Aug 20,2023 10:46

మనిషికి ఎంత సంపద ఉన్నా నిరుపేద అయ్యేది తమ రక్త కణంలో ఉండే హిమోగ్లోబిన్‌ ప్రోటీన్‌ లోపంతోనే.. అందులో ఉండాల్సినంత ఇనుప ధాతువు లేకపోవడమే. రక్తహీనత పురుషుల్లో, మహిళల్లో ఇలా అందరిలో కనిపించే సమస్యే అయినా.. మహిళల్లో మరింత ఎక్కువ. అందునా భారతీయ మహిళల్లో దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని అనేక పరిశోధనల్లో తేలింది. రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడాన్ని రక్తహీనత (అనీమియా) అంటారు. మన శరీరంలోని 100 గ్రాముల రక్తంలో... హిమోగ్లోబిన్‌ పరిమాణం పురుషుల్లోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. అసలు రక్తహీనత అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలిపేందుకు ఈ ప్రత్యేక కథనం..

77

             రక్తహీనత (ఎనీమియా) అంటే రక్త కణాల్లో హిమోగ్లోబిన్‌ తగు పాళ్ళలో లేకపోవడం. 7.5 -8.7 మైక్రో మీటర్ల వ్యాసంతో కుంభాకారంలో ఉండి, రక్తం ఎర్రగా ఉండేందుకు కారణమైన కణం ఎర్రరక్త కణం. చిత్రమైన విషయం ఏమిటంటే, జీవకణాలన్నింటిలో ఉండే న్యూక్లియస్‌ (కేంద్రకం) దీనిలో ఉండదు. ఎందుకంటే అది ఉంటే ఎంతో కొంత ఆక్సిజన్‌ వినియోగించుకోవాల్సి వస్తుంది.. తల వెంట్రుక మొదలు, కాలిగోటి వరకు ప్రాణవాయువును (ఆక్సిజన్‌) అందించ గలిగినది ఎర్ర రక్త కణం ఒక్కటే. ఇది కుంభాకారంలో ఉంటుంది. అందువల్ల అతి సన్నని రక్తనాళాల్లో కూడా చక్కగా ఒదిగి, చకచకా దూరి మళ్లీ వెనక్కు రాగలదు. ఇంత చిన్న కణంలో ఉన్న అతి విశిష్టమైన ప్రోటీన్‌ హిమోగ్లోబిన్‌. ఈ హిమోగ్లోబిన్‌ ఎముక మూలుగలో తయారవుతుంది. అక్కడే ఎర్ర రక్త కణాల్లోనికి ప్రవేశిస్తుంది. నడుమ ఉండే గ్లోబిన్‌ ప్రోటీన్‌ చుట్టూ నాలుగు హీమ్‌ కణాలు అమర్చబడి, ఒక్కొక్క హీమ్‌కు ఒక్కొక్క ఐరన్‌ ధాతువు పొదిగి ఉంటుంది. ఇదే ఆక్సిజన్‌ను పట్టి నిలిపి ఉంచే ఒక వల. ఒక్క మాటలో చెప్పాలంటే, నాలుగు హీమ్‌ కణాలు.. నాలుగు ఇనుప ధాతువులు.. నాలుగు ఆక్సిజన్‌ పరమాణువులు.. ఇదే మానవ జీవితం.

044


                                                                                 లక్షణాలు..

