Jul 30,2023 10:04

నేను శైలజ. అమ్మ బ్యాంకు మేనేజర్‌ కావడంతో ఎక్కువగా హాస్టల్లోనే ఉండేదాన్ని. నాన్న లేరు. అనూష, కావేరి నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇక నా గురించి అమ్మకు ఒకే ఒక్క భయం. నేను ప్రేమ పెళ్లి చేసుకుంటానని నా చిన్నతనంలో ఓ జ్యోతిష్యుడు చెప్పాడట. రోజూ వాకింగ్‌కి వెళ్లేదాన్ని. గ్రౌండ్లో చాలామంది అబ్బాయిలు క్రీడా కార్యకలాపాలలో శిక్షణ పొందేవారు. నేను అక్కడ్నుండి మాయమయ్యే వరకూ మా కాలేజీ సీనియర్‌ హర్ష నన్ను చూస్తూనే ఉంటాడు. ఓ రోజు చల్లగాలిని ఆస్వాదిస్తూ నడుస్తుంటే 'శైలు' అని పిలిచాడు. నేను ఆగిపోయాను.
'బ్రేక్‌ ఫాస్ట్‌ చేద్దామా?' అని అడిగాడు. నిజానికి హాస్టల్లో ఫుడ్‌ ఇష్టం ఉండదు. కానీ హర్షతో అంటే.. ఆలోచించి, 'సరే' అన్నాను బలహీనంగా.
'థాంక్స్‌' అన్నాడు. అతనితో ఏం మాట్లాడాలో నాకు తెలియదు. అతను ఒక అమ్మాయితో ఇంత క్లోజ్‌గా మాట్లాడటం ఇదే మొదటిసారని నేను ఊహించుకుంటున్నాను. అతను నాతో మాట్లాడుతుండగానే నా బ్రేక్‌ఫాస్ట్‌ ముగించాను. జ్యూస్‌ ఆర్డర్‌ ఇచ్చాడు.
'వచ్చేవారం కాలేజీకి సెలవు ఉంది కదా? ప్లాన్‌ ఏంటి?' అడిగాడు. నాతో చనువుగా మాట్లాడుతున్నాడు. కానీ నేను తొందరపడలేదు.
'ఏం లేవు' అన్నాను.
'గుడికి వెళ్లాలి అనుకున్నాను. నువ్వు నాతో వస్తావా?' అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను.
ఇంతలో ప్రియ అక్కడికి వచ్చింది. హర్షతో నేనెందుకు ఉన్నానో తెలుసుకోవాలనుకుంది. ప్రియ హర్ష క్లాస్మేట్‌. హర్షతో మాట్లాడి, వెళ్లిపోయింది. వచ్చిన జ్యూస్‌ తాగాను.
నా నంబర్‌ అడిగాడు. నంబర్‌ దాచిపెట్టడం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పకపోయినా అతను తెలుసుకోగలడు. నెంబర్‌ సేవ్‌ చేసుకున్నాక 'థాంక్స్‌ హర్ష' అని హాస్టల్‌కి వెళ్ళాను.
వచ్చేవారం నాలుగు రోజులు సెలవులు కావడంతో అమ్మ ఫోన్‌ చేసి ఇంటికి రమ్మంది. కాలేజీ లైబ్రరీలో పుస్తకాల కోసం వెతుకుతుండగా 'హారు శైలు' అని హర్ష నవ్వుతూ పలకరించాడు. 'నేను అడిగిన దాని గురించి ఆలోచించావా?' అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను.
'పర్వాలేదు. మళ్లీ ఎప్పుడైనా వెళ్దాం' అన్నాడు.
'నేను ఊరికి వెళ్ళాలి. ఒకటి చెద్దాం. నీతో పాటు గుడికి వెళ్లొచ్చాక, మా ఊరు వెళ్తాను' అన్నాను.
'సరే, గుడికి వెళ్ళాక నిన్ను నా కార్లో డ్రాప్‌ చేస్తాను!' అన్నాడు. అతని ఆలోచనకు సరే చెప్పాను.
ఉదయాన్నే అందమైన డ్రెస్‌ ధరించి, మెయిన్‌ గేట్‌ దగ్గర హర్ష కారు ఎక్కాను. 'హే, టైంకి వచ్చావు. నిజానికి చాలామంది అమ్మాయిలు టైంకి రారు' అన్నాడు. నేను నవ్వాను.
