Jul 02,2023 10:39

మైదాన ప్రాంతంలో పుట్టి, పెరిగి, వృక్ష శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన నాకు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతంలోని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం రావడంతో చెప్పలేని ఆనందంతో వెళ్ళి వెంటనే చేరిపోయి ఇప్పటికి రెండేండ్లు కావస్తుంది.
అసలే వృక్షశాస్త్రం చదువుకున్న వాణ్ణి, అందులోనూ ప్రకృతితో మమేకమై పోవాలని నిరంతరం తపించే స్వభావం వున్నవాణ్ణి కావడంతో శలవు దొరికిందంటే చాలు, స్థానిక గిరిజనుల సాయంతో ఆడవి లోపలికి వెళ్ళి అప్పటివరకు నా దృష్టికి రాని రకరకాల మొక్కలను సేకరించి పరిశీలించడం, ఆ చుట్టుపక్కల వున్న అనేక వాగులను, వంకలను, సెలయేళ్ళను, జలపాతాలను, గిరి శిఖరాలను, వెన్నెల కుప్పల్లాంటి అడవి బిడ్డల పల్లెలను సందర్శిస్తూ వారితో, ఆ ప్రాంతంతో మమేకమైపోతూ తీవ్రమైన మమకారాన్ని పెంచుకోసాగాను.
ఈ మధ్యే పాడేరుకు దగ్గరలో వున్న జీమాడుగుల మీదుగా కొత్తపల్లి జలపాతాల సందర్శనకు నాతోటి ఉపన్యాసకులతోను, విద్యార్థులతోనూ కలిసి మరోసారి వెళ్ళడం జరిగింది.
ఒక్క ఏడాది కాలంలో ఆ జలపాతాల ప్రాంతంలో ఆధునికత అక్రమ చొరబాటు కారణంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అనేక మార్పులను గమనించిన నేను ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది.
గతంలో నేను వచ్చినప్పుడు ఏ వనదేవతలో తూరుపు కొండల శిఖరాల మీద కూర్చుని, ఒకేసారి వంద కిన్నెరలు మీటుతున్నట్టుగా ఆ జలపాతపు మర్మర నాదం శ్రవణానందకరంగా రెండు కి.మీ. దూరం వరకూ కన్పించకుండా విన్పిస్తుంటే, ఆదిమానవుల మూల నాదం ఏదో నా గుండె తంత్రులను మీటుతున్న అనుభూతికి లోనయ్యాను.
గిరిపుత్రుల సహజ జీవన సౌందర్యాన్ని కళ్ళతోనే జుర్రి ఆస్వాదిస్తూ జలపాత నాద పతాక రెపరెపల సవ్వడిని అనుసరిస్తూ, దారికి ఇరువైపులా బయటి ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులెవ్వరికీ పేర్లు తెలియని అనేక రకాల అడవి వృక్షాలు, వాటిని పెనవేసుకుని, చిటారు కొమ్మలదాకా పాకిపోయిన అడవి తీవెలు, వాటి చివర్లలో వివిధ రూపాల్లో, వివిధ వర్ణాల్లో గుత్తులు గుత్తులుగా శోభిస్తూ, దర్శన మిస్తున్న పూపొదల ముగ్ధ మనోహర రూపాలు నిసర్గ సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచి, వృక్షాలు తమ కొమ్మల కరాల కైదండలతో మమ్ముల్ని మనఃపూర్వకంగా స్వాగతిస్తుంటే, ఒక అలౌకిక తన్మయత్వంలో మునిగిపోయిన నేను, నాకు తెలియకుండానే జలపాతపు సమీపానికి చేరుకున్నాను.