ఆడుతూ పాడుతూ, ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటుంది. కానీ రక్తహీనత (ఎనీమియా) ఎంతో నీరసం కలిగిస్తుంది. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది. తలనొప్పి, కాళ్ళ లాగడం, తిమ్మిర్లుగా ఉండి, చల్లగా మారడం, గుండె దడ, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా ఆయాసం రావడం వంటివన్నీ ఎనీమియా లక్షణాలు. ఏకాగ్రత లేకపోవడం, చేసేపని పట్ల శ్రద్ధ ఉండకపోవడం, నిస్సత్తువ, చర్మం తెల్లగా పాలిపోవడం, గోళ్లు తెల్లబడటం, శ్వాస కష్టంగా ఉండటం, కొద్దిపాటి నడకకే ఆయాసం, అలసట, చికాకు, కోపం, మగత, తలనొప్పి, నిద్ర పట్టకపోవడం, పాదాలలో నీరు చేరడం, ఆకలి తగ్గడం, జుట్టు ఊడిపోవడం జరుగుతాయి. ఎదిగే పిల్లల్లో చదువు పట్ల ఏకాగ్రత కుదరదు. కౌమార దశలో బాలబాలికలకు ఎముకల ఎదుగుదల, కండరాల పుష్టి రెండూ తగ్గుముఖం పడతాయి. గర్భిణీలు రక్తహీనతతో బాధపడితే ఆ గర్భస్థ శిశువు రక్తహీనతతోనే పుట్టడం జరుగుతుంది. దీనినే 'తరతరాల అనీమియా' అంటారు.
          గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 16 నుంచి 19 సంవత్సరాల వయసుకే పెళ్ళి చేయడం అలవాటుగా ఉంది. మేనరికాలు, ఆడపిల్ల పెళ్ళి చేసేసి.. బాధ్యత తీర్చుకోవాలనే ఆలోచనా ధోరణి ఇందుకు ముఖ్య కారణాలు అని చెప్పవచ్చు.
          మహిళల్లో విద్య, ఉద్యోగం చేసేవారు కనీసం 50 శాతం పెరిగారు. కానీ పని ఒత్తిడి, హాస్టల్లో ఉండడం కారణంగా తమ ఆహారంలో లోపాలను గుర్తించడం లేదు. అందుకే ప్రతి విద్యాసంస్థలో, ఉద్యోగ ప్రదేశంలో ఆరునెలలకోసారి మౌలిక రక్తపరీక్షలు చేసి, రక్తహీనత గల మహిళలను గుర్తించడం చాలా అవసరం. మూడు నెలలకోసారి అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. ఉద్యోగ, సిబ్బంది ఆరోగ్యానికి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం విధివిధానాలలో భాగం చేయాల్సిన అవసరం ఉంది.
 

                                                                                 కారణాలు..

రక్తహీనతకు కారణాలు ఆహార లోపం, ఖనిజ లవణాల లోపం, ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు కొరవడటం. దీనికి తోడు విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, కాపర్‌ లోపాలు కూడా. కొంతమందిలో జన్యు పరమైన రక్తకణ నిర్మాణ లోపాలుంటాయి. కొందరిలో హిమోగ్లోబిన్‌లోనే లోపాలు ఉండవచ్చు. ధూమపానం, మద్యపానం కూడా కారణాలే. రెండు, మూడు వారాల సాధారణ జ్వరం, టీ.బీ. వంటి అనారోగ్యం, మధుమేహం ఇవన్నీ ఆకలిని తగ్గించి, పేగు నుండి ఐరన్‌ ధాతువు పీల్చుకునే శక్తిని కోల్పోయేలా చేస్తాయి.
             మహిళల్లో రుతుస్రావం వల్ల ప్రతినెలా రక్తం పోతుంది.. కాబట్టి అది రక్తహీనతకు దారితీయడం చాలా సాధారణం. కొందరిలో ఎర్ర రక్తకణాల తయారీ ప్రక్రియ దెబ్బతింటుంది. కొత్త ఎర్ర రక్తకణాలు తయారయ్యేలోపే కొందరిలో పాతవి వేగంగా చనిపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. ఇక మహిళల్లో రుతుస్రావంతో పాటు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అతిగా రక్తం పోవడం, యుటెరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ ఉండటం కూడా రక్తహీనతకు కారణమే.
             ప్రస్తుతం పాశ్చాత్య శైలిని అనుసరించి తయారుచేసే ఆహార పదార్థాల్లో వినియోగించే ప్రిజర్వేటివ్స్‌, కలరింగ్‌ మెటీరియల్‌ మన దేహంలోకి ఇనుప ధాతువు ఇముడ్చుకోవడంలో అడ్డుపడుతున్నాయి. అంతేకాక వీటి వల్ల థైరాయిడ్‌ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్‌ అనే హార్మోను లోపం పెరిగింది.
           ఇవి కాకుండా మలేరియా, ఏటికలు, చిన్నపేగులో పాములు (ఆస్కారియాసిస్‌ వంటి హెల్మెంథ్‌ ఇన్ఫెక్షన్స్‌) లాంటి వాటి వలన కూడా రక్తహీనత ఉంటుంది.
            అందుకే 10 గ్రాముల కన్నా హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారంతా నోటి మాత్రలు వాడవచ్చు. ఏటికలు, హుక్‌వర్మ్‌లకు ఏడాదికి రెండుసార్లు మాత్రలు వేసుకోవాలి.
 

