
తనకెంతో ఇష్టమయిన పిన్ని శకుంతలని అమెరికా రప్పించుకున్న వారం రోజులకే, శాలిని ఇండియా వెళ్ళవలసి వచ్చింది. చావు బతుకుల్లో ఉన్న చిన్ననాటి స్నేహితుడిని చూడడానికి వెళ్ళడం, ఆమెకు అనివార్యం అయింది. తప్పని పరిస్థితుల్లో తన ప్రాణ స్నేహితురాలయిన దేదీప్య ఇంటిలో పిన్నిని విడిచి వెళ్లక తప్పలేదు. పదిరోజులపాటూ శకుంతలను ఇంట్లో ఉంచుకోవడం దేదీప్యకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ చిక్కంతా భర్త ప్రతీక్‌తోనే. అతనిది ఒక వింత మనస్తత్వం. తొందరగా ఎవరితోనూ కలవడు. అందుకే అతనికి స్నేహితులు చాలా తక్కువ. ప్రతిచోటా ప్రైవసీ కావాలంటాడు. ఖాళీ దొరికితే చాలు, తన గదిలోకి దూరిపోయి, పనిలో మునిగిపోతాడు. స్వంత భార్య కూడా, తలుపు కొట్టిన తర్వాతే గదిలోకి రావాలి. ఇంట్లో వాళ్లిద్దరే కాక మరో వ్యక్తి ఉండడానికి ప్రతీక్‌కి ఏమాత్రమూ ఇష్టం ఉండదు.
అతనలా తయారవ్వడానికి మొదటి కారణం.. హైదరాబాద్‌లో మొదటి వందమంది సంపన్నులలో ఒకరయిన, అతని తల్లితండ్రులు చేసిన గారాబం.. రెండవది అతని మేధస్సే.. అని దేదీప్య నమ్మకం. చెన్నై ఐఐటి లో గోల్డ్‌మెడల్ తెచ్చుకొని, ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో మంచి స్కోర్‌తో పాస్ అయి, సిలికాన్ వేలీలో ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రతీక్ హోదాను, తెలివితేటలను, అందాన్ని చూసి, దేదీప్య అతనితో ప్రేమలో పడిపోయింది. అతనితో కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఆనందంతో సర్దుకుపోతుంది. అందుకు అతని మీద ఉన్న అత్యంత ప్రేమ కారణంగా.
వచ్చిన గంటలోనే, ఐదు పడక గదులున్న భవంతినంతా కలియదిరిగింది శకుంతల. ప్రతీక్ పర్సనల్ రూమ్ మాత్రమే చూడలేకపోయింది. దానికి కారణం, ఆ గదికి నంబర్ లాక్ ఉండడం. దాని 'కీ' దేదీప్యకీ గుర్తురాకపోవడం. ఆ ఇంటిలో ఎడ్జస్ట్ అవడానికి శకుంతలకు చాలా తక్కువ సమయమే పట్టింది. దానికి ముఖ్యకారణం దేదీప్య కలుపుగోలుతనమే.
వచ్చిన కాసేపటిలోనే దేదీప్య వారిస్తున్నా వినకుండా అస్తవ్యస్తంగా ఉన్న వంట గదంతా సర్దేసి, వంట కూడా చేసేసింది. ప్రతి వీకెండ్‌కి రకరకాల రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం ప్రతీక్‌కి ఇష్టం. అలా కాకుండా ఇంట్లోనే, అతనికి ఇష్టం లేని వెజిటేరియన్ లంచ్ తినవలసిన పరిస్థితి రావడం, అతనికి బాగా కోపాన్ని తెప్పించింది. దేదీప్యది బాగా సర్దుకునే మనస్తత్వం కావడం వల్ల, ఇంట్లో ప్రతి నిర్ణయం అతనే తీసుకుంటాడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. వ్యతిరేకించడం సభ్యత కాదని, ముఖం మాడ్చుకుంటూనే భోజనం చేయడం ప్రారంభించాడు. శకుంతల చేసిన వంటలు నచ్చుతాయో లేదోనని దేదీప్య చాలా టెన్షన్ పడుతుంది. కానీ కాసేపటిలోనే ఆమెకు మంచి రిలీఫ్ వచ్చింది. శకుంతల చేసిన వంటకాలన్నీ మెచ్చుకున్నాడు. వాళ్ళమ్మ కూడా అలాగే చక్కగా చేస్తుందని చెపుతూ, ఆమె చేసిన వంటల లిస్టు ఏకరువు పెట్టాడు. ఇప్పుడు దేదీప్య మనసు ప్రశాంతంగా ఉంది. అయితే ఆ ప్రశాంతత తొందర్లోనే దూరమయింది.
