Sep 24,2023 08:55

పగ, ద్వేషం, అసహనం రెచ్చిపోయి, సహానుభూతి కోల్పోయి.. ప్రతిదానికి కయ్యానికి కాలు దువ్వడం వగైర వగైరాలాంటి రుగ్మతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూన్న రోజులు. ప్రేమకు నిర్వచనమే మారిపోయింది. కుల-మతాల పంతాలు పట్టింపులతో సమాజం ఎటువైపుకెళ్తూందో అని అనుకోవడమే తప్ప, తప్పుదారిన పోతూంటే సరైన దారిచూపే నాథులు కరువైపోయారు. యువకులు దిశ కోల్పోయారు. వాళ్లు నడిచిందే బాట. వాళ్లు పాడిందే పాట. ఆడిందే ఆట. ప్రతిదాని వెనుక అదృశ్యహస్తం. ఇలాంటి సమాజంలో ఓ సాయంత్రం చక్కని శృంగార భరితమైన వాతావరణంలో బాల మన్మథుడుకి చిలిపి చేష్టొకటి చేపట్టాలని బుద్ధిపుట్టింది. పూలబాణం ఎక్కుపెట్టి గాలిలో ఎగరసాగాడు.
తెల్లని రెండు చిన్న చిన్న రెక్కలు రెండు భుజాలకు. గులాబీ రంగు పట్టి రెండు కళ్లకు. రెండు చేతుల మధ్య విల్లు. దానిలో ఎక్కిపెట్టిన పూలబాణం. ప్రేమ బాణం. పౌర్ణమి రాత్రి. నిండు వెన్నెల. నేరుగా చంద్రమండలం నుంచి భూవాతావరణంలోకి అది కూడా మన తెలుగు రాష్ట్రాలలోని ఒక రాష్ట్రంలో జన కోలాహలంతో కిటకిటలాడుతున్న ప్రాంతాలలో ఎగరసాగాడు బాలమన్మథుడు. నలువైపులా కాంక్రీట్‌ జంగిల్‌. నచ్చలేదు. మళ్లీ పైపైకి ఎగరసాగాడు. వనాల వైపుకెళ్లాడు. జనాలు లేరక్కడ. హైదరాబాద్‌లో ఉన్న ఓ అందమైన తోటలో ప్రవేశించాడు. యువ జంటలు కిలకిల నవ్వులతో అక్కడ మెలగడం గమనించాడు. కొన్ని చెట్ల చాటున కొన్ని యువ జంటలు చెట్లనానుకొనే కబుర్లాడసాగారు. వీళ్లను దాటి మరి కొంత ముందుకెళ్లాడు. ఓ సిమెంట్‌ బెంచ్‌ పైన ఓ యువకుడు విచార వదనంతో కూర్చొని ఉన్నాడు ఏకాంతంలో. బాల మన్మథుడు నేలపైకి దిగాడు. అతనికి దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. అతడు బాల మన్మథుడి వైపు చూశాడు. అతని కళ్లు చాలా అందంగా మెరుస్తూ ఉన్నాయి. మంచి అందగాడు. వింతగా అతని వైపు చూశాడు.
'నన్ను గుర్తు పట్టావా?' ప్రశ్నించాడు ఆ బాలుడు.
లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు.
'నేను మన్మథుడిని. బాలమన్మథుడిని' చిరుమందహాసంతో చెప్పాడు.
ఆ బాలుడి వైపు ఆపాదమస్తకం చూశాడు. వేషమేసుకొనైతే రాలేదు కదా అని అనుకున్నాడు.
'నేను నువ్వు అనుకొంటున్నట్లు వేషం వేసుకొని రాలేదు!' అంటూ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
కొత్త క్యాలెండర్లలో పూలబాణంతో బాలమన్మథుడిని చాలా సార్లు చూసాడతడు. తల తిప్పాడు. అర్థం అయినట్లు. ఇద్దరు అపరిచితుల హృదయాలను తన ప్రేమ బాణంతో కట్టిపెట్టేస్తాడు. గుర్తుకొచ్చింది. పురాణ కథల్లో చదువుకున్నాడు. పెద్దల ద్వారా విన్నాడు. ప్రేమకు మారుస్వరూపం మన్మథుడని మాత్రం తెలుసు. ఈ రోజుల్లో ఇతని ఉనికి అత్యవసరం అని అనుకున్నాడు. పైకి మాత్రం 'ఇక్కడికెందుకొచ్చావ్‌?' అన్నట్లు కుడిచేతినాడిస్తూ అడిగాడు.
