Feb 19,2023 08:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతమున్న ప్లెయిన్‌ టాప్‌ స్థానంలో గళ్ల చొక్కా రానుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. శనివారం నాడు ఆయన పాఠ్యపుస్తకాల డైరెక్టర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి, సమగ్ర శిక్ష ఎఎస్‌పిడి కెవి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ముద్రణా కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం బాలికల టాప్‌ వంకాయ రంగు, బాలురు స్కైబ్లూ కలర్‌ షర్ట్‌లు అందజేస్తున్నామని, ఇక నుంచి వీటిని గళ్ల చొక్కాల (చెక్స్‌ షర్ట్‌) రూపంలోకి మారుస్తామని తెలిపారు. క్లాత్‌ పరిమాణం కూడా పెంచుతామన్నారు. రూ.1042 కోట్లతో 43 లక్షల మంది పైగా విద్యార్ధులకు జెవికె కిట్లు అందించనున్నట్లు తెలిపారు. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ ముద్రణ ప్రారంభమైందని, 1-9 తరగతుల విద్యార్థుల కోసం బైలింగ్యుల్‌ పాఠ్యపుస్తకాలు ప్రచురణ జరగుతోందన్నారు. ఈ ఏడాదికి కొత్తగా 6, 7, 9 తరగతుల కోసం ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలను బైలింగ్యుల్‌లో తయారు చేస్తున్నట్లు తెలిపారు.