నాకు బాగా తెలిసినవాడిలా కబుర్లు చెబుతున్నాడు. నాకు ఇష్టమైన సాంగ్స్‌ ప్లే చేశాడు. చిన్న విషయాలే అయినా చాలా బాగున్నాయి. ఆలయ దర్శనానంతరం సంతోషంగా, హాయిగా అనిపించింది. హర్ష చెప్పకుండానే నాపై ప్రేమను చూపించాడు. అతని మాటల ప్రయాణంలో మునిగిపోయాను. నన్ను ఊరిలో దించాడు. నేను ఊహించిన దానికంటే మంచివాడు హర్ష.
ఫోన్‌ చేసేవాడు. అతనితో మాట్లాడితే టైం తెలియదు. నాలుగురోజుల తర్వాత హాస్టల్‌కి తిరిగొచ్చాను. హర్ష పరిచయం తర్వాత చాలా బాగుంది.
ఒకరోజు హర్ష బ్లూ సూట్లో కనిపించాడు. 'ఇంటర్వ్యూకి హాజరవుతున్నావా?' అడిగాను. అవునన్నాడు. ఆల్‌ ది బెస్ట్‌! నా క్లాస్‌ అయ్యాక నిన్ను కలుస్తాను.. గుడ్‌ న్యూస్‌ చెప్పాలన్నాను. థాంక్స్‌ చెప్పాడు.
ఆ సాయంత్రం ప్రియ తన బర్త్‌ డే పార్టీకి రమ్మంది. నన్ను పిలవడానికి హర్షే కారణమని గ్రహించాను. హర్ష జాబ్‌ వచ్చిందని నాతో చెప్పాడు. కంగ్రాట్స్‌ చెప్పాను.
రోజూ హర్షతో ఫోన్లో కబుర్లు చెప్పేసరికి ఒంటిగంట అయ్యేది.
'జాబ్‌లో చేరితే నా దగ్గర ఉండవు కదా?' హర్షతో కాలేజ్‌లో నడుస్తూ అన్నాను. ఒక్కసారిగా నా చెయ్యి పట్టుకుని, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అతను చెప్పిన దానికి కాదు, ఎలా స్పందించాలో తెలియక.
అతన్ని కలిసిన కొద్ది రోజుల్లోనే అతనితో ప్రేమలో పడ్డాను. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు అందంగా ఉంటుంది. కానీ అతని హృదయం నాకోసం కొట్టుకుంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. క్యాంపస్‌ రోడ్ల వెంట ఇన్ని జంటలు ఎందుకు నడుస్తున్నాయో ఆ రోజు నాకు అర్థమైంది.
హర్ష నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను ఎదురుచూస్తున్న క్షణం ఇది. నా కళ్లలోకి చూస్తూ 'ఐ లవ్‌ యూ' అన్నాడు. నాకు మేఘాలలో నడుస్తున్నట్లు అనిపించింది. సిగ్గు మొగ్గలేసింది. 'ఐ టూ లవ్‌ యూ హర్ష' అన్నాను. నన్ను హత్తుకున్నాడు.
హర్ష గురించి అమ్మకు చెబితే పెళ్లి విషయంలో తొందరపడొద్దంది. హర్ష పూణేలో ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు నన్ను కలిసి వెళ్లేవాడు. ఏడాది గడిచింది.
హర్ష తన తల్లిదండ్రులకు నన్ను పరిచయం చేస్తానన్నాడు. బ్లూ డ్రెస్‌ ధరించాను. కారు వెళ్తుంది. 'చీర కట్టుకుంటే బాగుండేది కదా, అమ్మకి సంప్రదాయాలు ఇష్టం' అన్నాడు.
'ఎప్పుడైనా చీర కట్టుకున్నానా? ఎలా కట్టాలో నాకు తెలీదు. మీ అమ్మ గారు చాలా మోడ్రన్‌ అన్నావు కదా!'
'అవును, కానీ ఆమె తన కోడలు సాంప్రదాయకంగా ఉండాలని ఆశిస్తోంది.'
'అవునా ఓకే' అన్నాను కోపంగా.
'శైలు నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి మా అమ్మకి తప్పకుండా నచ్చుతావు' అంటూ నా కోపాన్ని చల్లార్చాడు.
