Jul 02,2023 10:29

బిల బిలమంటూ జనం పరుగులు తీసుకుంటూ.. ఒకర్నొకరు అరుచుకుంటూ.. చేతికి ఏది దొరికితే దాన్నే ఆయుధంగా చేసుకుంటూ.. ముందు మగవాళ్లు.. ఆ తర్వాత ఆడవాళ్లు.. పిల్లలు.. కెరటాల్లా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. చేరాల్సిన చోటుకు చేరుకున్నారు.
'మా పానాలు పోయినా.. రత్తం చిందినా.. మా భూములు వదులుకోం..' అందరూ అదే మాట.
మరోవైపు పోలీసు జీపులు డైనోసారుల్లా దుమ్ము రేపుతూ దూసుకొస్తున్నాయి. ఇంకోవైపు అక్కడ అణు విద్యుత్‌ కేంద్రం పెట్టాలనుకున్న విదేశీ కంపెనీకి చెందిన కిరాయి గూండాలు కూడా మోహరించి ఉన్నారు.
యువకులు, మత్స్యకారులు, రైతులు కుటుంబాలతో తరలివచ్చారు. సుమారు మూడువేల మంది వరకూ ఉన్నారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా ఉంది.
అరుపులూ.. కేకలు.. దుమ్మంతా రేగి పైకి లేవడంతో మేఘాలే కిందకొచ్చాయా అన్నట్లుంది.
మరోవైపు నుంచి మీడియా వ్యానులు పోటీలు పెట్టినట్లే రేస్‌కారుల్లా దూసుకొస్తున్నాయి.
పోలీసులు కూడా రెండువేల మంది వరకూ ఉన్నారు. మైకుల్లో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు.. 'అందరూ వెనక్కి వెళ్లిపోండి. 144 సెక్షన్‌ అమల్లో ఉంది.'
హెచ్చరికలు బేఖాతరంటూ 'మా భూమిని, మా బీలను మేమొదులుకోం.. మీ మాటలు నమ్మం...' అంటూ నినాదాల స్థాయి పెంచేశారు.
ఎవరూ అడుగు వెనక్కి వేయడంలేదు.
అంతే పోలీసులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వారిపై విరుచుకుపడి, లాఠీఛార్జీ చేస్తూ, చెదరగొడుతున్నారు.
దీంతో వ్యూహాత్మకంగా అందరూ వెనక్కి తగ్గారు. పక్కకెళ్లి సమావేశమయ్యారు.
చుట్టూతా ఉన్న 21 గ్రామాలకీ అక్కడ పరిస్థితి గురించి సమాచారం అందించారు.
రెండు గంటలయ్యిందో లేదో.. వేలకు వేలు జనం సంద్రం పోటెత్తినట్లు కెరటాల్లా వెల్లువెత్తారు.
వారందరినీ చూసి పోలీసులు బెంబేలెత్తిపోయారు.
అంతే డిఎస్‌పి 'వెనక్కి వెళ్లిపోండి... లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది!' అంటూ అనౌన్స్‌మెంట్‌.
అయినా ఎవరూ అడుగు వెనక్కు వేయడం లేదు సరికదా.. మరింత ఉద్రేకంగా ముందుకొచ్చేశారు. అందరూ కలసి పనులు అడ్డుకోవడం మొదలుపెట్టారు. వెంటనే పోలీసులు విచక్షణా రహితంగా లాఠీఛార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వీరితో పాటు కంపెనీ కిరాయి గూండాలు కూడా జనంలోకి చొచ్చుకుని వచ్చి కర్రలతో, కత్తులతో దాడి చేశారు.
దాంతో ప్రజలు కోపంతో తిరగబడ్డారు. దొరికిన రాయి దొరికినట్లు తీసుకుని, విసరసాగారు.
పోలీసుల జీపుల్ని, బైక్‌లను తగులబెట్టారు. గూండాల చేతుల్లోని కత్తుల్ని కొందరు యువకులు లాగేస్తున్నారు. దొరికిన వాళ్లపై కత్తులతోనే దాడులు చేయడం ప్రారంభించారు.
అక్కడంతా యుద్ధ వాతావరణమే.
ఇక లాభం లేదనుకున్నారు పోలీసులు. 'ఎవరూ బయటకు రాకండీ.. మీడియా వారూ మిమ్మల్నీ మేం కాపాడలేం.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి' అంటూ హెచ్చరిస్తూనే... 'ఫైర్‌'! ' అంటూ డిఎస్‌పి మైక్‌లో ఆదేశాలు జారీ చేశాడు.
కాల్పులు..
చెట్లు కూలినట్లు నలుగురు రైతులు కుప్పకూలిపోయి, రక్తపు మడుగులో గిలగిల్లాడుతూ చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయినా ప్రజల్లో ఏమాత్రం భీతి కనపడడం లేదు. పైగా మరింతగా కెరటాల్లా ఎగసిపడుతున్నారు.
పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఇలా అవుతుందని డిఎస్‌పి అంచనా వేయలేదు.
రాజకీయ పార్టీల నేతలందరినీ ముందుగానే ఎక్కడికక్కడ వారి వారి ఇళ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు. అయినా ప్రజల్లో ఇంతటి ఆగ్రహం ఉందని గ్రహించలేదు. ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కేయకపోవడం మీడియా వారికే ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు, కంపెనీ వారు అక్కడ నుండి నిష్క్రమించడం ప్రారంభించారు.
నాలుగు రోజులు గడిచింది. అక్కడంతా శ్మశాన వాతావరణం అలుముకుంది.
 

                                                                                ***

శరత్‌, దీప్తి, అవినాష్‌, సాత్విక్‌, స్పందన చిన్నప్పటి నుండీ స్నేహితులు.
అందరూ సాఫ్ట్‌వేర్‌లో జమ్స్‌.. ఆర్థిక సంక్షోభంతో వాళ్లు చేసే కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగాల వేటలో చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
శరత్‌ వస్తూనే 'మన చదువులకే బోలెడంత ఖర్చయ్యింది. తల్లిదండ్రులకు మన మొఖాలేం చూపిస్తాం!' అన్నాడు చేతిలో పేపర్‌ కప్పులోని టీని సిప్‌ చేస్తూ.
'ఇలా అనుకుంటూ బాధపడేకన్నా ఓ నిర్ణయానికి వస్తే మంచిది కదా!' అంది దీప్తి.
'నిర్ణయానికి రావాలంటే ఈ కష్టాలన్నింటికీ కారణాలేంటో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎలా ముందుకు వెళ్లాలో తెలిసేది. అసలు ఈ ప్రభుత్వాలు ప్రజల గురించి కాకుండా కొంతమంది బడాబాబుల మెహర్బానీల కోసం పనిచేస్తున్నాయి. ఆ సమస్యను పరిష్కరించుకోకుండా ఈ వేట ఎంత వేటాడినా ఒక్క ఉద్యోగం చిక్కదన్నదీ నాకైతే అర్థమైంది. అందుకే ఈ రోగానికి చికిత్స చేయాల్సిందే.. అది ఎలాగా? అనేదే ఆలోచించాలి' అన్నాడు శరత్‌.
'మనందరికీ అప్పుడెప్పుడో యువజన సంఘం వారు సభ్యత్వం ఇచ్చారు గుర్తుందా?' అంది స్పందన.
వెంటనే అందరూ ఆ రశీదుల కోసం బ్యాగ్స్‌లో వెతికారు. ఎలాగైతే వాటిని సాధించారు. అందరూ ఆ యువజన సంఘం ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
 

                                                                                    ***

'యువజన సంఘం ఆఫీసుకు వెళ్లి, వాళ్లతో మాట్లాడటమే కాదు.. వారు చేసే కార్యక్రమాల్లో అడుగులు కలిపాం. ఇప్పుడది మా సంఘం. ఇది దేశం మొత్తం ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఉందన్న విషయం వెళ్లిన కొద్దిరోజుల్లోనే మాకు అవగతమైంది. మా ఆలోచనలకూ అక్కడ విలువ ఉందని వెళ్లిన కొద్దిరోజుల్లోనే మాకర్థమైంది!' ఇంటికొచ్చాక తండ్రి విశ్వంతో చెప్పాడు సాత్విక్‌.
'ఏమోరా!' అంటూ విశ్వం పెదవి విరిచాడు.
'కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుని, ప్రజలకు మనమే మరింత దగ్గరవ్వాలని మేమంతా సూచించాం. అందుకు సంఘం కూడా చర్చించి, నిర్ణయం తీసుకుంటామంది!' ఎంతో ఆనందంగా తల్లి స్వప్నతో చెప్పింది దీప్తి.
'చూద్దాం.. ఏమవుతుందో' అంది స్వప్న.
మేమంతా రాష్ట్ర ఆఫీసులోనే పని మొదలుపెట్టాం. ఏ జిల్లాలో సమస్య వచ్చినా అక్కడికెళ్లి పరిస్థితిని అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడం ప్రస్తుతం మా పని. అవసరమైతే పై నాయకత్వం మమ్మల్ని అక్కడే కొన్నిరోజులుండి, పనిచేయమంటే చేస్తాం. ఇలా చేయడం మొదలైన ఏడాదికే ప్రజల్లో, మా తల్లిదండ్రుల్లో కొంత మంచిపేరు సంపాదించుకున్నామనే చెప్పాలి.
