'శేఖర్ నాకు టైమవుతోంది... ఇంకొక పది పదిహేను నిమిషాల్లో బస్సొచ్చేస్తుంది, నేను వెళ్తున్నా' హడావిడిగా లంచ్‌బాక్స్‌ని బ్యాగ్‌లో సర్దుకుంటూ బయటకు నడిచింది అపర్ణ.
'ఓకే వెళ్ళిరా... జాగ్రత్త... సాయంత్రం లేటయితే ఫోన్ చెయ్యి... అసలే వర్షాకాలం... అవసరమైతే మీ ప్రిన్సిపాల్‌ను పర్మిషనడిగి పెందలాడే వచ్చెయ్యి' అపర్ణకు జాగ్రత్తలతో పాటు బై చెప్పాడు శేఖర్.
శేఖర్ ఏలూరులో ఒక మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్న సమయంలో, మ్యూజిక్ నేర్చుకోవటానికొచ్చిన అపర్ణతో ప్రేమలోపడ్డాడు. ఆ ప్రేమ పక్వానికొచ్చి ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారు. శేఖర్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నాడు. అపర్ణ ఎం.ఏ., ఇంగ్లీషు లిటరేచర్ చదివింది. గవర్నమెంట్ డిగ్రీకాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా ఉద్యోగం రావటంతో ఏలూరుకు దగ్గరలోవున్న నిడదవోలు డిగ్రీకాలేజీలో పనిచేసింది కొంతకాలం. తరువాత చింతలపూడికి బదిలీ కావటంతో - రోజూ ఏలూరు నుండి ఉదయమే వెళ్ళి సాయంత్రం వస్తోంది. అటు ఉద్యోగ బాధ్యతల్ని, ఇటు సంసార బాధ్యతల్ని రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ప్రయాణాన్ని సజావుగా సాగిస్తోంది.
భార్యాభర్తలిద్దరూ పోటీపడి కష్టపడుతుండటంతో సంసారం ఎటువంటి వొడిదుడుకులు లేకుండా నల్లేరుమీద బండి నడకలా సాఫీగానే సాగిపోతోంది.
ఆరోజు ఉదయం నుండి వర్షం కుండపోతగా కురుస్తోంది. సాయంత్రం అపర్ణ ఇంటికిరావటం ఆలస్యం కావటంతో శేఖర్‌కు కొంచెం కంగారుగా ఉంది. ఎదురుచూస్తూ కూర్చున్నాడు. రాత్రి ఎనిమిదిగంటలకు పూర్తిగా తడిసిపోయి ఇంటికి చేరింది అపర్ణ.
'ఏంటి అపర్ణా... ఈరోజు ఇంత ఆలస్యమయ్యిందే, మీ ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇవ్వలేదా, కనీసం ఈ వర్షాకాలం కొద్దిరోజులైనా కాస్త పెందలాడే వస్తే బావుంటుంది కదా...!' పగలంతా పనిచేసి అలసిపోయి ఇలా వర్షంలో తడిసొచ్చిన భార్యనుచూసి తన బాధను వ్యక్తంచేసాడు శేఖర్.
'లేదు శేఖర్... మా ప్రిన్సిపాల్ చాలా మంచాయనే. ఎప్పుడు పర్మిషన్ అడిగినా నో అనరు. కానీ ఈరోజు ఉదయంనుండి వర్షం దంచికొట్టటంతో బస్సులు సరిగా నడవలేదు, దానికితోడు రోడ్లపరిస్థితి మరీదారుణంగా వుంది. అందుకే ఈ ఆలస్యం... బాగా ఆకలేస్తోంది, స్నానంచేసొచ్చి పావుగంటలో ఫుడ్ ప్రిపేర్‌చేస్తాను ఒకేనా' హ్యాండ్‌బ్యాగ్ టేబుల్‌మీద పెట్టి బాత్‌రూమ్‌వైపు నడిచింది అపర్ణ.