గతంలో సైన్స్ టీచర్‌గానూ, హెడ్‌మిస్ట్రెస్‌గానూ శకుంతల పనిచేయడం వల్ల, ఇతరుల మీద అజమాయిషీ చలాయించడం, అవసరం ఉన్నా లేకపోయినా సలహాలు ఇవ్వడం, అవి పాటించేదాకా సతాయించడం మొదలయింది. దానికి తోడు ఆమె వాగుడు తట్టుకోవడమూ కష్టమేనని దేదీప్యకు ఆలస్యంగా తెలిసొచ్చింది.
'మీ పిన్నితో మహా ఇబ్బందిగా ఉందే. నువ్వు ఎప్పుడొస్తావు? రోజుకో సమస్య తెస్తుంది. ఛస్తున్నా. నాలుగు రోజుల క్రితం మా కాలనీ దగ్గర వేసిన పూల మొక్కలు బాగున్నాయని, అక్కడ సెల్ఫీ దిగింది. ఆ తర్వాత రోజు ఏమయిందో తెలుసా? మా పక్కింటి ఫ్రెడ్రిక్ కూతురు ఎంతో బాగుందని ఎత్తుకొని, ముద్దాడిందట. ఇక్కడి అమెరికన్లకు అలాంటివి నచ్చవని, ప్రైవసీ ఎక్కువని, నీకు తెలుసు కదా? వాళ్ళొచ్చి కంప్లైంట్ చేసారు. ఇది కాకుండా ఎక్కడ మొక్కలు కనిపించినా పీక్కుంటూ వచ్చి, మా ఇంట్లో పాతుతూ మురిసిపోతుంది. ఇది ఎవరి కంటైనా పడితే ఎంత ప్రమాదం? చెబితే వినిపించుకోవడం లేదు.
''ఇక్కడ క్యాన్సర్ పట్ల నిర్లక్ష్యధోరణి బాగా కనిపిస్తుంది. ఎండలో కార్లను వదిలేస్తే, డేష్ బోర్డ్‌లలోనూ, సీట్లలోనూ ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్ లాంటి హానికరమయిన కెమికల్స్ యొక్క వేపర్స్ కార్లోనే చేరతాయి. వాటిని మనం పీల్చుకోవడం వల్ల కేన్సర్ వస్తుంది. అందుకే బయల్దేరేముందు అద్దాలన్నీ పూర్తిగా తెరిచి, ఆ వేపర్స్‌ని బయటకు తోసేయాలి.
చాలా రెస్టారెంట్లలో వేడి ఆహారం ప్లాస్టిక్ పాత్రల్లోనే ఇస్తున్నారు. వేడి ఆహారం ప్లాస్టిక్‌తో చర్య చెందుతుంది. అందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది...!'' అంటూ ఆమె ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. అవన్నీ తట్టుకోవడమూ కష్టంగానే ఉంది.'
'అయ్యో.. అలా జరుగుతుందా? నేను నాలుగు రోజుల్లో బయల్దేరి, వచ్చేస్తున్నాను. టికెట్ ఇప్పుడే బుక్ చేసాను. అంతవరకూ ఓపిక పట్టు. మిమ్మల్ని ఇకపై ఇబ్బంది పెట్టవద్దని మా పిన్నికి గట్టిగా చెప్తానులే.!' అంది శాలిని.