 

                                                                               ***

ఆ రోజు మీడియాలో వచ్చిన వార్తలకి మాకందరికీ రక్తం వేడెక్కింది. ఆ వార్తల్ని వెంటనే సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. అందరం కలిసి సమావేశమై చర్చించాం. శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, బీలను సందర్శించి, అక్కడి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని, నివేదిక ఇవ్వమని సంఘం మాపై బాధ్యత పెట్టింది. అందరం పయనమై అక్కడకు చేరుకున్నాం. ఆ గ్రామాలన్నీ తిరగడానికి వాహనం ఒకటి మాట్లాడుకున్నాం.
మా వాహనం పట్టణాన్ని దాటి పడమరవైపు వెళ్లి, ఆగింది. అక్కడ అందరం దిగి ఒక్కసారి చుట్టూతా పరికించాం.
పచ్చని పొలాలు తలలూపుతూ స్వాగతం పలుకుతున్నాయి. మరోవైపు పక్షుల కిలకిలారావాలు. పచ్చని పచ్చిక బయళ్లలో అలమందలూ హాయిగా మేస్తున్నాయి. కనుచూపుమేర పచ్చటి తివాచీ పరిచినట్లే ఉంది ఆ ప్రాంతమంతా. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లపై పిచ్చుకలు అందంగా కట్టుకున్న గూళ్లు. అల్లంత దూరాన చుట్టూ పచ్చదనాన్ని అంచులా అలంకరించుకుని వుంది బీల. గోదావరి తీరాన్ని, ఇంకా చెప్పాలంటే కోనసీమను తలపించేలా కొబ్బరిచెట్లు కనిపించగానే- 'ఆహా ఎంత ఆహ్లాదంగా వుంది ఈ ప్రాంతం' అంది దీప్తి.
ఆ కొబ్బరి తోటల్లో బొమ్మరిల్లులా ఒదిగి ఉంది మేము సందర్శించిన మొదటి గ్రామం కుత్తుమ. మేము యువజన సంఘం నుంచి వచ్చామని తెలియగానే.. గ్రామస్తులు మా చుట్టూ గుమిగూడారు. మమ్మల్ని ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు సుబ్బారావు ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ చాలామంది మాట్లాడారు. ఆడామగా, పిల్లాపాపా. అందరినోటా ఒకటే మాట- 'మాకు థర్మల్‌ పవరు ప్లాంటు వద్దు. మా ఊరిని, మా బీలను నాశనం చేయొద్దు!'
'ఇంతకీ బీల ఎక్కడుంది? అదెందుకు నాశనం కాకూడదని అనుకుంటున్నారు?' అనడిగాడు శరత్‌.
ఐదారుగురు ఒకేసారి స్పందించారు.
'అది మా పేనం బావూ. మా జీవిత మంతా అదే. ఇదిగో మా ఊరికి ఆనుకునే ఉంది. రండి- చూపిస్తాం.' అని తీసుకెళ్లారు. ఆ ఊరి పెద్ద రైతు జగన్నాథరావు, ఇంకొందరు రైతులు మా వెంట వచ్చారు.
ఊరికి ఆనుకొనే పొలాలు. ఒకటి రెండు రోజుల్లో నాట్లు వేసుకునేలా ఆకుమళ్లు పచ్చగా పైకి చూస్తున్నాయి. చాలామంది రైతులు పొలాల దమ్ము పనుల్లో ఉన్నారు. భూగర్భంలో అమర్చిన గొట్టాల్లోంచి నీరు నిండుగా వస్తోంది. 'అదిగోండి ఆ నీరంతా బీల నుంచి వస్తున్నదే! అక్కడ మోటార్లు పెట్టి తోడుతున్నాం. భూమిని మూడడుగుల లోతులోంచి గొట్టాలు అమర్చాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరొస్తుంది. బీల ఎప్పుడూ ఎండిపోదు. వేసవిలోనూ ఆరుతడి పంటలు పండిస్తాం!' అని వివరించాడు జగన్నాథరావు.
కనుచూపు మేరా బీల కనిపించింది. రకరకాల చెట్లూ, పొదలతో ఉంది. నీటితో నిండుగా ఉంది.
'మహేంద్ర తనయ నది నుంచి వచ్చే నీరు బీలలోకి చేరుతుంది. నిత్యం నేల చెమ్మగా ఉండడం బీల లక్షణం. ఈ కారణంగానే జిల్లాలోని ఉద్దానం ప్రాంతం నిరంతరం కొబ్బరితోటలతో, ఫలవృక్షాలతో కళకళలాడుతూ ఉంటుంది. సోంపేట థర్మల్‌ పవరు ప్లాంటు కోసం ప్రభుత్వం ఈ బీలను, చుట్టూ ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూముల్ని నాగార్జున నిర్మాణ కంపెనీకి ఎకరం రూ.80 వేల చొప్పున కట్టబెట్టింది' చెప్పాడు ఓ పెద్ద రైతు.
