Jul 30,2023 09:17

'ముస్తాఫా...ముస్తఫా డోంట్‌వర్రీ ముస్తాఫా!' అనే పాట అప్పట్లో కుర్రకారు గుండెల్లో మారుమోగింది. ఈ పాట 1996లో విడుదలైన 'ప్రేమదేశం' సినిమా లోనిది. అత్యధిక ప్రేక్షకాదరణ పొందడంతో అన్ని భాషల్లోకి డబ్బింగ్‌ చేశారు. ఇందులో నటించిన హీరోల్లో ఒకరైన అబ్బాస్‌ గత కొన్నేళ్లుగా ఇండిస్టీకి దూరంగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తొమ్మిదేళ్లుగా కుటుంబంతో విదేశాల్లో స్థిరపడిన ఆయన ఈ మధ్య కాలంలో తిరిగి స్వదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను, మలుపులను ప్రేక్షకులతో పంచుకున్నారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన అబ్బాస్‌కు చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి తక్కువ. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు స్కూలుకు వెళ్లేవాడు. 'పదో తరగతి ఫెయిలైనప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం కావడంతో మరింత బాధతో ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. ఓసారి రోడ్డు పక్కన నిల్చొని.. వేగంగా వస్తున్న భారీ వాహనం ముందుకు వెళ్లాలనుకున్నా. అదే సమయంలో దాని వెనుక వస్తున్న బైక్‌ని గమనించా. ఒకవేళ నన్ను ఆ వాహనం ఢ కొడితే.. వెనుక వచ్చే బైక్‌ అతను దాన్ని ఢ కొడతాడు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతడి జీవితంపై ప్రభావం పడుతుందని ఆలోచన కలిగింది. అంతే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. బాధలో ఉన్నప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకున్నా!' అని తన బాల్యంలో జరిగిన ఓ సంఘటనని గుర్తుచేసుకున్నారు.

3

ఆత్మహత్య ఆలోచనలు వద్దు..

'స్కూల్‌ డేస్‌లో చదువులో వెనకబడ్డ పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అంతేగానీ మార్కులు ఆధారంగా మనిషిని అంచనా వేయడం సరైంది కాదనేది నా అభిప్రాయం. సాధారణంగా మగవాళ్లు తమ ఎమోషన్స్‌ బయటపెట్టేందుకు కష్టంగా ఫీలవుతుంటారు. బాధను లోపలే దాచుకుంటారు. అందుకే కోవిడ్‌ సమయంలో జూమ్‌ యాప్‌ ద్వారా నా అభిమానులతో మాట్లాడి, వారి ఫీలింగ్స్‌ తెలుసుకున్నా. ప్రధానంగా ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్న వారితో మాట్లాడా. వారికి నా అనుభవాలతో ప్రేరణ కలిగించి, ధైర్యం చెప్పాను. నాకు తెలిసినంత మాట సహాయం చేశాను. వారిలో మార్పు కనిపించింది. నిజంగా సంతోషం వేసింది' అన్నాడు.

కనీసావసరాలు తీర్చుకోలేక..

'పందొమ్మిదేళ్ల వయస్సులో అనుకోకుండానే నేను నటుడినయ్యాను. సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం 'కాదల్‌ దేశం' (ప్రేమదేశం) లో నటించాను. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయాను. డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నాను. మొదట తమిళం, తెలుగు చిత్రాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలో విజయాలు అందుకున్నాను. తర్వాత నెగిటివ్‌ క్యారెక్టర్లు చేశాను. అవకాశాలు తగ్గాయి. చిన్న చిన్న పాత్రల్లో నటించడంతో కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. సిగిరెట్‌ కొనేందుకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సి వచ్చింది. అవకాశం కోసం నిర్మాత ఆర్‌.బి. చౌదరిని కలిశా. 'పూవెలి' చిత్రంలో నటించమన్నారు. కానీ కొన్నాళ్లకు నా నటనను నేను ఆస్వాదించలేకపోయాను. అందుకే సినిమాలకు దూరమయ్యా. బైక్‌ మెకానిక్‌గా అనుభవం ఉంది. దాంతో కుటుంబాన్ని పోషించేందుకు న్యూజిలాండ్‌ వెళ్లాను. బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ, ట్యాక్సీ డ్రైవర్‌గా స్థిరపడాను. నా పనిని నేను ప్రేమిస్తున్నాను. నా కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్నాను' అని చెప్పుకొచ్చాడు అబ్బాస్‌.

2

పేరు : మీర్జా అబ్బాస్‌ ఆలీ
పుట్టిన ప్రాంతం : 21-05-1975, కోల్‌కతా
(పశ్చిమ బెంగాల్‌)
భార్య : ఈరుమ్‌ ఆలీ
పిల్లలు : అయ్మాన్‌ (బాబు), మీరా (పాప)
నటించిన తెలుగుచిత్రాలు : 'రాజహంస', 'రాజా',
'నీ ప్రేమకై', 'అనగనగా ఒక అమ్మాయి', 'కృష్ణబాబు', 'శ్వేతనాగు','నరసింహ','అనసూయ'..