హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీం నగర్ఎంపి బండి సంజయ్ కుమార్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమతో 30 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. జిహెచ్ఎంసి నూతన కౌన్సిల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కలిసి..విజ్ఞప్తి చేశారు. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన కొంత మంది బిజెపి కార్పొరేట్లు కూడా ఆయన వెంట ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023లో తెలంగాణాలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలు బమ్మగా మారిందని, ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం హేళన చేస్తోందని అన్నారు. ఎన్నికలు జరిగి నెల రోజులు గడుస్తున్నా పాలకమండలి ఏర్పాటు చేయడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం వెంటనే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమతో టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, బిజెపిలోకి వస్తామని అంటున్నారని, కానీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించ వద్దనే ఉద్దేశంతోనే ప్రోత్సహించడం లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నాటకాలాడుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం సహకారం లేకుంటే హైదరాబాద్లో టిఆర్ఎస్ అన్ని సీట్లు గెలిపొందేది కాదని అన్నారు.