డివోనియన్ పీరియడ్.. 38 కోట్ల (380 మిలియన్) సంవత్సరాలు.. ఈ కాలాన్ని పరిశోధకులు 'చేపల యుగం'గా అభివర్ణించే కాలం. ఈ కాలం చివరిలో నాలుగు కాళ్ళ ఉభయచరాలు కనిపించాయి. సైన్సు ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉంటుంది. కాకపోతే వందలు కాదు.. వేలు కాదు.. అక్షరాలా 38 కోట్ల సంవత్సరాల తరువాత.. ఒక జీవి గుండె బయటపడటం అందరికీ విచిత్రమే. జీవి అంతర నిర్మాణాలు మృదు కణజాలంతో నిర్మితమై, అతి సున్నితంగా ఉంటాయి. జీవి ప్రాణాధారమైన గుండె అన్ని కోట్ల సంవత్సరాలు భద్రపరచగలగడం మరింత ఆశ్చర్యం.. ఇంత ఆశ్చర్యపరుస్తున్న ఆ వివరాల్లోకి వెళితే..
అంతరించిపోయిన జీవజాతుల రహస్యాలను శోధిస్తున్న శాస్త్రవేత్తలకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో 'గోగో రాక్ ఫార్మేషన్' లో ఒక గుండె నమూనా దొరికింది. ఇది దాదాపు డెవోనియన్ కాలం నుండి సంరక్షించబడిన ప్రత్యేకమైన గోగో జాతికి చెందిన చేప శిలాజంగా పెర్త్‌లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భావిస్తున్నారు. కింబర్లీలో జరిగే పురాతన జాతి చేపల శరీర అవయవాలపై జరుగుతున్న పరిశోధనలకు ఇది ఒక వెలుగును నింపిందని చెప్పవచ్చు. ఈ శిలాజం అంతరించిపోయిన చేప జాతుల అనాటమీ గురించి అధ్యయనం చేయడానికి సరికొత్త ఆధారాలను అందించిందని పరిశోధకులు తెలిపారు. అదే జీవికి సంబంధించిన కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఇవి సొరచేప (షార్క్) అవయవాలను పోలి ఉండటం వారి అధ్యయనంలో తేలింది.
అంత పురాతన శిలాజం కావడంతో శాస్త్రవేత్తలలో ఉద్వేగం, ఉత్సాహం పెల్లుబికాయి. 'ఈ శిలాజం అంత భద్రంగా దాచబడటం నిజంగా అపురూపం' అని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గుండె శిలాజం అప్పటి మనిషి, ఇతర దవడ సకసేరుకాల వివరాలు, వాటి పరిణామం గురించి తెలుసుకునేందుకు ఆధారాలు ఇవ్వగలదని జచీజుు లోని ఒక నివేదిక తెలిపింది. ఈ గుండె 358 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఆర్థ్రోడైర్ కుటుంబానికి చెందిన చేపదని ఈ నివేదిక పేర్కొంది. దీని లక్షణాలను బట్టి ప్రస్తుతం ఉన్న రికార్డెడ్ సమాచారానికి సైతం చాలా సంవత్సరాలకు ముందే జీవించిన దవడ చేపగా గుర్తించారు.
ఇప్పుడు లభ్యమైన గుండె ఆకారంలో ఉండి, రెండు గదులను కలిగి ఉంది. కర్ణిక, జఠరిక. రెండూ సాధారణ స్థితిలో పక్కపక్కన కాక జఠరిక పైన కర్ణిక అమరి ఉంది. ఈ చేపల గుండె మొప్పల కింది భాగంలో నోటి లోపల ఉంది. సకశేరుకాల ప్రారంభ దశలో ఇటువంటి లక్షణాలు అభివద్ధి చెందినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇది జీవరాసుల శరీర పరిణామంలో అత్యంత ముఖ్యమైన దశ అయిన దవడల నిర్మాణానికి అనుగుణంగా తల, మెడ ఏర్పడటం ప్రారంభమైన ప్రత్యేక దశను విశదీకరిస్తుంది.
ఇప్పుడు బయటపడిన శిలాజ నిర్మాణంలో ఒక సంక్లిష్టమైన వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్న సొరచేపల మాదిరిగానే కాలేయం స్పాంజిలాంటి నిర్మాణంతో పెద్దగా ఉండి నీటిపైకి తేలికగా రావడానికి, ఈదడానికి ఉపయోగపడేలా ఉంది. నేడు కన్పిస్తున్న ఊపిరితిత్తుల చేపలు, బిర్చర్స్ వంటి కొన్ని అస్థి చేపలకు మూత్రాశయాల నుండి ఉద్భవించిన ఊపిరితిత్తుల ద్వారా నీటిలో వాటి కార్యక్రమాలు తేలికగా జరుపుకుంటున్నాయి. ఇంతవరకూ జరిగిన మా పరిశోధనలో అంతరించిపోయిన చేపలలో ఊపిరితిత్తులు ఉన్నాయని తెలిపేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. అవి తరువాతి కాలంలో క్రమేపీ పరిణామం చెందాయని ఈ శిలాజం సూచిస్తుంది. దవడలు లేని, దవడలు కలిగిన సకశేరుకాల మధ్య జరిగిన పరిణామక్రమం ఎంత సుదీర్ఘమైనదో తెలిపేందుకు ఈ ఆదిమ దవడ చేప వారధిగా ఉండటం, ఆ విషయం మొట్టమొదటిసారి మా పరిశోధనలో తేలడం మాకు చాలాచాలా ఆశ్చర్యము, ఆనందము కలిగాయ'ని కర్టిన్ యూనివర్శిటీకి చెందిన కేట్ ట్రినాజిస్టిక్ ఎంతో ఉద్వేగంతో చెప్పారు.
శిలాజ అధ్యయన శాస్త్రంలో ఇది 'చారిత్రాత్మకమైనద'ని ఫ్లిండర్స్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ లాంగ్ వ్యాఖ్యానించారు. 'దవడ సకశేరుకాల ప్రారంభదశకు, ప్రస్తుతానికి చాలా పెద్ద వైవిధ్యం ఉంది. అస్థిపంజర నిర్మాణం, మదువైన అంతర శరీర నిర్మాణ శాస్త్రంలో ఆ మార్పు కనిపిస్తుంది. మృదు కణజాల నిర్మితాలు అంత భద్రంగా కోట్ల సంవత్సరాలు భద్రపరచబడటం అధ్భుతమైన విషయమేనని జాన్‌లాంగ్ అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితమైతే ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయడం అసాధ్యమని, ఆధునిక టెక్నాలజీ సహకారంతో కాబట్టి పెళుసుగా ఉండే మృదు కణజాలాన్ని ఏమాత్రం చెదిరిపోకుండా అధ్యయనం చేయగలిగామని, ఆ అవకాశం మాకు దక్కటం మా అదృష్టమ'ని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.