సాయం సంధ్యవేళ పగలంతా డ్యూటీ చేసి, కందిపోయిన ముఖంతో పడమటి శిబిరానికి తరలివెళ్తున్నాడు సూర్యుడు. ఉదయమనగా ఇల్లొదిలిన కువకువ పక్షులు సూర్యుడితో పాటే గూళ్లు చేరుకున్నాయి. చెట్టు కొమ్మల్లో పాట కచేరీలు పల్లవిస్తున్నాయి. స్కూలు నుండి చిట్టి కుందేలు పిల్లలు వీపు మీది బరువుతో ఇంటికి తిరిగొస్తున్నారు. అన్నీ అలసిపోయిన ముఖాలే. సిటీని అలసట కమ్మేసిందనటానికి సాక్ష్యంగా బస్సుల్లో, ఆటోల్లో, కార్లలో, కాలినడకన జనం ఇంటిదారి పడుతున్నారు.
అసిరిగాడు మాత్రం అవిశ్రాంతంగా ఆ భవనం గేటు ముందు ఇటు - అటు తిరుగుతూనే వున్నాడు. వాడితోపాటు మెడకి పురికోసతో కట్టిన బుజ్జి కుక్కపిల్లనీ తిప్పుతున్నాడు. తోకాడిస్తూ ఆ బుజ్జిది కూడా అసిరిగాడి పట్టుదలకి వంతపాడుతున్నట్టు అటూఇటూ తిరుగుతూనే వుంది. వాడికి సూర్యుడితో పనిలేదు. పక్షులతో నిమిత్తం లేదు. చిట్టి కుందేలు పిల్లలతో సాపత్యం లేదు. ఆ భవంతి యజమానురాలు భావనారెడ్డి రావాలి. తన అందమైన కుక్కపిల్లని చూడాలి. అది వాడి చిన్ని గుండెలో గూడుకట్టుకున్న పంతం. అదేపనిగా సాయంత్రం నాలుగు గంటల నుండి విసుగు - విరామం లేకుండా వాడి ప్రయత్నం కొనసాగుతూనే వుంది. నాలుగేళ్ల అసిరిగాడికి అలసట రావటం లేదు.
అటు భావనారెడ్డి రెండంతస్తుల భవంతిలో సోఫాలో కూర్చొని, తన ముద్దుల పమేరియన్ 'పింకీ'ని వొళ్లో పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంది. చెవులపిల్లి సైజులో వున్న పింకీ క్షణం తన ప్రియమైన యజమానురాలిని, మరోక్షణం టీవీలో కదులుతున్న బొమ్మల్ని మార్చి మార్చి చూస్తూ ఆమె వొళ్ళో పొందిగ్గా అమరిపోయింది. క్షణాలు గడిచేకొద్దీ అసిరిగాడిలో అసహనం పెరిగిపోతూ వుంది. భవనం గేటు దాకా వెళ్లి, మునివేళ్ల పైన నిలబడి తొంగిచూశాడు. వరండా వరకు పరుచుకున్న పచ్చటి లాన్ తప్ప వాడి కంటికి భావనారెడ్డి జాడ మాత్రం కనిపించలేదు. గేటుకున్న ఇనుప కమ్మిని పట్టుకొని, మరింత పైకి తలెత్తి చూశాడు. అలా చూస్తున్నప్పుడే కుక్కపిల్లని కట్టేసిన పురికొస చేతి నుండి జారిపోయి, అదికాస్త పరుగు లంకించుకుంది. కమ్మిని వొదిలి పెట్టి కుక్కపిల్ల వెంటపడ్డాడు అసిరిగాడు.