                                                                                   నివారణలు..

'ఆరోగ్యంతోనే చురుకైన మెదడు' అని తెలుసుకోవాలి. రక్తహీనతపై అవగాహన పెంచుకోవాలి. తాగేనీటిలో ఫ్లోరోసిస్‌ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి, నివారణోపాయాలు పాటించాలి.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు తప్పనిసరిగా 180 రోజులపాటు ప్రసవం ముందూ, తరువాత మాత్రలు వాడాలి.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసే మాత్రలను తీసుకోవాలి. వాటి పట్ల చిన్నచూపు ఉండకూడదు. దీనిపై మొదట ప్రజల్లో మానసికమైన మార్పు రావలసిన అవసరం ఉంది. మాత్రలను జాగ్రత్తగా ఉంచుకుని, సరైన సమయంలో వేసుకోవడం ముఖ్యమైన బాధ్యత.
 

                                                                             మందులు.. వాడకం..

గర్భిణీ కావచ్చు.. పాలిచ్చి పెంచే మాతృమూర్తి కావచ్చు.. పురుషులైనా సరే.. రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను నిర్దిష్ట సమయంలో, సరైన డోసేజ్‌లో తప్పక వినియోగించాలి.
 

వాడే విధానం : ఐరన్‌ మాత్రలను ఆహారాన్ని తినడానికి పావు గంట ముందు కొద్దిపాటి మంచినీళ్లతో వేసుకోవాలి. చిన్నపేగు, పెద్దపేగు కలిసేచోట ఇలియం అనే ప్రదేశంలో మన శరీరంలోకి ఐరన్‌ పీల్చుకోబడుతుంది.
 

                                                                              ఏమేమి తీసుకోవాలి..

ఇక పౌష్టికాహారం విషయానికి వస్తే, ముఖ్యంగా పాలకూర, మునగాకు, మెంతికూర, క్యాబేజీ, పుదీనా వంటివి తీసుకోవాలి. అలాగే అరటికాయ, ఉల్లికాడలు, బీట్రూట్‌ మొదలైనవి ఐరన్‌ పుష్కలంగా లభించే పదార్థాలు. పప్పు దినుసులు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం ఇవన్నీ ఐరన్‌ నిల్వ ఉండే మంచి ఆహార పదార్థాలు. మాంసం, కార్జ్యం (లివర్‌), కోడిగుడ్డు ఐరన్‌ మన శరీరంలోనికి ఇంకేటందుకు తోడ్పడుతూ మాంసకృత్తులను అందిస్తాయి. సీతాఫలం, పుచ్చకాయ, ఉసిరికాయ కూడా ప్రకృతి సహజమైన ఐరన్‌కు ఆలవాలమైన ఆహార పదార్థాలు.

walking


                                                                       ఐరన్‌ ఇంకకుండా చేసేవి..

మెగ్నీషియం, క్యాల్షియం, జింక్‌ వంటివి కలిసిన పదార్థాలు లేదా ఆహార పదార్థాలను నిల్వ ఉంచే పాత్రలు ఐరన్‌ శరీరంలో ఇంకకుండా అడ్డుపడతాయి.