గుడికి చేరుకుని దేవుడిని దర్శించుకున్నాం. తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. అతని తండ్రి నన్ను స్వాగతిస్తూ చిరునవ్వు ఇచ్చాడు. అతని తల్లి నన్ను తల నుంచి పాదాల వరకు చూసింది.
'చీరలో వస్తే ఎంత బాగుండేది' మొహం మాడ్చి అడిగింది. నాకు లోలోపల పొగలు రేగాయి. హర్ష తండ్రి నా కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నాడు. అతని తల్లి చీర గురించి తప్ప, మరేమీ అడగలేదు. నేను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ కుదరలేదు. సంప్రదాయ దుస్తుల్లో అక్కడికి వచ్చిన ప్రియను హర్ష తల్లి అభినందించింది. హర్ష ఆ సందర్భంలో ప్రియను అక్కడకు పిలవడం నాకు అసలు నచ్చలేదు.
జరిగిందంతా నా ఫ్రెండ్‌కి చెప్పాను. 'ఆమె నీకు అత్త కాబోతుంది. ఇది ఇలాగే కొనసాగుతుంది!' అంది కావేరి.
'నిన్ను పూర్తిగా తెలుసుకున్నాక నీతో బాగానే ఉంటుందిలే' అంది అనూష.
నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అతని తల్లి హ్యాపీగా లేదు. ఆమె ప్రియలాంటి అమ్మాయిని కోరుకుంటుంది.
'ఏంటి డల్‌గా ఉన్నావు?' హర్ష నన్ను కలిసినప్పుడు అడిగాడు. ఏమి జరిగిందో స్పష్టంగా తెలిసినప్పుడు ఈ ప్రశ్న ఎలా అడగగలిగాడు? అనుకున్నాను.
'ఏమైంది?' గట్టిగా అరిచాడు.
'నీతో జీవితాన్ని సాగించలేను. నా హృదయాన్ని చంపుకోలేను' అన్నాను.
'ఇది అర్థంలేనిది. ఇంట్లో అందరూ నిన్ను ఆహ్వానించారు కదా!'
'మీ అమ్మ సంగతేంటి?'
'నేను నిన్ను ఇష్టపడుతున్నాను, గౌరవిస్తాను. ఇది నా జీవితం. నాకు నువ్వు కావాలి. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు' అని వేడుకున్నాడు.
'నీకు నచ్చినట్లే నడుచుకున్నాను. కానీ మీ అమ్మకి నేను నచ్చలేదు. రేపు ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తావు?'
'నీకు ఏ సమస్యా రానివ్వను నన్ను నమ్ము!' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కన్నీళ్లకు నేను కరిగిపోయాను.

రెండేళ్ల తర్వాత సంతోషంగా లేను. హర్షతో నేను ఊహించిన జీవితం లేదు. అతను ఈ విషయాన్ని గ్రహించాడా?
మా పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి రోజున హర్ష వాళ్ల అమ్మ సీన్‌ క్రియేట్‌ చేసేవరకూ బాగానే ఉంది. తినడానికి పిలవలేదని, నచ్చిన రంగు చీర పెట్టలేదని మా అమ్మతో గొడవ చేసింది. ఆ రాత్రి నేను చాలా ఏడ్చాను.
మా హనీమూన్‌ కూడా సరిగ్గా జరగలేదు. రోజుకి ఒక్కసారైనా అత్తయ్యతో ఫోన్లో మాట్లాడమని హర్ష నన్ను కోరేవాడు. ఫోన్‌ చేయకపోతే, హర్షకి అత్తయ్య నుంచి కంప్లెంట్‌ వెళ్లింది.
'ఈ రోజు అమ్మకు ఫోన్‌ చేయలేదా?' అడిగాడు.
'నా తప్పుల గురించి, నా కులం గురించి, మా అమ్మ గురించి ఏదో ఒకటి అంటారు. అయినా ఇది హనీమూన్‌. నేను నీతో ఉన్నాను కదా ఆమాత్రం అర్థం చేసుకోలేరా?'
'శైలు, మాది మంచి ఫ్యామిలీ. నువ్వే సర్దుబాటు చేసుకోవాలి' అన్నాడు. నా బాధ అతనికి అర్థం కాలేదు.
హర్ష ఉద్యోగం మానేసి, తన తండ్రి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. హర్ష ఆఫీసులో అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు.