ఆ మర్నాడే ప్రతీక్ నుంచి ఫోన్ వచ్చింది.. ఆఫీసులో బిజీగా ఉన్న దేదీప్యకి. 'ఈ టైంలో ఫోన్ ఏమిటి? అనుకుంటూ ఆశ్చర్యపడుతూ ఫోన్ అందుకుంది. 'ఒక లొకేషన్ షేర్ చేసాను. అర్జంట్‌గా అక్కడికిరా. టైం లేదు వెంటనే బయల్దేరు' అంటూ ఆర్డర్ వేసాడు.
కంగారుపడుతూ దేదీప్య బయల్దేరింది. పది నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. పార్కింగ్ జోన్‌లో ప్రతీక్ వేచి ఉన్నాడు.
'ఏమయింది? ఎనీ థింగ్ సీరియస్?' అడిగింది ఆదుర్దాగా.
'చెప్తా పద' అన్నాడు ముభావంగా. గంభీరంగా ఉన్న అతని ముఖాన్ని చూసి కాస్త భయపడింది. అక్కడున్న కెఫే వైపు దారితీస్తున్న ప్రతీక్‌ని అనుసరిస్తూ కంగారుగా అడుగులు వేస్తూ, కెఫేలో ప్రవేశించింది. అక్కడ ఒక టేబుల్ దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్న శాలినిని చూడగానే షాక్ అయ్యింది.
'చూసావుగా? పద!' అంటూ ఆమె చేయి పట్టుకొని, బయటకు లాక్కొచ్చాడు. అతని ముఖం ఎర్రగా కందిపోయి ఉంది.
'చూసావా నీ ప్రాణ స్నేహితురాలు ఎంత మోసం చేసిందో? నాకు ముందు నుంచీ తను ఇష్టం లేదు. నా మీద ఏవో చాడీలు చెప్పేది కదా నీకు? ఇప్పుడు నిజం తెలిసిందా? ఎందుకిలా చేసింది? వాళ్ళ పిన్నిని మనింట్లో ఎందుకు పెట్టింది? దీని వెనుకున్న డ్రామా ఏమిటి?'
'నిజమే ప్రతీక్. దాన్ని నమ్మి, ఘోరంగా మోసపోయాను. నేనంతా చూసుకుంటాను. ఓ! ఈ రోజు సాయంత్రమే కదా నువ్వు న్యూయార్క్ బయల్దేరేది? నువ్వు నిశ్చింతగా వెళ్లిరా. నేను చూసుకుంటాను. ఈ రోజు రాత్రే అంతా తేల్చేస్తాను' అంటున్న దేదీప్య మాటల్లో కనిపించిన కరుకుదనానికి అతనికి నమ్మకం కలిగిందో ఏమో, 'దట్స్ గ్రేట్. నేను ఆఫీసు నుంచే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతాను. ఆల్ ది బెస్ట్!' అంటూ ఆమె భుజం తట్టి, కారెక్కాడు.
ఆఫీసు నుంచి బయల్దేరేముందు దేదీప్య, శాలినీకి ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ అని తెలియడంతో కోపంగా పళ్ళు నూరింది. రెండు మూడు సార్లు ఫోన్ చేసినా అదే పరిస్థితి. 'సరే ఇంటికెళ్ళి శకుంతల పని పడతాను' అని కసిగా అనుకుంటూ ఇంటికి బయల్దేరింది.
ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమెకు మతి పోయింది. 'తాళం గులాబీ మొక్క ఉన్న కుండీలో ఉన్నాయి!' అని తెలుగులో రాసి ఉన్న కాగితం తలుపుకు అంటించి ఉంది. దాంతో ఆమెకు కోపం నషాళానికి అంటింది.
తలుపు తీసి లోపలకి వెళ్ళగానే హల్లో స్పష్టంగా కనిపించేలా ఒక చార్ట్ వేలాడదీసి ఉంది. దాని మీద ఇలా రాసి ఉంది.