చేటు తెచ్చే మాత్రలు : కాస్తంత కారం తగిలితే చాలు, కడుపులో ఉబ్బరం, గొంతు మంటకు మందుల దుకాణంలో తెలుపు, గులాబీ రంగులో ఉన్న యాంటాసిడ్‌ ద్రవాలను, కౌంటర్‌పై దొరికే పాంటాప్రజోల్‌, రాబిప్రజోల్‌ వంటి మాత్రలను వాడడం పరిపాటి అయిపోయింది. ఇవి మన దేహంలోకి ఐరన్‌ ఇంకకుండా అడ్డుపడతాయి. అలాగే తరచూ ఎలర్జీ కోసం వాడే మాత్రలు కూడా ఐరన్‌ చేరకుండా అడ్డుపడతాయి.
అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గలవారు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే ఆస్ప్రిన్‌ మాత్రను ఉపయోగించడం గమనిస్తాం. ఈ మాత్ర రక్తం గడ్డ కట్టే విధంలో మార్పులు తెచ్చి, స్వల్ప పరిమాణంలో రక్తం వృధాగా పోయేలా చేస్తుంది. వీరిలో నిశ్శబ్దంగా రక్తహీనత వస్తుంది. ఎన్నాళ్ళైనా కారణం తెలియదు కూడా.
 

                                                                                  జాగ్రత్తలు..

ఐరన్‌ ట్యాబ్లెట్లు వాడాలి. ఇవి వాడే సమయంలో కొందరికి మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణం కన్నా ఎక్కువ నీరు తాగాలి. ఇవి డాక్టర్ల సలహా మేరకే వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. మరీ రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.
రక్తహీనత ఉన్న మహిళలు తప్పనిసరిగా డాక్టర్‌ చేత పరీక్షలు చేయించుకుని తమ అనీమియాకు నిర్దిష్టంగా కారణాన్ని తెలుసుకుని, దానికి సరైన చికిత్స తీసుకుంటే అనీమియా తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రమే అవసరాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.

iron


                                                                                  చికిత్సలు..

ఐరన్‌ ధాతువును తిన్నగా రక్తంలోకి ఎక్కించడం ఇంజక్షన్‌ రూపంలో సాధ్యమే. మాత్ర వేసుకోవడంలో రియాక్షన్స్‌, ఐరన్‌ ధాతువు సరిగా పేగు నుండి ఇంకడంలో వచ్చే సమస్యలు దీనితో అధిగమించవచ్చు. ఈ చికిత్స ఎంతో విప్లవాత్మకమైనది. కానీ ఈ విధానం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాల్సి ఉంది. లేకపోతే ప్రమాదం.
         ఇతర దేశాల్లో ఈ వైద్యం విలువ వెయ్యి మి.గ్రా.లకు రూ. 24,017.66 నుంచి 31,035.43 ఉంటుంది. ఈ మధ్య దీనిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి రక్తహీనత నుంచి విముక్తి కలిగినట్టే. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకూ రక్తహీనత నుంచి సమాజం విముక్తి పొందాలని ఆశిద్దాం. రక్తహీనత ఆరోగ్య క్షీణతను కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రక్తహీనత లేకుండా చూసుకోవాలి.

                                                                              మన శరీరంలో..

మానవ శరీరంలో ఐదు లీటర్ల రక్తానికి ఐదొందలకోట్ల రక్త కణాలు, వాటిల్లో సుమారు 790 గ్రా. హిమోగ్లోబిన్‌ ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంచనా. ప్రతి 100 మి.లీ. రక్తానికి 20 మి.లీ. ఆక్సిజన్‌ ఉంటే గానీ మన పని మనం చేసుకోలేం. అత్యంత ముఖ్యమైన జీవ రసాయన క్రియలైన శ్వాస, గుండె కొట్టుకోవడం జీర్ణక్రియ వ్యర్థాల విసర్జన వంటి మౌలికమైన పనులన్నీ ఆక్సిజన్‌ ఉంటే గానీ సరైన విధానంలో జరగవు. దానివల్ల ఆక్సిజన్‌ రుణం లేదా ఆక్సిజన్‌ డెట్‌ పెరిగి, లాక్టిక్‌ యాసిడ్‌ వంటి విషపదార్థాలు చేరి, ప్రాణాపాయ స్థితి వస్తుంది.
          కరోనా పాండమిక్‌ వలన సమాజంలో ఆరోగ్యంపై ఎంతో కొంత అవగాహన పెరిగింది. అప్పట్లో అందరూ ఆవేదనతో ఎదురుచూసినది ఆక్సిజన్‌ కోసమే అని మనం మరచిపోకూడదు. వాతావరణంలోని ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా తీసుకొని, ఎర్ర రక్తకణాలు అన్ని భాగాలకు చేరవేస్తాయి. స్త్రీలలో 10 నుంచి 12, పురుషుల్లో 14 నుంచి 16, పిల్లల్లో 9 నుంచి 10 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండి తీరాలి.
           మనదేశ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పురుషుల్లో 40 శాతం, స్త్రీలలో 53 శాతం, గర్భిణీలలో 50 శాతం, పిల్లల్లో 50.8 శాతం రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది.

karjuram

                                                                       ఎండు ద్రాక్షతో ఎంతో మేలు..

