
ప్రజాశక్తి-గన్నవరం : దేశంలో పేద వర్గాల బాగు కోసం సమరశీల ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాల్సి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్ళం వెంకటేశ్వరరావు అన్నారు. ఈనెల తొమ్మిదవ తేదీన గన్నవరం నియోజకవర్గంలో జరగనున్న రాష్ట్రస్థాయి జయభేరి యాత్ర బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గన్నవరం లోని పార్టీ కార్యాల యంలో మిరప నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జరిగిన విస్తత సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీఅధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పేదలకు, రైతులకు, కార్మికులకు ఉపయోగపడే చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. పేద వర్గాల హక్కులను కాలరాస్తూ, మరింత పేదరికంలోకి నెట్టేశారనీ, ఈ వర్గాల హక్కుల కోసం మనం పోరాటా లకు సమాయత్తం కావాలన్నారు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పేదరికం, నిరుద్యోగం తారాస్థాయికి చేరాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాలు బిజెపికి మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల పట్టని దీపాల కుల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. సిపిఎం మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈనెల తొమ్మిదవ తేదీన ఉదయం హనుమాన్ జంక్షన్ లో ప్రారంభమైన బైక్ ర్యాలీ బాపులపాడు మండలం ఉంగుటూరు మండలం మీదుగా గన్నవరం చేరుతుందన్నారు. 200 బైకులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే అనేక దఫాలుగా ఏపీలో అన్ని జిల్లాల్లో భూ పోరాటాలు నిర్వహిస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు,సాగు - భూముల కోసం భూములను గుర్తించి పేదలకు అందజేస్తున్నామన్నారు. ఒక్క నవరత్నాలతోనే పేదల బతుకులు మారవని, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని అనేకమార్లు ఉద్యమాలు చేసి డిమాండ్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు, పక్కా గహాలు, సాగు భూముల అంశంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కాబోతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, ఉదయ భాస్కరరావు, సూరగని సాంబ శివరావు, పటాన్ సర్దార్, ఉడత రామకష్ణ, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.