ఎదురుగా తిమింగలపు వెన్నెముఖ ఆకృతిలో వున్న కొండ మీద వాలిన వెండిమేఘ తతి, కొండ అనర్ఘ సౌందర్యానికి విచలితమైపోతూ, నీరుగా మారి శివుని ఝఠా ఝూటం నుండి కిందకి దుమికే గంగా వాహినిలా ఆ కొండ శిఖరపు శిరస్సు నుండి మహోగ్ర సర్పం ఒకటి బుసలు కొడుతూ అతి వేగంగా కిందకు దుముకుతున్నట్టుగా నేలకు జారుతున్న ఆ జలపాతపు హొయల లయలను వర్ణించడానికి వేయి నాల్కల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు అనుకుంటూ నన్ను నేను పూర్తిగా ప్రకృతిలో కలిపేసుకున్నాను. నా మనఃశ్శరీరాలు రెండూ పరిశుద్ధమైపోయాయన్న భావనకు లోనయ్యాను.
ఒక్క ఏడాది కాలంలోనే ఆ ప్రకృతి అందాన్ని ఏ రాకాసి మూకలో కొల్లగొట్టుకుపోయాయి. జలపాతపు పరిసరాల్లో ప్లాస్టిక్‌ మహమ్మారి రకరకాల రూపాల్లో, రంగుల్లో ఎన్నటికీ శిథిలం కాని అస్థికల్లా మనసుకు కష్టం కలిగిస్తూ విచ్చలవిడిగా పడివున్నాయి.
ప్రకృతిలో భాగమైన మనిషి తన మూలాలను వెతుక్కుంటూ వస్తే అందుకు కూడా టిక్కెట్టు పెట్టిన ప్రభుత్వ ధనాకాంక్ష ముందు ప్రతిదీ సంపాదనా మార్గమేనన్న ఆధునిక అరాచక ధోరణికి మనసు బాధతో మూలిగింది.
మెల్లగా జలపాతం దగ్గరికి చేరుకున్నాము. దాని మునుపటి వడి తగ్గిపోయింది. నాదం సన్నగిల్లింది. చూసినంతనే నయనాలు ఆనందతో తాండవం చేసిన పూర్వపు రూపు చెదిరిపోయింది.
నిన్నటి స్మృతులను నెమరు వేసుకుంటూ వర్తమానాన్ని ఆమోదించలేకపోతున్న నా మనసును నేనే సముదాయించుకుంటూ మావాళ్ళందరితోపాటు కొంతసేపు ఆ జలపాత ప్రవాహపు ఆకురాయికి మా శరీరాలకు పునరుత్తేజపు పదును పెట్టుకుని, మెల్లగా ఒడ్డెక్కాము.
ఎదురుగా వున్న కొండ మీదికి ఎక్కుతూ కొంత దూరం వెళ్ళిన తరువాత చిత్రంగా అక్కడో పెద్ద సొరచేప శిలాజం కనిపించింది. దానికి కొద్ది దూరంలోనే పేర్లు తెలియని ఏవేవో పెద్ద పెద్ద అడవి చెట్ల సమూహం చిక్కటి, చల్లటి నీడను పరుచుకుని వుండడాన్ని గమనించిన మేము అక్కడే భోజనాలు చేయాలనుకున్నాము.
మేము భోజనాలు చేస్తుండగా మాకు కొంచెం దిగువన ఆలమందను మేపుతున్న ఓ వృద్ధ గిరిజనుడు ఓ శిరిమాను చెట్టు కింద వున్న చిన్న బండ మీద కూర్చుని, పిల్లన గ్రోవిని వాయిస్తూ బాహ్య ప్రపంచంతో తనకు ఏ సంబంధం లేనట్టుగా తనలోకంలో తను మునిగీతలు కొడుతున్నాడు.
ఆవులన్నీ ఆ చుట్టుపక్కల వున్న గడ్డిదుబ్బుల్లో పడి పర్రు పర్రుమని గడ్డిని కొరుక్కు తింటూ తోకల్తో, చెవుల్తో జోరీగల్ని తోలుకుంటూ, ముక్కుల్తో ముసట్లు కొడ్తూ హాయిగా మేస్తున్నాయి. అందరికన్నా ముందుగా భోజనం చేసిన నేను వెంటనే లేచి, నేరుగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఆ గిరిజన వృద్ధుని దగ్గరికి వెళ్ళాను.