నిన్న కాదు కాని మొన్నటి వరకూ అసిరిగాడికి ఆ రెండతస్తుల భవంతిలో ప్రవేశం ఉంది. మొన్నటి రోజు వాడు చేసిన వెధవపనికి రెడ్డమ్మ గారు పనిమనిషి శంకరిని పిలిచి 'రేపటి నుండి వాణ్ణి ఇంట్లోకి తీసుకురావద్దు' అంటూ హుకుం జారీ చేసింది. 'సిన్నోడమ్మా! ఈ సారికి తప్పు కాసుకోండి. ఇంకమీన వాణ్ణి వరండాలోనే కూచోబెడతాను' అంటూ రెండు చేతులూ జోడించింది శంకరి. ఆమె విన్నపం రెడ్డమ్మ మనసు మార్చలేకపోయింది.. 'శంకరీ! అలాగైతే రేపటి నుండి నువ్వూ పనిలోకి రానక్కర్లేదు' అన్న భావనారెడ్డి మాటలకి జడిసి 'లేదమ్మ గోరూ! వాణ్ణే లోనికి రాకుండా చూసుకుంటా లెండి!' అంటూ అసిరిగాడి చేయిపట్టి లాక్కెళ్లిపోయింది శంకరి.
అసిరిగాడు వెళ్లిపోతుంటే భావనారెడ్డి చేతుల్లోంచి గెంతి ''కురు కురు'' మంటూ వాడి వెనకే పరుగు తీసింది పింకీ.
'ఏరు పింకీ! కమ్ హియర్ రాస్కెల్!' అన్న యజమానురాలి గద్దింపుకి చటుక్కున వెనక్కి తిరిగి, ఆమె కాళ్ల చుట్టూ తిరగనారంభించింది.
పాపం అసిరిగాడు! లాన్ దాటుకొని గేటు దాకా వెళ్లేలోగా పది పదిహేను సార్లైనా వెనక్కి తిరిగి పింకీ కేసి చూశాడు. అదంటే వాడికి ప్రాణం. వాళ్లమ్మ ఆ మేడలో పనికి లోపలికెళ్లిన దగ్గర్నుంచి వాడి ఆటా - పాటా పింకీతోనే. తను పరిగెత్తితే అది తన వెనకే పరిగెడుతుంది. తను ఎగిరి గంతేస్తే అదీ ఎగిరి గంతేస్తుంది. తను రెండు చేతులు నేలకానించి నడిస్తే అదీ అలాగే నడుస్తుంది. తను చేతులు తీసేసి రెండు కాళ్లపైన నిలబడితే పింకీ కూడా రెండు కాళ్లపైన నిలబడుతుంది. రేపట్నుంచి ఆ దోస్తీ కుదరదన్న ఆలోచన రాగానే వాడి చిట్టి మనసు తట్టుకోలేకపోయింది.
గేటు దాకా వచ్చిన అసిరిగాడు చివరిసారి అన్నట్టు ''పింకీ'' అంటూ కేక పెట్టాడు. వెంటనే అసిరిగాడి వద్దకి పరుగు పెట్టింది పింకీ. భావనారెడ్డి కోపం నసాళానికెక్కింది. చేతిలో బెత్తం పట్టుకొని ఆమె వస్తుంటే సివంగి నడచి వస్తున్నట్టే అనిపించింది శంకరికి. వెంటనే అసిరిగాణ్ణి ఎత్తుకొని చంకలో బిగించుకుంది. నాలుగు బెత్తం దెబ్బలు పడగానే పింకి ''కురు.. కురు..'' అంటూ లోపలికి పరిగెత్తటం, ఆలోగా అసిరిగాడితోపాటు శంకరి గేటు దాటేయటం ఏకకాలంలోనే జరిగిపోయాయి.
అసిరిగాడి వొంటిమీద బెత్తం పడకపోవటంతో మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది శంకరి.. కానీ గుడిసె దగ్గరికి చేరుకున్నాక అసిరిగాణ్ణి కిందకి దించి, నిట్టాడికి వేలాడుతున్న ఉట్టి తాడుతో నాలుగు తగిలించింది - 'యాలరా నీకి.. దొరసానమ్మ నిన్ను బొక్కమనిస్తే, ఆ కుక్కకి యాల బెడితివిరా సచ్చినోడా! ఆ పందినాయాలితో పాటు నువ్వూ యెలిపోయున్నా బాగుండేది' తల్లి ఏడిస్తే పిల్లలూ సహజంగానే ఏడ్చేస్తారు. అసిరిగాడు కూడా అంతే.
