
ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన శనివారం అద్దంకి- మేదరమెట్ల రోడ్డులోని బలరామకృష్ణ పురం సమీపంలో జరిగింది. మండలంలోని కొంగపాడు గ్రామానికి చెందిన గుడిపూడి ప్రసాద్ (45) ప్రతిరోజు గ్రామం నుండి మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ కు ముఠామేస్త్రి పనులు నిర్వహించేందుకు వెళుతుంటాడు. బైక్‌పై వెళుతూ బలరామకృష్ణపురం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుడిపూడి ప్రసాద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రమాద తీరును పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రసాద్‌కి భార్య పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.