'ఉద్యోగంలో చేరినప్పటినుండి ఈ పదేళ్ళుగా అపర్ణ రోజూ తెల్లవారు ఝామునేలేచి పనులన్నీ తెముల్చుకొని, ఇంట్లోకి టిఫిన్, లంచ్ అన్నీ రెడీచేసి, తనకు లంచ్ బాక్స్ 'పెట్టుకొని ఆదరాబాదరా బయటపడి రోడ్డుమీదికెళ్ళి బస్సుకోసం పడిగాపులుపడి, బస్సెక్కాక అదృష్టంబావుండి సీటు దొరికితేసరి; లేదంటే చింతలపూడి వరకు నిలువుకాళ్ళమీదే ప్రయాణంచేసి - పగలంతా డ్యూటీచేసి, మళ్ళీ సాయంత్రం అదే పనిగా ఉస్సురస్సురుమంటూ ఇంటికిచేరి వంటచేసి పడుకొని, మళ్ళీ పొద్దున్నే...' ఇదంతా తలుచుకుంటుంటే శేఖర్‌కు మనసులోంచి ఏదో చెప్పలేని బాధ పెల్లుబికివచ్చింది. ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళు... దేవుడి దయవల్ల ఉద్యోగం పర్మినెంట్ అయితే, ఏదో ఒక విధంగా ట్రైచేసుకొని ఈ మండలంలోనే పోస్టింగ్ వేయించుకుంటే - ఇలా ప్రతిరోజు ఇంతంత దూరం తిరిగే దిక్కుమాలిన పరిస్థితి తప్పుతుంది కదా... ఇలా శేఖర్ ఆలోచనలు కళ్ళాలు తెగిన గుర్రాల్లా పరిపరి విధాలుగా అడ్డూఅదుపులేనట్టుగా పరిగెడుతున్నాయి.
ఆలోచనల నుండి తేరుకున్న శేఖర్ పనులు ముగించుకొని మెల్లగా తన మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ వైపు నడిచాడు.
ఇంతలోనే... తన ఆలోచనలకు ముసుగేసేస్తున్నాయా అన్నట్టుగా ఆకాశంలో మేఘాలు దట్టంగా ముసురుకొస్తున్నాయి. తీరని తన కోరికలను చూసి వేళాకోళంగా నవ్వుతున్నాయా అన్నట్టుగా ఉరుములు మేఘాల చాటునుండి ఉరిమురిమి వింతవింత శబ్దాలుచేస్తూ వాతావరణాన్ని మరింత భయకంపితం చేస్తున్నాయి.
ఎప్పటిలాగే ఆరోజూ యధావిధిగా సాయంత్రమయ్యింది. అయితే, ఆరోజు కాస్త పెందలాడే ఇంటికొచ్చిన అపర్ణముఖంలో ఏదో తెలియని అసహనం కనిపిస్తోంది.
'ఏంటీ అలావున్నావ్... వొంట్లో బాగాలేదా' ఆందోళనగా అడిగాడు శేఖర్.
'ఏంలేదు శేఖర్, నాకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యింది... ఈరోజే ఆర్డర్స్ వచ్చాయి. రెండ్రోజుల్లో ఇక్కడ రిలీవ్ అయ్యి వెంటనే అక్కడచేరాలి. ఇప్పుడు రోజూ ఏభైకిలోమీటర్లు - రానూ పోనూ వందకిలోమీటర్లు ప్రయాణిస్తుంటేనే వొళ్ళు హూనమైపోతోంది. ఇక రేపటినుండి రెండొందల ఏభై కిలోమీటర్లు ప్రయాణంచేయాలంటే... బాబోరు... ఏమిటో నా పని పెనంమీంచి పొయ్యిలో పడినట్టుగావుంది' నిట్టూరుస్తూ చెబుతున్న అపర్ణ కళ్ళల్లో జీరగా కనిపించిన కన్నీటి చెమర్పును చూసి చలించిపోయాడు శేఖర్.
'సరే బాధపడకు, ఏంచేస్తాం... ప్రభుత్వం ఎక్కడికేస్తే అక్కడికి వెళ్ళక తప్పదు కదా... చూద్దాంలే. తర్వాత ఆలోచించి మెల్లగా దగ్గర్లోని ఏదైనా కాలేజీకి బదిలీచేయించుకోవచ్చులే... వెళ్ళి స్నానంచేసి రా... నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ తెస్తాను... ఇక ఇప్పుడు వంటేంచేస్తావ్‌లే' అంటూ సముదాయించి బయటకెళ్ళాడు శేఖర్.