'యేందే తల్లీ! నాలుగు సొంవత్సరాలైనా నిండల్యా. ఆన్నట్టుకొని ఆ నాయాలితో యెలిపొయ్యుంటే బాగుండేదంటవు. ఈ పాటికి ఆడు యాత్లో సచ్చి సొట్టబొయ్యుంటడు. ఇంకోపాలి ఆ యెధవతో సంగడి కట్టమాకు. ఆ...' తండ్రి యానాదయ్య అడ్డుపడకపోతే మరోనాలుగు అంటించి ఉండేదే.
''సూడు నాయినా మరి. గిలిగింత లేదు. యీనిక్యాల దొరసాని కుక్కతో నేత్తం. తింటానికి పెట్టిన రొట్టెని ఆ కుక్కకి పెడతం.. యాలనే?' రోషం, దు:ఖం కలగలిసిన స్వరం. తన కూతురు బాధని అర్థం చేసుకున్నాడు యానాదయ్య. అందుకే అన్నాడు. 'ఆడు సరే పొట్టిగాడు. ఆ యమ్మకైనా యితం వుండక్కర్లా. వొట్టి గొడ్డుమోతు యవ్వారం!'
'పో... పోయ్యీ! నువ్ పోయి యితమో కాదో కనుక్కొరాపో' అంది ఆవేశాన్ని అణుచుకోలేక.
నిజమే. యానాదయ్య మాటల్లో న్యాయం వుంది. భావనారెడ్డికి పెళ్లి అయ్యి, పద్దెనిమిదేండ్లు దాటినా పిల్లాజెల్లా లేరు. అందులో తన లోపం ఏమీలేదు. ఆ విషయం తనకు తెలుసు. నరసారెడ్డి లోపమూ లేదు. కోట్ల విలువ చేసే ఆస్తులిచ్చినా, వందలకోట్ల వ్యాపారాలిచ్చినా పిల్లలు లేకపోవడమే పెద్ద వెలితి వారి జీవితాల్లో. ఇరుగూ పొరుగూ మాటల్ని, ఆడబడుచుల దెప్పి పొడుపుల్ని, అయినవాళ్ల సూటిపోట్లని తట్టుకొని, ఆమె అలవాటు పడిపోయింది. తన భర్త మంచివాడు కాబట్టే మరో పెళ్లి ఆలోచన రానివ్వలేదు మనసులో. తను దాంపత్యానికి ఎలాంటి కొరతా రానివ్వలేదు.
శంకరి భర్త సామయ్య మనువయ్యాక నాలుగేళ్లయినా సరిగ్గా కాపురం చేయలేదు. కూలిపని చేసేవాడు. ఆ డబ్బంతా సారాయి కొట్టుకి అప్పజెప్పి, ఇంటికొచ్చేవాడు. వచ్చీరావటంతోనే అకారణంగా శంకరిని చావబాదేవాడు. ఎప్పుడైనా యానాదయ్య కలగజేసుకొంటే, మామ వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అతడిపైనా చేయిచేసుకొనేవాడు. అదేమని అడిగే ధైర్యం యానాదయ్య చేయలేదు. చేసినా పర్యవసానం అతడికి తెలుసు కాబట్టి, అమాయకురాలు శంకరిని వెంటబెట్టుకొని సిటీకి వచ్చేశాడు. మణికొండలో ఓ ప్లాటుకి కాపలా ఉంటానని అందులోనే ఓ గుడిసె వేసుకొని, కడుపులో బిడ్డని మోస్తున్న కూతురితో ఉండిపోయాడు. ఆ పూరి గుడిసెలోనే అసిరిగాడు పురుడు పోసుకున్నాడు.