చాలామంది రైతులు బీల నీటిని తమ పొలాలకు దగ్గరగా మళ్లించుకొని, అక్కడి నుంచి మడుల్లోకి మోటార్లతో తోడుతున్నారు. అక్టోబరు నెలలో వేసి, మార్చిలో పంట తీసిన వేరుశనగ ఆనవాళ్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొన్ని మళ్లలో దమ్ములో కలియదున్నే పచ్చిరొట్ట ఏపుగా పెరిగి ఉంది.
'బీలపై ఆధారపడి దాదాపు రెండు వేల ఎకరాలు సాగవుతున్నాయి. మూడుచోట్ల ప్రభుత్వమే ఎత్తిపోతల పథకాలు నిర్మించింది. అయితే, చాలా ఏళ్ల క్రితమే పూర్తయిన రుషికుద్ద, బెంకిలి పథకాల నిర్వహణ సరిగ్గా లేక, విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయి ఇప్పుడు మూలనపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కుత్తుమ పథకం మొత్తం పూర్తయింది. మోటార్లు మాత్రం రావాల్సి ఉంది. బీల ప్రభావంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరడుగుల లోతు నుంచే నీరు రావడం మొదలవుతుంది. 30, 40 అడుగులకు వెళితే బోర్లు నిండుగా పారతాయి. చాలామంది రైతులు మోటారు బావులు వేసుకొని, కాయగూరలు, అపరాలు, వరిధాన్యం పండిస్తున్నారు' వివరించాడు జగన్నాథరావు.
అక్కడకి మేం చేరుకోగానే.. పొలాల్లో నుంచి చాలామంది రైతులు మా దగ్గరకు వచ్చారు.
'ఇప్పుడు సెప్పండి బావూ.. ఇది బీడు భూమా? పనికిరాని భూమా? బీల మాకెంత మేలు సేత్తందో సొయంగా సూడండి. బీల ఉపయోగం లేందైతే.. మరి పెబుత్వమే మూడు ఎత్తిపోతల పదకాలు ఎందుకు పెట్టినట్టు? రిపోర్టు ఇచ్చిన అధికారులకు బుద్ధున్నాదా? మంత్రికి మతున్నాదా? అలగంటే ఎలగా బాపూ?' అని ప్రశ్నించాడు ఓ వృద్ధ రైతు.
తర్వాత రుషికుద్ద గ్రామం మీదుగా వెళ్లాం. వీధుల్లోని సిమెంటు రోడ్లపై చాలాచోట్ల ఎండబెట్టిన ధాన్యాన్ని కలయబెడుతూ మహిళలు కనిపించారు. ఆ ధాన్యం బీల చలవేనని మాతో మాట్లాడిన కామేశ్వరరావు, పార్వతి, పద్మనాభం చెప్పారు.
ఇటు బీల, అటు సముద్రం. ఆ రెంటి మధ్యా ఉన్నాయి మత్స్యకారుల గ్రామాలు. తొలుత ఇసకపాలెం, తరువాత రామయ్యపట్నం, పల్లి గొల్లగండి, చేపల గొల్లగండి వెళ్లాం.
'బీల పోతే.. మత్స్యకారులకు మరింత నష్టం. బతుకు చాలా కష్టపోతాది' అన్నారు ఇసకపాలెం సర్పంచి.
'పవరు ప్లాంటు వస్తే, బీల మొత్తం బూడిదతో నిండిపోతుంది. కొన్నాళ్లకి అది కూడా సరిపోదు. మా ఊళ్లన్నీ ఖాళీ చేసేయాలి. పరవాడ ఎన్‌టిపిసి ఉత్పత్తి సామర్థ్యం 1000 మెగా యూనిట్లే! ఇక్కడ ప్రతిపాదించిన ప్లాంటు సామర్థ్యం 2640 మెగా యూనిట్టు. ఇది సృష్టించే బూడిదా, కాలుష్యం లెక్కకు అందదు. మా ఊరికి పెద్దగా భూముల్లేవు. మూడు వేలకు పైగా జనాభా ఉంది. మా ఆడపిల్లలు పక్క ఊళ్లో వ్యవసాయ పనులకు వెళతారు. బీల పోతే ఆ పనులుండవు. తాగునీరుండదు. సముద్రం కలుసితమైపోయి, చేపలు బతకవు. అన్నీ పోయాక మేమింకెలా బతుకుతాం? అందుకే.. ప్రాణాలకు తెగించాం' అన్నారు అక్కడికి వచ్చిన కొందరు చదువుకున్న యువకులు.
'వేసవిలో సముద్రంలో చేపలవేట లేనప్పుడు బీలే మాకు ఆధారం. అక్కడ అన్నిరకాల చేపలూ దొరుకుతాయి. అవి తింతాం. అమ్ముకుంతాం. బీల మా సల్లని తల్లి. ఆయమ్మ నేకుంటే మేం నేవు.' అంది అక్కడే ఉన్న లక్ష్మమ్మ.
