సాహితీ ప్రస్థానపు తొలి అడుగులోనే 'కడప గడపలో' కవితతో ప్రాసను గ్రాసం చేసుకొని డెబ్భై ఐదు అడుగులు వేశారు కవయిత్రి మోహన వల్లి. ప్రకృతిలోని వాగులు, వంకలు, చెట్లు, చేమలు, పూలు, పండ్లు, అలలు, కలలు, ఆటలు, పాటలు, బాటలు, తోటలు.. ఇలా అన్నింటినీ స్పృశిస్తూ.. పరవశించి.. పలవరించి.. పలకరించారామె. ఆ అడుగు జాడల్లో.. 'కలం పట్టి నీ రాకకు' కవితలో తన కలానికి, రైతు హలానికి పోలిక పెట్టి.. రైతు శరీరంలోని ప్రతి అణువుకూ పొలంలో ప్రతి మట్టి రేణువుతో ఉండే అనుబంధాన్ని నినదించారు. ఆ అనుబంధం తెగిన రోజు రైతు ఆత్మఘోష అతీతమని చూపారు. అది చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుందంటారు కవయిత్రి.
అకాలంలో వచ్చిన తొలకరిని 'తీరిగ్గా ఇపుడు వచ్చావా..!' అని నిందించడంలో జీవం ఉట్టిపడింది. పుడమికి, పురిటి తల్లికి పోలిక పెట్టడం హృద్యంగా ఉంది. 'అక్షరం తోడైతే!' కవితలో స్త్రీని ఓర్పుకు మారుపేరని, సృష్టికి మూలం అని, శక్తికి ప్రతిరూపం అని.. ఆ స్త్రీకి అక్షరం తోడైతే గృహం స్వర్గసీమ అవుతుందని సున్నితంగా, కచ్చితంగా చెప్పారు రచయిత్రి. 'నిశ్శబ్దంగా' లో స్నేహం, బంధం, పరిచయాల గురించి ఆమె విశ్లేషణాత్మక తీరు ఆరంభం నుంచి ఆవిరయ్యే వరకూ అంటూ ఆర్తిగా ఆర్తనాదం చేసినట్లనిపించింది.
'నీ ప్రేమ వారిపై కురవాలి' లో వానకు వలపుతత్వాన్ని ఆపాదించి, తనను ఆసాంతం మైమరపించినట్లు ఉటంకించి.. చివరకు నేల, రైతు, చెట్లు నీ కోసం ఎదురు చూసే, పరితపించే నీ నేస్తాలు. అక్కడ చూపించు నీ ప్రేమ అంటూ.. వానతో నీకు నీవారు, నాకు నావారనడంలో కించిత్తు గర్వం తొణికిసలాడింది. అదే వానతో 'నీ మీద మనసాయే' అంటూ వర్షాన్ని వలపు పిలుపుతోనూ.. మురిపించడం వల్లిగారికే చెల్లింది. 'అంతేనేమో ఆవిడ' కవితలో.. గతి తప్పిన ఆమె బతుకులో రాబందుల లాంటి బంధువుల నుండి ఎదురైన కష్టాలకు ఆమె మనసు నిరాశతో నిండి, పూల పరిమళం.. వెన్నెల అనుభూతిని ఆస్వాదించలేనంతగా కఠినంగా మారి, గతం ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతూ నరకాన్ని సృష్టించుకుంటుందని ఆమె మనోగతంలోకి పరకాయ ప్రవేశం చేస్తారీమె.
'అప్పుడెప్పుడో' లో వేల మైళ్ళు పయనించే వలస పక్షుల కథలతో పోల్చిన.. వలస కూలీల వ్యథలు.. బహుదూరపు బాటసారిలా మనోబలంతో సరిహద్దులు దాటి, మలిపొద్దు గుంకి చేసే ప్రయాణం.. గూటికి చేరాలనే ఆరాటం.. 'కాటికో.. గూటికో' అనే నిరాశావాదంలో కొట్టుమిట్టాడుతున్న వలస కూలీల వెతలు.. అంతలోనే వారి అడుగు అడుగులో ఎలాగైనా ఇంటికి చేరతామనే ధైర్యంతో కూడిన నమ్మకం.. ఆశ.. ఆశయంతో.. ముందుకు సాగే విధానాన్ని కవయిత్రి కళ్ళకు కడతారు. స్వేద చరిత్రతో పోరాడాలనే వారి తెగింపు.. ఇంకా ఎన్నెన్నో వారి వారి భావనలు గుండెను తాకేలా చూపించిన రచయిత్రికి వందనాలు.
'ఇంకా నిదరోతూ గిరులు' కవితలో కొండలకు ప్రాణంపోసి మబ్బుల దుప్పటి కింద పరవశింప చేస్తారు కవయిత్రి. 'కిక్కుకోసం!' కవితలో పొద్దుగూకులూ కాయకష్టం చేసి సంపాదించిన కాసులతో మస్తుగా మత్తులో తూగే మందుబాబుల బలహీనతపై సిగ్గూ శరం లేకుండా ఆధారపడ్డ ప్రభుత్వాల దిగజారుడుతనాన్ని ఎండగట్టారు కవయిత్రి. 'ఎవరికి ఎరుక!' అనే కవితలో చరవాణి చెరలో సగటు మనిషి జీవితం బంధింపబడిందని, బాల్యం లేదు.. బంధం లేదు.. అనుబంధం అసలే లేదు అంటూ .. చివరికి చెరవాణిది భస్మాసుర హస్తమో.. ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తమో! అని కాస్త కినుకగా నిష్టురమాడారు మోహనవల్లి.
'పోరాడే కడలి...' లో కడలి మనకు ఆదర్శం కావాలంటూ.. ఎగసి పడే కెరటం నిరంతర శ్రామికుల జీవితాన్ని, విషాన్ని ఉదరంలో.. హర్షాన్ని వదనంలో దాచుకున్న అంబుధిగా వర్ణిస్తూ.. దివికి భువికి వారధి అని.. అదే మనకు ఆదర్శమని చెబుతారు. ఇలా ఒక్కొక్క కవిత ఒక సందేశమో.. సందేహమో.. సంతాపమో ఏదో ఒక రుచిని చూపిస్తుంది పాఠకుడికి. 'ఓ జాబిలమ్మ' కవితలో జాబిలికి జోల పాడాలని ఆరాట పడతారామె. నాకు నిద్ర వస్తోంది. నీవూ నిద్రకుపక్రమించమని వీడ్కోలు పలుకుతూ డెభ్భై ఐదు కవితాంశాలతో నిద్రలోకి జారుకుంటారు. మన భావనే భవితకు సాక్ష్యంగా ఉందని ఈ 'భవ సాక్ష్యం' ద్వారా చెప్పకనే చెబుతారు కవయిత్రి మోహన వల్లి.
- టాన్యా