* వ్య.కా.స రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: దళిత హక్కులు, సామాజిక, ఆర్థిక, భూ సమస్యలు తదితర 21 డిమాండ్లను నెరవేర్చాలని డిసెంబరు నాలుగో తేదీన చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కోటి సంతకాలతో విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరంలోని ఆ సంఘ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మణిపూర్‌లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేసిందని చెప్పారు. ఇంత జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం, దాడులు చేసిన వారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్‌ప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రిజర్వేషన్లను అమలు చేయకుండా అనేక ప్రయత్నాలు చేస్తోందన్నారు. మనువాద భావజాలాన్ని అమలు చేసి లౌకిక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందన్నారు. ఎస్సి, ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగరాపు సింహాచలం, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.