'హర్ష, ఈ వీకెండ్‌ సినిమాకి వెళ్దామా?' అని అడిగాను.
'లేదు, మనం అమ్మతో కలిసి ఫంక్షన్‌కి వెళ్లాలి' అన్నాడు.
'మీకు ఫ్యామిలీ ఫంక్షన్లకు టైం ఉంటుంది. నా కోసం ఉండదు. మీ అమ్మకి, ఇతరులకు ఇస్తున్నట్లుగా నాకు కొంత టైం ఇవ్వండి. కనీసం వారానికి ఒక్కసారి' అన్నాను.
'నువ్వు నన్ను అర్థంచేసుకోవు. ఇబ్బందిగా ఉంటే కొద్దిరోజులు మీ అమ్మ దగ్గరకు వెళ్లు' అని బయటకు వెళ్లాడు.
అనూష, కావేరిని రెస్టారెంట్లో కలిశాను. అద్భుతంగా ప్రారంభమైన నా లైఫ్‌ ఇప్పుడు చిక్కుల్లో ఉందనిపిస్తుందని వారికి చెప్పాను.
'హర్ష అప్పటి వ్యక్తి కాదు. అప్పుడు ప్రేమించేవాడు, పట్టించుకునేవాడు. నా మనసులో ఏం ఉందో తెలుసుకునేవాడు. ఇప్పుడదంతా లేదు. ఈ మధ్య మాట్లాడటమే మానేశాడు'
'వ్యాపారంలో ఏదైనా సమస్యా?' అడిగింది కావేరి.
'అది బానే ఉంది. నా విషయంలో ప్రతిదీ తన తల్లి సలహా తీసుకుంటాడు. ఇది వివరంచడం కాస్త కష్టం' అన్నాను. ఇంతలో హర్ష ఫోన్‌ చేశాడు.
'ఎక్కడున్నావు శైలు?' అన్నాడు.
'ఆఫీస్‌ కొలీగ్స్‌తో లంచ్‌ చేస్తున్నాను'
'ఎందుకు వేరే వాళ్ళతో స్నేహంగా ఉంటావు. అది నాకు నచ్చదు.'
'నువ్వు చాలా మందితో స్నేహంగా ఉంటావు. అందుకని ఎప్పుడైనా ప్రశ్నించానా. నన్ను అర్థం చేసుకోవడానికి ఏంటి సమస్య?' అన్నాను. కాల్‌ కట్‌ చేశాడు.
'ఏమైంది శైలు?' అడిగింది అనూష.
'నా ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌తో పరిచయాన్ని తగ్గించుకోవాలని, జాబ్‌ మానేసి ఇంట్లోనే ఉండి పనులన్నీ చేయాలని హర్ష, అత్తయ్య కోరిక. మా సైడ్‌ కోడలు ఇలానే ఉండాలంటారు. అతని తల్లి నేను తన చుట్టూ ఉండాలని కోరుకుంటుంది.. తద్వారా ఆమె మాట్లాడటానికి, నాలో తప్పులు కనుగొనడానికి. ఈ వ్యక్తి తన తల్లి చేతిలో కీలుబొమ్మ మాత్రమే' అని చెబుతుంటే.. హర్ష మళ్లీ ఫోన్‌ చేశాడు.
అతను తన ఫోన్‌ పోరాటం కొనసాగిస్తాడు. లిఫ్ట్‌ చేయకపోతే, మరో సీన్‌ చేస్తాడు. నా జీవితం ఇలా సాగుతోందని వారితో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లాను.
పెళ్లికి ముందు, తర్వాత కొన్ని నెలల వరకు హర్షని చూస్తే నా ముఖం పువ్వులా వికసించేది. ఒకే పైకప్పు కింద గడిపేందుకు ఆరాటపడేవాళ్ళం. ఇప్పుడు అతను దూరంగా ఉంటే కాస్త రిలీఫ్‌ అనిపిస్తుంది. అతని తల్లి నిరంతర విమర్శలు, అతని నిరంతర పోరాటంతో చాలా విసిగిపోయాను. పెళ్లికి ముందు అన్నీ చెప్పేవాడు. ఇప్పుడు నాకేమీ చెప్పడం లేదు.
'ఈ రోజు గుడికి వెళ్దామా హర్ష?'
