Aug 13,2023 16:05

'ఊహించనివి జరగడమే జీవితం! జీవితమంటేనే అనుకున్నవి జరగకపోవడం.. కావాలనుకున్నది దరి చేరకపోవడం..' ఒకప్పుడు ఆ మాటల్ని ఎక్కడో చదివినప్పుడు పడీపడీ నవ్వాడు సంజీవు. కాలం మనిషి ఆలోచనల్ని.. జీవనగతుల్ని మార్చేసి, వేడుక చూస్తుంటుందని.. అతడికి ఇప్పుడిప్పుడే వొంటబడుతున్న లైఫ్‌ ఫిలాసఫీ..! దేవుని గది దగ్గరకు పోయిన సంజీవు గొళ్ళెం తీస్తుంటే.. అతడి చేతులు వణికాయి. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ గది తలుపులు తెరుచుకోబోతున్నాయి.
'మాయ లేదు మంత్రం లేదు.. ఈ గారడీ రామయ్య చేతిలోని రూపాయి బిళ్ళ చూడుండ్రి' చుట్టూ గుమిగూడిన జనాలకు అరచేతిలోని రూపాయి బిళ్ల చూపిస్తూ గుమిగూడిన జనం చుట్టూ కలియతిరుగుతూ బిగ్గరగా అరిచాడు రామయ్య.
'ఏం చేయాలె దీన్ని?' అడిగాడు అందరి వైపు తమాషాగా చూస్తూ. ఎవరూ మాట్లాడలేదు. ఎవరో ఏదో చెప్తుంటే ఆ మాటలను తను వింటున్నట్టు నటిస్తూ.. కాస్త వంగి చెవిని వాళ్ల వైపు తిప్పి 'ఈ రూపాయి బిళ్ల పోయి, వంద నోటు కావాల్నా.. గట్లనే గట్లనే ..' వాళ్లు కోరింది తను చేస్తున్నట్టు ఆ రూపాయి బిళ్లను పిడికిట మూసాడు. పిడికిలిని నుదుటి దగ్గరకి తెచ్చుకొని, ఒకసారి మొక్కి ఆ పిడికిలి చుట్టూ చిన్న చేతికర్రతో మూడుసార్లు తిప్పి 'గీ గారడీ రామయ్య చేతిలోని రూపాయి బిళ్ళ సూడుండ్రి.. వొకటి రొండు మూడు..మాయమైతాంది మాయమైతాంది.. మాయ లేదు మంత్రం లేదు.. మాయమైపోయింది..' అంటూ తన హస్త లాఘవంతో పిడికిలి తెరిచి కలియ తిరుగుతూ అందరికీ చూపెట్టాడు.
కళ్లప్పగించి ఆ గారడీని వీక్షిస్తున్న ఆ గ్రామస్తులు ఆశ్చర్యచకితులయ్యారు. అతడి అరచేతిలో తళతళలాడే వంద రూపాయల నోటు కనబడగానే చప్పట్లు .. ఆ ప్రాంతంలో మారుమోగాయి. జనాన్ని చూసి చిన్నారి సంజీవు కూడా సంబరపడుతూ తన చిట్టి చేతులతో ఎగిరెగిరి చప్పట్లు కొట్టాడు.
'బాపు.. వొక్క రూపాయితో వంద రూపాయలు తెప్పిస్తున్నడు. తెల్ల కాయితాలు పట్టుకుంటే రూపాయల కట్టలు అవుతున్నయి..' అనుకుంటూ చాలా విచిత్ర పోయాడు. తన తండ్రి గొప్పతనం చిన్నారి బుర్రలో నాటుకుపోయింది.
