Nov 02,2023 22:34

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం
బిసిసిఐ (భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎసిఎ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు అండర్‌-19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ మూలపాడులోని డీవీఆర్‌, సీపీ గ్రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌. గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు. గురువారం మూలపాడులోని ఏసీఏ క్రికెట్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ జాయింట్‌ సెక్రెటరీ ఎ. రాకేష్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ జితేంద్రనాథ్‌ శర్మతో కలిసి గోపినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌ జట్లు, ఇండియా-ఎ, ఇండియా- బి జట్లుగా పాల్గొంటాయి. మొత్తం నాలుగు జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటాయని తెలిపారు. ఈ నెల 5న ఇంగ్లాండ్‌ జట్టు విజయవాడకు వచ్చి మూలపాడులో నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్‌ చేయనుందన్నారు. బంగ్లాదేశ్‌ జట్టు 10వ తేదీన విజయవాడకు చేరుకుంటుందని తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.