'పని మీదా బయటకు వెళ్తున్నాను. రేపు వెళ్దాం'
'ఈ రోజు నా పుట్టినరోజు'
'పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ గిఫ్ట్‌ ఏంటి?'
'అత్తయ్య ఇచ్చారు. కానీ నా పుట్టినరోజు నీకు గుర్తులేదు'
'అలా ఏం లేదు. నీకు అమ్మ మంచి గిఫ్ట్‌ ఇచ్చింది కదా!'
'నీ గురించి అడుగుతున్నాను. మీ అమ్మ గురించి కాదు. అయినా ముందు తిట్టి, ఇప్పుడు గిఫ్ట్‌ ఇస్తే నా మనసు సంతోషపడుతుందా?'
'ఇక్కడ బాధగా అనిపిస్తే, మీ అమ్మ దగ్గరికి కొన్ని రోజులు వెళ్లు'
'అలా ఎన్నిసార్లు వెళ్ళిపోమంటావు?'
'సారీ. ఇక ఏం అనను హ్యాపీగా ఉండు' అని ఆఫీసుకు వెళ్లాడు.
ఓ రోజు సాయంత్రం హర్ష అక్క కల్పన ఇంటికి వచ్చింది. నేను, అత్తయ్య, కల్పన కాసేపు మాట్లాడుకున్నాం. నాకు నిద్ర రావడంతో వాళ్ళకి చెప్పి పడుకున్నాను. కాసేపయ్యాక హర్ష వచ్చిన శబ్దానికి మెలకువ వచ్చింది.
నన్ను చూసి 'ఇప్పుడు నిద్ర అవసరమా? అక్క వచ్చింది, ఆమెతో కాసేపు మాట్లాడితే బాగుండేది కదా' అన్నాడు.
'అయ్యో, నాకు తలనొప్పిగా ఉంది. అప్పటికీ వాళ్ళతో మాట్లాడే పడుకున్నాను. నీకు చెప్పలేదా వాళ్ళు. నాకు సరిగ్గా నిద్రపోకపోతే తలనొప్పి వస్తుందని నీకు తెలియదా?'
'ఒక రోజు నిద్ర లేకుంటే ఏమీ కాదు. మా అమ్మ నీకంటే పెద్దది. ఆమెకు ఉన్న ఓపిక నీకు లేదు' అన్నాడు.
'ఆమె మధ్యాహ్నం నిద్రపోతుంది. నేను అలా కాదు. ఈ రోజు ఆఫీసులో, ఇంట్లో పని ఎక్కువగా ఉంది'
'ఫ్యామిలీకి తోడుగా ఉండాలి. అలా మాట్లాడకు' అన్నాడు హర్ష
'హర్ష, నాకు నీతో సమయం గడపాలని ఉంది. నువ్వు బిజీగా ఉంటావు. నా కోసం టైం ఇచ్చి, ఆపై నా నుండి డిమాండ్‌ చేయి' అన్నాను. హర్ష కోపంగా వెళ్ళిపోయాడు. అతని మాటలతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేశాను.
చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన మామయ్య నన్ను చూసి 'ఏమైంది తల్లి?' అని అడిగాడు. 'హర్ష నాతో సమయం గడపడటం లేదు. ఎవరితో స్నేహం చేయొద్దని, జాబ్‌ మానేయమని గొడవ చేస్తారు. చాలా సార్లు ఓర్చుకున్నా ఏదో ఒక విధంగా గొడవ పడాలని చూస్తుంది అత్తయ్య. పెళ్లికి ముందు మా ఫ్యామిలీతో ఏ సమస్యా ఉండదని హర్ష చెప్పాడు. కానీ ఇక్కడ నేను బానిసగా భావిస్తున్నాను' అని అన్నాను.
'నా భార్య ఏదీ అంత ఈజీగా నమ్మదు. హర్ష అంటే ఆమెకు పిచ్చి ప్రేమ. నువ్వు వచ్చేదాకా ఆమే అతని ప్రపంచం. ఇరవై ఏడేళ్ల బంధాన్ని తెంచుకోవడం కష్టం' అన్నాడు.
'నేను కూడా అతనితో జీవించడానికి ఇరవై ఐదు సంవత్సరాల నా ఇంటిని విడిచిపెట్టాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తన తల్లికి నచ్చిన వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాడు.'