తండ్రి అత్తెసరు వేన్నీళ్లకి చన్నీళ్ల సాయంగా భావనారెడ్డి వాళ్లింట్లో పనికి కుదిరింది శంకరి. అసిరిగాడికి రెండేళ్ల వయసు వచ్చేసరికి చంకనేసుకుని పనికి వెళ్లేది. వాళ్ల వసారాలో వొదిలేసి, పని చూసుకొంటున్నప్పుడు ఏడ్చి గీ పెట్టే అసిరిగాడి కోసం గిలక తెచ్చిపెట్టింది భావనారెడ్డి. వాణ్ణి ముట్టుకోక పోయినా ముద్దుచేసేది. కార్లో షికారుకి వెళ్లినప్పుడల్లా వాడికో కొత్త డ్రెస్సో లేక కొత్త చెప్పులో ఏదో ఒకటి తీసుకొచ్చేది. పోగా పోగా తాను తినే టిఫిన్లోంచి కొంచెం కొంచెం వాడి నోటికందించి, ఆనందపడేది. వాడెప్పుడైనా ఆమె దగ్గరగా రావటానికి ప్రయత్నిస్తే మాత్రం ''రేరు రాస్కెల్'' వెళ్లు.. వెళ్లు దూరంగా' అంటూ మెత్తటి స్వరంతో బెదిరించేది. అంత పెద్ద రెండతస్తుల భవనంలో ఒంటరితనంతో విసిగిపోయిన భావనారెడ్డికి అసిరిగాడి సాన్నిహిత్యంలో రోజులు అలవోకగా దొర్లిపోయాయి.
కొన్ని కొన్ని అనుభూతులు వివరించటానికి కవిత్వాలు, కథలు, మాటలు కూడా చాలవు. ఒక మొక్క పక్కన రెండోమొక్క నాటి చూడండి. రెండింటి ఎదుగుదల ఎంత వేగంగా జరుగుతుందో.. అయితే ఒక్కోసారి కాలం కొట్టే దెబ్బ విచిత్రమైన మార్పును తెస్తుంది జీవితంలో.
సంవత్సరం పాటు అసిరిగాడితో సంతోషంగా గడిపిన కాలం అంతలోనే పక్కకి మళ్లింది. ఉన్నట్టుండి భావనారెడ్డి ఓ రోజు పమేరియన్ కుక్కపిల్లని ఇంటికి తీసుకొచ్చింది. ఆ బుజ్జిది ఎంత అందంగా ఉందో. చిట్టి కుందేలు పిల్లలా ఉంది. గునగునా పరిగెడుతుంటే భావనారెడ్డి కంటే ఎక్కువగా ఆనందపడిందీ, గెంతులేసిందీ అసిరిగాడే. అయితే ఆవిడమాత్రం వాడు దాన్ని పట్టుకోబోతుంటే మొదటిసారి కసురుకొంది. 'రేరు! పింకీని పట్టుకోవద్దు. ముట్టుకున్నావో నీ తోలు వొలిచేస్తా!'
ఆ గొంతు విని అంట్లు తోముతున్న శంకరి గభాల్న బైటికి వచ్చింది వంటింట్లోంచి. అమ్మగారి ముఖంలో కోపం గమనించి 'రేరు అసిరిగా! ఏం జేస్తివిరా?' అంది కొడుకు దగ్గరికొస్తూ.
'వాడి మురికి చేతుల్తో పింకీని పట్టుకుంటున్నాడు. తీసుకెళ్లు వాణ్ణి ఇక్కణ్ణుంచి' తిరిగీ అదే తీవ్రత ఆమె స్వరంలో ఉన్నాయి.
మరో మాట మాట్లాడకుండా కొడుకుని చేయిపట్టి లాక్కెళ్లింది శంకరి.
అయినా భావనారెడ్డి కంటే అధికంగా అసిరిగాడికే మాలిమైంది పింకీ. ఆవిడకి నచ్చని విషయం కూడా అదే. కాబట్టే సాధ్యమైనంతగా అసిరిగాడు ఇంట్లో ఉన్నంతసేపూ పింకీని తన వద్దే ఉంచుకునేట్టు జాగ్రత్త పడింది. కానీ అదేం చోద్యమో ఆ బుజ్జిది మాత్రం సందు దొరికితే చాలు అసిరిగాడి దగ్గరకి వరండాల్లో పరిగెత్తుకొచ్చేది. తోక ఊపుకుంటూ వాడి చుట్టూ తిరిగేది. వాడికీ పింకీ అంటే వల్లమాలిన ప్రేమ. అంచేతే అది దగ్గరికి రాగానే వరండాలో ఇట్నుంచటు, అట్నుంచిటు పరుగు పెట్టేవాడు. వాడితోపాటు పింకీ కూడా పరిగెత్తేది.