'భూలోకంలో ప్రేమ ఆవిరైపోతూందని మా వాళ్లు చెప్పుకొంటూంటే విని ఇలా వచ్చాను. చూసి వెళ్దామని. ప్రేమకు ప్రతీతిగా ఉన్న బాలమన్మథుడినని.. చెబుతూ 'నేను నీ దగ్గర కూర్చోవచ్చా?' అడిగాడు.
'అయ్యో...!' నొచ్చుకొంటూ కొద్దిగా జరిగి, సిమెంట్‌ బెంచీ మీద చోటిచ్చాడు.
పల్లీలమ్ముకునే వాడు వెళ్తుండగా, 'తీసుకుంటారా?'' అని అడిగాడు. లేదన్నట్లు తల తిప్పాడు.
'మన్మథా! నువ్వు నా దగ్గరికెందుకొచ్చావ్‌?' అడిగాడు.
'నువ్వు కథలు రాసే రచయితవని తెలిసింది. సహృదయుడివి. సహానుభూతి కలవాడివి. కథల పాత్రలకు ప్రాణం పోసేవాడివి. అందుకే నేను నీ దగ్గరికి పంపించబడ్డాను. నువ్వు ప్రేమకథలు రాయాలి'
'నేనెన్నో ప్రేమ కథలు రాశాను. రాస్తూంటాను.'
'నువ్వు నీకు తోచినవిధంగా రాశావు. ఇప్పుడు నేను చెప్పే పాత్రలపై నీ కలాన్ని నడిపించు.'
ఓ చేతిలో, ఫ్లాస్క్‌లో టీ పట్టుకొని మరో చేతిలో చిన్న చిన్న రెండు మూడు గుటకలేసుకునే ప్లాస్టిక్‌ కప్పులతో వెళ్లసాగాడో వ్యక్తి.
అతని వైపు సైగ చేసి 'తీసుకొంటారా?' అన్నట్లు సైగ చేసి అడిగాడు.
'మాకలాంటివి అనవసరం.' అన్నాడు
'ఓకే మీరు చెప్పే పాత్రలను సృష్టిస్తాను. మీరు చెప్పే నేపథ్యంలో రాస్తాను.'
బాల మన్మథుడు రెక్కలు చాపి, క్షణంలో అక్కణ్ణుంచి మాయమైపోయాడు.

పెద్ద సిటీ. పెద్ద పేరున్న బార్సు అండ్‌ గర్ల్స్‌ కాలేజీ. పాత కాలేజీ. పెద్ద గార్డెన్‌. గుబురుగా పెరిగిన చెట్లు. విశాలమైన శాఖలు. పరుపులాంటి గాఢంగా ఉన్న పచ్చని గడ్డి లాన్‌. కాలేజీ క్లాసులతో ప్రారంభానికి ముందు, కాలేజీ వదిలేశాక కూడా ఆ చెట్ల కింద గంటల తరబడి కూర్చొని, ముచ్చట లాడుకునే యువతీ యువకులకు అదో విడిది. విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు కూడా లంచ్‌ సమయంలో అప్పుడప్పుడు అక్కడ సమయం గడిపేవారు.
'మనం ఇక్కడే చదివి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం. నేను వృక్షశాస్త్రంలో, మీరు జంతు శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో పట్టా తీసుకొన్నాం. మీరు తరచుగా చెప్పే పదంలా ఇది కూడా కాకతాళీయమేనా?' ఆమె నవ్వుతూ చెప్పినా ఆ గొంతులో ఏదో బాధలాంటిది ఉందని అతడు గమనించకపోలేదు.