'సారీ డియర్,
నా మీద పీకలదాకా కోపం ఉంది కదా? ఇదంతా నీకోసమే చేసాం. రేపటి వరకూ కాస్త ఓపిక పట్టి, వేచి ఉండు. రేపు మనకి పబ్లిక్ హాలిడే కదా? ఇంట్లోనే ఉండు. నేను, పిన్ని మీ ఇంటికి వచ్చి, అన్ని విషయాలు వివరంగా చెప్తాం.!
ప్రేమతో..
శాలిని'
మర్నాడు ...
న్యూయార్క్ వెళ్ళిన ప్రతీక్, తనున్న హోటల్ రూమ్‌లో తన క్లయింట్లతో మాట్లాడుతున్నాడేగానీ అతని మనసంతా దేదీప్య మీదే ఉంది. 'ఏం జరిగి ఉంటుంది? శాలిని ప్లాన్ ఏమిటి? దేదీప్య ఇంకా ఫోన్ చేయడం లేదేమిటి?' అనుకుంటూ ఉన్నాడు. గంట గడిచినా ఫోన్ రాకపోయేసరికి తనే ఫోన్ చేసాడు. ఎంగేజ్ వచ్చింది. మరో అరగంట తర్వాత ఫోన్ చేస్తే, 'ఐ విల్ కాల్ యు బాక్' అని మెసేజ్ వచ్చింది. మరో రెండుసార్లు ఫోన్ చేసినా అదే పరిస్థితి. అతనికి చాలా చిరాగ్గా ఉంది. అసహనంతో పిచ్చెక్కేలా ఉంది. సరిగ్గ్గా అదే సమయంలో చడీ చప్పుడు లేకుండా పోలీసులు అతని గదిలోకి వచ్చి, చేతికి సంకెళ్ళు వేసారు. ప్రతీక్‌కి దిమ్మ తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు.
'ఇదిగో దీని కోసమే ఇంతవరకూ ఆగవలసి వచ్చింది. ఇది మీ శ్రీవారి నిర్వాకం!' అంటూ మొబైల్‌లో ఉన్న వీడియో చూపించింది. ఆ వీడియో చూడగానే దేదీప్యకు దిమ్మ తిరిగిపోయింది. కాస్సేపు మాట్లాడ లేకపోయింది. తేరుకున్న తర్వాత 'మై గాడ్? ఏం జరిగింది? ప్రతీక్‌ని పోలీసులు అరస్ట్ చేయడం ఏమిటి? ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది కదా?' అంటూ గాభరాగా అడిగింది.
ఆమె పక్కనే కూర్చుని, అనునయిస్తూ చెప్పడం మొదలుపెట్టింది శాలిని.
'అదే అతని నిజస్వరూపం. అన్నీ ఆధారాలతో చూపాలనే ఇంత శ్రమపడ్డాం. ఇంతకాలం వెయిట్ చేసాం. అంతా వివరంగా చెప్తా విను. కేవలం రెండు నెలల పరిచయంతోనే ప్రతీక్‌తో నువ్వు పెళ్ళికి సిద్ధమయిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకో అతనన్నా, అతని మాటలన్నా నాకు సదభిప్రాయం కలిగేది కాదు. అతని మాటలు నమ్మాలని అనిపించేది కాదు. నీకు చెప్దామన్నా నువ్వు వినిపించుకొనే స్థితిలో లేవు. అందుకే నేనే స్వంతంగా ఆరా తీయడం మొదలుపెట్టాను. ముందుగా చెన్నై ఐఐటి లో ఎంక్వైరీ చేయించాను.. అతని గోల్డ్‌మెడల్ పురస్కారం గురించి. ఆ బ్యాచ్‌లో అతని పేరే కనబడలేదని తెలిసింది. దాంతో నా అనుమానం నిజమని తెలిసాక, చాలా విషయాలు తెలుసుకున్నాను. అతనిక్కడొక చిన్న కంపెనీలో డెవెలపర్‌గా పనిచేస్తున్నాడు. అతనికొచ్చే జీతం నీ జీతంలో మూడో వంతు కూడా ఉండదు. మరి ఇంత రిచ్‌గా ఎలా ఉంటున్నాడు? ఆ దిశగా ఆలోచిస్తే, అతను ఏవో ఇల్లీగల్ పనులు చేస్తూ బోలెడంత డబ్బు గడిస్తున్నాడని నాకు అనుమానం వచ్చింది. కానీ దానికి ఆధారాలు కావాలి కదా? అందుకే పిన్నితో కలిసి ఇలా నాటకం ఆడాను. అప్పటికి నా దగ్గరున్న ఆధారాలతో నీ కళ్ళు తెరిపించి, విడాకులు ఇప్పించేయవచ్చు. కానీ అది అంతటితో ఆగదు. మరొక అమ్మాయిని మోసం చేస్తాడు. అందుకే వాడిని కట కటాల వెనక్కి తోయించాలని పంతం పట్టాను.