నాలుగు రోజుల తర్వాతగానీ అసిరిగాడి పట్ల తన దురుసుతనం ఎందుకో అర్థంకాలేదు శంకరికి. సంతానం లేకపోవటం వల్లే మొదట్లో అసిరిగాణ్ణి దగ్గరికి తీసింది. ఓ ఏడాదిపాటు వాడితో ప్రేమగా ప్రవర్తించింది. ఏ రోజూ చేతుల్లోకి తీసుకోకపోయినా వాడికోసమని రెండుమూడు జతల బట్టలు తెచ్చింది. వాడు ఏడుస్తుంటే చూళ్లేక ఆడుకోవాలని గిలక కొనిపెట్టింది. రోజూ ఉదయం వాడింటికి రాగానే ఓ గ్లాసులో పాలు పోసి, మరో రెండు బిస్కెట్లు జత చేసి వాడికోసం వరండాలో పెట్టి ఉంచింది. ఆమె పట్ల ఆ పసిహృదయంలో ప్రేమ మొలకెత్తి రోజూ ఆవిడ కళ్లముందే అసిరిగాడు ఆడుకోవటం మొదలుపెట్టాడు. వాడి చిలిపి చేష్టలకి ఎంతో ముచ్చటపడేది భావనారెడ్డి. అయినా ఆమె కడుపులో కాయ కాయలేదు. ఆ కోపమే ఆవిడ చేత పింకీని కొని ఇంటికి తీసుకొచ్చేట్టు చేసింది. కానీ తాను ఊహించిందొకటైతే వాస్తవానికి జరిగింది మరోలా ఉంది. పింకీకి ఎంతసేపూ అసిరిగాడి మీదే గురి. వాడు కనిపిస్తే చాలు తోక ఊపుకుంటూ వాడి వెంటపడుతుంది. వాడు ఆడించినట్టల్లా ఆడుతుంది. తానెవరి నుండి దూరం కావటానికి పింకీని ఇంటికి తెచ్చిందో, వాడితోనే పింకీ తైతక్కలాడటం భరించలేకపోయింది భావనారెడ్డి. ఆ కారణంగానే నిత్యం పింకీనీ తన ఒళ్లోనే కూచోబెట్టుకుంటుంది. అయినా వరండాలో అసిరిగాడి అలికిడి వినగానే ఉన్నఫళంగా వొళ్లోంచి దూకి, వరండాలోకి పరుగుదీస్తుంది. తనకి నచ్చనిపని ఎవరు చేసినా భావనారెడ్డికి అరికాలిమంట నెత్తికెక్కుతుంది! వరండాలోకొచ్చి బెత్తంతో నాలుగు వడ్డించి, తనతోపాటు తీసుకెళ్లిపోయేది పింకీని.. పాపం ఇవేవీ తెలియని అసిరిగాడు మాత్రం పింకీ కోసం భావనారెడ్డి గది గుమ్మం దాకా వెళ్లేవాడు. ఆమె చూడకుండా ''యిస్.. యిస్..'' అంటూ పింకీని పిలిచే ప్రయత్నం చేసేవాడు.