నన్ను చూస్తూనే వాయిస్తున్న పిల్లనగ్రోవిని ఆపు చేస,ి నవ్వు ముఖంతో నా దిక్కు చూస్తూ 'ఏంది నాయినా?' అన్నట్టు చూశాడు.
నేను అతనికి మరింత దగ్గరగా జరిగి 'నీ పేరేంటి తాతా?' అంటూ అడిగాను.
'మోదన్న సామీ!' నెమ్మదిగా బదులిచ్చాడా వృద్ధుడు.
'మా వాళ్ళ దగ్గరికి పోదాం రా! బిర్యానీ తిందువుగాని' అన్నాను.
అతను ఏమాత్రం సంకోచించకుండా వెంటనే లేచాడు.
ఇద్దరం కలిసి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే నేనో విస్తరిలో కొంచెం బిర్యానీ, చికెన్‌ పెట్టించుకుని తీసుకొచ్చి మోదన్న చేతికి అందించాను.
అతనా ఆకును అందుకొని పక్కనే వున్న ఓ చిన్న బండ మీద కూర్చుని మెల్లగా తినసాగాడు.

                                                                                  ***

మా ఎదురుగా ఎంతో ఎత్తుగా, చిక్కగా, దృఢంగా, నల్ల జీడి చెట్ల సమూహంలో ఆ చుట్టు పక్కల ఎక్కడా లేని విధంగా ఓ ఎత్తయిన పురాతన జిట్రేగి చెట్టొకటి కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. దాన్ని గమనించిన మా తెలుగు లెక్చరర్‌ శివశంకర శాస్త్రి గారు 'ఇదేమిటండీ?! ఈ అడవిలో మనం ఇప్పటి దాకా చాలా ప్రాంతం తిరిగాము. కానీ ఎక్కడా మచ్చుక్కూడా ఒక్కటంటే ఒక్క జిట్రేగి చెట్టు కనిపించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంత పెద్ద చెట్టు ఎలా మిగిలి వుంది?!' నల్లగా కాండమంతటా బల్లి పేళ్ళు తేలిన ఆ జిట్రేగి చెట్టును అప్పుడు పరీక్షగా చూసిన మేమంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతూ ''ఔను నిజమే'' అంటే ''నిజమే'' అంటూ అందుకు గల కారణాలను మాకు తోచిన పద్ధతుల్లో వ్యక్తం చేయసాగాము.
అప్పటిదాకా బండ మీద కూర్చుని నింపాదిగా అన్నం తింటూ మా మధ్య జరుగుతున్న మా మాటలన్నీ వింటున్న మోదన్న ''మీరనుకున్నయెయ్యి కాదు'' అన్నాడు. ఒక్కసారిగా అతని దిక్కు తిరిగిన మా వాళ్ళంతా ''మరేంటది?'' అన్నట్టు అతని దిక్కు చూశారు.
తాను తిన్న విస్తరిని చుట్ట చుట్టి కింద పెట్టి, అది గాలికి కొట్టుకు పోకుండా దాని మీద ఓ చిన్న రాయిని బరువుగా పెట్టాడు. ఆ తరువాత తన పక్కనే వున్న సొరకాయ బుర్రలోని నీళ్ళను తాగి వాటితోనే చేతిని, మూతినీ కడుక్కుని భుజం మీది తువ్వాలుతో తుడుచుకుని గట్టిగా సరాయిస్తూ, మా దిక్కు తిరిగి ''అదంతా ఓ పెద్ద కత'' అన్నాడు మోదన్న.
''అదేంటో చెప్పు'' అన్నారు మావాళ్ళంతా ఒకేసారి ఉత్సాహంగా.