మూడేళ్ల నుంచి ఇదే వరుస. ఇద్దరి మనసులో ఒకరంటే ఒకరికి అభిమానం. గుండె కుహరంలో ప్రేమ మొలచి వటవృక్షమైనా ఇద్దరూ ఏకం కావడం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి వాళ్ల వాళ్ల ఇంట్లో సమస్యలుంటూండేవి. అవి అయ్యాక చూద్దాం అనుకొంటూనే ఇన్నాళ్లూ గడిపేశారు. ఓసారి మతం, కులం, వర్ణం మరోసారి సాంఘిక అడ్డుగోడ, సామాజిక భయం, ఆందోళన, ప్రాణాపాయం. ఒకటేమిటి ఇలా చెప్పుకొంటూంటే హనుమంతుడి తోకలా అడ్డంకులెన్నో పెళ్లి చేసుకోవడానికి. కానీ ఒకరిని వదిలి ఒకరు బతకడం కష్టంగా మారింది. అంతవరకు ముదిరిపోయింది వారిద్దరి ప్రేమ వ్యవహారం. విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి పారిపోవడమో, రిజిస్టర్డ్‌ మ్యారేజ్‌ చేసుకుందామనో అనుకోలేదు. పరిస్థితులను ఎదురించుదాం.. కుటుంబాలకు నచ్చజెప్పుదామని నిర్ణయించుకొన్నారిద్దరు.
ఆమెది సంప్రదాయ కుటుంబం. అతనిది మధ్యతరగతికి చెందిన కుటుంబం. వారిద్దరి మధ్య సమాజపు కట్టుబాట్ల వారధి తెగిపోయింది. వారిద్దరు చేరుకోవలసిన గమ్యానికి దారిలేదు. ఇద్దరు కలసి జీవించడానికి, ఉన్నతమైన స్థలానికి చేరుకోవడానికి నిచ్చెన మాత్రం ఉంది. కానీ అది పాము-నిచ్చెన ఆటలా అనిపిస్తుంది. ఆశ మాత్రం వదులుకోలేదు.
ఆమె లతలా ఉంటుంది. స్వర్ణ దేహచ్చాయ. ఉంగరాల జుత్తు. కోల మొహం. అందమైన కళ్లు. దానిమ్మ మొగ్గల్లాంటి పెదాలు. చూపరులకు ఇట్టే ఆకర్షించబడే దేహవర్చస్సు. అన్నింటికి మించిన గుణం కలుపుగోలుతనం. మృదు మితభాషి.
అతడు కండరాలు తిరిగిన శరీరసౌష్టం కలిగి ఉన్నవాడు. ఎప్పుడూ లైట్‌ కలర్స్‌లో హాఫ్‌ బుషర్ట్‌, తరచుగా బ్లాక్‌ ప్యాంట్‌ వేసుకొంటూంటాడు. టక్‌ చేయడం మరవడు. కానీ బెల్ట్‌ పెట్టుకోడు. గోల్డెన్‌ ఫ్రేం కళ్లద్దాలు. మొహంలో ఓ కళ.
ఆమె బి.యస్సీ వాళ్లకు బోటనీ, అతడు జువాలజీ బోధిస్తాడు. ఇద్దరూ విద్యార్థులకు తలమానికంగా ఉంటారు. అతడు ఆమె లంచ్‌ వేళ కలుసుకున్నప్పుడల్లా మాట్లాడుతూ లవ్‌ కెమిస్ట్రీ వరకెళ్లి కన్‌ఫ్యూజ్‌ అయిపోతారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉందని మాత్రం గట్టిగా నమ్ముతారు. నోరు విప్పి చెప్పుకోలేక పోయినా బాడీ లాంగ్వేజ్‌ మాత్రం ఎప్పుడో ఒప్పేసుకుంది నువ్వు లేనిది నేను లేను. నేను లేనిది నువ్వు లేవని. చేతుల్లో చేతులేసి మాటిచ్చుకోలేకపోయినా తాము చేరుకోవలసిన గమ్యమేమిటో వారికి తెలియనిది కాదు.

బాల మన్మథుడు చీకటి పడుతూండగా, అప్పుడప్పుడే వెన్నెల తన రెక్కలను విప్పు కొంటూండగా తన రెక్కలను విచ్చుకొని, రచయిత కూర్చున్న సిమెంట్‌ బెంచి దగ్గరకు వచ్చాడు. అతని పక్కన కూర్చున్నాడు. అతడు ఉలిక్కిపడి చూశాడు. బాల మన్మథుడు చెప్పిన వృత్తాంతం విని, 'అనవసరంగా వారిద్దరి జీవితంలో తుపాన్‌ లేపావు. నా కథ చూడు.. నా పాత్రలు, ఓ కాలేజీలో ఇద్దరు పనిచేస్తూ అమితంగా ప్రేమించు కొంటున్నారు. పెళ్లి చేసుకొందామని ఓ చిన్న మలుపు తీసుకొచ్చి వాళ్లిద్దరిని ఒకటి చేయాలనుకొంటున్నాను. హ్యాపీ ఎండింగ్‌. తెలుగోళ్లకు హ్యాపీ హ్యాపీ ముగింపులు బాగుంటాయి. నీ పాత్రల ముగింపు ఘోరంగా ముగిస్తాయి.'