నిన్న కాక మొన్నటి రోజు జరిగిన చిన్న విషయం అసిరిగాణ్ణి ఆ భవనం నుండి దూరం చేయడానికి కారణమైంది. ఆ రోజు సాయంత్రం వరకూ అసిరిగాడికి దూరంగా ఉంచే ప్రయత్నంలో పింకీని తనతోపాటే తిప్పుకుంది భావనారెడ్డి. సాయంత్రం దాకా అసహనంగానేనైనా పింకీ కోసం ఎదురుచూస్తూ గడిపాడు అసిరిగాడు. ఉదయం తనకోసం యజమానురాలు పెట్టిన పాలనీ, బిస్కెట్లనీ అలాగే ఉంచేశాడు. పింకీ ఆ ఇంట్లో ప్రవేశించిన లగాయితు ఓ బిస్కెట్ ముక్క దానికి పెట్టడం కూడా వాడికి అలవాటైపోయింది. సాయంత్రం తల్లి ఇంట్లో పనంతా ముగించుకొని, బైటికొచ్చే వేళైనా పింకీ కనిపించక పోయేసరికి మొదటిసారి భావనారెడ్డి గదిలోకి అడుగుపెట్టే ధైర్యం చేశాడు.
''యిస్... యిస్....'' అన్నాడు మంచంపైన పడుకున్న ఆవిడ పక్కనే పింకీని చూసి. అదీ అర్థమైనట్టు ''కురు.. కురు...'' అంది. అసిరిగాడు చప్పుడు చేయకుండా మంచం దగ్గరకెళ్లి బిస్కెట్ ముక్కని పింకీకి చూపాడు.
చప్పున ఎగిరి మంచం దూకి, అసిరిగాడి దగ్గరికి పరుగు పెట్టింది పింకీ. యాధృచ్చికమో, కాకతాళీయమో అప్పుడే లేచిన భావనారెడ్డికి ఆ దృశ్యం త్రీడి స్క్రీన్లా అతి పెద్దగా, భయంకరంగా కనిపించింది. అంతే... సివంగిలా లేచి కూచుంది. ఆ ఇంటి నుండి అసిరిగాణ్ణి బహిష్కరించింది.
అయితేనేం - అసిరిగాడి కోసం గ్లాసులో పాలు, పక్కనే రెండు బిస్కెట్లు వరండాలో పెట్టడం మానలేదు.
'అమ్మగోరూ! వాణ్ణి రావొద్దంటిరి గద. ఈ పాలు, బిస్కత్తులు ఎవులికోసం?' అని అడిగింది శంకరి భావనారెడ్డి వాటిని వరండాలో పెట్టడం చూసి.
'సాయంత్రం నువ్వెళ్లేప్పుడు తీసుకెళ్లు. రోజుకో గ్లాసుడు పాలైనా తాగకపోతే ఎలా ఎదుగుతాడు వాడు' అంది ముఖం తిప్పుకుంటూ.
శంకరి చూళ్లేదు కానీ అలా తిప్పుకున్న క్షణంలో ఆమె కళ్లలో మెరిసిన సన్నటి నీటి తెర. మరోమాట మాట్లాడకుండా లోపలికెళ్లిపోయింది భావనారెడ్డి.
రెండు రోజులుగా ఆమెలో తెలీని వెలితి. పింకీని వొళ్లో పెట్టుకున్నా తన మంకుపట్టును తన మనసే గుర్తిస్తున్నంతగా ఇబ్బందిపడింది. బొటన వేలంత లేని వెధవ అంత ధైర్యంగా తన గదిలోకి రావటమే ఆమెను మెలిపెడుతున్న సమస్య. గుండెల్లో సన్నటి గీతలాంటి బాధ. అయినా సరే ఆ వెధవని తను చూడకూడదని అనుకుంటూనే గదిలోంచి వరండాలోకి చూపులు సారించింది. అంతలోనే సర్దుకొని పింకీని గట్టిగా పట్టుకొని, టీవీ ఆన్ చేసి కూచుంది.
