
ప్రజాశక్తి-జగ్గయ్యపేట: నవంబర్ 8న కేజీ నుండి పీజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సోమేశ్వరరావు కోరారు. శుక్రవారం బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధి పట్ల బిజెపి నేతల నిర్లక్ష్యం విడనాడాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొనడంతో పాటు విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జి.గోపినాయక్ మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపయోగపడుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.