రక్తహీనత సర్వసాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో మరింత ఎక్కువ. మనదేశంలో ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67 శాతం, మహిళల్లో 57 శాతం మంది దీనివల్ల బాధపడుతున్నారని అంచనా. దీనికి ప్రధాన కారణం ఎర్ర రక్తకణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవటం. ఉత్పత్తి అయినా కొందరిలో త్వరగా క్షీణిస్తుంటాయి. రక్తం కోల్పోవటమూ దీనికి కారణమవుతుంది. చాలామందిలో ఐరన్‌ లోపంతోనే రక్తహీనత తలెత్తుతుంది. ఇది లోపిస్తే ఎర్ర రక్తరక్తకణాలు తగినంత ఉత్పత్తి కావు. దీంతో అలసట, ఆయాసం వంటి లక్షణాలు వేధిస్తాయి. ఐరన్‌ లోపం తగ్గటానికి ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. రాత్రిపూట 10-15 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తిని, నీళ్లు తాగటం మంచిది. ఇది ఐరన్‌ లోపాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తహీనతా తగ్గుతుంది. రోజూ కొన్ని ఎండుద్రాక్ష పళ్లను తినటం గుండె ఆరోగ్యానికీ మేలే. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరి. కొలెస్ట్రాల్‌ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటమూ తగ్గుతుంది. దీంతో గుండెకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

44

                                                                            ఆస్ప్రిన్‌తో వృద్ధుల్లో..

గుండెజబ్బు ముప్పున్న వారికి వైద్యులు స్వల్పమోతాదులో ఆస్ప్రిన్‌ వేసుకోమంటారు. ఇది గుండెపోటు, పక్షవాతం నివారణకు తోడ్పడుతుంది. అయితే దీంతో రక్తస్రావమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదొక్కటే కాదు.. దీర్ఘకాలం తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ వాడే వృద్ధులకు రక్తహీనత ముప్పు 20 శాతం వరకు పెరుగుతున్నట్లు మోనాష్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. వీరిలో హిమోగ్లోబిన్‌, ఐరన్‌ను మోసుకెళ్లే ఫెరిటిన్‌ మోతాదులు వేగంగా తగ్గుతుండటం గమనార్హం. ముఖ్యంగా 70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు వారికి ఈ ముప్పు పొంచి ఉంటోంది. మామూలుగానే వృద్ధులకు రక్తహీనత తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో నిస్సత్తువ, కుంగుబాటు లక్షణాలు, మతిమరుపు వంటివి వేధిస్తుంటాయి. ఆస్ప్రిన్‌ వాడకంతో రక్తహీనత ముప్పు మరింత పెరుగుతున్న నేపథ్యంలో వీరిని తరచూ పరీక్షిస్తుండాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ప్రిన్‌తో తీవ్ర సమస్యలైన గుండెపోటు, పక్షవాతం ముప్పులు తగ్గుతాయి. కాబట్టి డాక్టర్‌ సలహా లేకుండా వీటిని మార్చటంగానీ మానెయ్యటంగానీ తగదు.

                                                                     దానిమ్మతో బయటపడొచ్చు..

దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరెన్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి. ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్‌, 3 గ్రాముల ప్రోటీన్‌, 30 శాతం విటమిన్‌ సి, 16 శాతం ఫోలేట్‌, 12 శాతం పొటాషియం ఉంటాయి. కప్పు దానిమ్మ గింజల్లో 24 గ్రాముల చక్కెర, 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150 మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది. రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.

77
                                                         డాక్టర్‌ కాళ్లకూరి శైలజ
                                                 జనరల్‌ అండ్‌ లాపరోస్కోపిక్‌ సర్జన్‌
                                                                  కాకినాడ