అనుకున్నట్టుగానే చింతలపూడి కాలేజీనుండి రిలీవై రాజమండ్రి కాలేజీలో జాయినైంది అపర్ణ. కష్టం అనుకోకుండా రెండు నెలలుగా రోజూ ఓపిగ్గా రాజమండ్రి వెళ్ళి వస్తోంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంలేదు... మొన్నటివరకు బస్సు ప్రయాణం... ఇప్పుడు రైలు ప్రయాణం అంతే.
ఆరోజు సాయంత్రం రాజమండ్రి నుండి వచ్చిన అపర్ణ కాస్తంత నీరసంగా కనిపించటంతో -
'ఏవోురు ఏమయ్యిందీ... మళ్ళీ ఏమైనా ట్రాన్స్‌ఫర్ ఆర్డర్సొచ్చాయా... ఇంకా దూరం వేశారా... ఎందుకలా ఉన్నావ్' ఆందోళనగా అడిగాడు శేఖర్.
'ఏమీలేదు శేఖర్, వొంట్లో బాగాలేదు... ఉదయం రాజమండ్రి వెళ్ళినదగ్గరనుండి కొంచెం నలతగా నీరసంగా వుంది... మధ్యాహ్నంనుండి తల నొప్పిగాను, వామ్టింగ్ సెన్సేషన్‌గాను వుంది. చెస్ట్‌లో కూడా కొంచెం బరువుగా నొప్పిగా వుంది... ఖంగారు పడాల్సిందేమీలేదులే. బహుశ బాగా స్ట్రెయినవ్వటం మూలంగా అయ్యుంటుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుందిలే' భర్త కంగారుపడతాడేమోనని సముదాయింపుగా చెప్పింది అపర్ణ.
అపర్ణ చాలా తేలికగా తీసిపారేసిందిగానీ శేఖర్ మాత్రం రాత్రంతా అపర్ణ ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు.
తెల్లారగానే... 'అపర్ణా ఈరోజు సెకండ్ సాటర్డే... మీకు శెలవు కదా... త్వరగా టిఫిన్ కార్యక్రమం ముగించి రెడీ అయితే హాస్పిటల్‌కి వెళ్దాం... ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకుంటే బావుంటుంది కదా...'
'అబ్బా ఎందుకులే శేఖర్... ఇంత చిన్నదానికి ఆసుపత్రులూ ఇవన్నీ... ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే'
'లేదు అపర్ణా, దయచేసి నా మాటవిను... ప్రివెన్షన్ ఈజ్ బెటర్‌దేన్ క్యూర్ అంటారు... ప్లీజ్ త్వరగా రెడీ అయితే ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టరుగార్ని కలుద్దాం... ఏ ప్రాబ్లం లేదంటే హేపీయే కదా... ప్లీజ్ గెట్ రెడీ' త్వరగా రెడీ అవ్వు అన్నట్టుగా చెప్పి, తను రెడీ అయ్యేపనిలో పడ్డాడు శేఖర్.
పదిగంటలకల్లా ఇద్దరూ హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకొని, పరీక్షలన్నీ అయ్యాక, కాస్సేపు అక్కడే వెయిట్‌చేసి, డాక్టరుగారు పిలవడంతో రూంలోకొచ్చి డాక్టరుగారి ఎదురుగా కూర్చున్నారు - రిపోర్టుల గురించి ఏంచెబుతారో అనే ఆందోళనతో.
'అపర్ణ మీరేనా?'