సరిగ్గా అప్పుడే అసిరిగాడు ఆ భవనం ముందు దిబ్బలో దొరికిన కుక్కపిల్ల మెళ్లో పురికొస కట్టి, ఇట్నుంచి అటు అట్నుంచిటూ తిరుగుతున్నాడు. క్షణక్షణానికి వాడిలో అసహనం పెరిగిపోతోంది. భావనారెడ్డి రావాలి. వాడి కుక్కపిల్లని చూడాలి. అదొక్కటే వాడు కోరుకుంటున్నది. ఆమె రావటం ఆలస్యమౌతున్న కొద్దీ వాడిచేయి చొక్కా మీది జేబు దగ్గరికెళ్తు న్నది. ఆ చొక్కా కొనిచ్చింది ఆవిడే అన్న విషయం కూడా తెలీదు వాడికి. వాడికి తెలిసిందల్లా మొన్నటి రోజు పింకీకి బిస్కెట్లు పెడితే ఆవిడ కోపంతో ఊగిపోవటమే. తనని ఇంట్లోకి రావొద్దని వారించడమే.
గేటు ముందు నుండి వెళ్తూ మరోసారి జేబు తడుముకున్నాడు అసిరిగాడు. గేటు దాటిన వెంటనే వెనక్కి తిరిగి, మళ్లీ అటువైపుకి నడిచాడు. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో గేటు దగ్గర ఆగి, దానికున్న ఇనుప కమ్మిని పట్టుకొని, లోపలికి తొంగి చూశాడు. భావనారెడ్డి వొళ్లో నుంచి ఎప్పుడు దూకేసిందో వరండాలోకొచ్చి నిలుచుంది పింకీ. అది కనిపించగానే తన్ను తాను మరిచిపోయాడు అసిరిగాడు. తనెందుకు మధ్యాహ్నం నుండి గేటు ముందు తిరుగుతున్నాడో మర్చిపోయాడు. చేతిలోంచి పురికొస జారిపోయింది. సందులో సడేమియాలాగా ఆ కుక్కపిల్ల కాస్త పరుగు లంకించుకుంది. దానివైపొకసారి చూశాడు అసిరిగాడు. వెంటనే వాడి దృష్టి మళ్లీ పింకీవైపు మరలింది ''యిస్.. యిస్...'' అంటూ వాడి నోటి నుండి చప్పుడు పుట్టుకొచ్చింది.
ఆ పిలుపు వినగానే పింకీ పంచకళ్యాణి లాంటి పరుగందుకుంది గేటుకేసి. వాడు కమ్మిని పట్టుకొని పైకి ఎగబాకి చూస్తున్నాడు పింకీని. అది గేటు చివరికంటా వచ్చి దాన్నెక్కేయాలన్నంత కసిగా ప్రయత్నం చేస్తుంది. ఎగిరెగిరి గెంతుతుంది. ''కురు... కురు..'' అంటూ అరుస్తూ ఉంది.
అసిరిగాడు జేబులో దాచుకున్న బిస్కెట్లు తీసి కమ్మీల మధ్యనున్న ఖాళీలోంచి పింకీకి అందేలా కిందికి వొదిలాడు. పింకీ దాన్ని నోటకరచుకున్నప్పుడు చూశాడు. వరండాలో నిలుచున్న భావనారెడ్డిని, ఆ వెనకే నిలబడ్డ తన తల్లి శంకరిని. అయినా తనే గెలిచానన్న తృప్తి వాడి ముఖంలో, నిండా ఆనందం వాడి గుండెల్లో గర్వంగా చూశాడు భావనారెడ్డి వైపు.
'ఈ రోజు సచ్చినావ్ రా కొడకా! నా చేతుల్లో' అంటూ భావనారెడ్డి చేతిలోంచి పేముబెత్తం లాక్కొని ముందుకు కదలబోయింది శంకరి. ఈ మారు తల్లి సివంగిలా మారింది. వేగంగా కదలబోతున్న శంకరి చేయి గట్టిగా పట్టుకొంది భావనారెడ్డి.. శంకరికి అర్థం కాలేదు. పింకీకి రెండు బిస్కెట్లు పెట్టేసి, గర్వంగా గేటు దూకి వెళ్లిపోతున్నాడు అసిరిగాడు. వెళ్తున్న అసిరిగాడి వైపే చూస్తూ నిలుచుంది భావనారెడ్డి పసి హృదయంతో.
ఈతకోట సుబ్బారావు
94405 29785