'వైజాగ్లో వ్యాపార పనులు ఉన్నాయి. మీ అత్తయ్యతో అక్కడకి వెళ్తాను. అప్పుడు హర్ష నీవైపు కాస్త మనసు మార్చుకుంటాడు' అన్నాడు.
వైజాగ్‌కి వెళ్లిపోయారు. ఇప్పుడు నా జీవితం కొత్తగా ఉంటుందని చిన్న ఆశతో ఉన్నాను.

ఆ తరవాత హర్ష కనీసం ఒప్పుకోకపోయినా నేను చెప్పేది వినేవాడు. పెళ్లయ్యాక హ్యాపీగా లేనని చెబితే నవ్వి ఊరుకున్నాడు.
ఓ రోజు నా కొలీగ్‌ అంజలి బర్త్‌డే వల్ల ఆలస్యంగా వస్తానని హర్షతో చెప్పాను. వెంటనే ఆఫీస్‌కి వచ్చి, 'బయటకి వెళ్దాం పదా!' అన్నాడు. పార్టీ తర్వాత వెళ్దామన్నా అంగీకరించలేదు. నాకు కోపం వచ్చి ఆఫీసులోకి వెళ్లాను.
హర్షతో అలా అనడం కరెక్ట్‌ కాదని తెలుసు. కానీ అతను ఒప్పుకోవడం లేదు. నేను ఒకరోజు ఆలస్యగా వెళ్తే తప్పేంటి? నాపై అనుమానమా?
బర్త్‌డే పార్టీ జరుగుతుంది. హర్ష ఫోన్‌ చేసి 'నువ్వు నా మాట వినట్లేదు. అమ్మ చెప్పింది నిజమే'
'చాలు హర్ష. నాకు అర్థమైంది. దీని వెనుక ఉన్నది మీ అమ్మ'
'అమ్మని ఏం అనకు'
'నేను ఆమెను ఎప్పుడూ ఏం అన్లేదు. ఓకే కూల్‌. వచ్చాక మాట్లాడతాను' అని ఫోన్‌ పెట్టేశాను. చాలా ఏడ్చాను. హర్ష నిజమైన కారణం చెప్పి ఉంటే పార్టీకి వచ్చేదాన్నే కాదు. కానీ అతనికి కావలసింది నా నుండి గుడ్డి విధేయత. నా భావాలను కూడా గౌరవించడు.
పార్టీ తర్వాత ఇంటికి వచ్చాను. హర్ష తలుపు తీయలేదు. ఫోన్‌ చేస్తే బిజీ. ఇరవై నిమిషాల తర్వాత తలుపు తెరిచాడు.
'కాస్త లేటుగా వస్తానని చెప్పాను కదా. నేను క్షేమంగా వచ్చానా లేదా అని కూడా పట్టించుకోవా? నాకు ఏ రక్షణ ఉంది ఇక్కడీ పైగా చాలాసేపు బయట నిల్చోబెట్టావు'
'ఫోన్లో బిజీగా ఉన్నాను'
'మీ అమ్మతోనేగా ఫోన్‌ మాట్లాడుతున్నావు' అంటూ ఏడ్చేశాను. అతను మౌనంగా ఉన్నాడు. నేను గదిలోకి వెళ్లి తలుపు వేశాను. అమ్మకి ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పాను. ఏడవకు, హర్షతో తర్వాత మాట్లాడతానని ఇంటికి రమ్మంది. ఇరవై నిమిషాల తర్వాత హర్షకి చెప్పి, అమ్మ దగ్గరికి వెళ్ళాను.
నిజానికి నేను చాలా అలిసిపోయాను. హర్ష ఒక్కసారి ఫోన్‌ చేశాడు అంతే. నేను లిప్ట్‌ చేయలేదు.
హర్ష దగ్గరకు వెళ్ళమని మమయ్య నాకు నచ్చజెప్పాడు. కానీ హర్ష నాపై జాలి చూపలేదు. నేను ఫోన్‌ చేస్తే కట్‌ చేసేవాడు. అమ్మ హర్షని బతిలాడింది. కానీ ఒప్పుకోలేదు. నేనే హర్ష దగ్గరకు వెళ్లి క్షమించని అడిగాను. జాబ్‌ మానేసి ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో మంచిగా ప్రవర్తించమని చెప్పాడు. అన్నిటికీ ఒప్పుకున్నాను.
