ప్రజాశక్తి-గుంటూరు : పంటలన్నిటికీ పెట్టుబడి వ్యయంపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి, చట్టబద్ధత కల్పించాలని, రైతులు, పేదల పాలిట ఉరితాడుగా మారే విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో ఈనెల 27, 28 తేదీల్లో విజయాడలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు కరపత్రాన్ని బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్, ఎఐటియుసి నాయకులు పి.సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు యు.నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం నాయకులు పశ్చల శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు, కిసాన్ ఫెడరేషన్ నాయకులు కాలువ శ్రీధర్‌రావు, సిఐటియు నాయకులు కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత దేశాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. కార్మిక చట్టాలను నీరుగారుస్తోందని, రైల్వేలు, విమానయానం, బొగ్గు గనులు, బీమా, బ్యాంకులు సహా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలని యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలివ్వాలని, రైతుల పంట రుణాలు ఒక పర్యాయం రద్దు చేయాలని, కేరళలో మాదిరిగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, కార్పొరేట్ అనుకూల పంటల బీమా పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ డిమాండ్లతో నిర్వహించే ధర్నాలో రైతులు, కౌలు రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బి.రామకృష్ణ, పి.డేవిడ్‌రాజు పాల్గొన్నారు.