'ప్రేమలో ఇలాగే అవుతోంది'
'వారిద్దరి అంతస్తుల్లో ఎంత తారతమ్యం ఉందో చూశావా? నక్కకూ నాగలోకానికీ ఉన్నంత!'
'ప్రేమ అంటే ఇదే! దీన్నే ప్రేమ అంటారు!! సమస్త ప్రపంచానికీ తెలుసు ప్రేమ గుడ్డిదని.'
'ఈ రోజుల్లో ప్రేమ ఇంత గుడ్డిది కూడా కాదు!'
'ఏ రోజుల్లో అయినా...ఏ యుగంలో అయినా ప్రేమ ప్రేమే. అలాగే ఉంటుంది. ఈ ప్రేమలోనే రాజ్యాలు పొగొట్టుకున్నారు.. ప్రాణాలు కోల్పోయారు.'
'అంతవరకు బాగానే ఉన్నా, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఘోరాతి ఘోరమైన విషయం ప్రేమించట్లేదని యాసిడ్‌ మొహాలపై చల్లడం, బలత్కారాలు చేయడం పరిపాటి అయిపోయింది. కులమతాల వివక్ష పెచ్చుమీరిపోయింది. మరో విధంగా చెప్పాలంటే ప్రేమ-జ్వరం కామ-జ్వరమే! కామం చల్లారగానే చల్లగా జారుకొంటారు. ఆ తర్వాత అమ్మాయిలు నరకం అనుభవించాల్సిందే' రచయిత గొంతు కొద్దిగా కోపం మిళితమైంది.
'ఇది ప్రేమ కాదు. అమాయకులను వలలో వేసుకోవడమే. ప్రేమ బలాత్కారం కాదు బలిదానం. త్యాగానికి మారు పేరు. రెండు హృదయాల కలయిక. అదే ప్రేమ. ప్రేమ గురించి నేను ఇంకా నీకు చెప్పాల్సిందేమీ లేదు. నువ్వు రాస్తావు అంటే బాగా సాహిత్యం చదువుతావు. అందుకే నీకు ప్రేమ గురించి నేనెలాంటి ఉపోద్ఘాతం చెప్పదలచుకోలేదు. కానీ ఈ రెండు పాత్రలను ప్రేమ ఊబిలో తోసేసెరు. చూడు ముగింపు ఎలా ఉంటుందో...నీకో కథ వృత్తాంతం ఇచ్చాను.' అని రెక్కలను రెపరెపలాడిస్తూ కారు మబ్బుల్లోకెళ్లి మాయమైపోయాడు మన్మథుడు. చిన్నగా జల్లులు పడుతూంటే లేచి, ఇంటి మొహం పట్టాడు రచయిత, భారమైన వదనంతో.

కాలేజీ యాన్యువల్‌ ఫంక్షన్‌. పట్టణంలోని వివిధ కాలేజీల టీచింగ్‌ స్టాఫ్‌ ఆహ్వానించబడ్డారు. ఆమె అతిథులను ఆహ్వానించడానికై కాలేజీ మేనేజ్మెంట్‌ తరఫు నుంచి ఎన్నుకోబడింది. కాలేజీ గేట్‌కు దూరాన లేత అకుపచ్చ టొయోటా లెక్సెస్‌ కార్‌ ఓ చోట పార్క్‌ చేసి, కాలేజీ గేట్‌లో ప్రవేశించాడు. ఆమె అందించిన పూలగుత్తినందుకొంటూ తదేకంగా చూస్తూ రెండు చేతులు జోడించాడు.