కొన్ని రోజులకి మళ్లీ కథ మొదటికి వచ్చింది. మగబిడ్డనే కనాలని అనేవారు. ఆడపిల్ల పుట్టడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకు నేను ఒప్పుకోలేదు. నాపై వారికి విపరీతమైన కోపం పెరిగింది. ఇక అక్కడ ఉండలేక మళ్లీ ఇంటికి వచ్చాను.
అతని షరతులతో మళ్లీ కలవమని చాలా మంది చెప్పారు. తనకు నచ్చినట్లు ఉంటేనే రమ్మని లేకుంటే వద్దన్నాడు హర్ష. కొన్ని గొడవల తర్వాత అతను విడాకుల పిటిషన్‌పై సంతకం పెట్టమన్నాడు. ఎంతో బాధని దిగమింగుకుని సంతకం చేశాను.

రోజులు గడుస్తున్నాయి. హర్ష జ్ఞాపకాలు చాలాసార్లు కన్నీళ్లు తెప్పించాయి. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని జాబ్‌కి అప్లరు చేశాను.
'మీ ప్రొఫైల్‌ మాకు నచ్చింది. మీరు హైదరాబాద్‌ బ్రాంచ్‌కి వెళ్ళాలి' ఇంటర్వ్యూలో హెచ్‌ఆర్‌ రామ్‌ అన్నారు. సరే అన్నాను.
కొత్త ఆఫీసు బాగుంది. రామ్‌ కనిపించి నవ్వాడు. నేను కూడా నా గతాన్ని చిరునవ్వుతో దాచేశాను.
ఆఫీస్‌ ఫ్రెండ్‌ ఝాన్సీ రూముకి షిఫ్ట్‌ అయ్యాను. మన హెచ్‌ఆర్‌ రామ్‌ పక్కింట్లోనే ఉంటారని ఝాన్సీ చెప్పింది. ఇంతలో వర్షంలో తడుస్తూ వచ్చాడు రామ్‌.
'మీరేంటి ఇక్కడీ' అన్నాడు.
'ఝాన్సీ రూమ్‌కి షిఫ్ట్‌ అయ్యాను'
'సరే. తడ్చిపోయాను తర్వాత మాట్లాడతాను' అని వెళ్లిపోయాడు.
అతని డిన్నర్‌కి సాయం చేయాలి అనిపించి, నేను ప్రిపేర్‌ చేసిన ఫుడ్‌ ఇచ్చాను. అతను థాంక్స్‌ చెప్పాడు.
ఆఫీసులో అందరూ నాకు మంచి స్నేహితులే. తెలియకుండానే మూడు నెలలు గడిచిపోయాయి. అప్పుడప్పుడు రామ్‌తో మాట్లాడేదానిని.
ఝాన్సీ ఊరెళ్లింది. ఒకరోజు గ్రౌండ్‌లో వాక్‌ చేస్తుంటే రామ్‌ కనిపించాడు. 'ఎలా ఉంది ఇక్కడీ' అన్నాడు. 'బానే ఉంది' అన్నాను.
'మీరు ఆఫీసులో బాగా పని చేస్తున్నారని మీ మేనేజర్‌ నాతో చెప్పారు. మీరు మంచిపేరు తెచ్చుకున్నారు' అన్నాడు. అతను నన్ను మెచ్చుకున్నందుకు నేను సంతోషించాను.
కావేరి ఒకరోజు కాల్‌ చేసి 'హర్ష ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ చూశావా?' అని అడిగింది. వెంటనే చూసి షాక్‌ అయ్యాను. ఏడుపు వచ్చింది. హర్ష ప్రియను పెళ్లి చేసుకున్నాడు. ఇది నేను జీర్ణించుకోలేకపోయాను. ఇద్దరూ హ్యాపీగా నవ్వుతున్నారు. ఆమె అతని చేతులు పట్టుకుంది. రామ్‌ నన్ను చూసి 'ఏమైంది శైలజా?' అన్నాడు. కానీ నా కన్నీళ్లు ఆగలేదు.
నీళ్ళు తాగమని ఇచ్చాడు. నా గతమంతా రామ్‌కి చెప్పాను. 'నాకే ఇలా ఎందుకు జరుగుతుందో?' అన్నాను.