'అవును డాక్టర్ నేనే'
'మీ రిపోర్ట్స్ అన్నీ చూశాను... నేను చెప్పే విషయం విని మీరేమీ కంగారు పడకండి... ధైర్యంగా, జాగ్రత్తగా వినండి... మీకు బ్రెస్ట్ కాన్సర్... అయితే, వ్యాధి ప్రిమిటివ్ - అంటే బిగినింగ్ స్టేజ్‌లోనే వుంది. జాగ్రత్తగా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ నూటికి నూరుపాళ్ళూ ఉన్నాయి. అవసరమైతే రేడియేషన్ థెరపీ చేయించుకోవాల్సి వుంటుంది. వారానికి ఐదు రోజుల చొప్పున ఐదు వారాలు చేయించుకోవాలి... కాబట్టి ఆలోచించుకొని, రెండ్రోజుల్లో రండి... ఆలస్యం చెయ్యొద్దు'
'సరే మేడమ్... రెండ్రోజుల్లో వస్తాం' షాక్‌లోనే బైటికొచ్చారు ఇద్దరూ.
ఇంటికొచ్చాక ఇద్దరూ ఆలోచనల్లోపడ్డారు. ఊహించని వార్త నుండి తేరుకోవటానికి చాలా సమయమే పట్టింది. సరే, ఎలావుంటే అలా జరుగుతుంది అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఐదు వారాలు రేడియేషన్ అంటే... తప్పనిసరిగా ఐదువారాలూ శెలవు పెట్టాల్సిందే. కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి జీతం నష్టం మీద శెలవు పెట్టాల్సిందే. దాదాపు ఎనభైవేలు జీతం నష్టపోవాలి. ఏం చెయ్యాలా అని ఇద్దరూ ఆలోచనల్లోపడ్డారు. మాట్లాడుకుంటూనే ఇద్దరూ మగతనిద్రలోకి జారుకున్నారు.
'అపర్ణా రాత్రంతా ఆలోచించాను. ఈ పరిస్థితుల్లో నువ్వు శలవు పెడితే జీతం రాదు, మనం చాలా ఇబ్బందిపడాల్సి వుంటుంది... కాబట్టి, నువ్వు రాజమండ్రిలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో జాయినై, లోకల్‌గా వున్న ఆసుపత్రిలో రేడియేషన్ ట్రీట్‌మెంట్ తీసుకొని, తరువాత కాలేజీకి వెళ్ళు' తన ఆలోచన గురించి చెప్పాడు శేఖర్.
'సరేలే అలాగే చేస్తాను' వేరే మాట్లాడకుండా బదులిచ్చింది అపర్ణ.
'భరించేవాడు భర్త అని ఎవరన్నారోగానీ... అది నా విషయంలో నిజం కాదు. భరించేది భార్యే...' బాధలో అపర్ణ ఆలోచనలు పరిపరివిధాల పచార్లు చేశాయి.
ఆ రాత్రంతా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిన శేఖర్ సుప్తచేతనావస్థలో... ఒక కలగన్నాడు. కలలో లీలగా తన రూపమే - తనను హెచ్చరిస్తూ మాట్లాడటం గమనించాడు... రాత్రంతా అంతరాత్మతో పెనుగులాడాడు -
'ఏం శేఖర్... అపర్ణ విషయంలో నువ్వు చేస్తున్నది ఎంతవరకు సబబు..? భర్తంటే భరించేవాడు అంటారు. ఇరవై ఏళ్ళుగా ఒక యంత్రంలా పనిచేస్తూ, నువ్వు చెప్పిందానికల్లా తలూపుతూ.. ఒక గానుగెద్దులా శ్రమిస్తూ నెలనెలా జీతం తెచ్చి, నీ చేతిలో పోస్తున్న నీ జీవిత భాగస్వామికి నువ్విచ్చే విలువ ఇదేనా..? అర్ధాంగి అనే మాటకు నువ్వు చెప్పే అర్థం ఇదేనా..? ఒక ఐదువారాలు ఆమెకు విశ్రాంతినిచ్చి ఈ ఊర్లోనే వైద్యం చేయించలేవా..? ఎనభైవేలు జీతం నష్టమొస్తుందని భార్య విషయంలో ఇంత అమానవీయంగా ఆలోచిస్తావా..? ఒకవేళ ఆమె అసలు కదలలేని పరిస్థితేవస్తే అప్పుడేం చేస్తావు..? పుట్టింటికి పంపేస్తావా, లేక నిన్ను భరించలేనని పూర్తిగా వదిలేస్తావా..?' చదువుకున్నవాడివి... ఇదేనా నీకు తెలిసిన న్యాయం..?'