'ఐ యాం అనిల్‌. చైర్మెన్‌ ఫర్‌ మల్టీ కాలేజెస్‌ ఆఫ్‌ రస్తొగి' అంటూ ముందుకెళ్లాడు. అతనికి ప్రతి నమస్కారం చేసి, 'మోస్ట్‌ వెల్కం సర్‌' అని అంది. హీరోలాంటి పర్సనాలిటీ అతనిది. ఎంత సింపుల్‌గా ఉన్నాడనుకుంది. విఐపీలకు కాలేజీ ప్రాంగణంలో ప్రత్యేకంగా కార్‌ పార్కింగ్లు ఏర్పాటు చేసి ఉన్నా వాటిని ఉపయోగించుకోలేదు!
సభ మొదలైంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆమె ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది...ఆమెకు పక్క సీట్లోనే అనిల్‌. యాధృచ్ఛికం. తన వాడి కోసం ఆమె కళ్లు చాలా వెదికాయి. కాని ఎక్కడా కనిపించలేదు.
అనిల్‌ మాటలు కలిపాడు ఆమెతో. కంఠం చాలా బాగుంది. నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. తన గురించి చెప్పుకొస్తున్నాడు. ఓ రెండుసార్లు తన అందం గురించి బాగా మెచ్చుకొన్నాడు. తను అతని వైపు ఆకర్షింపబడుతున్నట్లు ఫీల్‌ కాసాగింది. ఏదో శక్తి అనిల్‌ వైపు లాగుతూన్నట్లనిపిం చింది. తన ఆధీనంలో లేకుండానే అతని మొహం వైపే చూడాలనిపిస్తూందెందుకో?
అతని మాటల మధ్య సోషియాలజీలో డాక్టరేట్‌ అని తెలుసుకుంది. చిన్నప్పట్నుంచి బాగా కష్టపడి చదివాడు. పెత్తందారీ కులాలచే ఊర్లో బాధించబడ్డాడు. కానీ అవన్నీ పీడ కలగా భావించాడు.
అనిల్‌ తరచుగా ఏదో ఓ నెపంతో కాలేజీకి వస్తూండేవాడు. ఆమెతో తప్పక కలుస్తూండేవాడు. ఆమె అనిల్‌ను తన కోసం కాలేజీకి రాకూడదని ఎప్పుడూ వారించలేదు.
లంచ్‌ సమయంలో అమె అతనితో క్లాసు గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు అతని గురించి ఆరా తీశాడు. అమె చెప్పింది. అతడు వారించాడు. ఆగంతకులతో కలుపుగోలుగా ఉండడం మంచిదికాదని నచ్చజెప్పాడు. అమె తల ఊపింది. కానీ ఆమె మనసు ఎందుకో పదేపదే పరిపరివిధాల అనిల్‌ చుట్టే తిరుగాడుతుండేది. రాత్రిళ్లు నిద్రలేమిగా కాలేజీకి వస్తూండేది. అనిల్‌ను చూడగానే శరీరంలో విద్యుత్తు ప్రవహిస్తూన్నట్లుండేది. అతడు ఆమెలోని ఈ ప్రవర్తనలను గమనించకపోలేదు. అసహాయుడై పోయాడు.

ఆమెకు పెళ్లి కుదిరింది. తన సహోద్యోగితో కాదు. అనిల్‌తో కాదు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లి. ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. అనిల్‌తో జీవితం గడుపుతానని నిక్కచ్చిగా చెప్పింది. లబోదిబో మొత్తుకున్నారు. తలలు బాదుకున్నారు ఆమె ఇంటివాళ్లు. తమ పరువు బజారు పాలవు తోందని ఆమె కాళ్లూచేతులు పట్టుకున్నారు. అన్నలు వారించారు.. అయినా ఆమె అతన్నే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పింది.

సూర్యోదయం ఇంకా మబ్బుల్లోనే దోబూచులాడుకొంటుంది. గడ్డిపోచలపై మంచు బిందువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. రచయిత కూర్చున్న బెంచి తడిగా ఉన్నా అలాగే కూర్చున్నాడు. వేసుకున్న ట్రాక్‌ వెనుకభాగానికి కొద్దిగా తడిగా అనిపించింది. ఆదోరకమైన అనుభవం. రచయిత పెదాలు చిన్నగా కదిలాయి, హాయిగా అనిపించింది చల్లగా తాకినందుకు. తన మనసుకు కూడా ఇలాగే హాయినిస్తే ఎంతో బాగుండుననుకున్నాడు.