'బీలలో చేపలవేటపై మాణిక్యపురం, చేపల గొల్లగండి, పల్లి గొల్లగండి, రామయ్యపట్నం, ఇసకపాలెం తదితర గ్రామాలకు చెందిన 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. చేపల వేట తప్ప వేరే ఆధారం లేని తాము బీల లేకుండా ఎలా బతకాలి?' అని నూకమ్మ, ఈశ్వరరావు, బాపనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
'బీల ఆధారంగా మాణిక్యపురం, బొరివంకలో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు దాదాపు 16 మత్స్యకార గ్రామాలకు, ఐదువేల జనాభాకు తాగునీటిని అందిస్తున్నాయి' వివరించారు సర్పంచి.
పల్లి గొల్లగండిలో రాజమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ముందుకొచ్చింది. ఆమె చాలా హుషారుగా మాట్లాడింది. 'నాయనా బీలంటే ఏటనుకున్నావ్‌? నన్ను కన్నతల్లి తల్లికి తల్లి. శానాకాలం నుంచి మమ్మల్నందర్నీ కాపాడకుంటా, పెంచుకుంటా వత్తంది. ఫేక్టరీ పెట్టి ఆయమ్మని నాసినం సేద్దామంటే- అది నాయమా సెప్మి?' అంది.
'ఎప్పుడూ ఇలాటి దురమార్గం జరగనేదు నాయనా. ఆల్లకేం పోయేం కాలమోగానీ, బీలనీ, ఊళ్లనీ నాసినం సేద్దామని సూత్తన్నారు.' అని శాపనార్థాలూ పెట్టింది.
'ఇంతకీ బీల మిమ్మల్ని బతికిస్తుందా అమ్మా?' అని అడగ్గానే-
'నేను సెప్తాను ఇంటవా? బీల మా దేవత బావూ.. అక్కడ పొన్నంగడ్డి దొరుకుతాది. 11 నెలలో (నవంబరు) గడ్డి కోసి తెస్తాం. ఎండినాక గూడచాపలు అల్లుతాం. అవి వానాకాలంలో ఉడుపులు కెల్లేవాళ్లకి తడవకుండా పనికొత్తాయి. ఊళ్లకి తీసుకెళ్లి అమ్ముతాం. ఆటెట్టి ఇంటోకి అవీఇవీ కొనుక్కుంతాం. తుంగగడ్డితో పడుకునే పెద్ద చాపలు అల్లుతాం. కరాస గడ్డితో ఇల్లు నేసుకుంతాం. మరి ఆ అమ్మ వల్లే తలదాచుకుంతన్నాం. చాపలమ్ముకొని బతుకుతున్నాం. ఇలగ ఈ చుట్టుపక్కల ఊళ్లన్నీ కలిపి ఓ 300 కుటుంబాలు బతుకుతున్నం' అని దానమ్మ అనే ఆమె ముందుకొచ్చి, వివరించింది.
'ఇంకా 20 రకాల ఆకుకూరలు దొరుకుతాయి బాపూ. తూటికూర, పొన్నగంటి, కునుకుకూర, నాగలసేరు, బొడ్డుకూర, గురువుకూర, అంబలిమాడు, గుంట తెత్తిరి, బూరుగుకూర, శేషురేసి..' అంది తులసమ్మ.
'చోడంబలి, శేషురేసి కలిపి తింటే- శానా బాగుంటాది' అని తలచుకుంది పక్కన ఉన్న ఓ ముసలమ్మ.
'శానా రకాల సేపలు దొరుకుతాయి. పిత్తపరిగి, సవడా, మార్పు, ఇంగిలి, మిట్ట, గొరక, కశింపరిగి, ఎల్లంకి, గనుగు...' అని లిస్టు చదువుతా పోయింది అంతకు ముందు మాట్లాడిన దానమ్మ.
'ఇంట్లో తిండానికి ఏమీనేకపోతే.. ఆయమ్మ దగ్గరికి వెల్లిపోతే.. కలవదుంపో, ఒంటిపువ్వు దుంపో ఇత్తది. ఉడికించుకు తింటే ఆకలి తీరిపోతాది.' అంది రాజమ్మ.
'బీల గురించి మంత్రి ఏడో కూకొని కాదు. ఈడకొచ్చి, మా మధ్యనోంచి మాట్టాడాలా' అని సవాలు విసిరాడు పల్లి గొల్లగండిలో కోదండరావు అనే ఓ నడివయస్సు రైతు.
పలాసపురంలో, లక్కవరంలో, బారువాలో, సోంపేటలో, బెంకిలిలో, జింకిభద్రలో- బీల చుట్టూ హారంలా అల్లుకొని ఉన్న అన్ని గ్రామాల్లోనూ మేము ఇలాంటి మాటలే విన్నాం. కన్నతల్లి గురించి ప్రేమోద్వేగంతో మాట్లాడే బిడ్డలనే చూశాం. గోడల మీద రాసిన నినాదాలే వారి గొంతుల్లో మార్మోగడం గమనించాం.