ప్రేక్షకుల కంటికి చిక్కకుండా ప్రతి అంశాన్ని అద్భుతంగా ప్రదర్శించి, జనం మెప్పు పొందే అతికొద్ది మంది గారడీ నిపుణుల్లో రామయ్య ఒకడు. పైసలకు రూపాయలు పుట్టించే తన తండ్రి.. గారడీి ఆట అయిపోయాక జనం విసిరిన చిల్లర డబ్బులు ఎందుకు మూట గట్టుకుంటున్నాడో అర్థంకాలేదు చిన్నారి సంజీవుకి. చిల్లరంతా మూటగట్టుకున్నాక గారడీ సామగ్రిని పెద్ద సంచిలో సర్దుకున్నాడు రామయ్య.
సంచిని తన డొక్కు సైకిలు వెనుక పెట్టి 'ఆరి సంజీవూ.. నేనాడే గారడీ ఆట నీకొక్కసారన్న సూపెట్టాల్నని.. మొట్టమొదటిసారి గీ వూరికి తీస్కచ్చిన. ఎట్లన్పించింది బిడ్డా?' అని అడిగాడు సంచిని తాడుతో బిగిస్తూ. నిలువుగా తలూపుతూ 'మంచిగుంది బాపు..' జవాబిచ్చాడు సంజీవు. కన్నకొడుకు మెచ్చుకునేసరికి ఆనందపడ్డాడు రామయ్య. దగ్గరున్న టేల నుండి వొక బిస్కెట్ల పూడ తీసుకువచ్చి కొడుకుకి ఇచ్చాడు. సంజీవుని ముందర కూర్చోబెట్టుకొని.. హుషారుగా సైకిల్‌ని తన వూరి వైపు కదిలించాడు రామయ్య.

గుడిసె ముందరేసిన తాటాకు పందిరి కింద.. తన గారడీ సామగ్రిని ముందటేసుకొని, సాధన చేసుకుంటున్న తండ్రి రామయ్య దగ్గరకు వచ్చాడు సంజీవు. కొడుకు రాకను గమనించిన రామయ్య 'ఏందిర బిడ్డ! ఏంగావాలె..?' అంటూ మందలించాడు.
'అది.. అది..' నసిగాడు.
'అదంటె.. బొంబాయి మిఠాయి కొనుక్కుంటవా?' ప్రేమగా అడిగాడు.
'కాదు బాపూ! అట్లాస్‌ కొనుక్కోమ్మన్నడు సోషల్‌ సారు..'
'నా దగ్గర కూసొని ఈ గారడీ ఆట నేర్సుకొమ్మంటె.. చదువు చదువని బాగా ఎగురుతున్నవ్‌? చదివి ఏం చేద్దామను కుంటున్నవ్‌రా?' విసుక్కున్నాడు రామయ్య.
'అయ్యా కొడుకుల మధ్యన ఆ ముచ్చట తప్ప మరొకటి ఉండదా?' ఉడికిన బియ్యం కట్టెల పొయ్యి మీద నుండి దించి, గుడిసె బయటకు వచ్చింది మణెవ్వ.
భర్త వైపు కోపంగా చూస్తూ 'ఎవలైన పిలగాండ్లు బడికివోనని జిద్దుజేత్తే.. బుదిరికిచ్చో, బయపెట్టో ఇస్కూలుకు వంపుతరు. వున్న వొక్క పిలగాడు బడికి పోతనంటుంటే నువ్వడ్డంబడుడేందో?' గొంతు పెంచింది మణెవ్వ.
కిక్కురుమనలేదు రామయ్య.
'బిడ్డ చదువుకుంటె నీ సొమ్మేంపాయె!' మూతి ముడుచుకుంటూ పందిరి గుంజను ఆనుకొని కింద కూర్చున్నది.
'సందు దొరికితె చొర పడుడేనాయె! కొడుకును అడ్డం బెట్టుకొని నా మీద ఎగరవడితివి..' ధుమధుమ లాడాడు రామయ్య.
'చాల్చాలు సంబురం.. ఎగవడడానికి మెడల బంగారపు కంఠె అడుగుతలేను. పిలగాడడిగిన ముచ్చట సంగతి వద్దనకు అంటున్న..'