చేతిలో ఉన్న ఐ-ఫోన్‌లో యథాప్రకారం యూట్యూబ్‌లో లోకల్‌ వార్తలు వెతకసాగాడు. ఓ చోట వార్తలు వింటూ విస్మయం చెందాడు. సరూర్‌నగర్‌లో యువ జంట బైక్‌పై వెళ్తుండగా దారి కాచి, వారిపై తుపాకీ గోలీలు కాల్చారు. కాల్చిన వారు అమ్మాయి తాలుకు వారని, రివాల్వర్‌ గోలి తప్పి అబ్బాయికి బదులు అమ్మాయికి తగిలిందని తెలిసింది. అబ్బాయి షెడ్యూల్‌ కులానికి చెందినవాడని చెప్పుకొంటున్నారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ వివాహం అని, కులం గొడవని తెలుస్తోంది. కులదురహంకార హత్యగా భావిస్తున్నారని యాంకర్‌ చెపుతోంది.
గార్డెన్‌లో చిన్నగా చలిగాలి వీస్తున్నా రచయిత నుదురుకు చెమటలు పట్టసాగాయి. గబగబా మరో ఛానెల్‌ వెదికాడు ఇంకేమైనా వివరాలుంటాయేమోనని. అమ్మాయి సిటీలోని ఓ కాలేజీలో బోటనీ లెక్చరర్‌. షెడ్యూల్‌ కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది అమ్మాయి. కొత్తగా రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు.
రచయిత తలపట్టుకున్నాడు. కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. 'ఓ మైగాడ్‌' నోట్లోంచి వెలువడింది. అప్పుడే రెక్కల చప్పుడు పటపటామంటు తన ముందుకొచ్చి వాలాడు బాలమన్మథుడు. కోపంగా అతని వైపు చూశాడు. 'చూశావా?' అని కోపంగా అడిగాడు బాలమన్మథుడిని ఉద్దేశించి. 'నీ మూర్ఖపు ప్రయోగం ఓ అమాయకుడి ప్రాణాల్ని బలిగొంది.'
'నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్లు చేసిన నేరమేమిటి? ఒకరినొకరు ప్రేమించుకున్నారనేగా! దీనికి ఇంత ఘోరమైన శిక్షనా?'
'ఓ నా అమాయక ప్రేమ రాయబారి. ఈ రోజులు నువ్వనుకున్నట్లు ఆ రోజుల కావు! నువ్వు ప్రేమ ప్రచారం చేయడానికి ఇది మంచి సమాజం కాదు. తప్పుదోవ తొక్కావు. యూ నాక్డ్‌ ఏ రాంగ్‌ డోర్‌!' రచయిత కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి.
బొంగురు స్వరంతో, 'మాకు ప్రేమ కాదు విద్వేషం కావల్సింది. మేము చావదలుచుకున్నాం. జాతి-మతం పేరిట, హిందూ-ముస్లిం అధారంగా, ధనిక-బీద వర్గాల మధ్య, రాజకీయం పేరు మీద, కుల దురహంకార హత్యలు, విజృంభిస్తున్న పగ, విద్వేష భావజాలం మా నరాలలో ప్రవహిస్తోంది! మాలో బతకాలనే ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. నేను కేవలం ప్రేమకథలే రాస్తుంటాను. స్వయంగా నేను ఎవరినీ ప్రేమించను. మాకు మాత్రం ప్రేమ అవసరం లేదు.'
'అవును. నువ్వు చెప్పింది కరక్టే! నేనర్థం చేసుకున్నాను. ఈ నేలపై ప్రేమ విత్తనాలను జల్లుదామని నేను తొందరపడ్డాను. ఇక్కడ నా ఉనికి అనవసరం. నేను వెళ్లిపోతున్నాను.' అంటూ గట్టిగా తన రెక్కలను విప్పార్చి, కళ్లలో నీళ్లు నింపుకొని, క్షణంలో రచయిత కనులనుంచి కనుమరుగైపోయాడు బాల మన్మథుడు. మబ్బులను దాటి, భూ-ఆకర్షణను అధిగమించి శూన్యంలోకి.

అమ్జద్‌
73375 92686