 

                                                                                    ***

తిరిగి వచ్చేశాం.. ఆ రాత్రి మాకెవ్వరికీ నిద్ర పట్టలేదు. వాళ్ల మాటలు, ఆవేదన.. ఆ చుట్టూ ఉన్న వాతావరణం మమ్మల్ని ఆలోచింపజేశాయి. వారు బీలను కేవలం ఒక చిత్తడి నేలగానో, ప్రకృతి అందంగానో, పిట్టల ఆవాసంగానో, జంతువుల నివాసంగానో చూడడం లేదు. పచ్చదనం ప్రసాదించే దేవతలా చూస్తున్నారు. ఆకలి తీర్చే అమ్మలా చూస్తున్నారు. తరతరాల తరగని అమూల్య సంపదలా చూస్తున్నారు. తమ బతుకునీ, భవిష్యత్తునీ దాంతో ముడేసుకున్నారు. అధికారులు కావాలనే తప్పుడు నివేదిక ఇచ్చినట్టుగా మాకందరికీ అర్థమైంది.
మంత్రికో, అధికారులకో మాత్రమే బీల వట్టి నేల. పనికిరాని పోరంబోకు. అలా మాట్లాడటం ప్రభుత్వ భూమిని అతి చౌకగా ధారాదత్తం చేసే సాకు అని మాకందరికీ అర్థమైంది.
కానీ, ఆ బీల ప్రజలకు కల్పతరువు. బతుకు తెరువు, ఎప్పటికీ ఆదరువు. తల్లిలాంటి బీలను కంటికి రెప్పలా కాపాడుకోవాలనే సంకల్పం, సన్నద్ధత మాకు తారసపడ్డ ప్రతి ఒక్కరిలోనూ కనిపించాయి.
ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? అని ఎదురుచూస్తున్నాం. తెల్లారింది. ఏదో చేయాలన్న తపన మమ్మల్ని నిలువనీయడం లేదు. ఇంట్లో టిఫిన్‌ కూడా తినకుండా స్నానాలు చేసి, ఆఫీసుకు బయల్దేరాం. వెంటనే రాష్ట్ర బాధ్యుల ముందు మా ప్రతిపాదన పెట్టాం. మెజార్టీ ఆమోదించారు. కొంతమంది 'అంత తేలికకాదు' అన్నారు. అయినా అక్కడ పనిచేయాలని నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఎలాగో అధ్యయనం చేశాం కాబట్టి మమ్మల్నే అక్కడికెళ్లి, జిల్లా, స్థానిక సంఘ బాధ్యుల్ని తోడుచేసుకుని పనిచేయమంది.
తెల్లారే వాహనం ఒకటి తీసుకుని, మేమంతా బయల్దేరాం. ఆ గ్రామాల్లోని యువకులందర్నీ రాజకీయ పార్టీలకు అతీతంగా సమావేశపరిచాం. వారి అభిప్రాయాలన్నీ తెలుసుకున్నాం. సమాచార చట్టం కింద అసలు ఎవరికి ఈ భూముల్ని ధారాదత్తం చేస్తున్నారో వివరాలు తీసుకున్నాం. వారితోనే వివిధ రాజకీయపార్టీల నేతల్నీ పిలిపించి, మరోసారి సమావేశమయ్యాం. మాట్లాడాం. వారందరికీ ఏం చేయాలో చెప్పాం.
ఆ సాయంత్రమే ప్రజలందరినీ ఎక్కడికక్కడ చిన్న సమూహాలుగా సమావేశ పరిచాం. విషయం వాళ్లకు వివరించి చెప్పాం. అందరూ సమ్మతం తెలిపారు. భూమిని కాపాడుకోడానికి దేనికైనా సిద్ధమన్నారు.
అంతే.. ప్రజలందర్నీ ర్యాలీగా తీసుకుని, మానవహక్కుల సంఘాల వారినీ, పర్యావరణశాఖ అధికారుల్ని కలిసి, వినతిపత్రాలు సమర్పించాం. అంతేకాదు. అన్ని గ్రామాల నుండి ఐదుగురేసి చొప్పున కోర్టుల్లో కేసులు వేయించాం.
మేము అప్పటికి ఎంతో తెలివిగా చెప్పామని అనుకున్నాం. కానీ ప్రజలు అంతటితో ఊరుకోలేదు. రాజకీయాలకు అతీతంగా నేతలు, పెద్దలు, రైతులు, పేదలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారు.