'చిత్తు కాగితాలతో పువ్వులు, మామూలు నీళ్ళతో రంగునీళ్లు, వాళ్ల జేబుల డబ్బులు వీళ్ల జేబుల్లోకి, దూరంగా వున్న ఆంటీ పర్సులోంచి పక్కనున్న ఆంటీ పర్స్‌లోకి చైన్లు తెప్పిస్తావు కద బాపు..' చెబుతూ ఆగాడు సంజీవు.
కొడుకు చెబుతున్నది అర్థమవక 'అవునుమల్ల..గారడీ ఆటనాయె! తమాషాలు సేసుడే గద..' అన్నాడు.
'ఆ జంతర్‌ మంతర్‌ కట్టె తిప్పుకుంటు మా సారు చెప్పిన అట్లాస్‌ తెప్పించి.. ఇవ్వరాదె బాపు..' అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి.
అది విని ఫక్కున నవ్వాడు రామయ్య.
'గదంత నువద్దనుకున్నావ్‌ బిడ్డా! మీ అయ్య అంత గొప్పోడైతె ఈ మెడల వొక్క నల్లపూసల గొలుసే ఎందుకుంటది.. కింది నుంచి మీద్దాక నగలు దిగేసుకోక పోదునా?ఉత్తుత్తదే! సెట్టు మీది సింతకాయలు సూపెట్టుకుంట నీళ్ళూరించుడు. గదంత గారడీరా అయ్య. మీ అయ్య సేసేదంతా గారడీనే. బతుకు గారడీ! లేనిదున్నట్టు చూపెట్టుడు. లగ్గమైన కాన్నుండి నాకు సూపెట్టిండు. అటెన్క జనాలకు సూపెడుతున్నడు. ఇప్పుడు నీకు షురూ జేసిండు' లోపలి అక్కసునంత బయటపెట్టింది మణెవ్వ. తల్లి మాటలకు ప్రాణం ఉసూరుమంది సంజీవుకు.
'గారడీ చేసేవాళ్ల బతుకులు ఇలాగే ఉంటాయా? అసలైన నోట్లలా కాకుండా చిత్తు కాగితాలలాగనే చెల్లవా?' పైకే అనేసాడు బాధగా.
ఏమనిపించిందో ఏమో 'ఆరి సంజీవా..' అంటూ ఆర్తిగా కొడుకును దగ్గరకు తీసుకొని, బావురుమన్నాడు రామయ్య. తండ్రి వేదన అర్థం కాలేదా పిల్లవాడికి. కంటి నీరొత్తుకుంటు 'ఉత్తుత్తి కాగితాలు కర్ర తిప్పంగనే రూపాయలైతే మన బతుకులు గిట్లెందుకుంటరు బిడ్డ? నీకు మంచి బట్టలు కొనియ్యకపోదునా? నిన్ను ఈ గుడిసెల ఎందుకు ఉంచుదురయ్య? పెద్ద బంగులా కట్టకపోదునా? మీ అవ్వ ఆ పాత సీరెలు కట్టుకుంట ఎందుకు బాధపడుతుండె?' అంటూ గుండె లోతుల్లో ఆవేదన వెళ్లగక్కాడు.
తండ్రి కనురెప్పలు తడిసి, కరిగిన కన్నీళ్లు కిందికి జారుతూ.. తన వెన్ను మీద పడుతుంటే ఆ చిన్నిబుర్రకి కొంత అర్థమై కానట్టుంది. 'అలా ఆయితే బాపు.. మరోసారి నిన్ను దేనికీ డబ్బులు అడగనే..' అన్నాడు. తల్లీతండ్రీ ఆశ్చర్యంగా చూశారు సంజీవు వైపు.