మా పిన్ని మీ ఇంట్లో చేరాక ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి. ఆ విషయాలన్నీ పిన్ని చెపితేనే బాగుంటుంది' అంటూ ఆపింది శాలిని.
'ప్రతీక్ తల్లితండ్రుల స్థాయికి ఇంటినిండా నౌకర్లే ఉంటారు కదా? వంట వాళ్ళమ్మ చేయడం ఏమిటి? అని సందేహం వచ్చింది. పోన్లే అప్పుడప్పుడు సరదాగా వంట చేస్తూ ఉంటుందేమోనని సరిపెట్టుకున్నాను. అయితే అతను చెప్పిన జాబితాలోని వంటలన్నీ పక్కా పల్లెటూరి వంటలే. దాంతో మా సందేహం మరింత బలపడింది. అతని తల్లితండ్రులు హైదరాబాదులో ఉండే సంపన్నులు కాదని, పక్కా పల్లెటూరి వారై ఉంటారని మాకు అనుమానం వచ్చింది. అతని వివరాలు తెలియాలంటే అతని గదిలోకి వెళ్లి తీరాలని అర్థమయింది. అందుకే ఒక ప్లాన్ వేసాం. ప్లాన్‌లో భాగంగా మీరిద్దరూ ఆఫీసుకు వెళ్ళాక ప్రతీక్ రూమ్‌కి ఎదురుగా ఒక సీక్రెట్ కెమెరా అమర్చాను. దాని ద్వారా కీ కోడ్ నెంబర్ తెలుసుకున్నాం. తర్వాత, అతని రూమ్ తెరిచి, అక్కడ కూడా కెమెరా పెట్టాను. దాని సహాయంతో అతని పాస్‌వర్డ్ తెలుసుకోగలిగాను. దాంతో మొత్తం బండారం బయటపడింది. శాలిని ఊహించినట్లే అతను డ్రగ్ స్మగ్లింగ్‌లో చాలా ఏక్టివ్‌గా ఉన్నాడు. న్యూయార్క్ వెళ్ళింది కూడా ఆ పని మీదే. ఇవన్నీ బయటపడతాయనే తన గదిలోకి ఎవర్నీ రానివ్వకుండా, ప్రైవసీ డ్రామా ఆడుతున్నాడు. నా మీద ఏమీ అనుమానం కలగకూడదనే, మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం, కాలనీలో ఉన్న అమెరికన్లు కంప్లైట్‌లు చేసేటట్లు, నా ఉపన్యాసాలతో మీ మతులు పోగొట్టేటట్లు చేసాను. అదే నేనిక్కడ చేరడంలో అంతరార్ధం' అంటూ నవ్వుతూ ముగించింది శకుంతల.
'పిన్ని సంపాదించిన ఆధారాలు పోలీసులకు చూపిస్తే, వాళ్ళు వెంటనే రంగలో దిగారు' అంది శాలిని.
'చాలా చాలా థాంక్స్ ఆంటీ. మీరిద్దరూ లేకపోతే నేనేమయిపోయేదాన్నో?' అంటూ ఏడవడం ప్రారంభించిన దేదీప్యను సముదాయిస్తూ దగ్గరకు తీసుకుంది శకుంతల.
శాలిని దేదీప్య తలనిమురుతూ ఉండిపోయింది.
కొయిలాడ రామ్మోహన్‌రావు
9849345060