రాత్రంతా కలలో అంతరాత్మ పదేపదే హెచ్చరించటంతో ఒక్కసారిగా మెలకువొచ్చి, దిగ్గున లేచికూర్చున్నాడు శేఖర్. లేచి లైటేసి - తను ప్రక్కనే ఉన్నాడనే ధైర్యంతో ఆదమరిచి నిద్రపోతున్న అపర్ణను చూడగానే దు:ఖం గట్టుతెగిన గోదారిలా పొంగుకొచ్చింది. పరిస్థితులు తలచుకొని, మౌనంగా ఏడ్చి ఏడ్చి ఇక ఓపికలేక పడుకున్నాడు... ఆపై మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
తెల్లారింది. బయట కోడికూతలు, పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూ వీనులవిందు చేస్తున్నాయి. వాతావరణం కూడా ఒక్కసారిగా చిరుజల్లులతో చల్లగా ఆహ్లాదకరంగా మారిపోయింది.
టిఫిన్ చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరూ. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడు శేఖర్... నోరు విప్పాడు...
'అపర్ణా... నీ ట్రీట్‌మెంట్ విషయం రాత్రంతా ఆలోచించాను. ఐదువారాలపాటు నువ్వు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో వుండి రాజమండ్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవటం నాకెందుకో సరైన నిర్ణయం అనిపించటంలేదు. ఈ పరిస్థితుల్లో నువ్వక్కడ; నేనిక్కడ... నీ ఆరోగ్యరీత్యా అంత రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదనిపిస్తోంది. అందుకే, పోతేపోయింది... జీతం నష్టం .. ఆలోచించకుండా ఐదువారాలు శెలవుపెట్టెయ్యి. ఇక్కడే వుండి హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుందువుగాని. అందుకు నా ఏర్పాట్లేవో నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వేమీ ఆలోచించకు. నీ ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్ళీ డ్యూటీకి వెళ్ళొచ్చు. ఈరోజే రాజమండ్రి వెళ్ళి లీవ్ అప్లై చేసిరా' అంతరాత్మ ప్రబోధాన్ని ఆచరించే ఉద్దేశ్యంతో - చెమర్చిన కళ్ళతో చెప్పాడు శేఖర్.
శేఖర్ మాటలు విన్న అపర్ణ మొదట ఇది కలా.. నిజమా అనుకొని తనను తాను గిల్లి చూసుకుంది. ఆపై తేరుకొని శేఖర్ని తేరిపారా చూసింది. నిజమే అని నిర్ధారించుకొని, తననింతగా అర్థంచేసుకొని, తన క్షేమంకోరి ప్రేమించే భర్త దొరికినందుకు ఆనందభాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతా పూర్వకంగా శేఖర్ భుజంపై తల ఆన్చి 'థాంక్యూ శేఖర్ ఫర్ యువర్ టైంలీ అండ్ కైండ్ డెసిషన్ అండ్ కన్సిడరేషన్ టువార్డ్స్ మీ... థాంక్యూ... థాంక్యూ సోమచ్' అంటూ ఆగని కన్నీటితోనే తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
'ఓకే డియర్... డోంట్‌వర్రీ అంతా మంచే జరుగుతుంది... టైమవుతోంది ఇక లే... త్వరగా రెడీ అవ్వు' అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచాడు శేఖర్.
మనసులో సంతోషం ఉరకలేస్తుంటే... తనకొచ్చిన వ్యాధి అప్పుడే సగం నయమైపోయినట్టు ఫీలవుతూ గబగబా రెడీ అయిన అపర్ణను రైల్వేస్టేషన్‌లో దింపి..
'సాయంత్రం త్వరగా వచ్చేరు డియర్...' అంటూ బాయ్ చెప్పి వెనుదిరిగాడు శేఖర్.
డా|| వి. రాజేంద్రప్రసాద్,
76759 73777