'బాపూ.. ఒక పూట కాపోల్లకు కైకిలు పనికి పోతనే!' చాలా ఉత్సాహంగా తండ్రితో అన్నాడు సంజీవు. రామయ్య గుండె జారి, పాతాళపు అంచుల్లోకి కూరుకుపోయింది. వేరెవరో ఇంద్రజాలికుడు తన ప్రమేయం లేకుండానే తల తీసి, దూరంగా
విసిరి వేసినట్టు అనిపించింది.
'గారడీ ఆట ఆడే జానపద కళాకారులకే కాదు.. గారడీ ఆటకే కరువొచ్చింది. ఇప్పుడు ఈ ఆట చూడడానికి ఎవరు ఆసక్తి చూపుతలేరు. ఇప్పటి వాల్లకైతె సెల్లులు, టీవీలతోనె కాలక్షేపం గావట్టె. సాన కట్టమైతంది. ఏ వూరెళ్లినా పది మంది వున్న చోట అప్పటి కప్పుడు గారడీ ఆట మొదలు పెడితె అతికట్టం మీద ఒక వంద రూపాయలు రాలుతున్నరు! అవి దేనికి పనికత్తరు! సంసారానికి ఏ మూలకత్తరు!' రామయ్య గుండెలోని బాధంతా కన్నీటి రూపమై, కనురెప్పల మాటున దాక్కుంది.
మణెవ్వ ఏం మాట్లాడలేదు.
సంజీవేమో 'రోజుకు నూట యాభై రూపాయలిస్తున్నరట. అట్లస్‌కు యాభై చాలె బాపు.. వొక పూట పనికి పోతే డెబ్భై ఐదు రూపాయలస్తరు! మిగిలిన ఇరవై అయిదు రూపాయలు ఇంట్లకు పనికస్తరు..' అన్నాడు.
ఎందుకో రామయ్యకు మొదటిసారి తన మీద తనకే అసహ్యం కలిగింది. 'నాలుగెంతులైతె ఆ పైసలు చేతికి అందుతరు. కొనిస్త.. మెల్ల మెల్లగ ఈ గారడీ విద్దెలు నా దగ్గర నేర్సుకోవాలె మల్ల..' అన్నాడు కొడుకుతో.
'పుస్తకాలు కొనిస్తే కొనియ్యి. లేకపోతె లేదు. అంతేగని..మద్దెల గీ ఫిటింగేందో?' గొణికింది మణెవ్వ.
'మనింటి కళ గాదె ఈ గారడీ విద్దె. తాత ముత్తాతల కాన్నుండి గారడాట మనకు జీవనోపాధి గాదే! రేపు వానికి చదువు అబ్బక, చదువుకున్నా ఎక్కడా కొలువు దొర్కక మన గారడీ విద్దె తెల్వక..ఎటని పోతడు? ఎట్ల బతుకుతడు?' ముందుచూపుగా అన్నాడు.
'ఎవల బతుకెట్ల రాసి పెట్టున్నదో? ఎవల కెర్క? బగ్గ సదువుకొని వుజ్జోగం చేస్తడేమో! వాడి ఆలోచనలకు మనం అడ్డం పడుడుదేనికి?' అన్నది మణెవ్వ

దేవుని అర్ర గొళ్లెం తీసి తలుపులు తెరిచాడు సంజీవు. ఎదురుగా ఎవరో నిలబడి ఉన్నట్టనిపించి, ఒక్క క్షణం వున్నచోటే కదలకుండా ఆగిపోయాడు. 'ఎవరో ఏంటి? నాన్న కదా!' అనుకుంటూనే 'బాపూ..బాపూ..ఇక్కడున్నవేంటీ?' అనడిగాడు. అప్పటికే సంజీవు భ్రాంతి తొలగిపోయింది. తనను ప్రేమగా దీవిస్తూ చిరునవ్వు నవ్వుతున్న రామయ్య రూపం అదృశ్యమయ్యింది.
