీసుకున్నారంటే ఒకరిలో మరొకరికి నచ్చినవే ఎక్కువ ఉన్నాయన్న మాట' నవ్వుతూ అన్నాడు గోవిందం.
రాజు, రోజా ముఖాముఖాలు చూసుకున్నారు.
'రాజూ నువ్వు రోజా కోసం నీ ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకొని చూడు.. శాఖాహారం నీకు మంచిదని చెప్పిందంటే నీ ఆరోగ్యం బాగుండాలని నీ భార్య ఆలోచిస్తుందనే కదా' ఆగాడు గోవిందం.
'రోజా అతని ఇష్టాన్ని హేళన చేయకుండా నెమ్మదిగా అతనికి నచ్చిన ఆహారం నువ్వు వండిపెట్టడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు ఇష్టపడే శాఖాహారమూ అతను తినడానికి ముందుకు వస్తాడు. నిన్ను వండమని ఒత్తిడి చేయలేదంటే నిన్ను బాధపెట్టకుండా గౌరవించినట్లే ఇద్దరూ బాగా ఆలోచించండి.. మీ ఇద్దరిలో నచ్చనివి ఆలోచించడం మానేసి నచ్చినవాటి గురించి ఆలోచించండి. పెళ్లి అనే బంధాన్ని అంత తేలికగా తెంచుకోవడం నేటి తరం పిల్లలకు ఫ్యాషన్‌ అయిపోయింది. అది చాలా తప్పు. ముడిపడిన బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి' అన్నాడు గోవిందం.
రోజా, రాజు మళ్ళీ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరి ఆలోచనా విధానంలో మార్పు మొదలైంది.
'నా ఆహారపు అలవాట్లు నేను మానుకుంటానని చెప్పను. కానీ క్రమేపీ తగ్గించుకుంటూ నీ మాటలు కూడా వింటాను' అన్నాడు రాజు.
'నిన్ను నాన్‌ వెజ్‌ తినొద్దని నేనూ ఒత్తిడి చేయను. నీకు తినే వంటకాలు నేను కూడా వండటానికి ప్రయత్నిస్తాను' అంది రోజా.
'అయితే నా కౌన్సిలింగ్‌ పని చేసినట్లేనా మీరిద్దరూ విడాకులు తీసుకోరుగా' బట్టతల నిమురుకుంటూ ఆనందంగా అన్నాడు గోవిందం.
'అవును సర్‌ అందులో సందేహం లేదు' ఇద్దరూ సంతోషంగా అన్నారు.
'నాకో సందేహం సర్‌ మీరు మాటిమాటికీ తల ఎందుకు నిమురుకుంటున్నారు? అక్కడ జుట్టు లేదుగా' అన్నాడు రాజు.
'ఎందుకంటే ఒకప్పుడు నాకు చాలా వత్తయిన జుట్టు ఉండేది. మా ఆవిడకు నా జుట్టంటే చాలా ఇష్టం. పెళ్లయిన కొత్తలో అభిప్రాయభేదాలతో మీలాగే మేము కూడా జుట్టూ జుట్టూ పట్టుకొని గొడవపడేవాళ్ళం. మా ఆవిడ చేతులకు బలమెక్కువ. అందుకే ఇలా బట్టతలయింది. జుట్టు పీకేసినా నాకు ఆవిడ మీద ప్రేమ తగ్గలేదు. అలా తల మీద చెయ్యి వేసి, నిమురుకోవడం అలవాటయింది' అంటూ నవ్వేశాడు గోవిందం.
'అంటే మీరు కూడా పోట్లాడుకునేవారా సర్‌?' అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
'పోట్లాడుకోకపోతే భార్యాభర్తలు ఎలా అవుతారు?' అన్నాడు గోవిందం.
ఆ మాటలకు రోజా గొల్లున నవ్వింది.
ఆ నవ్వులో ఇప్పటివరకూ ఆమెలో తను చూడని కొత్త అందాన్ని రెప్ప వేయకుండా చూస్తున్నాడు రాజు.

కె.వి. సుమలత
9492656255