దానికతను మా వంక చూస్తూ 'ఎనకటెప్పుడో మా తాతల కాలాన తెల్లదొరలు ఈ అడివిల బడి కనపడ్డ జిట్రేగు చెట్టునల్లా కొట్టిచ్చి, బండ్ల మీద ఇశాకపట్నం రేవుకు తోలిచ్చి, ఆన్నుంచి ఓడల మీద వాల్ల దేశం జమాయించుక పోయిండ్రంట. సరిగ్గ అటువంటి సమయాన్నే గత్తరొచ్చి ఊళ్లకు ఊళ్లు తూడ్సిపెట్టుకపోతుంటే చూసిన మా తాత ఏదో చెట్టు పసరిచ్చి, మా సుట్టుపక్కల గుంపుల ఒక్క పురుగు గూడ సావకుంట కాపాడిండంట.
ఆ దెబ్బతోటి మా తాత అంటే ఏందో తెలిసొచ్చిన ఆ తెల్ల దొరలు ఆయిన మాటకు ఎంతో ఇలువ ఇవ్వటవ మొదలు పెట్టిండ్రంట. గత్తర బీమారి తగ్గిపోయిన కొన్నాల్లకు తెల్లోల్ల మనుసులు మల్లా అడివి మీద బడి జిట్రేగు మొక్కన్నది లేకుండ ఊడ్సక పోబట్టిండ్రు.
దాంతోటి ఈ తెల్లదొరల దెబ్బకు మన అడివిల మచ్చుగ్గూడా ఒక్క మొక్కలేకుంట పొయ్యేటట్టుంది.ఎట్లనన్న జేసి చెట్లను గొట్టే పనిని ఆపించాలన్న ఆలోచన చేసిన మా తాత కొండన్న ఓ అమాసనాటి రేయి నరమానవునికి తెలవకుంట ఈడికొచ్చి ఓ మాదిరి మొక్కగా పెరిగి వున్న ఈ చెట్టు కింద దేవరను నిలిపి జాతర చేయించుడు మొదలు పెట్టిండు.
ఆ దెబ్బతోటి తెల్లోల్లు ఈ చెట్టు జోలికి రాలేదు. అంతేకాదు వందేండ్లు దాటిపోతున్నా అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇది దేవర చెట్టన్న భయంతోటో, భక్తితోటో ఈ చెట్టు జోలికి ఎవ్వరు రాలే. కాలం గెడ్డ మాదిరిగా సాగిపోతూనే వున్నప్పటికీ ఈ చెట్టు మాత్రం ఇంకా దాని వేటు పడకుండా ఇట్లా ఒంటరిగా మిగిలిపోయింది' అంటూ ఆ చెట్టు వెనుక వున్న కథను చెప్పుకొచ్చాడు.
ఆ కథ విన్న మేమంతా కొండన్న తెలివికి, సమయస్పూర్తికి ఆశ్చర్యపోతూ మా మనసుల్లో అతనికి జోహర్లు తెలియజేసుకున్నాం.
ఒక్క సంవత్సర కాలంలోనే వికృత నాగరికతా కరకు కరవాలానికి ఈ జలపాతాల చుట్టూ వున్న చెట్టూ చేమా పల్చబారి, గిరిజన గుంపులు పల్లెలుగా రూపు దేరి తమ మూలాలకు దూరమవుతున్నాయని.. వస్తూనే బాధపడిన మేమంతా మోదన్న చెప్పిన కథ విన్న తరువాత ప్రతి అవసర సమయంలోనూ తమ వారసత్వ మూలాలను కాపాడుకోవడానికి కొండన్న మాదిరిగానే ఎవరో ఒకరు తప్పకుండా పుట్టుకొస్తారు. అన్న నమ్మకంతో మోదన్న దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగాము.

శిరంశెట్టి కాంతారావు
98498 90322