'మా నోట్లో బూడిద కొట్టుకోదలుచు కోలేదు. మా తరం అంతమైనా రేపటితరాన్ని, మా బీలను మేం కాపాడుకుంటాం.' అన్న నినాదాలు రాసిన బ్యానర్లు అన్ని గ్రామాల పొలిమేరల్లో కట్టారు. ఆ కంపెనీ చుట్టూతా వంతులవారీ వెయ్యిమంది చొప్పున రోజూ కాపలా కాయడం మొదలుపెట్టారు.
అయినా కంపెనీ వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం పోలీసు బలగాల్ని రంగంలోకి దింపింది.
ఇక లాభం లేదనుకుని, ప్రజలందర్నీ కలుపుకుని బీలలో మానవహారంగా మోకాలు లోతు నీళ్లల్లో నిలబడ్డాం. దీనికి 'జల మానవహారం' అని పేరు పెట్టాం. ఇది ఒకరోజు కాదు. పదిహేను రోజులు గడిచింది. ప్రజలెవ్వరూ వెనక్కి తగ్గటంలేదు. తినడానికి, కాలకృత్యాలు తీర్చుకోడానికి తప్ప నీళ్లల్లో నుండి ఎవ్వరూ బయటికి రావడం లేదు. కాళ్లు పాచిపోయాయి. ప్రధానంగా మహిళలు చాలా పట్టుదలగా వున్నారు. ఏదో ఒకటి తేల్చుకోందే ఈ నీళ్లల్లో నుండి బయటికి వచ్చేది లేదన్నది మా అందరి నిర్ణయం. ఇది ఎన్నాళ్లు సాగుతుందో చెప్పలేం. కానీ ప్రజల పట్టుదల చూశాక మాకు మరింత ఉత్తేజం కలిగింది. మా ప్రాణాలు పోయినా ఫర్వాలేదనిపించింది. పదిహేనో రోజు మీడియా అంతా అక్కడ నుండి లైవ్‌ షో ప్రసారం చేసింది. ఈ వార్త రాష్ట్రమంతా వ్యాపించింది. మాకు మద్దతుగా అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు, రాస్తారోకోలు ప్రారంభమయ్యాయి. కొందరైతే వివిధ జిల్లాల నుండి అక్కడకు చేరుకుని, మాతో పాటు ఆ రోజంతా జల మానవహారంలో పాల్గొన్నారు. దీనిపై దేశ రాజధానిలోని ఢిల్లీలో సైతం ప్రకంపనలు మొదలయ్యాయి. పార్లమెంటును ముట్టడించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ నిర్ణయించుకున్నాయి.
ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఇవన్నీ తెలుసుకున్న విదేశీ కంపెనీకి ఆందోళన మొద లైంది. ఇక అక్కడ నుండి ఉపసంహరించుకోవ డం మేలని నిర్ణయించుకుంది.
'మేమిక వేరే స్థలం చూసుకుంటాం' సదరు విదేశీ కంపెనీకి ఇక్కడ ప్రతినిధిగా వున్న ముత్యాలరావు మంత్రితో అన్నాడు.
'మీదగ్గర ఇప్పటికే చాలా మొత్తం పుచ్చుకుని ఉన్నా, ఎలాగైనా నేనొప్పిస్తా. ఈ ప్రజలకు సరిగ్గా బట్టలు కూడా లేవు. స్థలం ఇస్తే, కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చని వాళ్లకి నచ్చజెప్పి, ఒప్పించే పూచీ నాది' అంటూ మంత్రి బతిమిలాడటం మొదలుపెట్టాడు.
'నీకు లేకపోతే బట్టలు కొనుక్కోమంటు న్నారు ఆ గ్రామ ప్రజలు. నీ చెవికింకా ఆ మాటలు చేరలేదేమో. ఇక మాటలనవసరం. అగ్రిమెంటు రద్దు చేసుకోమని మా బాస్‌ చెప్పేశారు. వేరేచోట స్థలమిప్పిస్తే మంచిది. లేకపోతే డబ్బులు లెక్క చూసుకొని రమ్మన్నారు.' అన్నాడు ముత్యాలరావు.
'అలా మీరు తొందరపడకండి. ముఖ్యమంత్రిగారితో, మా పార్టీ పెద్దలతో మాట్లాడి మీకు రెండురోజుల్లో ఏ విషయం చెపుతాను. ఈ స్థలం మీకెట్లాగైనా కట్టబెడ తాను. మాటంటే మాటే..' అన్నాడు మంత్రి..
ముత్యాలరావు వాళ్ల బాస్‌తో ఫోన్‌లో మాట్లాడి విషయం చెప్పాడు. ఏం చెప్పాడో ఏమో, ఫోను పెట్టేసి.. 'రెండురోజులు లేదు.. ఏంలేదు.. ఇప్పుడే ముఖ్యమంత్రికి ఫోన్‌ చెయ్యి! మా బాస్‌ టైమ్‌ వేస్ట్‌ చేయొద్దంటు న్నారు. ఇప్పటికే చాలా ఇన్వెస్ట్‌ చేశాం. మాకు చాలా లాసైంది.' ఆగ్రహంగా అన్నాడు ముత్యాలరావు.