'కొన్ని భరించలేము కానీ అంగీకరించక తప్పదు. గతాన్ని మర్చిపోయి, జీవితాన్ని కొత్తగా మార్చుకో' అన్నాడు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటారని నేనెప్పుడూ ఊహించలేదు.
మరుసటి రోజు కూడా ఏడుస్తూ కూర్చున్నాను. రామ్‌ వచ్చాడు. 'ఏడవడటం సరైంది కాదు. మీరు వర్క్‌లో బిజీ కావాలి. మిమ్మల్ని మీరు రిఫ్రెష్‌ చేసుకోండి. మీ జీవితాన్ని రీస్టార్ట్‌ చేయండి' అన్నాడు.
రామ్‌ నాకు ఫుడ్‌ చేసి ఇచ్చాడు. చాలా సాయం చేస్తున్నాడు. ఇది అతన్నుంచి ఆశించట్లేదు. కానీ ఆపలేకపోయాను. నన్ను ఒంటరిగా వదిలేయడం ఇష్టంలేక ఆఫీసుకి కూడా సెలవు పెట్టాడు.
'హర్షను ప్రేమించావు కాబట్టి పెళ్లి చేసుకున్నావు. కానీ హర్ష వాళ్ల అమ్మ చేతిలో కీలుబొమ్మ అని నీకు ముందే తెలుసు కదా?' అన్నాడు.
'హర్ష మారుతాడని అనుకున్నాను'
'ప్రేమ కారణంగా మీ జీవితంపై నమ్మకం కలగని రోజే పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్లికి ముందే ఆ బంధం అక్కడితో ఆపేసి ఉండాలి. బదులుగా మీరు అతనిని మార్చాలనుకున్నారు. మీరు అతని నిజస్వరూపాన్ని అస్సలు ప్రేమించలేదు' అన్నాడు. మౌనంగా ఉన్నాను.
'ఈ టైంలో ఇది చర్చించడం కరెక్ట్‌ కాదేమో. కానీ మీరు చేసింది మీ జీవితంలో ఉత్తమమైన నిర్ణయమని భావించినప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు' అన్నాడు. కన్నీళ్లు తుడుచుకున్నాను.
'రంగుల గురించి ఆలోచిస్తే, ఏ రంగైన మన మనసు మార్చేస్తుంది. నలుపు, తెలుపుని ఇష్టపడండి. శాశ్వతంగా ఉంటుంది' అన్నాడు.
'ఏం చెప్పాలో తెలియడం లేదు' అన్నాను.
'ముందు మంచి కాఫీీ తాగు' అని ఇచ్చాడు. ఆ కాఫీ తర్వాత నా జీవితం మారిపోయింది.
నాకు ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడం మొదలుపెట్టాను. నా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రామ్‌ చాలా సాయం చేశాడు. నేను ఎక్కడ మెరుగుపరచుకోవాలో సూచించాడు. రామ్‌ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు.
'ఈరోజు డిన్నర్‌కి రెస్టారెంట్‌కి వెళ్దామా?' రామ్‌ని అడిగాను. సరే అన్నాడు. నేను అడిగిన దేన్నీ కాదనడు. రామ్‌ నాకు నచ్చాడు. కానీ మళ్లీ కమిట్‌ అయ్యే ముందు టైమ్‌ తీసుకోవాలనుకున్నాను.
హర్షతో ఎందుకు వర్కవుట్‌ కాలేదో తెలియదు. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వడానికి, సాయం చేయడానికి అమ్మ, రామ్‌, ఫ్రెండ్స్‌ ఉన్నారు.
అందమైన జంటను చూసినప్పుడు భావోద్వేగానికి గురవుతాను. నా జీవితంలో రామ్‌లాంటి వ్యక్తి ఉండాలని అనుకున్నాను. నన్ను రామ్‌ ఒప్పుకుంటాడన్న నమ్మకం ఉంది.
ఈ రోజు నా బర్త్‌డే అని రామ్‌కి చెప్పలేదు. రెస్టారెంట్‌కి చేరుకున్నాం. సడన్‌గా 'హ్యాపీ బర్త్‌ డే టూ యు శైలు' అని నా వేలికి ఉంగరం తొడిగాడు. అతను నన్ను తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామ్‌తో నా కల నెరవేరింది. ఇది నా జీవితంలో నిజమైన బహుమతి.

రమేశ్‌ రాపోలు
90308 72697