తండ్రి ఆలోచనలే సంజీవుని పదే పదే వెంటాడుతున్నాయి. అందుకేనేమో ఆ భ్రమ? తనలో తనే నవ్వుకున్నాడు సంజీవు.
'లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు! జనాలకి సూపెట్టుడే గారడీ ఆట బిడ్డ..' బతికి ఉన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు సంజీవు మదిలో మెదులుతుంటే తన ప్రమేయం లేకుండానే గది వైపు కదిలాడు.

'గారడీ విద్య ఒక కళా రూపమే! దీన్ని మనలాంటి వాల్లు బతికించుకోవాలె! పదిమందికి వినోదాన్ని పంచే కళ ఇది. నేను జానపద కళాకారుడ్ని. కళాకారుడిగా పుట్టడం అంటే పోయిన జనమలో చేసుకున్న పున్నెమే అయ్యుంటది..!' అవే చివరి మాటలు సంజీవుతో తండ్రి మాట్లాడినవి. హఠాత్తుగా మరునాడే కుటుంబ సభ్యులు రామయ్య మరణవార్త వినాల్సి వచ్చింది. సంజీవు ఒక మెజీషియన్‌ని కలిసి, అతని దగ్గర అసిస్టెంట్‌గా పనికి కుదిరాడు.

ఒక మూల అరుగు మీద వున్న 'పెట్టె పూజ' (గారడీ ఆటకు చెందిన వస్తువులు ఉంచే సందుగ) దగ్గర కూసున్నడు సంజీవు. రెండు చేతులెత్తి ఆ పెట్టె పూజకు నమస్కరించి, దాని మూత తెరిచాడు. గారడీి ఆటలో తండ్రి ఉపయోగించిన ఆ వస్తువులన్నీ తీసి బయటపెట్టాడు. ఒక్కొక్క వస్తువుని తాకుతున్నప్పుడల్లా తండ్రి చేతులు ప్రేమగా తన గుండెని తడుముతున్నట్టు అనిపించి, భావోద్వేగానికి లోనయ్యాడు. గుడిసె బయట పందిరి కింద తండ్రి గతంలో ఏ జాగలో కూర్చొని, సాధన చేసుకున్నడో అక్కడికే వస్తువుల్ని తీసుకుపోయాడు.
తల్లి దగ్గరకుపోయి 'మా మాస్టారు నాకొక కొత్త ప్రోగ్రాం అప్పజెప్పిండమ్మా.. స్వంతంగా చేసుకొమ్మని! ఫస్ట్‌ ది కదా పదివేలకు మాట్లాడాడు.. ఒక పెద్దాయన సన్మానసభలో చేయాలీ ప్రోగ్రాం. ''ఆల్రెడీ కళాకారుడి కొడుకువి. కొత్తగా నా దగ్గర నేర్చింది ఏమీ లేకపోయినా నీకున్న టాలెంట్‌కి నా దగ్గర ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు!'' అంటూ దీవించాడమ్మా! మరొక వారంలో వుందా ప్రోగ్రాం. మన ఇంట్లో ఉన్న గారడీ సామానుతో సాధన చేయబోతున్నా! నన్ను దీవించమ్మా!' అంటూ వంగి,తల్లి పాదాలకు మొక్కాడు సంజీవు.
ఎదురుగా గోడకు వేలాడుతున్న భర్త ఫోటోకి రెండు చేతులతో మొక్కి, ప్రేమగా కొడుకును ఆశీర్వదించింది మణెవ్వ.
అత్యంత ప్రతిభాశాలి అయిన సంజీవు ఆ ప్రాంతానికే ఒక గొప్ప ఇంద్రజాల కళాకారుడిగా ఎదగబోతున్నాడన్న విషయం ఆ క్షణాన ఆ తల్లికి తెలియదు.

ఎనుగంటి వేణుగోపాల్‌
94402 36055