వెంటనే మంత్రి సిఎంకి ఫోన్‌ కలపమని సెక్రటరీని ఆదేశించాడు. లైన్‌లోకి వచ్చిన ముఖ్యమంత్రికి విషయమంతా వివరించాడు. మంత్రి ముఖం పాలిపోయింది. ఫోన్‌ పెట్టేశాడు.
'మా ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు ఎలాగైనా వేరేచోట స్థలం ఇప్పిస్తాను. ఇక ఇక్కడ ఆశ వదులుకోండి.' అంటూ అతని చేతులు పట్టుకుని బతిమిలాడాడు మంత్రి.
'సరే అదీ చూద్దాం..' అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు ముత్యాలరావు.
ఆ సాయంత్రమే మంత్రి విలేకరుల సమావేశం పెట్టి - 'ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నాం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అదే మా సిఎం గారూ అంటున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ పనీ మా ప్రభుత్వం చేయదు. ఇప్పటి వరకూ జరిగిన దానికి ప్రజల్ని క్షమాపణ కోరుతున్నాం. ఆ కంపెనీ వారికి ఆ స్థలం ఇవ్వమని చెప్పేశాం. ప్రజల పట్టుదల నాకు చాలా ఆనందంగా ఉంది.' అంటూ తనదైన శైలిలో మాట్లాడుతున్నాడు మంత్రి.
 

                                                                                 ***

మా బృందమంతా కొన్నిరోజుల తర్వాత మళ్లీ ఆ గ్రామానికి వెళ్లింది. భూమాతను, కన్నతల్లిలాంటి బీలను కాపాడుకున్నామన్న సంతృప్తి వారి కళ్లల్లో మాకు కనిపించింది. ఆ సంతోషాన్ని కొలవడానికీ ఏ కొలమానాలూ సరిపోవు. మమ్మల్ని చూడగానే ప్రజలంతా చుట్టుముట్టారు. మా మెడల్లో ఆ బీలలో తెంపిన తామర, కలువపూలు గుచ్చిన దండలు వేశారు. మమ్మల్ని ఎత్తుకుని దింపకుండా చాలా దూరం తీసుకువెళ్లారు. ఆ కల్మషంలేని ఆ మనస్సుల్ని వదల్లేక వదల్లేక పట్టణానికి బయల్దేరాం. తెల్లారి మీడియా అన్నింటిలో 'యువ విజయం', 'కుర్రోళ్లు గెలిచారు', 'యువ కెరటాలు' అంటూ హెడ్డింగ్‌లు పెట్టారు.
ఈ ఆనందాన్ని ప్రజలు అస్వాదించేలోపే మళ్లీ ప్రభుత్వం రాష్ట్రంలో 'కాకినాడ, శ్రీకాకుళం దగ్గర అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు భూసేకరణకు ప్రకటన చేసింది. అలాగే మనపక్క రాష్ట్రాలైన, కర్ణాటక, తమిళనాడుల్లో అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు భూములివ్వాలని రైతుల్ని ఆదేశించాయి ఆయా ప్రభుత్వాలు. ఈ పోరాట స్ఫూర్తితో ఎక్కడికక్కడ రైతులు, ప్రజలు ఆందోళన పథం చేపట్టారు. అదే పోరాట స్ఫూర్తితో 'మేము సైతం' అంటూ మా వంతు సహకారం అందించేందుకు ఆయా చోట్లకు 'యువ ప్రయాణం' కొనసాగుతూనే ఉంది. సమస్య లొచ్చినప్పుడు బేల పోకుండా 'కెరటం'లా ఎగసిపడాలన్నదే సోంపేట పోరాటం నేర్పిన పాఠం. ఈ 'కెరటం' తన లక్ష్యం నెరవేరే వరకూ ఎగిసిపడుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరంలో వారి అడుగులు నడుస్తున్నాయి. అక్కడ ప్రాజెక్టు పూర్తికావడం సంగతేమోగానీ.. నిర్వాసితుల సమస్య దారుణంగా ఉంది. గ్రామాలన్నీ ముంపులోనే. వాటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. అక్కడ యువత పరిస్థితి అగమ్యగోచరం.. భవిష్యత్తు అంథకారంగా ఉంది. నిర్వాసితులను ఆదుకునేవరకూ ఆ పాదాలు వెనక్కి వచ్చేది లేదు. వారి పాదాలతో ప్రతి ఇంటి అడుగులు కలుస్తున్నాయి. ఇప్పుడు పాదాలన్నీ అటువైపే నడుస్తున్నాయి.

- శాంతిశ్రీ
8333818985